తొలి తెలుగు గిరిజన దినపత్రిక మన్యసీమ


31-07-2010

Advertisements

పనులు వేగవంతం చేయండి: ఖాన్‌ ఆదేశాలు


కర్నూలు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని రాజీవ్‌ విద్యా మిషన్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి చందనాఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాభవన్‌లోని సమావేశ మందిరంలో సర్వశిక్ష అభియాన్‌ పనితీరు, విద్యా హక్కు చట్టం, సాక్షరభారత్‌ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చందనాఖాన్‌ మాట్లాడుతూ విద్యాలయాల్లో గదుల కొరత వల్ల పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, యుద్ద ప్రాతిపదికన అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని, సకాలంలో త్వరితగతిన పూర్తి చేసి విద్యార్దులకు చదువులకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. మరుగుదొడ్లు,త్రాగునీటి సదుపాయం, ఇతర మౌళిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని ఆమె ఆదేశించారు. బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని కారణంగా ఆడపిల్లలు చదువు మానేస్తున్నట్లు తాను పరిశీలించానని జాప్యం లేకుండా అన్ని పాఠశాలల్లో తక్షణమే ఏర్పాట్లు చేయాలని, నిర్మించిన మరుగుదొడ్లలో సక్రమ నిర్వాహణ లేకపోవడం వల్ల నిరుపయోగంగా ఉన్నాయని, ఒక పాఠశాలకు 400 రూపాయల చొప్పున ఖర్చు చేసేందుకు ఔట్‌ సోర్సింగ్‌ పద్దతి పై నియమించుకోవాలని, ఉన్న పాఠశాలకు కంప్యూటర్‌ పరికరాలు సరఫరా చేశామని వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వంద శాతం పాఠశాలలకు విద్యుత్‌ సరఫరా తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులను ఆమె ఆదేశించారు. ఇంటర్నల్‌ వైరింగ్‌, ఎలక్ట్రీక్‌ బోర్డులు, స్విచ్‌లు ఇతర పరికరాల కొనుగోలుకు పాఠశాల నిధుల నుండి ఖర్చు చేయాలని ఆమె సూచించారు. అకడమిక్‌ కమిటీలకు విద్యార్దులు తల్లిదండ్రులు తప్పని సరిగా హాజరై సూచనలిస్తే విద్యార్దుల చదువు ఆటోమెటిక్‌గా సాగుతుందని, కస్తూరిభా గాంధీ పాఠశాల భవనాలు కూడా త్వరగా పూర్తి చేసి అవసరమైన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని , అంగన్‌వాడి సెంటరులో చేరిన పిల్లలు మొదటి తరగతి వరకు వచ్చేంతవరకు పాఠశాలలో చేర్పించే బాధ్యతను తీసుకోవాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖా పిడి జూబేదా బేగంను ఆమె ఆదేశించారు. వయోజనులు సంతకాలు చేసినంత మాత్రాన అక్షరాస్యులు కారని వారందరినీ సాక్షర భారత్‌ కార్యక్రమం ద్వారా విద్యావంతులను చేయాలని ఆమె ఆదేశించారు. గత రెండు సంవత్సరాల కంటే ఈ ఏడాది 450 పాఠశాలలకు అదనపు గదుల నిర్మాణం కోసం మంజూరు పత్రాలు జారీ చేశామని, జాప్యం లేకుండా త్వరగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. వయోజన విద్య సంచాలకులు పి జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లా మహిళ అక్షర శాతం తక్కువుగా ఉందని, నేషనల్‌ లిటరిసీ మిషన్‌ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుని వయోజనులందరికి అక్షరాస్యులుగా చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాలన్ని లిటరసీ కేంద్రాలుగా మారితే అక్షరాస్యతా శాతం మెరుగవుతుందన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని డిఇఓ ప్రిన్సిపల్‌ కార్యదర్శికి నివేదించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌ నాయక్‌, వయోజన విద్య సంచాలకులు పి జనార్దన్‌ రెడ్డి ,జిల్లా పరిషత్‌ సిఇఓ సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ రామ్మోహన్‌ రెడ్డి, డిఆర్‌డిఏ పిడి ప్రాజెక్టు డైరెక్టర్‌ రఘనాథ్‌, సంక్షేమ శాఖ డిడి జయప్రకాశ్‌, డిపిఓ శంకరయ్య, రాజీవ్‌ విద్యా మిషన్‌ పిడి , ఎస్‌సి కార్పోరేషన్‌, ఇడి ఆనంద్‌ నాయక్‌, డిప్యూటి డిఇలు తదితరులు పాల్గోన్నారు.

