హనుమంతరావు వ్యాఖ్యలతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత


నెల్లూరు: దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం ఏర్పడ్డ రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. రాజశేఖర్‌ఖరరెడ్డి మరణించిన తరువాత జరిగిన చావులన్నీ బోగస్‌లని రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు ప్రకటించడాన్ని జిల్లా కాంగ్రెస్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఆనం వివేకానందరెడ్డి బుధవారం పత్రికావిలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కనీస నైతిక విలువలు కూడా తెలియని హనుమంతరావు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. హనుమంతరావును చంపుతామంటూ జగన్‌ వర్గీయులు బెదిరింపుకాల్స్‌ చేస్తున్నారన్న, వ్యాఖ్యలపై వివేకానందరెడ్డి మాట్లాడుతూ హనుమంతరావును చంపడానికి అరబుల్లెట్‌ కూడా వేస్ట్‌ అని అపహాస్యం చేసారు. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో ఇలాంటి కలుపుమొక్కలు ఉండడం సాధారణమేనని, అంతమాత్రాన కాంగ్రెస్‌కు ఎటువంటి నష్టం వాటిల్లబోదని తెలిపారు. ఇకనైనా హనుమంతరావు దిగజారుడు మాటాలు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. ఎన్టీరామారావు, రాజశేఖర్‌రెడ్డి తరువాత అదేస్థాయి ప్రజా మద్దతు జగన్‌కు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. పార్టీ అధిష్టానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ కార్పొరేటర్లు నర్సింహారావు, మేయర్‌ భానుశ్రీ, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisements

సమస్యల పరిష్కారాలకు సింగరేణి సన్నాహలు


ఖమ్మం: సింగరేణిలో చేసిన ఫిర్యాదులు నెలల తరబడి పరిష్కృతం కాకుండా ఉంటాయన్న అపోహకు తెరదించేందుకు సింగరేణి సంస్థ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తమకు అందే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నారు. తమకు అందే ప్రతీ ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని సిద్ధం చేసే బాధ్యతను సిబ్బందికి అప్పగించారు. ఇకపై అపరిష్కృత ఫిర్యాదులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సంబంధిత క్లర్కులు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వారికి తగిన శిక్షణను కూడా ఇస్తూ ఫిర్యాదుల కాలయాపనకు స్వస్థిపలికే పనికి శ్రీకారం చుడుతున్నారు. దీంతో నెలల తరబడి ఫిర్యాదులు పేరుకుపోయే పరిస్థితి ఉండే అవకాశాలు లేకుండా చూడనున్నారు. సింగరేణి సంస్థకు అందే ఫిర్యాదులపై ప్రతీ నెలా 10వ తేదీన సీస్‌ జనరల్‌ మేనేజర్‌ సమీక్షను కూడా నిర్వహించనున్నారు.

ఇంటర్‌ పరీక్షా ఫీజు గడువు పెంపు


శ్రీకాకుళం: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫీజు గడువు అక్టోబర్‌ 8వ తేదీవరకు పెంచినట్లు ఇంటర్మీడియట్‌ ప్రాంతీయ పర్యవేక్షాణాధికారి ఎం. విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము వంద రూపాయలతో అక్టోబర్‌ 15వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చునని అన్నారు.

జీడిపప్పు నుండి నూనె ఉత్పత్తి పరిశ్రమ ప్రారంభం


శ్రీకాకుళం: బాయిలింగ్‌ విధానంలో జీడిపప్పు తీసివేయగా మిగిలిన జీడిపప్పుల నుండి నూనె ఉత్పత్తిచేసే పరిశ్రమను పలాసా పారిశ్రామిక వాడలో శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలు డాక్టర్‌ కె. కృపారాణి ప్రారంభించారు. శ్రీరామ సిఎంఎస్‌ ఆయిల్‌ ఇండస్ట్రీ పేరిట నెలకొల్పిన ఈ పరిశ్రమలో 20బాయిలింగ్‌ పరిశ్రమల నుండి విడుదల అవుతున్న వ్యర్థాల నుండి ఆయిల్‌ ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ యజమాని నాగేశ్వరరావు తెలిపారు. ఈసందర్భంగా పారిశ్రామిక వాడలోని మౌలిక సమస్యలను జీడిఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం. రామేశ్వరరావు తదితరులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి ఆమె సానుకూలంగా స్పందించారు. ఈకార్యక్రమంలో పలాసా ఎమ్మెల్యే జె.జగన్నాయకులు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బాబూరావు, మున్సిపల్‌ కోఆప్టన్‌ సభ్యుడు దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం


