ప్రతిష్ఠాత్మకంగా ప్రజారాజ్యం ప్లీనరీ


విశాఖపట్నం: ప్రజారాజ్యం ప్లీనరీ సమావేశాలకు నగరం ముస్తాబైంది… పచ్చని తోరణాలు… స్వాగత ద్వారాలు… భారీ ఫ్లెక్సీలతో సందడి వాతావరణం నెలకొంది. ముఖ్య కూడళ్లు, జాతీయ రహదారి పొడవునా అట్టహాసంగా బ్యానర్లు ఏర్పాటుచేశారు. పార్టీ అధినేత చిరంజీవి భారీ ఫ్లెక్సీలను పలుచోట్ల నెలకొల్పారు. ప్రధాన కూడళ్లు, డివైడర్లను అందంగా తీర్చిదిద్దారు. పోర్టు కళావాణి స్టేడియంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ప్రరాపా మొట్టమొదటిసారిగా ప్లీనరీ సమావేశాలు విశాఖలో నిర్వహిస్తోంది. దీంతో జిల్లాకు చెందిన నేతలంతా కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎవరికి వారు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నారు. పోర్టు స్టేడియంలోని డైమండ్‌ జూబ్లీ మైదానంలో భారీ వేదిక ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం సమావేశాల్ని కేవలం 700 మందికే పరిమితం చేస్తున్నా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది రానున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో అంతమందికి సరిపడా 50 వేల చదరపు అడుగుల స్థలంలో సువిశాలమైన షెడ్డువేసి సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. నగరంలో గత రెండు రోజులుగా విపరీతమైన ఉక్కపోతగా ఉంది. దీంతో అడుగడుగునా ఫ్యాన్లు… కూర్చోడానికి వేల సంఖ్యలో కుర్చీలు సిద్ధం చేశారు. చల్లని గాలుల కోసం టవర్‌ ఎ.సి.లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆహుతులు అందరికీ భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం 20 వేల చదరపు అడుగుల స్థలంలో భోజనశాలకు సన్నాహాలు జరిగాయి. చిరంజీవి సినీ, రాజకీయ, సేవా ప్రస్థానాలను కళ్లకు కట్టినట్లు చూపేలా ‘ఫొటో ప్రదర్శన’ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆఖరులో కూర్చున్న వారికి సైతం వేదిక స్పష్టంగా కనపడడానికి అదనంగా ఎల్‌.సి.డి. టి.వి.లను అందుబాటులో ఉంచుతున్నారు. ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా పకడ్బందీగా బారికేడ్లు అమర్చారు. అల్లు అరవింద్‌, రామచంద్రయ్య, కోటగిరి విద్యాధరరావులు పలుసార్లు రహస్య మంతనాలు సాగించారు.

Leave a comment