మావోల ఉనికికోసమే ఈ చర్యలు


రెబ్బెన: రోజురోజుకూ మావోయిస్టులు తమ ఉనికికోసం దానిని నిలదొక్కుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి అడిషనల్‌ ఎస్‌పి రమేష్‌బాబు అన్నారు. సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి ఓపెన్‌కాస్టులో మావోయిస్టులు వాహనాలను ద్వంసం చేసిన విషయంపై స్పందించిన ఆయన రెబ్బెన మండలం గోలేటి జిఎం కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలో గత ఆగస్టు మాసం నుంచి చత్తీస్‌ఘడ్‌ నుంచి మావోలు వచ్చి సంచరించడం జరుగుతుందన్నారు. మంగి, ఇంద్రవెల్లి ఏరియాల్లో తిరుగుతున్నట్లు సమాచారం. డిసెంబర్‌ 2 నుంచి 8 వరకు పీపూల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా వారోత్సవాలు జరుపుకోవడానికే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. డోర్లి ఓపెన్‌కాస్టులో విద్వంసానికి పాల్పడిన వారిలో 30 నుంచి 40 మంది మిలిటెంట్లు, దళకమాండర్లు ఆయుదాలతో వచ్చినట్లు సమాచారం. దీనిలో ఇంద్రవెల్లి, మంగి కమిటీలతోపాటూ స్టేట్‌కమిటీ, జిల్లా కమిటీని ప్రోత్సహించి వారు తీసుకువచ్చినట్లు చెప్పారు. అయితే గిరిజనులు దళంలో చేరడానికి ఎవరూ ఆసక్తి చూపడంలేదని, ఇటీవలే ఇద్దరు గిరిజన దళసభ్యులు లొంగిపోవడమే ఇందుకు నిదర్శణం అన్నారు. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా వారోత్సవాల సందర్భంగా ఎలాంటి హానీ జరగకుండా పోలీసుల గస్తీ ఈ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని అటవీప్రాంతాల్లో కూంబింగ్‌, సింగరేణి ఓపెన్‌కాస్టు ఏరియాల్లో ప్రత్యేక పోలీసు దళాలతో గస్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. గిరిజనుల కోసం వైద్యశిబిరాలు నిర్వహించి పోలీసులు వారితో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. గిరిజనులకు ఎలాంటి హామీ జరగకుండా చూస్తామని వెళ్ళడించారు. ఆయన వెంట బెల్లంపల్లి జిఎం సివి రెడ్డి, డిఎస్‌పి భాస్కర్‌రావు, తాండూర్‌ సీఐ భీమన్న, రెబ్బెన ఎసై్స శశిధర్‌రెడ్డి, పోలీసులు ఉన్నారు.

Advertisements

ఆదిలాబాద్‌లో మావోల పంజా


తిర్యాణి: ఆదిలాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని డోర్లి ఒసిపి-1 లో మావోలు పంజా విసారారు. సింగరేణిలో ఆరు వాహనాలను మావోయిస్టులు దగ్దం చేశారు. గత ఐదారు సంవత్సరాలుగా జిల్లాలో మావోయిస్టులు ఎలాంటి విద్వంసాలకు పాల్పడకుండా ఉండడంతో జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉండగా, డోర్లి ఒసిపిలో జరిగిన సంఘటనతో జిల్లాలో మళ్ళీ మావోల ప్రభావం ప్రారంభమైంది. బుధవారం రాత్రి 10 గంటలకు దాదాపు 50 మంది మావోయిస్టులు డోర్లి ఒసిపి-1 సింగరేణి కార్యాలయానికి రాగా అందులో ఇద్దరు అండర్‌ మేనేజర్‌ శ్రీరాములు దగ్గరకు వచ్చి పిఎల్‌జిఎ వారోత్సవాలు అయ్యేంత వరకు ఒసిపి పనులు చేపట్టరాదని, ఎవరికీ సమాచారం అందించవద్దని, అక్కడున్న కార్మికులందరిని రూంలోకి పంపించి ఎవరూ బయటకు రావద్దని వారి వద్ద నున్న సెల్‌ఫోన్‌, వైర్‌లెస్‌ సెల్‌లను తీసుకుని బయట ఉన్న మావోయిస్టులు ఒసిపిలోని ఎల్‌జి మెంటెనెన్స్‌ వ్యాన్‌ను, డిజిల్‌ట్యాంకర్‌, వాటర్‌ట్యాంకర్‌, రెండు జీపులు, ఒక టిప్పర్‌పై డిజిల్‌ చల్లి దగ్దం చేశారు. ఇటీవల ఒసిపికి కొత్తగా వచ్చిన నాలుగు హైడ్రాలిక్‌ డంపర్‌లకు కూడా నిప్పంటించబోతుండగా వాటిలో ఉన్న అటోమిక్‌సైరన్‌ మొగడంతో ఆపరేటర్లు వచ్చి ఈ వాహనాలు దగ్దంచేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని, దీంతో ప్రాణనష్టం జరుగుతుందని వేడుకోగా వాటిని వదిలిపెట్టారు. ఈ వాహనాలు దగ్దమయి ఉంటే సింగరేణి సంస్థకు దాదాపు రూ. 7 కోట్ల నష్టం వాటిల్లేది. అలాగే కార్యాలయం ఆవరణలో కార్యాలయం గోడలకు పలు చోట్ల బ్యానర్లను కట్టి వాల్‌పోస్టర్లను అంటించారు. ఏది ఏమైనా జిల్లాలో ఈ సంఘటనతో రాజకీయ నాయకుల్లో కలవరం మొదలైంది.

