బయోగ్యాస్‌ ప్లాంట్ల నిర్మాణంలో ‘ప్రథమం’


ఖమ్మం: అత్యధికంగా బయోగ్యాస్‌ ప్లాంట్లను నిర్మించినజిల్లాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నెడ్‌ క్యాప్‌ ద్వారా రాష్ట్రస్థాయిలో అమలు చేస్తున్న తరగని ఇంధన వనరుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విరివిగా బయోగ్యాస్‌ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానాన్ని పొందుతోంది. నెడ్‌ క్యాప్‌ వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.పి.రెడ్డి హైదరాబాద్‌ నుంచి కలెక్టర్‌కు ఈ బహుమతిని పంపారు. జిల్లాలో నెడ్‌ క్యాప్‌ సిబ్బందికి సహాయ సహకారాలు అందించినందుకు మన కలెక్టర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపినట్లు నెడ్‌ క్యాప్‌ కార్యనిర్వాహక ఇంజినీరు రామలింగయ్య పేర్కొన్నారు. నాలుగేళ్లుగా పరిశీలిస్తే 2004-05లో 1746 ప్లాంట్లను, 2005-06లో 1233, 2006-07లో 2790, 2007-08 సంవత్సరంలో 1530 ప్లాంట్లను జిల్లాలో నిర్మించినట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే పనితీరునుకనబరచాలని కలెక్టర్‌ నెడ్‌క్యాప్‌ సిబ్బందికి సూచించారు.

Advertisements

ఎన్‌కౌంటర్‌ కాదది… ఆదివాసీల ఊచకోత


భద్రాచలం: ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింగారం అడవుల్లో జరిగింది ఎన్‌కౌంటర్‌ కాదని, అది ఆదివాసీల భారీ ఊచకోత అని 4 రాష్ట్రాల పౌరహక్కుల సంఘాలు ఆరోపించాయి. ఆంధ్రా, కర్నాటక, న్యూఢిల్లీ, నాగాలాండ్‌కు చెందిన వివిధ పౌరహక్కుల సంఘాల నేతలు రెండు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సింగారం అడవుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు భద్రాచలంలో ఆదివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి చైతన్య, బి.వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, శ్రీనివాసరావు, బాబయ్య(కర్నాటక), సుబ్రితో, ప్రీతి (న్యూఢిల్లీ), జాన్‌చాన్‌ (నాగాలాండ్‌) తదితరులు ఆదివాసీల నుంచి సేకరించిన వివరాలను తెలిపారు. మేము 16 కి.మీలు ప్రయాసతో నడిచి సింగారం గ్రామాన్ని చేరుకున్నాం. సీతమ్మ, కారం లచ్చమ్మ అనే బాధితులతో పాటు పోలీసులు, సల్వాజుడుం చెర నుంచి తప్పించుకుని వచ్చిన మరో నలుగురితో మాట్లాడాం. ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలు తెలిశాయి. జరిగిందిదీ. ”ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం 200 మంది సల్వాజుడుం కిరాయి గూండాలు గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దంతీష్‌పూరా, కొవ్వాసిగూడెం, మారీస్‌వూరు, సింగారం గ్రామాలను చుట్టుముట్టారు. దాడి చేసి ధాన్యాన్ని, బట్టల్ని, నగదును దోచుకున్నారు. తుపాకీలు ఎక్కుపెట్టి 30 మందిని వెంట పెట్టుకు వెళ్లారు. వాళ్లతోనే లూటీ చేసిన సామాన్లను మోయించారు. 2 కి.మీల తర్వాత వాయుదుడ్డువాగు వద్దకు తీసుకెళ్లి 30 మందిని నాలుగు గ్రూపులుగా విభజించారు. వేర్వేరుగా తీసుకెళ్లి పరుగెత్తమని చెప్పి కాల్పులు జరిపారు. ఈ దారుణకాండలో నలుగురు మహిళలతో పాటు 18 మంది ప్రాణాలు విడిచారు. 12మంది తప్పించుకోగా ఇందులో నలుగురు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. మరికొందరి ఆచూకీ నేటికీ తెలియడం లేదు. ఇది సల్వాజుడుం, పోలీసుల కుట్ర. పోలీసుల అండదండలతో సల్వాజుడుం పెట్రేగిపోతోంది”.  దంతెవాడ ఎస్పీపై హత్యానేరం మోపాలి ఈ దమనకాండకు ప్రధాన సూత్రధారి దంతెవాడ ఎస్పీ రాహుల్‌ శర్మపై హత్యానేరం మోపాలని పౌర హక్కుల సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై జ్యూడిషియల్‌ విచారణ చేపట్టాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు వారు తెలిపారు. చత్తీస్‌గఢ్‌ తరహాలో నాగా ప్రభుత్వం కూడా సల్వాజుడుంను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోందని, దీనిని కూడా సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌, నాగాపీపుల్స్‌ మూవ్‌మెంట్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ప్రతినిధి జాన్‌చాన్‌లు తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా పెద్దన్న


