ధరల కౌగిట్లో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి!


విశాఖపట్నం: పండగ వచ్చింImageదంటే చాలు మార్కెట్లో సరకుల ధరలకు రెక్కలు వచ్చేస్తాయి. సామాన్యుడే లక్ష్యంగా వ్యాపారులు ఒక్కసారిగా ధరలను పెంచేసి సొమ్ము చేసుకోవాలని చూస్తుంటారు. తాజాగా దీపావళి సందర్భంగా కూడా టోకు వ్యాపారులు అదే పని చేశారు. పండగ పూట ఎక్కువగా అమ్ముడయ్యే నిత్యావసర సరకుల ధరలను ఒక్కసారిగా పెంచేసి లాభార్జనకు నడుం బిగించారు. బియ్యం, పప్పులు, నూనెలు, పంచదార వంటి సరకుల ధరలను దసరా ముందే పెంచేయగా, తాజాగా టమోటా, ఉల్లిపాయల ధరలను కూడా పెంచేసి పండగ ఆనందాన్ని హరించే ప్రయత్నం చేశారు. కర్నూలు మార్కెట్‌కు భారీఎత్తున వస్తున్న ఉల్లి పంటను కారుచౌకగా కొనేస్తూ నేరుగా తమ గోదాములకు తరలిస్తున్న వ్యాపారులు చిల్లర వర్తకుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం పీనాసి బుద్ది ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దాంతో ఎక్కడ చూసినా ఉల్లి ధర భగ్గుమంది. పది రోజుల కిందట కూడా కిలోకు రూ.10 నుంచి రూ.12 పలికిన నాణ్యమైన ఉల్లి ఇప్పుడు అమాంతం కొండెక్కింది. సోమవారం హైదరాబాద్‌ రైతు బజార్లలోనే సాధారణ రకానికి రూ.16 వసూలు చేశారు. బహిరంగ మార్కెట్లో రూ.18 పలుకుతోంది. దీపావళికి వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులే చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి కర్నూలు బడా వ్యాపారుల గోదాములపై దాడులు చేయకపోతే ఉల్లి రేటు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఉల్లి అవసరాలను ప్రధానంగా కర్నూలు, మహారాష్ట్రలోని నాసిక్‌ మార్కెట్లు తీరుస్తున్నాయి. మహారాష్ట్రలో వర్షాల వల్ల ఉల్లి రవాణాకు స్వల్ప అంతరాయాలు ఏర్పడ్డాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న కర్నూలు ఉల్లి వ్యాపారులు ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టారు. కర్నూలు జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తుంటారు. డిసెంబర్‌ వరకు కర్నూలు మార్కెట్‌కు భారీగా సరకు వస్తుంది. హోల్‌సేల్‌ వ్యాపారులు కొని లారీల్లో అన్ని జిల్లాలకు సరఫరా చేస్తారు. మొన్నటి వర్షాలకు కొద్దిపాటి పంట నష్టపోయినా ఉత్పత్తికి పెద్ద ఇబ్బందులు లేవని చెబుతున్నారు. నవంబరులోనే రోజూ 70 వేల క్వింటాళ్ల సరకు కర్నూలు మార్కెట్‌ యార్డుకు వస్తోంది. రైతుల నుంచి వ్యాపారులు కారు చౌకగా సరుకును కొనేస్తున్నారు. కిలోకు రూ.3 నుంచి రూ.5 వరకు చెల్లిస్తున్నారు. నామమాత్రపు సరకును రూ.9కి కొంటున్నారు. ఏరోజు కొన్న సరకు ఆరోజు సక్రమంగా జిల్లాలకు వెళితే ఉల్లి రేటు పెరగదు. అయితే, బడా వ్యాపారులు కొన్నది కొన్నట్లే గోదాములకు తరలిస్తున్నారు. ఇటీవల వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతిందని అందుచేత పంట రాక తగ్గిందని, దీనివల్లే రేటు పెరిగిందని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాల కారణంగా మహారాష్ట్ర వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌కు ఉల్లి రవాణాను నిలిపేస్తే కోస్తాలో తప్ప అంతగా ప్రభావం చూపని నీలం తుపాను పేరు చెప్పి ఉల్లి వ్యాపారులు పది రోజులుగా కర్నూలు గోదాముల నుంచి సరకు బయటకు తీయడం లేదు. మరోపక్క కర్నూలు మార్కెట్‌కు రైతులు తెచ్చిన సరకును కొనేసి గోదాములకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలో పరిస్థితి సర్థుబాటైనా కూడా అక్కడి నుంచి ఉల్లి లారీలు రాకుండా అడ్డుకుంటున్నారు. ఫలితంగా వారం రోజులుగా బహిరంగ మార్కెట్లో ఉల్లి నిల్వలు తగ్గిపోయాయి. దాంతో ఉల్లి రేట్లు అమాంతం పెరిగాయి. కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల గోదాముల్లో పెద్దఎత్తున ఉల్లి నిల్వలు ఉన్నాయని సమాచారం. విజిలెన్సు ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు దాడులు చేస్తే పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు బయటపడే అవకాశం ఉంది. విజిలెన్సు అధికారుల నిర్లక్ష్యం కూడా అనుమానాలకు తావిస్తోంది. మరోపక్క బెల్లం రేటు కూడా ఆకాశాన్ని తాకేలాగే ఉంది. వ్యాపారుల మాయాజాలంతో రాష్ట్రంలో బెల్లం రేటు కూడా పెద్దఎత్తున పెరిగింది. వారం రోజుల కిందట కేజీ బెల్లం రూ.40 నుంచి రూ.45 ఉంటే ఇప్పుడది కేజీ రూ.55 నుంచి రూ.60కు పెరిగి పోయింది. ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు చిల్లర వ్యాపారులు. అనకాపల్లి నుంచి నిల్వలు మార్కెట్లోకి రాకపోవడం వల్ల దీని ధర పెరిగిందని చెబుతున్నారు. వంట నూనెల ధరలు గరిష్ఠంగా పెరిగాయి. గతంలో లీటరు రూ.70 నుంచి రూ.85 రూపాయల మధ్య లభించిన నాణ్యమైన నూనె ఇప్పుడు రూ.100 నుంచి రూ.168 మధ్య దొరుకుతోంది. పప్పుల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ పండగ వచ్చినా ముందు పెరిగేది పప్పు దినుసుల ధరలే.

Advertisements