ఖైదీలకు దూరంగా వైద్య సేవలు?


హైదరాబాద్‌: జైళ్లలో ఖైదీలకు ఎప్పటికప్పుడు సరైన వైద్య సేవలు అందిస్తున్నామంటూ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రకటనలు కేవలం పత్రికలకే పరిమితమవుతున్నాయి. ఆచరణలో ఆ మాటలు కనీసం మచ్చుకైనా కానరావడం లేదు. సబ్‌ జైలులో ఉన్న ఖైదీని పరిశీలించేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి డాక్టర్‌ వస్తారు. ఒకవేళ ఖైదీ ఎవరైనా ఆనారోగ్యానికి గురై వైద్య సేవలు అవసరమైతే 15 రోజుల పాటు ఆగాల్సిందే.

రాష్ట్రంలో ఉన్న 141 సబ్‌ జైళ్లలో ఉన్న ఖైదీల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతుండగా, ఖైదీల్లో పెరుగుతున్న మరణాలు ఈ పరిస్థితికి రుజువుగా నిలుస్తున్నాయి. చాలా సబ్‌ జైళ్లలో జైలు ఆవరణలో డాక్టర్‌ను అందుబాటులో ఉంచే పరిస్థితి లేదు. ఖైదీ పరిస్థితి తీవ్రంగా మారితే అతనిని అధికార్లు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా నర్సింగ్‌ హోంకు తరలిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏటా 120 నుంచి 130 మంది ఖైదీలు మరణిస్తున్నారని మానవహక్కుల ఫోరం (హెచ్‌ఆర్‌ఎఫ్‌) కార్యదర్శి కె.మురళి అన్నారు. ”అయితే, కర్ణాటక, మహారాష్ట్రలలో నమోదవుతున్న మరణాల సంఖ్య చాలా తక్కువ. తేడా ఏమిటంటే, ఖైదీలకు అందించే నాసిరకం వైద్య సేవలే” అని ఖైదీలకు అందుబాటులో ఉన్న వైద్య సేవలపై విస్తృతంగా అధ్యయనం చేసిన మురళీ చెప్పారు. వైద్యులకు నెలకు కేవలం రూ.750 మాత్రమే ఇస్తున్నందున చాలామంది జైళ్లలో సేవలందించేందుకు ఆసక్తి చూపడంలేదన్నారు. ”ఫలితంగా, చాలామంది వైద్యులు వారి విధుల్ని సక్రమంగా నిర్వర్తించడంలేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎమర్జెన్సీ కేసుల విషయంలో రోగులకు స మయానికి తగిన రక్షణ కల్పించడంలో జైళ్ళ అధికార్లు విఫలమవుతున్నారన్నారు. ”ఏడాది కాలంలో సంభవించిన జైలు మరణాల్లో కనీసం ఐదుగురు హార్ట్‌ అటాక్‌తో మరణిస్తున్నారని, సమయానికి తగిన చికిత్స లభించకపోవడం ఇందుకు కారణం” అని ఈ హెచ్‌ఆర్‌ఎఫ్‌ సభ్యుడు అన్నారు.

ఖైదీలు తరచుగా జాండీస్‌ వ్యాధికి గురవుతున్నారన్నారు. అయితే, సబ్‌-జైళ్ళలో ఈ వ్యాధికి గురైన రోగులకు వైద్యులు సూచించిన ప్రకారం ఆహారం ఇవ్వడం జరగడం లేదని, వారు కూడా జైల్లోని ఇతర ఖైదీలకు ఇచ్చే ఆహారాన్నే తీసుకోవాల్సి వస్తుందన్నారు. కాగా, జైలు అధికార్లు ఈ ఆరోపణలను తిరస్కరించారు.

సబ్‌ జైలులో ఉన్న ఖైదీల సంఖ్య కేవలం 20 మాత్రమేనని, అందువల్ల పూర్తి స్థాయిలో వైద్యుల ఏర్పాటు సాధ్యం కాదని అన్నారు. ”ప్రతి ఏటా లక్షమంది వ్యక్తులకుగాను మన జైళ్ళలో మరణాల రేటు 0.07 శాతంగా ఉంది. అయితే, జైలు బయట (సాధారణ పౌరుల్లో) ఒక లక్షమంది వ్యక్తులలో ఏడు మరణాలు సంభవిస్తున్నాయి. సరాసరిన రాష్ట్రంలోని ప్రతి 300 మంది ఖైదీలకు ఒక వైద్యుడున్నారు” అని అదనపు ఇనస్పెక్టర్‌ జనరల్‌ (జైళ్ళు) పి నరసింహారెడ్డి చెప్పారు.

చికిత్స పొందుతున్న రిమాండ్‌ ఖైదీ మృతి


శ్రీకాకుళం: జిల్లా జైలులో రిమాండులోని ఖైదీ డి. అప్పలనర్సమ్మ(56) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటన జరిగిన 24 గంటల వరకు ఈ విషయం బయటపడకపోగా పోలీసుల కథనం ప్రకారం దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బూర్జ మండలంలోని ఎబిస పేటకు చెందిన దవల అప్పారావు, అప్పలనర్సమ్మ దంపతులకు, శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు కుమారులు ఉన్నారు. మే నెలలో శ్రీనివాసరావు భార్య అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ కేసులో అప్పారావు దంపతులను ఇద్దరు కుమారులను పోలీసులు అరెస్టు చేసారు. ఆమదాలవలస జ్యూడిషీయల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు ఈ ఏడాది జూన్‌ 23న జిల్లా జైలుకు రిమాండుకు పంపారు. రిమాండులో ఉన్న అప్పలనర్సమ్మ తరచూ అనారోగ్యానికి గురవుతుండడంతో రిమ్స్‌ ఆసుపత్రికి వైద్యపరీక్షల నిమిత్తం తెస్తూ ఉండేవారు. ఈనెల 8న ఆమెను పరీక్షించిన జైలు వైద్యులు ఆసుపత్రిలో చేర్పించాలని చెప్పారు. దీంతో 10వ తేదీ ఉదయం 10.30గంటలకు శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆమె మృతిచెందింది. వెంటనే వైద్య అధికారులు ఈ సమాచారాన్ని జైలు సూపరింటెండెంట్‌ అప్పన్నకు తెలిపారు. శ్రీకాకుళం డిఎస్పీ పనసారెడ్డి, ఆర్డీవో సత్యనారాయణ, తహశీల్దార్‌ సత్తిబాబుతోపాటు జైలు అధికారులు రిమ్స్‌కు చేరుకుని మృతురాలికి పంచనామ నిర్వహించారు. రిమాండులో ఉన్న ఖైదీ మృతిచెందడంతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.