పీఆర్ ప్రగతిపై కలెక్టర్ సమీక్ష


కరీంనగర్: జిల్లాలో పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా జరుగుతున్న పనుల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ జి.డి.అరుణ అన్నారు. పంచాయతీ రాజ్‌ పనుల ప్రగతిని కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భింగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 2009 – 10 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా 1490 పనులు మంజూరు అయినట్లు ఆమే తెలిపారు. 1476 పనులు ప్రగతిలో ఉన్నాయని అన్నారు.

ఇంత వరకు 1162 పనులలో 364 లక్షల ఖర్చు చేసినట్లు ఆమె తెలిపారు. పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. ముఖ్యంగా పనుల నిర్మాణంలో నాన్యత ప్రమాణాలు పాటించాలని, అన్నారు. జరిగిన పనులన్నింటిని క్వాలిటి కంట్రోల్‌ ద్వారా తనిఖీ చేయించాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్‌ యస్‌.ఇ. బిక్యా నాయక్‌, ఇ.ఇ.లు దశరతం, విజయ కుమార్‌ , ప్రసాద్‌, మధునయ్య, డి.ఇ.లు తదితరులు పాల్గొన్నారు.

విషజ్వరాల బారిన విద్యార్థులు


రాయికల్‌: మండలంలోని ఒడ్డెలింగాపూర్‌ గిరిజన గురుకుల పాఠశాలలో విషజ్వరాలు విజృంభించాయి. జ్వరాలతో విద్యార్థులు మంచాన పడ్డారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో విలవిల్లాడుతున్న విద్యార్థులను ఆశ్రమ పాఠశాల సిబ్బంది శుక్రవారం రాయికల్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఈ ఆశ్రమపాఠశాలలో వివిధ మండలాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొన్ని రోజులుగా విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం బాధాకరం. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు శ్రద్ద కనబరచకపోవడంతో విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న ఆదివాసి గిరిజన హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్రం రవిందర్‌ గురుకుల సిబ్బందిని నిలదీయడంతో బాధిత విద్యార్థులను వైద్య సేవల కోసం రాయికల్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. స్థానిక వైద్యులు వేదవ్యాస్‌ విద్యార్థినిలను పరీక్షించి మందులను అందజేసారు. గురుకులంలో వార్డెన్‌పోస్టు గత కొంత కాలంగా ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణ కరువైందని, దాంతో ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని గిరిజన సంఘ నాయకుడు రవిందర్‌ ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్‌ పోస్టును భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసారు.

గిరిజన మహిళలకు దీపం సర్టిఫికెట్ల పంపిణి


మెట్‌పల్లి: ఎనిమిది మంది గిరిజన మహిళలకు ఎంఎల్‌ఏ కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు దీపం సిలిండర్‌ సర్టిఫికెట్లు తహసీల్దార్‌ కార్యలయంలో పంపిణి చేశారు. జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా రంగరావుపేట తండా పరిశీలనకు వచ్చినప్పుడు 71 కుటుంభాలకు దీపం సిలిండర్‌లు మంజూరు చెయిస్తానని హమి ఇచ్చారని అందులో భాగంగా సిలిండర్‌తో పాటు అదనపు తరగతిగది, త్రాగునీటి పైపు లైను, మంజూరు చెశారని ఎంఎల్‌ఏ విద్యాసాగర్‌రావు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ పి సంపత్‌కుమార్‌ గ్యాస్‌ ఎజెన్సీ నిర్వహకులు సునీల్‌, రంగారావుపేట గ్రామస్థులు పాల్గొన్నారు.