శ్రీకాకుళం: ఇన్ఫోసిస్‌లో అకౌంటింగ్‌, ఎగ్జిక్యూటీవ్‌ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ బి. పోలీసు తెలిపారు. కమీషనర్‌ ఆఫ్‌ కాలేజీ హేడ్‌ ఎడ్యూకేషన్‌ హైదరాబాదు సహాకారంతో జరుగుతున్న ఉద్యోగమేళాకు 2009 సంవత్సరం బికాం, లేదా ఎంకాం 50శాతం ఉత్తీర్ణత పొంది ఎదైనా జెకేసీ ద్వారా శిక్షణ పొందిన వారు మాత్రమే అర్హులని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల విద్యార్థులు తమ కళాశాలల్లో అక్టోబర్‌ 3నుండి 6లోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ విద్యార్థులకు 9వ తేదీనుండి 18వ తేదీవరకు వీటికోసం ఉచిత శిక్షణ ఇస్తామని అన్నారు. మొదటి రెండు రౌండ్ల స్పీడెన్‌ టెస్టు అక్టోబర్‌ 19, 20, 21 తేదీల్లో కళాశాలల్లో నిర్వహిస్తామన్నారు. తదుపరి రౌండ్లు హైదరాబాదు గచ్చిబౌలీలోని ఇన్ఫోసిస్‌ క్యాంపస్‌లో నిర్వహిస్తారన్నారు. మరిన్ని వివరాల కోసం జెకేసీ కోఆర్డినేటర్‌ చాపార తిరుపతిరావు, ఫోన్‌ నెంబరు 9908732040 సంప్రదించవచ్చని తెలిపారు.

3వ తేదీ నుండి కళాసందడి


శ్రీకాకుళం: శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య దశ వసంతోత్సవాలు స్థానిక బాపూజీ కళామందిర్‌లో అక్టోబర్‌ 3నుండి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక విభాగం అధికారి పి. నర్సింహ్మమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 3రోజులు ఉదయం సాయంత్రం పలువురు ప్రముఖుల ఉపనాస్యాలు రాత్రి 8గంటలకు నాటక ప్రదర్శనలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయిస్తున్న నంది నాటకోత్సవాల్లో ప్రథమ బహుమతి పొందిన ఏలూరువారి’ఏవరో ఒకరు’నాటికి మొదటి రోజు ప్రదర్శిస్తారన్నారు. 4వ తేదీన కాకినాడ కళాకారులచే అళ్లసాని పెద్దన, 5న హైదరాబాదువారిచే జీవన్నాటకం ప్రదర్శనలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రోజు రాత్రి 8గంటలకు బాపూజీ కళామందిర్‌లో ప్రదర్శించే ఉత్తమనాటకాల ప్రదర్శనను చూసేందుకు తరలిరావాలని కళాభిమానులకు ఆయన పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై పాదయాత్రలు


శ్రీకాకుళం: ప్రజలు వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అక్టోబర్‌ 25 నుండి 31వ తేదీవరకు గ్రామాలలో పాదయాత్రలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక క్రాంతిభవన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరు గ్రామాల్లో పారిశుద్ధ్యం, పింఛన్‌ల పంపిణీ జరుగుతున్న తీరు తదితర అంశాలపై అధ్యయనం చేసి సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి చాపార సుందర్‌లాల్‌ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర ధరలను అదుపు చేయాలని, పేదలకు భూపంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌ చేసారు. సంఘం అధ్యక్షులు చెల్లా ధర్మారావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కార్యదర్శి ఆర్‌. అయ్యప్ప, చాపార వెంకటరమణ, వి.రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.