పదవులు ఊడాయ్


హైదరాబాద్: కేంద్ర సాంకేతిక విద్యా మండలి(ఎఐసిటిఇ) పెద్దలకు కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. అవినీతి కేసులలో ఇరుక్కున్న మండలి సభ్య కార్యదర్శి కె నారాయణరావును ఆ పదవి నుంచి తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన నారాయణరావు మూడేళ్ళ క్రితం మండలి సభ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. దేశంలో సాంకేతిక కళాశాలల అనుమతులకు లక్షల రూపాయలు ముడుపులు స్వీకరిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు సిబిఐ చేసిన దాడుల్లో నారాయణరావు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. సిబిఐ అరెస్టు చేసిన రోజు నుంచే ఆయన సభ్య కార్యదర్శి పదవి నుంచి తొలగించినట్టని ప్రభుత్వం తెలిపింది. అలానే మండలి చైర్మన్ ఆర్ ఎ యాదవ్ ను కూడా పదవి నుంచి తొలగించినట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న దృష్ట్యా వీరికి ఉద్వాసన పలికినట్లు వివరించింది. వీర పదవుల్లో కొనసాగితే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నందున వీరందరినీ తక్షణం విధుల నుంచి వైతొలగి పాత ఉద్యోగాలకు వెళ్ళాలని ఆదేశించింది.యాదవ్ తోపాటు సలహాదారు రాయ్, డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రాంద్వా, అసిస్టెంట్ డైరెక్టర్ ఓం దలాల్ ను కూడా తొలగించారు. మండలి వైస్ చైర్మన్ ఎస్ ఎన్ మంతా ఇక నుంచి చైర్మన్ గా వ్యవహరిస్తారు.

Advertisements

`సారీ’ల సభ


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం నాడు ఆరోగ్యకరమైన వాతావరణం కనిపించింది. ప్రతిపక్ష నాయకులు, అధికార పక్షం నాయకులు, చివరకు సభాపతి కూడా పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నారు. గత మూడు రోజులుగా ఆవేశాలతో వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచారు. పంతాలను, పట్టింపులను పక్కన పెట్టి బడ్జెట్ సమావేశాల నాలుగో రోజును సజావుగా నడుపుకునేందుకు అవకాశం కల్పించారు. సభ ప్రారంభం కాగానే ఒకరి వెంట ఒకరు `సారీ’లు చెబుతుంటే సభ్యులంతా హర్షాద్వానాలు చేశారు. ఈ నాయకులను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు.

ముందుగా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సభ్యుల పట్ల పరుషంగా ప్రవర్తించినందుకు చింతిస్తున్నానని అన్నారు. గౌరవ సభ్యులను నొప్పించినందుకు విచారిస్తున్నానని, తాను క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. తాను కూడా స్పీకర్ పదవికి కొత్తేనని, సభ్యులు కూడా తనను అర్ధం చేసుకోవాలని కోరారు. తాను నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్న ఆలోచనతో ఉన్నానని, సభను నిబంధనల ప్రకారమే నడిపించడానికి ప్రయత్నిస్తున్నానని వివరించారు. తాను కూడా భావోద్వేగాలను అదుపుచేసుకోవాల్సి ఉందని, అలానే సభ్యులను కూడా అదపులో పెట్టాల్సి ఉందని చెప్పారు. సభ్యులకు తాను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, తనకు సభ్యులు కూడా సహకరించాలని కోరారు.

శాసన సభను సవ్యంగా నడుపుకోడానికి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడటానికి తాను ప్రయత్నిస్తున్నాని, దానిలో భాగంగానే తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాని ఆర్ధిక మంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. ఒక్కొక్క సారి ధర్మంపై అధర్మం విజయం సాధిస్తూ ఉంటుందని, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. అ తరువాత మాట్లాడిన గాలి ముద్దు కృష్ణమనాయుడు తాను కూడా సభలోదురుసుగా ప్రవర్తించడం తప్పేనని అంగీకరించారు. తన ప్రవర్తనకు క్షమాపణలు కోరుతున్నానని ఆయన అన్నారు. సభలో హుందాగా విచారం వ్యక్తం చేసిన రోశయ్యకు ఆయన అభినందనలు తెలిపారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సభలో పరిణామాలకు తాను చింతిస్తున్నానని అన్నారు. హుందాగా క్షమాపణలు చెప్పిన స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని ముందుగా ఆయన అభినందించారు. తాము ప్రజా సమస్యలపై స్పందించినప్పుడు స్పీకర్ తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మీరు హుందాగా వ్యవహరిస్తే తాము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు ప్రకటించారు. సభలో రెచ్చగొట్టే పద్ధతులను అనుసరించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ కు సూచించారు. ఈ దశలో స్పీకర్ జోక్యం చేసుకుని మళ్ళీ వివాదాస్పదమైన వ్యాఖ్యలు వద్దని చంద్రబాబును వారించారు.