‘ఫీల్డ్‌ చానల్‌ ’ పేరుతో ఉపాధి అవినీతి


రాయికల్‌ (కరీంనగర్ జిల్లా): అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తున్నారనడానికి ఇదో మంచి ఉదాహరణ. జాతీయ గ్రామీణ ఉపాధి హామి నిధులను పక్కదారి పట్టించి చేయని పనులను బిల్లులందించారు. రికార్డుల్లో ఫీల్డ్‌ఛానల్‌ పనులను నిర్వహించినట్లు చూపుతూ అట్టి నిధులను కాజేశారు. క్షేత్రస్థాయిలో పనులు జరిగిన ఆనవాళ్ళే లేకపోవడం విస్మయానికి గురిచేసింది. రాయికల్‌ మండలం వస్తాపూర్‌ అటవీ గ్రామానికి ఫీల్డ్‌ఛానల్‌ నిర్మాణ పనుల పేరుతో జరిగిన అవినీతిపై కథనమిది.

వస్తాపూర్‌ గ్రామంలోని చెరువు తూము నుండి లంబాడి తండా వరకు ఫీల్డ్‌ఛానల్‌ నిర్మాణం కోసం జాతీయ ఉపాధి హామి పథకం కింద మే 2006లో పనులు చేపట్టినట్లు రికార్డుల్లో చూపారు. ఈ పనులు ఇంకా పురోగతిలో ఉన్నట్లు అధికారులే చెప్పుతున్నారు. ఇందుకు 1214 మంది కూలీలకు వినియోగించినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. రూ.1లక్షా21 వేల 369 నిధుల బిల్లులను అందించినట్లు చెప్పారు. ఇదంతా రికార్డులకే పరిమితమైంది.

గ్రామానికి చెందిన బత్తుల మల్లయ్య అనే ఉపాధి కూలీ చెరువులో కందకాల నిర్మాణ పనులకెళ్ళాడు. అట్టి పనులకు రావాల్సిన డబ్బులను కాదని ఫీల్డ్‌ఛానల్‌ పనుల కింద కూలీకి వచ్చినట్లు పేర్కొంటూ ఇటీవల డబ్బులందించారు. తాను ఆ పనులకే వెళ్లకపోవడం అసలు ఫీల్డ్‌ఛానల్‌ పనులే జరుగకపోవడంతో ఈ విషయాన్ని విలేకరుల దృష్టికి తీసుకువచ్చాడు. కూపీ లాగితే చేయని పనులకు బిల్లులందించినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. దాంతో గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసారు. ఏలాంటి పని జరుగకున్న బిల్లు మంజూరు చేయడంతో అధికారులు పర్మవేక్షణ జరుపలేదని తేట తెల్లమవుతుంది.

విచారణ జరిపి బాధ్యులపై చర్యలు ః ఎంపిడిఓ
మండలంలోని వస్తాపూర్‌లో జరిగిన ఉపాధి హామి అవినీతిపై రాయికల్‌ ఎంపిడిఓ గంగుల సంతోష్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లగా ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదన్నారు. చేయని పనులకు బిల్లులందించడం తప్పేనని విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటానన్నారు.

ధర్మపురిలో పెరిగిన గోదావరి


ధర్మపురి (కరీంనగర్ జిల్లా): గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ధర్మపురిలో గోదావరి నీటిమట్టం పెరిగింది. వర్షాకాలం ప్రారంభమెనై రెండు నెలల్లో కేవలం రెండు సార్లు మాత్రమే నీటిమట్టం పెరిగింది. మిగిలిన రోజుల్లో వర్షాలు లేక వెలవెల బోయింది. వర్షాకాల ప్రారంభంలో జాన్‌ 27న రాత్రి కురిసిన తొలకరి వర్షానికి జూన్‌ 28న మొదటిసారి గోదావరి నీటిమట్టం పెరగగా రెండవసారి గురువారం పెరిగింది. పెరిగిన గోదావరిని చూడడానికి ధర్మపురి గ్రామస్థులతో పాటు చుట్టు ప్రక్క గ్రామాల ప్రజలు తరలివచ్చారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో పరిశీలించిన రెవెన్యూ సిబ్బంది, పుణ్యస్నానాలాచరించడానికి వచ్చిన భక్తులు గోదావరి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.