హైదరాబాద్‌‌: చాపకింద నీరులా మావోయిస్టులు రాష్ట్రంలో తమ నెట్‌వర్క్‌ను, ఇటు క్యాడర్‌ను పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. 2005 చర్చల తర్వాత వరుస ఎన్‌కౌంటర్లు, అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లో హతమవడం… మరికొందరు నేతలు లొంగిపోవడంతో ఉత్తర తెలంగాణా స్పెషల్‌ జోనల్‌ కమిటీతో పాటు నల్లమల, దండకారణ్యం పూర్తిగా మట్టికొట్టుకుపోయింది. ఇటీవలే ఛత్తీస్‌ గఢ్‌లో పోలీసులపై గెరిల్లా యుద్ధతంత్రంతో విజ యాన్ని సాధించిన మావోయిస్టులు తిరిగి రాష్ట్రంలో పాగా వేసేందుకు యత్నాలను ముమ్మరం చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

గతంలో అగ్ర నేతలు శాఖమూరి అప్పారావు, టెక్‌ రమణ అలి యాస్‌ కొండల్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌ సమయంలో వారి డైరీని డీకోడ్‌ చేసినప్పుడు మావోల వ్యూహాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రముఖులను టార్గెట్‌ చేసేందుకే వారు వచ్చినట్లు డీజీపీ స్వయంగా పేర్కొన్నారు. మావోయిస్టులు ఉత్తర తెలం గాణా స్పెషల్‌ జోన్‌పై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. చాలా వరకు గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక భూమిక పోషించి ఆ తర్వాత లొంగిపోయినవారు.. మావోయిస్టు సానుభూతిపరులుగా పోలీసు శాఖకు చిక్కకుండా పనిచేసిన యువత ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న వారు…. వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులపాలైనవారు మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఉత్తర తెలంగాణా స్పెషల్‌ జోనల్‌ కమిటీలో సభ్యులుగా చేరుతున్నట్లు తెలుస్తోంది.

దండకారణ్యం… అబూజ్‌మఢ్‌ కొండల్లో వీరికి శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతంలో శిక్షణ పూర్తి అయిన తర్వాత ఉత్తర తెలంగాణాలో జిల్లాల వారీగా, మండలాల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జి రామన్న ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఉత్తర తెలంగాణాలోని నల్గొండలో కొంతభాగం, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో చాలామంది యువకులు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. అదే సమయంలో తెలంగాణాలో గతంలో విప్లవోద్యమాన్ని బలోపేతం చేసిన సికాస గట్టిపడుతున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలు సైతం అప్రమత్తం చేస్తున్నాయి.

నల్లమలలో ఉనికే లేదు…
అగ్రనేతలు బాలకృష్ణ, సుధాకర్‌ ఎన్‌కౌంటర్‌, ఉయ్యూరు ఎన్‌కౌంటర్‌ తర్వాత నల్లమలలో మావో యిస్టుల ఉనికి లేకుండా పోయిందనేది స్పష్టమవు తోంది. అదే సమయంలో పోలీసు వర్గాలు సైతం ఉత్తర తెలంగాణా, ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ)లో మాత్రమే మావోయిస్టుల కదలికలు స్పష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. దండకారణ్యం, నల్లమల కేంద్రంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే మావోయిస్టులు పేట్రేగిపోయి దాడులకు దిగుతు న్నారు. గతంలో మావోయిస్టులకు బలంగా ఉన్న ఉత్తర తెలంగాణాలో పార్టీ పుంజుకుంటేనే తిరిగి రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉండటంతో అగ్రనేతలంతా ఉత్తర తెలంగాణాపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన ఆరు సంవత్సరాలుగా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్ళిన అగ్రనేతలు సైతం రాష్ట్రం పైనే ప్రధానంగా గురిపెట్టి వ్యూహరచన చేస్తున్నట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

దండకారణ్యం ద్వారా ప్రవేశం
ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ఉన్న దండకార ణ్యం ద్వారా మావోయిస్టు వర్గాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తు న్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పేట్రేగిపోయి సాయుధ బలగాలపై దాడులకు దిగుతున్న నేపథ్యంలో… రాష్ట్ర పోలీసులు ఛత్తీస్‌గఢ్‌ – ఆంధ్రా సరిహద్దుపై భద్రతా దళాలు, గ్రేహౌండ్స్‌ బలగాలు పెద్దయెత్తున మోహరించడం… ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దుపై పోలీసుల నిఘా తక్కువగా ఉండటం… సులువుగా ప్రవేశించే అవకాశం ఉండటం ప్రధాన కారణంగా తెలుస్తోంది.

సోనియాతో సమావేశమైన రోశయ్య


న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్రమంత్రివర్గ విస్తరణ, సంక్షేమ పథకాల తీరు, రాజ్యసభ ఎన్నికలు, పార్టీలో కొందరి ధిక్కారస్వరం.. తదితర అంశాలపై ఆయన సోనియాగాంధీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్పమొయిలీ కూడా పాల్గొన్నారు. మధ్యాహ్నం ప్రధానమంత్రితో రోశయ్య సమావేశమనున్నారు.

చెలికాని మృతి పట్ల రోశయ్య సంతాపం


విశాఖపట్నం: ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొంటూ శ్రీకాకుళం జిల్లా రాజం మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ చెలికాని హరనాథ్‌ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.రోశయ్య విచారం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారానికై నేటి ఉదయం ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొంటూ ఆకస్మికంగా ఆనారోగ్యానికి గురై ఆయన మరణించడం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో రాజీలేదు : సీఎం


విశాఖపట్నం: రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాలలో ఒక్క చుక్క నీటిని కూడా నష్టపొకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే అంశాలలో ఎలాంటి రాజీ లేకుండా అధికారులు, వ్యూహాత్మకంగా పకడ్బందీగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు.

ఢిల్లీలో సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న కృష్ణ ట్రిబ్యునల్‌ వాధనలు, అలాగే 12వ తేదీన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి సిడబ్యుసి వద్ద అధికారుల సమావేశం, వంశధార ట్రిబ్యునల్‌ తదితర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర భారీ మధ్యతరహా నీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య నీటి పారుదల, అంతర్రాష్ట్ర జల మండలి శాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలిఫోన్‌లో సుదీర్ఘంగా చర్చించారు.

ప్రధానంగా కృష్ణ ట్రిబ్యునల్‌ వాధనలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో కర్ణాటక ఆల్‌మటి ప్రాజెక్టు ఎత్తు పెంపు విషయాలు, మిగుల జలాల పంపిణీ తదితర అంశాలలో పట్టుపడుతున్న సందర్భంగా మన రాష్ట్ర న్యాయనిపుణులు, అంతర్రాష్ట్ర జల వివాదాల మండలి అధికారులు పకడ్బంధీగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రానికి ఒక్క చుక్క నీరు కూడా నష్టపోకుండా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా, ప్రయోజనాల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా తగిన విధంగా కృషి చేయాలని ఆదేశించారు.

అల్‌మట్టి ఎత్తు పెంపు వల్ల రాష్ట్రానికి కృష్ణా జలాలు తీవ్రంగా నష్టపోతామని, వర్షాలు తక్కువగా ఉన్న సమయంలో మన రాష్ట్రంలో పంటకాలం చాలా ఆలస్యమవుతుందని దీని వల్ల రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆల్‌మట్టి ఎత్తు పెంపు విషయంలో వారికి కేటాయించిన నీరు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా పాటించేలా సకల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నది దిగువ రాష్ట్రమైన మన రాష్ట్రానికి గత బచావత్‌ అవార్డులో కేటాయించిన విధంగానే మిగులు జలాల విషయంలో మనకు న్యాయం జరిగే విధంగా చూడాలని ముఖ్యమంత్రి వివరించారు.

అలాగే ఈ నెల 12వ తేదీన ఢిల్లీలో జరగనున్న ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నీటిపారుదల ఉన్నతాధికారుల సమావేశం గురించి ముఖ్యమంత్రి చర్చించారు. మహారాష్ట్ర రెండు రాష్ట్రాల ఒప్పందాలను, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను, సుప్రీం కోర్టు తీర్పులను ధిక్కరించి ప్రాజెక్టులను, అక్రమంగా నిర్మిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర 13 అక్రమ బ్యారేజీలను నిర్మిస్తుందని ముఖ్యమంత్రి ఆరోపించారు. 13 బ్యారేజీలు నిర్మించి మహారాష్ట్రకు కేటాయించిన 60 టి.ఎం.సి.ల నీటి కంటే ఎక్కువ నీటిని తరలించుకునేందుకు ఎత్తులు వేస్తుందని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు.

ఈ విషయంలో గతంలో అనేక సార్లు అటు ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి పవన్‌ కుమార్‌ బన్సాల్‌ను, కేంద్ర జల వనరుల మండలి అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని వివరించారు. వారి ఆదేశాల మేరకు 12వ తేదీన రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహారాష్ట్రను సిడబ్ల్యుసి పూర్తి సమాచారంతో రావాల్సిందిగా ఆదేశించడంతో కేంద్రం వద్ద మన ప్రయత్నాలు ఫలించినట్లుగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలను కేంద్ర జల మండలి అధికారుల ముందు ఉంచాలనే అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌ సరైన ఆధారాలను చూపిస్తే కేంద్రం, మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులను నిలిపివేసేందుకు ఆదేశాలు ఇచ్చే అవకాశముందని ఈ విషయంలో అధికారులు చురుగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే మన న్యాయవాదులు, అంతరాష్ట్ర జల వివాదాల మండలి, సాగునీటి శాఖ అధికారులు క్రియాశీలకంగా, చురుగ్గా పనిచేస్తున్నారని అన్నారు. అత్యంత కీలకమైన అంతరాష్ట్ర జల వివాదాల విషయంలో అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకొని ఇంకా చాకచక్యంగా పనిచేయాలని లేనిపక్షంలో రాష్ట్రం పెద్దగా నష్టపోయే ప్రమాదముంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

వంశధార ట్రిబ్యునల్‌ ఏర్పాటు: వంశధార నదిలో జలాల పంపకానికి సంబంధించి మనకు న్యాయమైన వాట సాధించే విధంగా సమర్ధవంతంగా వాధించేందుకు జల వనరుల అంశాలలో సుదీర్ఘ అనుభవం వున్న న్యాయవాదుల బృందంతో ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు సంబంధించి చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. వంశధార ట్రిబ్యునల్‌లో మన రాష్ట్రానికి సంబంధించి హక్కులను కాపాడడంలో న్యాయవాదులు సమర్ధవంతంగా, పకడ్బందీగా, పక్కా వ్యూహంతో తమ వాదనలను వినిపించాల్సి వుంటుంది. ఈ వాదనల ఆధారంగా ఒక నివేదిక రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.