ధాన్యం అమ్మకాలపై ఆందోళన వద్దు


మచిలీపట్నం: జిల్లాలో రైతాంగం ధాన్యం అమ్మకం గురించి కంగారు పడవలసిన అవసరం లేదనీ, మద్దతుధర కంటే తక్కువకు ఎటువంట పరిస్థితుల్లోనూ అమ్మవద్దనీ కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్ గౌరవ్‌ ఉప్పల్‌ రైతులను కోరారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలుపై మద్దతుధర ఇవ్వడంలేదని ఫిర్యాదులు వస్తున్నాయని సమస్యను అధ్యయనం చేసి రైతులతోను మిల్లర్లతోను మాట్లాడుతున్నామని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు.

ఈ సందర్భంగా బందరు శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్యతో కలసి చిలకలపూడి వేర్‌హౌసింగ్‌ కార్పోరేషన్‌ గోడౌన్‌ వద్ద రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరువాత జాయింట్‌ కలెక్టర్‌ తన ఛాంబర్‌ లో మిల్లర్లతో సమావేశమైవారి సమస్యలను చర్చించి అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో ఈ రబీ సీజన్‌ లో 1001, 1010 రకం ధాన్యం ఎక్కువగా పండించడం జరిగిందనీ వీటి కొనుగోలు బాగానే జరుగుతుందనీ, యం7, నెల్లూరు సన్నాలు రకం కొనుగోలుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వున్నాయని వీటి విషయంలో రైతులు భయాందోళనలు చెందవలసిన అవసరం లేదనీ త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామనీ ఉప్పల్ అన్నారు.

నెల్లూరు సన్నాల రకంలో నల్లమచ్చ వుందనీ, 3 శాతం కంటే తక్కువ డేమేజ్‌ వుంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అయితే 3 శాతం కంటే ఎక్కువగా ఈ డ్యామేజ్‌ వున్నందున రిలాక్సేషన్‌ ఇవ్వాలనీ పౌర సరఫరాల శాఖ మంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. భారత ఆహార సంస్థను మన జిల్లాకు మినహాయింపు ఇవ్వవలసినదిగా కోరినట్లు తెలిపారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదనీ వస్తున్న ఆరోపణలపై మిల్లర్లతో మాట్లాడడం జరిగిందనీ, వారు గోడౌన్‌ లు కొరత వున్న కారణంగా ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నామని చెప్పారనీ, గోడౌన్‌ కొరత నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించవలసినదిగా భారత ఆహార సంస్థ జి.ఎం. లను కోరినట్లు జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు.

ఈ నెలలో లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి స్థలం వస్తుందనీ, 23 రైల్వే ర్యాకులు త్వరలో రానున్నాయనీ ధాన్యం నిల్వలకు పై#్రవేటు గోడౌన్ల యజమానులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని జాయింట్‌ కలెక్టర్‌ వివరించారు. మన జిల్లాలో కనీస మద్దతుధరతో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడానికి 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో సిడ్లబ్యుసి కైకలూరులో, సిడబ్ల్యుసి గుడివాడలో, ఎఫ్‌.సి.ఐ హనుమాన్‌ జంక్షన్‌ లోసిడబ్ల్యుసి నందిగామలో ఎస్‌.డబ్ల్యుసి జగ్గయ్యపేటలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

పౌర సరఫరాల కార్పోరేషన్‌ ఆద్వర్యంలో నాగాయలంక, బంటుమిల్లి, పెడన, నందిగామ, ఎ.కొండూరు, తిరువూరు లలో ఆయా మండల సమాఖ్య కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం నాణ్యత కనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుందని కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు. రైతులకు ధాన్యం అమ్మకం విషయంలో సమస్యలు వుంటే వెంటనే తమ దృష్టికి నేరుగా గానీ, జిల్లా పౌర సరఫరాల అధికారి ద్వారాగాని, ఆర్‌.డి.ఒ. ద్వారా గానీ తీసుకువస్తే వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు.