అక్రమ కలప తరలిస్తున్న లారీ పట్టివేత


ఇచ్చోడ: మండలంలోని దేవులనాయక్‌తాండ గ్రామ సమీపం నుంచి అక్రమంగా కలపను తరలిస్తున్న లారీ ఈజ్‌పూర్‌ చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ఇచ్చోడ అటవీశాఖ అధికారి వినయ్‌ కుమార్‌ సాహు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దేవులనాయక్‌తాండ ప్రాంతం నుంచి అక్రమంగా కలప తరలుతోందని సమాచారం అందుకుతున్న అటవీశాఖ సిబ్బంది ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా ఆ ప్రాంతం నుంచి అనుమానాస్పదంగా లారీ హెచ్‌ఆర్‌ 38 ఎం 3872 కనిపించడంతో అటుగా వెళ్లిన సిబ్బందిని చూసి ఆ ప్రాంతం నుంచి ముందుకు రాగానే చెక్‌పోస్టు సిబ్బందిని అప్రమత్తం చేయగా లారీని వెంబడిస్తూ చెక్‌పోస్టు సమీపంలో అటకాయించి తనిఖీ చేయగా అందులో రూ. లక్ష విలువ చేసే కలప దుంగలు లభ్యమైనట్లు, వాటిని స్వాధీనం చేసుకొని లారీని అటవీశాఖ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎఫ్‌ఎస్‌ఓలు బాలయ్య, హకీం, ఎఫ్‌బిఓలు శంకరయ్య, స్వామి, భీంజీనాయక్‌, గంగన్న, అడెల్లు, బల్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ దీక్షా శిబిరం చుట్టూ ఆత్మాహుతి దళాలు


హైదరాబాదు: తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ేసీఆర్‌ చేపట్టే దీక్షను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హెచ్చరించారు. దీక్షా శిబిరం చుట్టూ ఆత్మాహుతి దళాలు ఉంటాయని అవసరమైతే పెట్రోల్‌ పోసుకుని చావనైనా చస్తాముకాని దీక్షను విరమించమని ఈటెల స్ఫష్టం చేశారు. అసలు దీక్షను చేపట్టకుండానే అడ్డుకుంటామనడం విడ్డూరమని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉద్యమం చేసే తమను అనవసరంగా ప్రభుత్వం రెచ్చగొడుతోందని ఈటెల అన్నారు. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తామని ముందుగానే చెప్పాము. అయినా అరెస్టు పేరుతో వేలాది మంది పోలీసులను దీక్షా శిభిరంతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకుల ఇళ్ల చుట్టూ మొహరించి ఉద్రిక్త వాతావరణాన్ని ప్రభుత్వమే సృష్టిస్తోంది ఆయన అన్నారు. పోలీసుల చర్యలను తమ పార్టీ కార్యకర్తల చర్యలు ఉంటాయని ఈటెల అన్నారు. సిద్దిపేటలో కేసీఆర్‌ చేపట్టే దీక్షా శిభిరాన్ని ఈటెల పరిశీలించారు.

ఘనంగా బక్రీద్‌ పండగ


హైదరాబాద్‌: త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్‌ పండగను ముస్లింలు సోదరులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. శనివారం నగరంలోని పాతబస్తీలో ముస్తాబైన మీరాలం ఈద్గాలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. దైవప్రేమలో తనకు చెందిన సర్వస్వాన్ని త్యాగం చేసే వాగ్దానాల పండుగ అయిన బక్రీద్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు సామూహిక ప్రార్థనలు జరుపుకున్నారు.

కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌లో వ్యాపించిన మంటలు


అనంతపురం: న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో మంటలను గమనించిన ప్రయాణికులు గుంతకల్‌ రైల్వే అధికారులకు తెలిపారు. వెంటనే రైలును గుంతకల్‌ జంక్షన్‌లో నిలిపివేసిన సిబ్బంది మరమ్మతులు నిర్వహించారు. ఈ క్రమంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా మంటల వ్యాపించిన బోగీలను తొలగించిన రైల్వే సిబ్బంది వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి అనంతరం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. షార్ట్‌ సర్క్యూట్‌ వలనే బోగీల్లో మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు.

కాంగ్రెస్‌గూటికి స్మిత థాక్రే ?


ముంబాయి: శివసేన అధినేత బాల్‌థాక్రే పెద్ద కోడలు స్మితా థాక్రే త్వరలో ఆ పార్టీకి స్వస్తి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. శనివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పార్టీలో తనను చిన్నచూపు చూస్తున్నారని, అవమానాలు భరించలేకే కాంగ్రెస్‌లో చేరుతున్నాని స్మితా స్పష్టం చేశారు. కాగా కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని స్మితా ప్రశంసల జల్లు కురిపించింది. సోనియా, రాహుల్‌ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె తెలిపారు. బీజేపీ, శివసేన కూటమి అధికారంలో ఉన్నప్పుడు స్మితా చక్రం తిప్పారు. రాజకీయాలను శాసించారు. అయితే శివసేన పార్టీ పగ్గాలు ఉద్దవ్‌ థాక్రే చేపట్టిన తర్వాత ఆమె ప్రబల్యం తగ్గడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.