అనంతపురం: ప్రప్రథమంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గం ఎంపికైంది. ఈ మేరకు ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో ఆ సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య ముఖ్యఅతిథిగా హాజరైన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎస్‌.పెద్దన్న, ప్రధాన కార్యదర్శిగా బి.శంకర్‌, సహాధ్యక్షుడిగా ఎస్‌.రామలింగం, కోశాధికారిగా కె.శంకరయ్య, గౌరవాధ్యక్షుడిగా ఎం.అంజయ్యలు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎం.జగదీష్‌, బి.సుధాకర్‌నాయక్‌, కె.తిరుపాల్‌నాయక్‌, హెచ్‌.హనుమంతు, ఎం.రామకృష్ణ, ఎస్‌.రామానాయక్‌, కార్యదర్శులుగా పి.గంగాధర్‌, ఇ.శ్రీనివాసులు, ఎం.నరసింహులు, ఇ.మహేశ్‌, కేజీపీ రామన్న, శంకర్‌నాయక్‌, వెంకటేసు, నాగరాజు, రాజరమేష్‌లు ఎంపికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సురేంద్ర, కార్యదర్శిగా బాబునాయక్‌లను నియమించారు. ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేకంగా పోరాటాలు చేస్తామని నూతన కార్యవర్గం ఈ సందర్భంగా ప్రకటించింది.

మావోయిస్టులకు ఎఎస్పీ తరుణ్‌జోషి పిలుపు


నేరడిగొండ: లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని ఎఎస్పీ తరుణ్‌జోషి అజ్ఞాత మావోయిస్టులకు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ నిర్వహించిన మావోయిస్టు, సానుభూతిపరుల అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. పోలీసులు ప్రజల కోసం ఉన్నారని, సంఘ వ్యతిరేకశక్తులకు గ్రామీణులు ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. ఎవరిని బాధించాలనే ఆలోచన పోలీసులకు లేదన్నారు. ఈసందర్భంగా అజ్ఞాత మావోయిస్టుల కుటుంబసభ్యులకు దుస్తులు, బియ్యం పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సీఐ చంద్రప్రభు, ఎస్సైలు జబ్బార్‌, పురుషోత్తంచారిలు, ఎంపీపీ సాబ్లె ప్రేంసింగ్‌, జడ్పీటీసీ పండరి, స్థానిక సర్పంచి సజన్‌, ఎంపీటీసీ దుర్వ వాగు పాల్గొన్నారు.

అచేతనావస్థలో భర్త.. మంచంపట్టిన కూతురు!


మంచిర్యాల: కూతురి అనారోగ్యం.. ఏడు పదులు దాటి అచేతన స్థితిలో ఉన్న భర్త.. ఎదుగుతున్న కూతురి పిల్లలు.. ఆపై కుటుంబ పోషణ భారం.. ఇవన్ని తలకుమించిన భారమై.. మానసికంగా కుంగిపోయిన ఓ వృద్ధురాలు శనివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మంచిర్యాలలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… మంచిర్యాల మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన సాగే గోపాల్‌రావు, పద్మావతి(60) దంపతులు మంచిర్యాలలో స్థిరపడ్డారు. 15 ఏళ్ల క్రితం కరీంనగర్‌ జిల్లా చాకుంట గ్రామానికి చెందిన ఎమ్మా నర్సింగంతో కూతురు శ్రీలక్ష్మి వివాహం జరిపించారు. వారికి అశ్విని, వంశీ అనే పిల్లలున్నారు. అనారోగ్యానికి గురైన అల్లుడు నర్సింగం ఐదేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి వీరికి కష్టాలు మొదలయ్యాయి. భర్త మరణించటంతో శ్రీలక్ష్మి ఇద్దరు పిల్లలతో పుట్టింటికి చేరారు. అప్పటికే వయస్సు మీద పడిన తల్లిదండ్రులు పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూతురు, ఆమె ఇద్దరి పిల్లల పోషణ వారికి భారమైంది. కూతురు ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మంచం పట్టింది. ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించారు. వైద్య ఖర్చులకు డబ్బులు లేక గేదెలను విక్రయించారు. దీంతో వారు జీవనాధారం కోల్పోయారు. రూ.200 వృద్ధాప్య పింఛనుపై ఆధారపడి జీవిస్తున్నారు. మంచం పట్టిన కూతురు జబ్బు నయం కాకపోగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు భర్త మరొకరి సాయం లేనిదే బయటకు కదలలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కుటుంబ పోషణపై మనస్థాపం చెందిన పద్మావతి శనివారం తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పోషణకర్తను కోల్పోవటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె భర్త, ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూతురు, ఆమె పిల్లల పరిస్థితి పలువురిని కంట తడి పెట్టించింది. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. స్థానికులు దహనసంస్కారం జరిపించారు.

