మైక్రో ఆగడాలపై కఠిన వైఖరి: డీజీపీ


వరంగల్: రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్ సంస్థల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న దృష్ట్యా వాటి ఆగడాలపై కఠినంగా వ్యవహరించాలని డీఎస్పీలకు ఇప్పటికే ఆదేశాలిచ్చామని డీజీపీ అరవిందరావు చెప్పారు. వరంగల్, కరీంగర్‌లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైక్రోఫైనాన్స్ సంస్థల వల్ల ఎవరైనా వేధింపులకు గురైతే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. రాష్ట్రంలో మైక్రో ఆగడాలపై ఇప్పటి వరకు 19 కేసులు నమోదు చేశామని, చట్టాన్ని అతిక్రమించే మైక్రో సంస్థలపై చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.

Advertisements

గద్దర్ పిలిస్తే చర్చలకు సై


మెదక్: గద్దర్ ఆహ్వానిస్తే చర్చలకు వెళ్లేందుకు సిద్ధమని తెలంగాణ సమష్టి ఉద్యమ కార్యక్రమ నిర్వాహక కమిటీ నాయకురాలు, ప్రజా గాయని విమలక్క ప్రకటించారు. ప్రజాఫ్రంట్ సమష్టిగా సాగిపోయే కమ్మని పాట అని, అందులో చిన్న అపశ్రుతి దొర్లడం దురదృష్టకరమన్నారు. మెదక్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఫ్రంట్ ఉద్యమ రూపకల్పనలో తమకు భాగస్వామ్యం కల్పించని కారణంగానే.. బయటకు వచ్చామని విమలక్క వివరించారు.

దళిత క్రిస్టియన్ల వైపు జగన్ దృష్టి


నెల్లూరు: దళిత సిక్కులకు, బౌద్ధులకు మాదిరిగానే దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఓ లేఖ రాశారు. దళిత క్రిస్టియన్ల మద్దతు కోసం ఆయన ప్రధానికి ఆ విజ్ఞప్తి చేసినట్లు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో దళిత క్రిస్టియన్లు 15 శాతం ఉంటారు. చాలా మంది మాలలు, కొంత మంది మాదిగలు క్రిస్టియన్ మతాన్ని పుచ్చుకున్నారు. దాంతో వారికి రిజర్వేషన్లు కల్పించాలని కోరడం ద్వారా వారి మద్దతు సంపాదించాలనేది జగన్ అభిమతంగా కనిపిస్తోంది. రిజర్వేషన్లు కల్పిస్తే దళితులు వరుసగా క్రైస్తవ మతంలోకి మారుతారని, భారతీయ జనతా పార్టీ జగన్ పై మండిపడింది.

27 నుంచి తెలంగాణ విద్రోహ నిరసనలు


ఆదిలాబాద్: రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 27నుంచి నవంబర్ 1 వరకు జిల్లాలో నిరసన, విద్రోహ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక టీఎన్‌జీవో భవనంలో చైర్మన్ మామిడి నారాయణ అధ్యక్షతన జిల్లా జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించారు. తెలంగాణ విద్రోహదిన సందర్భంగా వారం రోజుల పాటు జరిగే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు సమావేశం పలు తీర్మానాలను సైతం ఆమోదించింది. జేఏసీలోనూతన సంఘాలు చేరికపై స్టీరింగ్ కమిటీదే తుది నిర్ణయమని, కొత్త సభ్యులందరు స్టీరింగ్ కమిటీ సభ్యులుగా కొనసాగుతారని సమావేశం తీర్మానించింది. జేఏసీ ఆర్థిక వ్యవహారాలను కోర్ కమిటీ నిర్వహిస్తుందని సమావేశం తీర్మానించింది. జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలను పర్యవేక్షించేందుకు జేఏసీ జిల్లా కమిటీ కోర్ కమిటీ సభ్యులను నియమించింది.

లాయర్లకు లగడపాటి సలహా


విజయవాడ: హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుందని, అయితే దానికి డిసెంబర్ 31 వరకు లాయర్లు ఆగాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సీమాంధ్ర లాయర్లకు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో సూచించారు. డిసెంబర్ 31 తర్వాత హైకోర్టు బెంచ్ ఇవ్వకుంటే తనతో పాటు న్యాయశాఖామంత్రి ఉద్యమంలో పాల్గొంటామని చెప్పారు. అయితే లాయర్లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకుండా డిసెంబర్ 31 వరకు ఆగాలని చెప్పారు. అంతవరకు కోర్టులకు తాళాలు వేయటం, జిల్లా బంద్ లు నిర్వహించటం మానుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. ఇప్పుడే బెంచ్ ఇస్తే అది రాష్ట్ర విభజనకు దారి తీస్తుందని ఆయన చెప్పారు.