ఇప్పటివరకు జిల్లాలో 7.5 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యానికి గాను 4.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని మిల్లర్లు లక్ష్యం పెంచమని అడిగిన కారణంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందనీ మరో 50,000 మెట్రీక్‌ టన్నులకు లెవీ పెంచే అవకాశమున్నదని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు.

స్థానిక మార్కట్‌ యార్డుగోడౌన్‌లో గత సంవత్సరం ఎన్నికల సందర్భంగా ఇవిఎం మిషన్లను తీయించి ఖాళీచేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. మిల్లర్లు రైతులతో నేరుగా సంబంధాలు కలిగివుంటారు, కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులున్నా సమస్యలు తమ దృష్టికి తీసుకురావలసిందిగా జాయింట్‌ కలెక్టర్‌ మిల్లర్లకు విజ్ఞప్తిచేశారు. జిల్లా సివిల్‌ సప్లై అధికారి కె.సింగయ్య మాట్లాడుతూ రైతులు తాము అమ్మదలుసుకున్న ధాన్యాన్ని ఒకేసారి తీసుకురాకుండా కొంత శాంపిల్‌ తీసుకువస్తే ఇక్కడ సిబ్బంది ధాన్యం నాణ్యతను పరిశీలించి మద్దతుధర నిర్ణయిస్తారని ధర అనుకూలంగా వుంటే అప్పుడు మొత్తం ధాన్యాన్ని తీసుకురావచ్చునని అన్నారు.

కొనుగోలు కేంద్రం వరకు రైతులు తమ స్వంతఖర్చులతో ధాన్యాన్నీ తీసుకురావాలని అన్నారు.

ఈ సమావేశంలో బందరు శాసనసభ్యులు పేర్నినాని, భారత ఆహార సంస్థ జి.అన్నామలై, సివిల్‌ సప్లై సిబ్బంది, బందరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ మోకా భాస్కరరావు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తీరప్రాంతంలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటు


మచిలీపట్నం: కోస్తా తీర ప్రాంతంలో పటిష్ఠవంతంగా నిఘా ఏర్పాట్లు చేపట్టే చర్యలోభాగంగా కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలో కొత్తగా రెండు మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు మెరైన్‌ డిఐఇ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపినట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ రామకృష్ణయ్యతో కలిసి ఆయన మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామని, భవన నిర్మాణాలు జరిగేవరకు తాత్కాలికంగా సాగర సంగమం వద్ద గల డాల్ఫిన్‌ భవనంలో మెరైన్‌ పోలీస్‌ అవుట్‌ పోస్టును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రెండవ మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ను కృతివెన్ను మండలం వర్లకొండితిప్ప గ్రామం వద్ద నెలకొల్పనున్నట్లు దానికి స్థల సేకరణ జరిగిందన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో నిఘా కోసం కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే వెంటనే ఈ కమిటీలు పోలీసులకు సమాచారం అందిస్తాయని అన్నారు. ఇటీవల శ్రీలంక నుండి తీర ప్రాంతానికి వచ్చిన జాలర్ల అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ సమాచారాన్ని చెన్నైలోని డిప్యూటీ కమీషనర్‌కు, కేంద్ర హోంశాఖకు అందజేసినట్లు ఆయన చెప్పారు. ఆదేశాలు వచ్చిన అనంతరం జాలర్లను వారివారి స్థలాలకు పంపే ఏర్పాటు చేస్తామన్నారు. మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తయిన తరువాత పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించి వారికి అదునాతన బోట్లను అందజేస్తామని ఈ బోట్ల సహాయంతో తీర ప్రాంతం వెంట పెట్రోలింగ్‌ జరుగుతుందని అన్నారు.