బాక్సైట్‌ వెనుకా ‘ప్రైస్‌వాటర్‌’


pwc1
సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆడిటింగ్‌ సంస్థ ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ)నుంచి రాష్ట్ర సర్కారు కూడా ‘విలువైన’ సూచనలు స్వీకరించింది. వేల కోట్ల రూపాయల బాక్సైట్‌ నిక్షేపాలను రెండు ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే విషయంలో ఈ సంస్థ ప్రభుత్వానికి కన్సల్టెంట్‌గా వ్యవహరించింది. విజయనగరం జిల్లాలో జిందాల్‌ గ్రూపు ‘జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్‌’ పేరుతో, విశాఖ జిల్లాలో రస్‌ అల్‌ ఖైమా కంపెనీ ‘ఆన్‌రాక్‌ అల్యూమినియం’ పేరుతో భారీ అల్యూమినియం కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటికి కావలసిన బాక్సైట్‌ నిక్షేపాలు విశాఖ జిల్లా ఏజన్సీ ప్రాంతంలో ఉన్నాయి. సమతా వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ప్రాంతాలను మైనింగ్‌ కోసం ఇవ్వకూడదు. అయినా ప్రభుత్వ పెద్దలు తమకు కావలసిన రెండు కంపెనీలకు బాక్సైట్‌ నిక్షేపాలను దక్కించేందుకు ఓ పద్ధతిని అన్వేషించారు. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) బాక్సైట్‌ నిక్షేపాలను వెలికి తీస్తుంది. వీటిని అల్యూమినియం కంపెనీలకు సరఫరా చేస్తుంది. ఈ మేరకు రెండు అల్యూమినియం కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఆ కంపెనీల నుంచి ఏపీఎండీసీ ఎంత ధర వసూలు చేయాలన్న అంశంపై అధికారులతో సర్కారు ఒక కమిటీని వేసింది. దీనికి పరిశ్రమల శాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ కమిటీకి పీడబ్ల్యూసీ కన్సెల్టెంట్‌గా వ్యవహరించడం గమనార్హం. ఈ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు టన్ను బాక్సైట్‌పై వచ్చే రాయల్టీతో పోలిస్తే 1.25 రెట్ల సొమ్ము సర్కారుకు చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకు ప్రభుత్వం కూడా సమ్మతిస్తూ గత ఏడాది ఆగస్టు 13న ఉత్తర్వులు జారీ చేసింది. టన్ను బాక్సైట్‌పై రాయల్టీ మొత్తం ప్రస్తుతం సుమారు రూ.80 ఉంది. ఈ లెక్కన టన్ను బాక్సైట్‌పై కంపెనీలు సుమారు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. నిక్షేపాల వెలికితీతకు అయ్యే వ్యయాన్ని ఆయా కంపెనీలే చెల్లించాల్సి ఉన్నప్పటికీ కేవలం రూ.100 మాత్రమే చెల్లించాలనడంపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇలా చేయడం సహజ వనరులను దోపిడీకి అప్పగించడమేనని నిపుణులు పేర్కొన్నారు. ఐదు టన్నుల బాక్సైట్‌తో ఒక టన్ను అల్యూమినియం ఉత్పత్తి చేయవచ్చు. కేంద్రం నిర్ణయించిన విధానం ప్రకారం ఖనిజ వనరులపై నామమాత్రపు రాయల్టీ వసూలు చేస్తున్నారు. దీన్ని ప్రాతిపదికగా చేసుకుని ప్రైవేటు సంస్థలకు అప్పగించే లక్షలాది టన్నుల ఖనిజం ధరను నిర్ణయించడం సమంజసం కాదని నిపుణుల అభిప్రాయం. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ సూచనలు ఉపయోగపడటం విశేషం.

బీబీసీపై పర్యటించిన ఎమ్మెల్యే కట్టా


బోనకల్లు: బీబీసీ పరిధిలో ఎండిపోతున్న పంటలను బుధవారం మధిర శాసనసభ్యుడు కట్టా వెంకటనర్సయ్య పరిశీలించారు. నారాయణపురం రైతులను ఆయన కలిసి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయికి చెందిన రైతులు మంగళవారం ఖమ్మం వెళ్లి ఎన్‌ఎస్‌పీ కార్యాలయాన్ని ముట్టడిస్తే… పాలేరు జలాశయంలో నీళ్లు లేవని చెప్పడం తప్ప వారి బాధని అధికారులు అర్థం చేసుకునే స్థితిలో లేరన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే, సీఈతో ఫోన్లో ఆయన మాట్లాడిన తర్వాత 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. మండలంలో పంటల పరిస్థితి చూసిన ఎమ్మెల్యే అక్కడే నుంచే ఇ.ఇ. వీర్రాజుతో మాట్లాడారు. ప్రధాన కాలువ షట్టర్లు గురువారం దించి బోనకల్లు కాలువకి వెయ్యి క్యూసెక్కులు ఇస్తామని చెప్పారు. అక్కడ నుంచే ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌ లక్ష్మారెడ్డితో కూడా ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడారు. ప్రాజెక్టు నుంచి పాలేరుకు నీళ్లు విడుదలకు చొరవ తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట రైతు సంఘం డివిజన్‌ అధ్యక్షుడు ఉమ్మనేని కోటయ్య, జడ్పీటీసీ సభ్యుడు కోటేశ్వరరావు, ఎంపీపీ కొమ్ము శ్రీనివాసరావు, డీసీ ఛైర్మన్‌ కిలారు తిరపతయ్య పాల్గొన్నారు.