దక్షిణ కోస్తాలో చురుగ్గా రుతుపవనాలు


విశాఖపట్నం: పెను తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారి కర్నాటక, రాయలసీమలకు ఆనుకుని మారుమూల తమిళనాడులో కేంద్రీకతమై వుంది. ఇది వాయువ్య దిశగా పయనించి మరింత బలహీనపడుతుంది. ఇదే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.  వీటి ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, తెలంగాణాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.  గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఉదయగిరిలో 16 సెంటీమీటర్లు, వింజమూరులో 15, ఒంగోలు, పుత్తూరుల్లో 14, తిరుపతి, రాపూరు, సత్యవేడుల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి పట్టణాల్లో 12, గూడూరు, సూళ్లూరుపేట, లక్కిరెడ్డిపల్లి, పాకాలలో 11, కందుకూరు, పలమనేరు, రాజంపేటల్లో పది, నెల్లూరులో తొమ్మిది, దర్శి, పొదిలి, సీతారాంపురం, తడ, శ్రీకాళహస్తిల్లో ఎనిమిది, బాపట్ల, పుంగనూరులో ఏడు, ఆరోగ్యవరం, అద్దంకి, బద్వేల్‌, పోరుమామిళ్ల, రాయచోటి, వెంపల్లెలో ఆరు, మచిలీపట్నం, కలక్కడ్‌, కమలాపురంలో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisements

భారత్‌ కమెండోల సాహసాలకు చిత్తైన నరహంతకులు


నారిమన్‌ హౌజ్‌ను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించిన కొద్ది సేపటికే  ట్రెడెండ్ హోటల్‌లోని బంధీలకు కూడా విముక్తి లభించింది. నలబై గంటల పాటు సైన్యం సాగించిన పోరుతో టెర్రరిస్టులు తలవంచక తప్పలేదు. ముంబయ్ మహానగరంలో అత్యంత ఖరీదైన బిజినెస్‌ సెంటర్‌ నారిమన్ పాయింట్ దగ్గర అరేబియా మహా సముద్రానికి అభిముఖంగా ఠీవిగా కన్పించేదే ఓబెరాయ్ హోటల్.  వ్యాపారం నిమిత్తం నగరానికి వచ్చే బిగ్‌ షాట్స్‌ అంతా ఎక్కువగా ఇందులో బస చేస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ గేట్స్, మీడియా కింగ్‌ రూపర్డ్ మర్దోక్‌తో పాటు ఎందరో ప్రపంచ ప్రముఖులకు ఆతిథ్యమిచ్చిన ఈ విలాసవంతమైన హోటల్ ఇస్లామిక్‌ తీవ్రవాదుల చేతిలో నలబైగంటలపాటు బంధీగా వుంది. ఎట్టకేలకు మన  కమెండోల సాహసం ముందు ఉగ్రవాదులు ఎదురు నిలవలేకపోయారు. సైనిక చర్యతో అంచెలంచెలుగా తీవ్రవాదులను ఏరివేశారు. దాడులు జరిగిన సమయంలో 380మంది అతిధులు, సిబ్బంది హోటల్‌లో ఉన్నారు.  రంగ ప్రవేశం చేసిన కమెండోలు ముందు 17 అంతస్ధులను క్లియర్ చేసి 148 మందిని కాపాడారు. ఇద్దరు ఉగ్రవాదులను హత మార్చిన తర్వాత బందీలకు విముక్తి లభించిందని అధికారులు వివరించారు. ఈఆపరేషన్ లో మొత్తం 32 మంది చనిపోయారు. హోటల్ ను నాలుగురోజుల తరువాత తిరిగి తెరుస్తామని యాజమాన్యం ప్రకటించింది.

బెంగుళూరు – మచిలీపట్నంల మధ్య ప్రత్యేక రైళ్లు


హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి బెంగళూరు, మచిలీపట్నాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పనబాక కృష్ణయ్య తెలిపారు. కాచిగూడ-బెంగళూరు (రైల్‌ నెంబర్‌ 789) స్పెషల్‌: డిసెంబర్‌ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో కాచిగూడ నుంచి రాత్రి 9.55కు బయల్దేరి మర్నాటి రోజు మధ్యాహ్నం 12.10కు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (నెం.790) డిసెంబర్‌ 8, 15, 22, 29, జనవరి 5, 12, 19, 26వ తేదీల్లో బెంగళూరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి మర్నాటి తెల్లవారుజామున 4 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.  సికింద్రాబాద్‌-మచిలీపట్నం స్పెషల్‌: సికింద్రాబాద్‌-మచిలీపట్నం స్పెషల్‌ (నెంబర్‌ 750) డిసెంబర్‌ 8, 15, 22, 29, జనవరి 5, 12, 19, 26వ తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 5.30కు బయల్దేరి మధ్యాహ్నం 1.35కు మచిలీపట్నం చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో మచిలీపట్నం-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (నెంబర్‌ 749) డిసెంబర్‌ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18, 25వ తేదీల్లో మచిలీపట్నం నుంచి రాత్రి 8.30కు బయల్దేరి మర్నాటి తెల్లవారుజామున 4.55కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

