రూ. 15లక్షలతో వై.ఎస్‌. కాంస్య విగ్రహ ఏర్పాటు


ఒంగోలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటుకు చీరాల పట్టణంలోని గడియారస్థంభం సెంటర్‌లో శుక్రవారం కమీషనర్‌ దేవ్‌సింగ్‌ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. ఇటీవల చీరాల మున్సిపల్‌ కౌన్సిల్‌ హలులో జరిగిన సమావేశంలో రూ.15లక్షల వ్యయంతో విగ్రహా ఏర్పాటుకు కౌన్సిల్‌ తీర్మానించినందున వెంటనే పనులు ప్రారంభించినట్లు కమీషనర్‌ బి. దేవ్‌సింగ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశానుసారం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ విగ్రహ ఏర్పాటు వెంటనే జరగాలని ఆదేశించినట్లు తెలిపారు.

వెస్లీ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి


ఒంగోలు: జాన్‌వెస్లీ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర భూగర్భశాఖ, గనుల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఇఎంఎస్‌తో మాట్లాడుతూ హెలికాప్టర్‌ ప్రమాదంలో ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.తోపాటు మృతిచెందిన చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఒంగోలు నివాసి అయిన వెస్లీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. వెస్లీ తన చిన్ననాటి మిత్రుడని, ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళమని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రధాన భద్రతా అధికారిగా తన మిత్రుడు ఉన్నాడని గర్వంగా తాను అనుకున్నానని, కానీ వెస్లీ అకాలమరణం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. వెస్లీ కుటుంబానికి ప్రభుత్వ పరంగా రావాల్సిన జీతభత్యాలు త్వరగా వచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా వెస్లీ భార్యకు ఆర్డీఓగా పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక జూబ్లీహీల్స్‌లో ప్రభుత్వం తరఫున ఒకఫ్లాట్‌ను మంజూరు చేయిస్తామని తెలిపారు. ఆయనలేని లోటు వారి కటుంబానికి తీర్చలేనిదని, వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

జగన్‌ ముఖ్యమంత్రిత్వానికి పార్టీ ఏకగ్రీవ తీర్మానం


ఒంగోలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తనయుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రకాశం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. బడుగు, బలహీన వర్గాల కోసం దివంగత వై.ఎస్‌.ఆర్‌ సేవలు మరువలేనివని, ఆయన ఆశయాలను కొనసాగించడానికి వెంటనే వై.ఎస్‌.జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ పార్టీ కమిటీ శుక్రవారంనాడు తెలిపింది.

సింగరాయకొండ వద్ద రోడ్డు ప్రమాదం


ఒంగోలు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామం వద్ద గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో గాయపడిన మరో ఐదుగురిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెన్నై నుండి హైదరాబాద్‌కు వెళుతున్న వోల్వో బస్సుకు ఎదురుగా వస్తున్న మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి వోల్వో బస్సు పొలాల్లోకి తిరగబడింది. మృతులలో నందనవనానికి చెందిన పి.వి.సుబ్బారావు(35), రఘునాథ చక్రవర్తి(40), సాయి మనోహర్‌ (30), బస్‌ క్లీనర్‌ అబ్దుల్‌ కలాం(25)లు అక్కడికక్కడే మృతి చెందారు. సింగరాయకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.