ఎమ్మార్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టాలి


హైదరాబాద్: కోట్లాది రూపాయల కుంభకోణం దాగి ఉన్న ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలని, ఆ సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని సీపీఐ అధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం డిమాండ్‌ చేసింది. ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కోసం రైతులు, ఫ్లాట్ల యజమానుల వద్ద నుంచి సేకరించిన భూములను స్వాధీనం చేయాలని కోరింది. ఈ వ్యవహారంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరేందుకు ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్‌.తులసి రెడ్డి (కాంగ్రెస్‌), రేవంత్‌రెడ్డి (టీడీపీ), వై.వెంకటేశ్వరరావు (సీపీఎం), బండా రు దత్తాత్రేయ (బీజేపీ), జె.గౌతమ్‌ (పీఆర్పీ), వై.డి.రామారావు (లో్‌క్ సత్తా), తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామికాభివృద్ధికి కేటాయించిన భూమిలో ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ విల్లాలు కట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. నాన్‌ రామ్‌ గుడా, మణికొండ గ్రామంలో 535 ఎకరాలు సంస్థకు కేటాయించారని, అందులో 235 ఎకరాలు గోల్ఫ్‌ కోర్సు, 285 ఎకరాలు బహుళ ప్రయోజనార్థం వినియోగించుకునేందుకు కేటాయిస్తే 15 ఎకరాలు చెరువు ఉందన్నారు. ఇందులో 90 ఎకరాలు రైతులు, ఫ్లాటు యజమానుల నుంచి బలవంతంగా సేకరించారని, అదే సర్వే నెంబర్‌లో ఉన్న సినీ నటుడు కృష్ణ, మంత్రి గల్లా అరుణకుమారికి సంబంధించిన అమర్‌ రాజా బ్యాటరీ సంస్థ భూములకు మాత్రం మినహాయింపు ఇచ్చారన్నారు. ఈ వ్యవహారం వెనుక బలమైన రిమోట్‌ కంట్రోల్‌ ఉందని, తక్షణమే ప్రభుత్వం సీబీఐ విచారణ జరపటంతో పాటు భూమి పోగొట్టుకున్న వారికి స్వాధీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మార్‌ వ్యవహారంపై అఖిలపక్షం ఏ నిర్ణయం తీసుకున్నా కలసి వస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. 2001లో ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌కు భూమి ఇచ్చి నప్పుడు ఎకరం విలువ రూ.20 లక్షలు ఉందని, ఇప్పుడు రూ.20 కోట్ల దాకా చేరిందన్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రోశయ్య పాత్ర అనుమానాస్పదంగా ఉందని బండారు దత్తాత్రేయ వ్యాఖ్యా నించారు. ఎమ్మార్‌ వ్యవహారంలో ఏపీఐఐసీయే అసలు దొంగ అని, విచారణ, చర్య బాధ్యతను దానికే అప్పగించటం ద్వారా దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టయిం దన్నారు. నిజమైన దొంగలు బయటపడాలంటే సీబీఐ విచారణ జరపాల్సిందే అన్నారు. ఎమ్మార్‌ వ్యవహారంపై అవసరం అయితే సీబీఐ విచారణ జరిపించటం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదని తులసీరెడ్డి అన్నారు. దేశంలోనే అత్యధికంగా సీబీఐ విచారణలకు ఆదేశించింది తమ ప్రభుత్వమే అన్నారు.

పీఆర్పీ రాజకీయాల్లో కొత్తమలుపు


విజయవాడ: విజయవాడ పీఆర్పీ రాజకీయాలు కొత్తమలుపు తిరుగుతున్నాయి. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యంకి దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పర్యటనను ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రద్దు చేసుకున్నందువలననే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాధ చెప్తున్నారు. పార్టీ నాయకులు నచ్చజెప్పుతున్నా ఆయన వినే పరిస్థితి లేదని అంటున్నారు. విజయవాడ మహాప్రభల కార్యక్రమానికి హాజరుకానందుకు చిరంజీవిపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తిరిగి కాంగ్రెసులోకి రావడానికి ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన తన అనుచర గణంతో చర్చలు జరుపుతున్నారు. వైయస్ జగన్ ను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పడం ద్వారా వంగవీటి రాధ తన అంతరంగాన్ని బయటపెట్టినట్లు భావిస్తున్నారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అందరి కన్నా ముందుగా వంగవీటి రాధాకృష్ణ అందులోకి వెళ్లడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. విజయవాడలో శాసనసభ్యుడు శ్రీనివాస రావుకు ప్రాధాన్యం ఇస్తూ తనకు చిరంజీవి ప్రాధాన్యం తగ్గించడాన్ని కూడా వంగవీటి రాధా జీర్ణించుకోలేకపోతున్నారు.