తాజ్‌లో ముగిసిన పోరు


ముంబయి: తాజ్‌హోటల్లో రాత్రినుంచి కొనసాగుతున్న ఆపరేషన్‌ సైక్లోన్‌ కార్యక్రమం ఎట్టకేలకు ఈరోజు ఉదయం ముగిసింది. ముగ్గురు తీవ్రవాదులు అంతమయ్యారు. హోటల్‌ కమెండోల హస్తగతం అయింది. తాజ్‌ ఫస్ట్‌ఫ్లోర్‌లోని కారిడార్లలో ఈరోజు ఉదయం ఆరుగంటలనుంచి భీకర పోరు కొనసాగింది. కాల్పులు, మంటలతో ఆ ప్రాంతం యుద్ధభూమిని తలపించింది. కమెండోలు అన్ని వైపులనుంచి చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో కమెండోలు ఓ శవాన్ని బయటకు విసిరివేశారు. మరో ఇద్దరు తీవ్రవాదులు కూడా మృతి చెందారని తెలుస్తోంది. అనంతరం అంబులెన్సులు వచ్చాయి. కమెండోలు బయట తిరుగుతున్నారు. మీడియాను కూడా కొంత ముందుకు అనుమతించారు. నిన్న ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్‌ దాదాపు ముగిసిందని, తాజ్‌ కమెండోల స్వాధీనం అయిందని సైనికాధికారులు తెలిపారు. లోపల ఉన్న మృతదేహాలను బయటకు తెచ్చే కార్యక్రమం మొదలైంది. దీంతో 59 గంటలపాటు కొనసాగిన పోరు ముగిసినట్లయింది.

5 గురు ఉగ్రవాదుల హతం : తనిఖీ ముమ్మరం


ముంబయి: తాజ్‌ హోటల్‌లో ఆపరేషన్‌ పూర్తిగా ముగిసినట్లు కాదని హోటల్‌ మొత్తం గాలించి అన్ని విషయాలు ధృవీకరించుకున్నాకే ఇది ముగిసినట్లు భావించాలని ఎన్‌ఎస్‌జీ చీఫ్‌ దత్‌ తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటివరకు చేసిన దాడుల గురించి తెలిపారు. తాజ్‌లో ముగ్గురు తీవ్రవాదులు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని, కొన్ని గ్రెనేడ్లు, ఏకే 47లు కూడా తమకు దొరికాయని ఆయన చెప్పారు. తమ కమాండర్‌ ఒకరు వారితో పోరాడుతూ వీరమరణం పొందారని చెప్పారు. ఇంకా తనిఖీ కొనసాగుతోందన్నారు. తీవ్రవాదులు బలహీనపడగానే బెదిరించేందుకు మొదట చేసే పని మంటలు పెట్టటం అని వారి ఈ అలవాటే వారి బలాబలాలను తెలియజేసిందని అన్నారు. హోటల్‌లో ఇంకా కొందరు అతిథులు ఉండే అవకాశం ఉందని వారిని బయటకు తేవటం పెద్ద సమస్య అని ఆయన అన్నారు. తలుపు కొడితే తీవ్రవాదులు వచ్చారనే వారు భయపడతారని అన్నారు. అందుకే కిటికీల పరదా తొలగించి సంకేతం పంపమని కోరామన్నారు. తద్వారా తాము చూసి ధృవీకరించుకుని కాపాడే అవకాశం ఉంటుందన్నారు. మొత్తం తనిఖీలు పూర్తయ్యాక తాము మళ్లీ మీడియాకు చెబుతామని ఆయన అన్నారు. అయితే సైన్యానికి మరో తీవ్రవాది సజీవంగా దొరికినట్లు తెలుస్తోంది.

అమరవీరులకు తుది నివాళులు


ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు : తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు జాతి తుది నివాళులు అర్పించింది. మాలెగాం పేలుళ్ల దర్యాప్తులో చురుకైన పాత్ర పోషించిన ఐపీఎస్‌ అధికారి, ఏటీఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరే తాజ్‌ వద్ద తీవ్రవాదులను ఏరివేసే కార్యక్రమంలో వారు పేల్చిన తూటాలకు నేలకొరిగారు. ముంబయిలో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరిగాయి. పెద్దసంఖ్యలో ప్రజలు, బంధువులు, పోలీసులు, మంత్రులు, రాజకీయనాయకులు ఆయన నివాసానికి వచ్చేసి ఘనంగా నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలో తీవ్రవాదులతో పోరులో ప్రాణాలు కోల్పోయిన గజేంద్రసింగ్‌ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి. రాజకీయపక్షాల నేతలు, ఉన్నతాధికారులు, ప్రజలు హాజరయ్యారు. బెంగుళూరులో తీవ్రవాదులతో పోరులో అసువులు బాసిన సైనికాధికారి మేజర్‌ ఉన్నికృష్ణన్‌కు ప్రజలు ఘనంగా తుది నివాళులు అర్పించారు.

ఉగ్రవాదుల్లో ఒకరు తాజ్‌లో ట్రైనీ చెఫ్‌


ముంబయి: తాజ్‌ సంఘటనలో ఉద్రిక్తత కొంత అదుపులోకి రాగానే పలు దిగ్భ్రాంతికరమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజ్‌పై జరిగిన దాడిలో పాల్గొన్న తీవ్రవాదుల్లో ఒకరు 10 నెలలుగా అక్కడే ట్రైనీ చెఫ్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏడాదిగా తీవ్రవాదులు దాడికి ప్రణాళిక రచించారని, అందుకు అనుగుణంగా ముందే హోటల్‌లో చేరి అన్ని దారులు, ఇతర విషయాలు బాగా తెలుసుకున్నారని తెలుస్తోంది. గత రాత్రి నౌకా దళ అధికారి ఒకరు మాట్లాడుతూ తామే మొదటిసారి లోపలికి వెళ్లి గందరగోళానికి గురయ్యామని తీవ్రవాదులు మాత్రం బాగా తెలిసిన చోట తిరిగినట్లు తిరిగారని అనటం గమనార్హం. ఇక్కడ ఉన్న తీవ్రవాదే ఆయుధాలు చేరవేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. మిగతా హోటళ్లలో కూడా తీవ్రవాదులకు చెందినవారు పనిచేసినట్లు అనుమానిస్తున్నారు.