తప్పులు జరగడం సహజమని, దానికి క్షమాపణలు చెబితే నష్టం ఏమీ లేదని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు. హుందాగా వ్యవహరించి సభలో క్షమాపణలు చెప్పిన నాయకులందరినీ ఆయన ప్రశంసించారు. తప్పును తప్పని ఒప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, దానివల్ల వ్యక్తి గౌరవానికి భంగం వాటిల్లదని, పైగా అలాంటి వారిపై సమాజంలో గౌరవం పెరుగుతుందని ఆయన అన్నారు. ఐదేళ్లపాటు జరగవలసిన ఈ అసెంబ్లీలో ఇంకా మనం తొలి దినాల్లోనే ఉన్నామని, రాబోయే కాలంలో కూడా సుహృద్భావ వాతావరణంలో సభను నడుపుకోడానికి అందరం కృషి చేయాలని ఆయన చెప్పారు.

కాగా భేషజాలు లేని రాజకీయాలు ఆరోగ్యకరమైనవని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. సభ సజావుగా నడవటానికి దోహదం చేస్తూ పరస్పరం క్షమాపణలు చెప్పుకున్న వారిని ఆయన అభినందించారు. ముఖ్యంగా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ని ఆయన ప్రశంసించారు. సభలో మంత్రి రోశయ్య , ప్రతిపక్షనేత చంద్రబాబు చాలా హుందాగా వ్యవహరించారని, సభలో నాయకులు ఇలాగ ప్రవర్తిస్తే కొత్త వారికి ఆదర్శప్రాయులుగా నిలుస్తారని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. బిజెపి నాయకుడు కిషన్ రెడ్డి, సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు కూడా ఈ నాయకులను అభినందించారు.

ప్రతిపక్షాల వాకౌట్


హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ హస్టల్ విద్యార్ధులకు సరైన పౌష్టికాహారం అందించడానికి రోజువారీ భత్యాన్ని పెంచాలని శాసనసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీనికి ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, భారతీయ జనతా పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రజారాజ్యం పార్టీ, తెలంగాణారాష్ట్ర సమితి మాత్రం నిరసన తెలిపాయి. ఈ అంశంపై తెలుగుదేశం ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహం మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్దులు ఆకలితో అల్లాడిపోతున్నారని అన్నారు. సరైన ఆహరం లభించక అనారోగ్యాల పాలవుతున్నరని చెప్పారు. వారికి తిండి పెట్టడానికి కనీసం పదిరూపాయలు కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.

జైల్లో ఖైదీలకు రోజుకు 30 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం భావి పౌరులకు సరైన ఆహారం కూడా పెట్టకపోవడం ఎంత వరకూ న్యాయమని ప్రశ్నించారు. హస్టల్ విద్యార్ధులకు రోజుకు 30 రూపాయలు కేటాయించాలన్నది తమ డిమాండని, దానికి ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించారు. కందిపప్పు వందరూపాయలు అయిపోయిన ఈ రోజుల్లో హస్టళ్ళలో ఉండి చదవుకునే పేద పిల్లలు కనీసం సాంబారు అన్నానికి కూడా నోచుకోవడం లేదని, వాళ్లకు పసుపు నీళ్ళే అన్నంలో పోస్తున్నారని మిగతా నాయకులు అన్నారు. బిజెపి ఎమ్మెల్యే కిషన రెడ్డ. సిపిఐ ఎమ్మెల్యే మల్లేష్, సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి నిరసనగా వాకౌట్ చేశారు. కాగా ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి మాట్లాడుతూ వసతి గృహల్లో పిల్లలకు సరైన సదుపాయాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం ముందుకు రాకపోవడం చాలా దారుణమని అన్నారు. తెరాస ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా నిరసన తెలిపారు.

ఇక నుంచి ఐఐటీ వైద్యులు!