మంచిర్యాలలో అరవింద్‌, సిర్పూర్‌లో సమ్మయ్య


హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి కావేటి సమ్మయ్య విజయం సాధించారు. ఇక్కడ మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్ధి ఇంద్రకిరణ్‌ రెడ్డి ఆధిక్యం సాధించినా అనంతరం అన్ని రౌండ్లలో తెరాస ఆధిక్యం సాధించింది. కాగా, ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలో తెరాస అభ్యర్ధి గడ్డం అరవిందరెడ్డి సమీప కాంగ్రెస్‌ అభ్యర్ధి ఆర్‌.కృష్ణారావుపై విజయం సాధించారు. కరీంనగర్‌ జిల్లా వేములవాడ నియోజకవర్గంలో తెరాస అభ్యర్ధి చెన్నమనేని రమేష్‌ విజయం సాధించారు. ఇంతకుముందు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన రమేష్‌ తెలంగాణ కోసం రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు. తెరాస అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన గెలిచారు.

వైఎస్సార్‌ ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవి


హైదరాబాద్‌: దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉంటే తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలు ఇలా ఉండేవి కావని కాంగ్రెసు బహిష్కృత నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మహానాయకుడు వైఎస్‌ లేని లోటు తెలంగాణ ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. త్వరలో తమ నాయకుడు వైఎస్‌ జగన్‌ తెలంగాణలో పర్యటిస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రచారం కూడా చేయలేదని ఆయన అన్నారు. రెండు ప్రాంతాలు రెండు కళ్లు అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారానికి కూడా వెళ్లలేని స్థితిలో పడ్డారని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పోటీ చేయడానికే భయపడ్డారని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల ఓటమిని అంగీకరించాయని ఆయన అభిప్రాయపడ్డారు.