కృషా జిల్లాలో 49 కరువు మండలాలు


మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించింది. కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో ఒక విజయవాడ అర్బన్‌ మినహ మిగిలిన 49 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరువు విలయ తాండవం చేస్తోంది. దీనిపై జిల్లా యంత్రాంగం జిల్లాలోని అన్నీ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి నివేదిక పంపించింది. అలాగే జిల్లా అభివృద్ధి సమీక్షమండలి సమావేశంలో కూడా కృష్ణా జిల్లాలోని అన్నీ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేపట్టి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడంలో జాప్యం చేసినప్పటికీ చిట్టచివరకు జిల్లాలోని 49 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడంతో ఇటు రాజకీయ నాయకులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించడం వల్ల ఈ ఏడాది ఖరీఫ్‌లో ఇప్పటివరకు రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలు రీషెడ్యూల్‌ కావడంతోపాటు కొత్తగా తిరిగి రుణాలు మంజూరు చేసి అవకాశం ఏర్పడింది. అలాగే పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ కూడా అందజేస్తారు. అయితే రైతులు తీసుకున్న ప్రైవేట్‌ రుణాలపై మాత్రం ప్రభుత్వం మారిటోరియం విధించకపోవడంతో ప్రైవేట్‌ రుణాలు మాత్రం యధావిధిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఒక్క అంశం మినహ మిగిలిన అంశాలన్నీ రైతులకు అనుకూలంగా ఉండడంతో రైతాంగం కొంత మేరకు తేరుకునే అవకాశం ఉంది. జిల్లాలో ఈ ఏడాది అత్యల్ప వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌ 2వ తేదీ వరకు నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే ఈ ఏడాది జూన్‌ మాసంలో 98 మిల్లీమీటర్లు నమోదు వర్షపాతం కావాల్సి ఉండగా, 33.44 వర్షపాతం నమోదైంది. జూలై నెలలో 211 మి.మీ వర్షపాతానికి గాను 56.8 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే ఆగస్టులో 213 మి.మీ వర్షపాతానికి గాను 160.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక సెప్టెంబర్‌ మాసంలో 164 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 32.5 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇంతటి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వరి పంట మొదలుకొని పత్తి, మినుము, పెసర, వేరుశనగ, మిర్చి తదితర పంటలన్నీ దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 2.58 హెక్టార్లలో వరి పంట సాగు కావాల్సి ఉండగా, ఈనెల 10వ తేదీ వరకు కేవలం రెండు లక్షల హెక్టార్లలోనే వరి సాగు అయింది. ఇంకను జిల్లాలోని సముద్ర తీరప్రాంత మండలాలలో నేటికీ నాట్లు పడని దుస్థితి నెలకొని ఉంది. అంతేగాక కాల్వ చివరి భూములకు తాగునీరు సక్రమంగా అందక వేసిన వరి పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా 25 నుండి 50 శాతం కన్నా తక్కువ వర్షాపాతం నమోదైతే ఆ ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉంది. జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబర్‌ మొదటి వారం వరకు కేవలం 43 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. దీంతో ప్రభుత్వం జిల్లాలోని అన్ని మండలాలను ఇప్పుడు కరువు మండలాలుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కొంత ఆలస్యంగానైనా ప్రభుత్వం తేరుకొని కరువు మండలాలను ప్రకటించడంతో రైతాంగానికి కొంత మేరకు ఊరట లభించింది. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడం వల్ల జిల్లాలోని రైతాంగానికి పంట రుణాల రీషెడ్యూల్‌ అవనున్నాయి. జిల్లాలో ఆగస్టు 31వ తేదీ నాటికి 790 కోట్ల రూపాయలు పంట రుణాలు రైతాంగానికి అందించినట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. ఇందులో సుమారు రెండు వందల కోట్ల రూపాయలకు పైగా సహకార బ్యాంకుల ద్వారా రుణాలు అందజేశారు. మిగిలిన రుణాలు కమర్షియల్‌ బ్యాంకుల ద్వారా అందించడం జరిగింది. ప్రభుత్వం రుణాలు రీషెడ్యూల్‌ ప్రకటించడం వల్ల మూడు వందల కోట్ల రూపాయల మేరకు రుణాలు రీషెడ్యూల్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే కొత్తగా తిరిగి రైతులకు రుణాలు కూడా మంజూరు చేస్తారు. అంతేగాక పంటలు దెబ్బతిన్న రైతాంగానికి ప్రభుత్వ సహకారంగా ఇన్‌ఫుట్‌ సబ్సిడీని అందించనుంది. దీంతో ఈ ఏడాది జిల్లాలో వర్షాభావ పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ప్రభుత్వం అందించే ఈ సహాయంతో రైతులకు కొంత మేరకు ఊరట లభించవచ్చు. అలాగే జిల్లాలో నెలకొని ఉన్న పశుగ్రాసం కొరతను నివారించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించడం పట్ల రైతు సంఘాలు, రైతు సమాఖ్య రైతాంగం హర్షం వ్యక్తం చేశారు.