న్యూఢిల్లీ: ఇప్పటివరకు ఇంజినీర్లను తయారు చేసిన ఐఐటీ(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లు సామాజిక శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయవాదులను కూడా అందించనున్నాయి. తమ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పేందుకు ప్రైవేట్ భాగస్వాములను ఖరగ్ పూర్ ఐఐటీ ఆహ్వానించింది. ఆస్పత్రి ఏర్పాటైతే ఎంబీబీఎస్ కోర్సును ఇక్కడ ప్రారంభించే అవకాశాలు మెరుగౌతాయి. ”మెడికల్ సైన్స్, టెక్నాలజీ పాఠశాల ఇప్పటికే ఉంది. ఆస్పత్రి అవసరం ఉందని కొంతకాలంగా ఉంది” అని ఖరగ్ పూర్ ఐఐటీ డైరెక్టర్ డీ ఆచార్య తెలిపారు. ఖరగ్ పూర్ లో ఇటీవలే ‘లా స్కూల్’ ను కూడా ప్రారంభించారు. సామాజిక శాస్త్రాల్లో స్నాతకోత్తర (ఎంఏ) కోర్సులకు గౌహతిలోని ఐఐటీ శ్రీకారం చుట్టింది. ఇందులో ఆర్థిక శాస్త్రం, తత్త్వశాస్త్రం, మానసిక శాస్త్రం వంటివి ఆరు అంశాలున్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులు తమకు ఇష్టమైన అంశాలను ఎన్నుకునే అవకాశాన్ని ఐఐటీలు ఇస్తున్నాయి.

ఎంఎస్ సీలో ఆర్థికశాస్త్రం, సామాజిక శాస్త్రాల్లో పరిశోధనలకు కాన్పూర్, ఖరగ్ పూర్ ల్లో అవకాశం ఉంది. ఐఐటీలు పూర్తిస్థాయి విశ్వవిద్యాలయాలుగా మారాలని, మసాచూట్స్ సాంకేతిక విద్యాసంస్థ తరహాలో విశాల దృక్పధంతో ఆయా వర్సిటీల్లో పాఠ్య ప్రణాళిక ఉండాలని ఇటీవల యశ్ పాల్ కమిటీ సూచించిన సంగతి తెలిసిందే. సాంస్కృతిక అధ్యయనం, అభివృద్ధిపై ఎంఏ కోర్సును ఢిల్లీ ఐఐటీ నిర్వహిస్తోంది. సామాజిక శాస్త్రాల్లో పీహెచ్ డీలు ప్రదానం చేస్తున్న బాంబే ఐఐటీలో అధ్యాపకుల సంఖ్యను 16 నుంచి 36కి పెంచడం గమనార్హం. ఐఐటీ మద్రాస్ లో ఆర్థికశాస్త్రం, ఆంగ్లంలో ఐదేళ్ల ఎంఏ కోర్సును 2006లో మొదలైంది.

‘రావణ్’ షూటింగ్ లో ప్రమాదం


తిరువనంతపురం: ప్రముఖ దర్శకుడు మణిరత్నం పలు అవరోధాల మధ్య ‘రావణ్’ షూటింగ్ ను మళ్లీ సెట్స్ పైకి తీసుకువచ్చినప్పటికీ దురదృష్టం మాత్రం ఇంకా వెన్నాడుతూనే ఉంది. బుధవారం సాయంత్రం కేరళలోని చాలక్కుడి సమీపంలో ఉన్న అతిరప్పలి జలపాతాల వద్ద షూటింగ్ ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ కోసం తీసుకువచ్చిన కుంజు అనే ఏనుగు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఏనుగును లొంగదీసుకునేందుకు ప్రయత్నించిన ట్రయినర్, మావటి ఆండవన్ ను తొక్కి చంపింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు సమీపంలోనే ఉన్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విక్రమ్ లు తృటిలో తప్పించుకున్నారు.

ఇండియాలో అత్యధిక సంఖ్యలో ఏనుగులు కేరళలోని తిరుచూరి జిల్లా అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, టూరిస్ట్ ప్రోగ్రామ్ లు వంటి పలు కార్యక్రమాలకు వీటిని ఉపయోగిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లోనే ఏనుగులు అదుపుతప్పి బీభత్సం సృష్టించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కుంజు అదుపుతప్పి మావటిని చంపడంతో అప్పుడే షూటింగ్ పూర్తి చేసుకున్న అభిషేక్, ఐశ్వర్య, విక్రమ్, తదితరులను కేరళ అటవీ శాఖ అధికారులు అదే అడవుల్లోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఏనుగు యజమాని, మరో ట్రైనర్ కలిసి దానిని అదుపులోనికి తీసుకునేంతవరకూ అభిషేక్, ఐశ్వర్య తదితరులు కొద్ది గంటల సేపు టెన్షన్ కు గురయ్యారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో తదుపరి షూటింగ్ ను మణిరత్నం నిలిపివేశారు.