టిఆర్‌ఎస్‌ గెలుపుపై హర్షం సీమాంధ్రుల హర్షం


కర్నూలు: శుక్రవారం తెలంగాణ ప్రాంతాల్లో ఉప ఎన్నికల్లో వెలువడిన ఫలితాల మేరకు కేంద్ర కాంగ్రెస్‌ అధినేతల నాయకులలో మార్పు రావాలని రాయలసీమ తెలంగాణ ఉత్తరాంధ్ర వ్యవస్దాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఉదయం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన తెలుపుతూ రాజీనామాలు చేసిన వారే తిరిగి గెలుపొందడం తెలంగాణా ప్రజల విజయం అని, కాబట్ట అభివృద్ది పై దృష్టి పెట్టక పోవడమే వల్లే ఉప ఎన్నికల ఫలితాలను తెలంగాణాపై రిఫరెండంగా భావించాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా కప్పదాట్లు వేస్తున్న కాంగ్రెస్‌ నాయకుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, లేకపోతే వారి రాజకీయ భవిష్యత్‌తోపాటు కాంగ్రెస్‌ పార్టీకి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కూడా సంయమనం పాటించాలని, తెలంగాణా తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెసేనని చెప్పడం కన్నా అభివృద్ది తమ పార్టీ హాయంలోనే అని ప్రకటించి ఉంటే బాగుండేదని, ముఖ్యంగా దివంగత నేత డా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వర్గాన్ని, అభిమానులను, కార్యకర్తలను, కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టడం వల్లే కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద దెబ్బ అని గుప్తా తెలిపారు. అదే విధంగా తెలుగుదేశంపార్టీ కూడా బాబ్లీ అంశం వైపు పోవడంతో టిఆర్‌ఎస్‌కు లాభాన్ని చేకూరిందని, ఇప్పటికైనా రెండు నాలకల ధోరణి వ్యవహరించడం బాబు మానుకుని అభివృద్ది పై పోరాటాలు చేయాలని ఆయన కోరారు. ఎన్నికలకు ముందే అధిష్ఠానంతో తనతోపాటు మరికొందరు తెలంగాణా ప్రాంత నాయకులు పోటీకి దిగవద్దని సూచించినా, గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా ప్రతికూల ఫలితం వస్తే కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టకు దెబ్బతగులుతుందన్నారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్‌ నాయకులను నమ్మే పరిస్థితి ఉండదని, తెలంగాణా సమస్యను విభేదాలతో గాక సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను పరిగణనలోకి తీసుకుని పార్టీలకతీతంగా తెలంగాణా ఎజెండాతో ముందుకు కదలాలని, తెలంగాణ ప్రాంతల్లో అభివృద్ది సారిస్తే కాంగ్రెస్‌ పార్టీ పై ప్రజల్లో నమ్మకం వస్తుందన్నారు. తమిళనాడుతో వేరు పడడం మన రాష్ట్రం విభజన కావడంతో పోల్చరాదని, తెలంగాణ రాష్ట్రం అయ్యేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించకుండా అభివృద్ది పై దృష్టి సారించాలన్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలతో సొంతంగా తెలంగాణా రాష్ట్రాన్ని టిఆర్‌ఎస్‌ పార్టీ తెచ్చుకోగలదా అని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్‌ పదేపదే డిసెంబర్‌ తర్వాత రాష్ట్రం అగ్నిగుండం కాకుండా చూసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించాలని, లేని పక్షంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు తిరస్కరించే అవకాశం ఉందని కె సత్యనారాయణ గుప్త స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇక పై ప్రాంతాల వారిగా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్‌ గెలుపును తాము స్వాగతిస్తున్నామని, కాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌ పార్టీ ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, కాంగ్రెస్‌ పార్టీని జనం గెలిపించి ఉంటే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చే అవకాశాలు ఉండేదన్నారు. కాని టిఆర్‌ఎస్‌ గెలుపు తెలంగాణ వాదాన్ని బలంగా విన్పించినా, కాంగ్రెస్‌ అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుందో తెలియడం లేదని గుప్తా తెలిపారు.

చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స


కడప: పేదలకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించి వారికి అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నా అందులో ఏ మాత్రం మార్పుకనిపించడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి మండలకేంద్రంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదలకు అందుబాటులో వైద్యం కల్పించాలని ప్రభుత్వం స్పందించినా అవి ఏవీ ఇక్కడ లేకపోవడం అందరిని బాధిస్తోంది. కనీస సౌకర్యాలు కూడా లేక పోవడంతో వైద్యం కోసం వచ్చిన రోగులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన చాపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో అన్నీ సమస్యలే. పేరుకే 24గంటల ఆసుపత్రి పనిచేస్తోంది. కేవలం 8గంటలు మాత్రమే ఆసుపత్రిని తెరచి ఆ తరువాట మూసి వేయడం విశేషం. 24గంటల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ మూడేళ్ళ కిందట ప్రభుత్వం చర్యలు తీసుకున్నా ఇక్కడి ఉద్యోగులు కేవలం 8గంటలుమాత్రమే అసుపత్రిని కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఎవరూ నివాసం లేకపోవడం గమనార్హం. వైద్యాధికారి ఇలియరాణితో పాటు వైద్య సిబ్బంది మైదుకూరు,ప్రొద్దుటూరు పట్టణాల్లో నివాసం వుంటూ రోజు రాకపోకలు సాగిస్తున్నారు. ఆరోగ్యకేంద్రంలో కనీసం రోగులకు బెడ్లు కూడా లేకపోవడంతో ఆరుబయట బండలపై వైద్యాన్ని పొందాల్సిన దుస్థితి రోగులకు ఎదురైంది. అనునిత్యం ఆసుపత్రికి రోజుకు 70నుంచి 80మంది వరకు రోగులు వైద్యం కోసం రావడం జరుగుతోంది.చాపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. ఆసుపత్రిలో 10 పడకలు కూడా లేకపోవడంతో అందరిని బాదిస్తోంది. ప్రస్తుతం వైద్యాధికారి ఇలియరాణి ప్రసూతిసెలవు పై వెళ్లింది. వీరపునాయునిపల్లె మండలంలోని పాయసం పల్లె పిహెచ్‌సికి చెందిన వైద్యాధికారి బి.విశ్వనాధరెడ్డి చాపాడు పిహెచ్‌సి ఇన్‌చార్జిగా బాద్యతలు చేపట్టారు. వారానికి మూడు రోజులు మాత్రమే వైధ్యాధికారి విధులు నిర్వహించడం జరుగుతోంది. మిగిలిన సమయాల్లో రోగులను పరీక్షించడానికి వైద్యులు లేక ప్రజలు చాలా అవస్ధలు పడుతున్నారు. ప్రస్తుతం సీజనల్‌గా అంటువ్యాదులు గ్రామాల్లో చుట్టుముట్టాయి. ఫలితంగా జ్వరాలు, డయేరియా, తదితర వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డయేరియా కేసులు రోజుకు నాలుగు అయినా ఆసుపత్రికి రావడం జరుగుతోంది. అదే విధంగా వైద్యసిబ్బంది కొరత కూడా అధికంగానే వుంది.అన్నవరం సబ్‌సెంటర్‌లో ఏఎన్‌ఎం పోస్టు చాలా కాలంగా ఖాళీగా వుంది. ఆ స్ధానాన్ని భర్తీ చేయడంలో అధికారులు విఫలం అయ్యారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోరాయిపల్లి, ఎన్‌.ఓబాయపల్లి సబ్‌సెంటర్‌లో రెండవ ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంలో కూడా అధికారులు చర్యలు తీసుకోలేదు.దీంతో వైద్యం ప్రజలకు అందుబాటులోకి రాకుండా పోయింది. 24గంటలు వైద్యం అందించాలని ఆరోగ్యకేంద్రం స్ధాయిని పెంచినప్పటికి వైద్యసిబ్బంది లేకపోవడం వలన ఏడు కిలోమీటర్ల దూరంలోని మైదుకూరు, 13కిలోమీటర్ల దూరంలోని ప్రొద్దుటూరు ప్రాంతాలకు రోగులు ఆశ్రయిస్తూ వైద్య పరీక్షలకు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. వైద్య సిబ్బందిని అందుబాటులో వుంచడంతో పాటు ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో అన్ని వసతులను సమకూర్చి రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని స్ధాని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

కేసీఆర్‌తో చర్చలకు సిద్ధమన్న లగడపాటి


న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావుతో చర్చలు జరిపేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నట్టు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ప్రకటించారు. ఈ సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని భావించామన్నారు. అయితే, తెలంగాణ సెంటిమెంట్‌కు ఆ ప్రాంత ప్రజలు పట్టం కట్టారన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఒక ప్రైవేట్‌ టీవీ ఛానెల్‌ నిర్వహించిన సర్వే ప్రకారం ఫలితాలు రావడం మంచిదే అయినప్పటికీ ఒక కాంగ్రెస్‌ వాదిగా తనకు తీవ్ర నిరాశకు లోను చేశాయన్నారు. ఇకపోతే, ఈ ఎన్నికల ఫలితాలకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముడిపెట్టకూడదన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ కంటే రాజీనామా చేసిన అభ్యర్ధుల పట్ల సానుభూతి ఎక్కువగా ఉండటం వల్ల వారు విజయభేరి మోగించారన్నారు. అదే సమయంలో ఉప ఎన్నికలు జరిగిన 12 స్థానాల్లో తెరాస అభ్యర్ధులు విజయం సాధించడం తెలంగాణ సెంటిమెంట్‌ బలంగా ఉన్నట్టు కాదన్నారు. గతంలో కేసీఆర్‌ 2.15 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన మెజార్టీకి కేవలం 15వేలకు పడిపోయిందని గుర్తు చేశారు. అందువల్ల ఎన్నికల ఫలితాలకు, తెలంగాణవాదానికి ముడిపెట్టరాదన్నారు. అదే సమయంలో రాష్ట్ర ఏర్పాటుపై అన్ని రాజకీయ పార్టీల నేతలు ఒకచోట కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగా కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు.