స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య 42


న్యూయార్క్‌: రోజురోజుకు స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధితో 42 మరణించగా, వ్యాధిసోకిన వారి సంఖ్య 1,070కు చేరింది. 2,099 మందిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలను గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ఒక్క మెక్సికోలో 1,112 కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. అమరికాలోని 41 రాష్ట్రాల్లో 896 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా కెనడాలో 201, స్పెయిన్‌లో 73 మందికి ఈ వ్యాధి సోకింది.

Advertisements

కసబ్‌ దాడిని వివరించిన ప్రత్యక్ష సాక్షి


ముంబయి: గతేడాది నవంబరు 26 ముంబయి దాడి కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో ఆ నాటి ఘటనను ప్రత్యక్షసాక్షి పోలీస్‌ సబ్‌ఇన్స్‌పెక్టరు బాస్కర్‌ కదం వివరించారు. కసబ్‌ ఎ.కె.-47 తుపాకీతో గిర్గౌన్‌ చౌపటి వద్ద సహాయ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ తుకారామ్‌ ఓంబ్లేను కాల్చాడని బాస్కర్‌ కోర్టుకు వివరించారు. ముంబయి ఘటనకు సంబంధించి ప్రత్యక్షసాక్షుల విచారణను ప్రత్యేక కోర్టు చేపట్టింది. ‘స్కోడా కారులో వచ్చిన కసబ్‌, అతని సహాచరుడు అబు ఇస్మాయిల్‌కు, అధికారులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇస్మాయిల్‌ తీవ్రంగా గాయపడగా కసబ్‌ను ఓంబ్లే, ఏపీఐ గోవిల్కర్‌ రెండువైపుల నుంచి పట్టుకోగా ఓంబ్లేపై కాల్పులు జరిపాడు. ఈ సందర్భంగా ఓంబ్లే అతన్ని నిరాయుధుడిని చేసేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం మిగిలిన పోలీసులు కసబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓంబ్లే, గోవిల్కర్‌లను మొబైల్‌ పోలీసు వ్యానులో, కసబ్‌, ఇస్మాయిల్‌ను అంబులెన్స్‌లో వేర్వేరు ఆసుపత్రులకు తరలించా’రని బాస్కర్‌ వివరించారు.ఇతర ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది.

తొమ్మిదికి చేరిన భోలక్‌పూర్‌ మృతులు


హైదరాబాద్‌: భోలక్‌పూర్‌లోని కలుషిత జలం తాగి అస్వస్థతకు గురై ఇప్పటికే ఎనిమిది మంది మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య


గుంటూరు: చిలకలూరిపేటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. పేటకు చెందిన ఖాదీర్‌కు ఏడేళ్ల కిందట రజీయాతో వివాహమైంది. ఇటీవల కాలంలో వీరి మధ్య స్వల్ప ఘర్ణణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో రజియా ఆవేశంతో తన ఇద్దరు పిల్లలతో పాటు ఒంటికి నిప్పటించుకుంది. ఘటనలో రజియా అక్కడిక్కడే మరణించగా, పిల్లలు గుంటూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు.

డయేరియాతో 25 మందికి అస్వస్థత


విజయనగరం: జిల్లాలోని గుమ్మలక్ష్మిపురం మండలం కొండవాడలో డయేరియా విజృంభించింది. దీంతో 25 మంది గ్రామస్థులు ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 10 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అధికారులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కలుషిత నీరే కారణమని గ్రామస్థులు ఆరోపించారు.

లొంగిపోయిన పేరం నాగిరెడ్డి


అనంతపురం: ఓటింగ్‌ అనంతరం తాడిపత్రిలో జరిగిన ఘర్షణలకు సంబంధించి తెదేపా పార్టీ శాసనసభ అభ్యర్థి పేరం నాగిరెడ్డి కోర్టులో లొంగిపోయారు. నియోజకవర్గంలోని నందలపాడులో కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల ఘర్షణ పడి ఆస్తులను తగలబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులైన మంత్రి జేసీ సోదరుడు ప్రభాకర్‌రెడ్డి, పేరం నాగిరెడ్డి అప్పటినుంచి అజ్ఞాతంలో ఉన్నారు. ఉదయం ప్రభాకర్‌రెడ్డి లొంగిపోగా అనంతరం తాడిపత్రి కోర్టులో నాగిరెడ్డి లొంగిపోయారు. విచారణ అనంతరం ప్రభాకర్‌రెడ్డికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

క్యాబినెట్‌ మీటింగ్‌కు లాలూ డుమ్మా


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సమావేశానికి రైల్వే శాఖామంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్‌, మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వన్‌లు గైర్హాజరయ్యారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు అనుకూలంగా రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఆగ్రహం కలిగించినట్లు దీనిద్వారా స్పష్టమవుతోంది. అందుకే సమావేశానికి డుమ్మా కొట్టి ఉంటారని కొందరు నాయకుల అభిప్రాయపడుతున్నారు.