అడుగడుగునా గండాలే…
మణిరత్నం హిందీ, తమిళ భాషల్లో ‘రావణ్’ చిత్రం ప్రారంభించినప్పటి నుంచి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తొలుత టైటిల్ విషయంలో సమస్య తలెత్తింది. ‘రావణ్’ టైటిల్ ను తమిళ డైరెక్టర్ ఒకరు ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకోవడంతో ‘అశోగ వనం’ అనే టైటిల్ ను మణిరత్నం రిజిస్టర్ చేయించాల్సి వచ్చింది. హిందీలో మాత్రం ‘రావణ్’ పేరునే ఉంచారు. 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న తరుణంలో మణిరత్నం హృద్రోగ సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో మూడు నెలలకు పైగా షూటింగ్ నిలిచిపోయింది. దీంతో అప్పటికే వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ మణికండన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ స్థానంలో సంతోష్ శివన్ ను తీసుకున్నారు. మణిరత్నం ఇటీవల పూర్తి స్వస్థత చేకూరడంతో కేరళలోని పలు ప్రాంతాల్లో నిరవధికంగా షూటింగ్ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఏనుగు సృష్టించిన బీభత్సం మరోసారి షూటింగ్ కు అంతరాయ కలిగించింది. ఈ చిత్రాన్ని మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ పతాకంపై ఆయన సోదరి శారద నిర్మిస్తున్నారు.

‘రాములమ్మ తప్పుకోవాలి’


మెదక్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మెదక్ లోక్ సభ సభ్యురాలు విజయశాంతి వెంటనే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు రఘునందన్ రావు డిమాండ్ చేశారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారైందని ఆయన అన్నారు. మీడియాలో వచ్చే కథనాలపై ఆమె ఎందుకు స్పందించడం లేదని రఘునందన్ రావు సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి దయ వల్లే ఆమె మెదక్ ఎంపిగా గెలిచారు కనుక ఆ పదవికి రాజీనామా చేయాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారంనాడు ఇక్కడ ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, పార్టీ నిర్ణయాలనుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రిని కలవడం, జిల్లా నాయకులకు ఎలాంటి విషయాలు చెప్పకుండానే ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్న విజయశాంతి ఇక ఎంతమాత్రమూ పార్టీ ద్వారా వచ్చిన పదవిని అనుభవించే అర్హత లేదని రఘునందన్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ బాధ్యతలను విజయశాంతి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తమ పార్టీ నాయకుడు హరీష్ రావు ఆమె నివాసానికి వెళ్ళినప్పుడు తీవ్రంగా అవమానించినట్లు మీడియాలో వచ్చిన వార్తలు కూడా తెరాస వర్గాలను తీవ్ర ఆగ్రహావేశాలకు కారణంగా నిలుస్తోంది.

‘జనం మధ్యే ఉద్యమం’


హైదరాబాద్: ఇక నుంచి తాను జనం మధ్య ప్రత్యక్షంగా ఉండి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటానని జనశక్తి రాష్ట్ర కార్యదర్శి కూర దేవేందర్ అలియాస్ అమర్ ప్రకటించారు. ఇంతవరకూ తాను మానసిక పోరాటం మాత్రమే చేశానని, ఇప్పుడు ప్రజా సమస్యలపై భౌతికంగా ఉద్యమాల్లో ఉంటానని చెప్పారు. తెలంగాణలో ఉన్న వారంతా పార్టీలు, సిద్ధాంతాలు పక్కన పెట్టి కలిసికట్టుగా ఒక్కటై తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాలని అమర్ పిలుపునిచ్చారు. చర్లపల్లి జైలు నుంచి గురువారం మధ్యాహ్నం బెయిలుపై విడుదలైన అమర్ మీడియా ప్రతినిధులతో కాసేపు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి అమర్ కు రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతరం అనారోగ్యంతో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన అన్న కూర రాజన్నను పరామర్శించేందుకు అమర్ వెళ్ళారు.

ప్రస్తుతం ప్రజా ఉద్యమాలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయని, ఈ ఉద్యమాల కారణంగానే పార్లమెంట్ లో భూసంస్కరణలు అమలవుతున్నాయని అమర్ చెప్పారు. పార్లమెంటుతో సంబంధం లేని చారు మజుందార్ మరణానంతరం పార్లమెంట్ ఘనంగా నివాళులు అర్పించడం దీనికి నిదర్శనం అన్నారు. ఐదేళ్ళపాటు జైలు జీవితం అనుభవించిన రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని అమర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ఖైదీలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఇటీవలే జారీ చేసిన జీఓను అమర్ స్వాగతించారు.

కాగా, అమర్ విడుదలైన సందర్భంగా ఆయనను స్వాగతించేందుకు చర్లపల్లి జైలు వద్దకు ప్రజా నాట్యమండలి కళాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమర్ కు పీపుల్స్ వార్ మాజీ నాయకుడు సత్యమూర్తి స్వాగతం పలికారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత నక్సలైట్లు – జనశక్తి (చర్చల సమయంలోనే ఈ రెండు పార్టీలూ మావోయిస్టు పార్టీగా ఐక్యమయ్యాయి) రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన శాంతి చర్చల్లో అమర్ పాల్గొన్న విషయం తెలిసిందే.