11న వైఎస్‌ స్మృత్యర్థం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు


మచిలీపట్నం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి స్మృత్యర్థం జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ పోటీలు ఈనెల 11న నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో వైఎస్‌ సేవలపై వ్యాసరచన, కవిత్వ పోటీలు జరుగుతాయని అన్నారు. విద్యార్థులకు డ్రాయింగ్‌ కూడా నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాలస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో గెలుపొందినవారి స్క్రీప్టులను జిల్లాస్థాయి పోటీలకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పంపాలని కోరారు. అదేవిధంగా పాఠశాలల స్క్రీప్టులు, పెయింటింగ్‌లను పరిశీలించి ఈనెల 16న జిల్లాస్థాయిలో న్యాయ నిర్ణేతల పేరును ప్రకటిస్తారు. వ్యాసరచనలో తెలుగులో 10 మందిని, ఇంగ్లీష్‌లో 5, ఉర్దూలో 5 మందిని ఎంపిక చేస్తారని, అదేవిధంగా కవిత్వం నుండి 10 మందిని, పెయింటింగ్‌్‌ నుండి 10 మందిని ఎంపిక చేసి రాష్ట్రస్థాయికి పంపడం జరుగుతుందని అన్నారు.

‘పారిశ్రామిక సంస్థల నైతిక బాధ్యత-సంస్థాగత దృక్పథం’పై జాతీయసదస్సు


మచిలీపట్నం: రాష్ట్ర ఉన్నత విద్యామండలి, కృష్ణా విశ్వవిద్యాలయంల సంయుక్త ఆధ్వర్యంలో పారిశ్రామిక సంస్థల నైతిక బాధ్యత-సంస్థాగత దృక్పథం అన్న అంశంపై ఈనెల 10, 11వ తేదీలలో జాతీయస్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు కృష్ణా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎం.కేశవదుర్గాప్రసాద్‌ తెలిపారు.ఈ సదస్సు మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నివాళికి ఈ సదస్సును అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ కళాశాలల అనుబంధ సంస్థల కార్యదర్శి దైతా రామచంద్రశాస్త్రీ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్‌ఛాన్స్‌లర్‌ బాలమోహనదాస్‌, కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎ.నాగేశ్వరరావు పాల్గొంటారని తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జి.ప్రసాద్‌ అధ్యక్షతన జరిగే మొదటి సాంకేతిక సదస్సులో ఎం.అరవింద్‌, సమన్వయ పరుస్తారన్నారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు సదస్సులో వెంకటేశ్వరరావు సమన్వయ కర్తగా వ్యవహరిస్తారని అన్నారు. తిరిగి 11వ తేదీ ఉదయం జరిగే సదస్సులు జరుగుతాయని మధ్యాహ్నం రెండు గంటలకు ముగింపు సమావేశం జరుగుతుందని ఈ సమావేశంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ కె.నాగేశ్వరరావుతోపాటు వివిధ ప్రముఖులు పాల్గొంటారని, మరో 40 మంది విద్యావేత్తలకు పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు.

మరో 16 వేల క్యూసెక్కుల నీరు కృష్ణా డెల్టాకు అవసరం


మచిలీపట్నం: కృష్ణా డెల్టాలో సాగునీటి వినియోగం పెరిగినందున ఇప్పుడు అందిస్తున్న సాగునీరు సారిపోనందున అందనంగా నీటిని పెడుదల చేయాలని నీటి పారుదల శాఖ ఎస్‌.ఇ. డి.చంద్రరావు ప్రభుత్వాని కోరారు. ప్రస్తుతం విజయవాడ, ప్రకాశ బ్యారేజి వద్ద 7.6 అడుగుల నీటి మట్టం ఉందని అన్నారు. సాగర్‌ నుండి అదనపు నీరు వచ్చి చేరడంతో ప్రకాశం బ్యారేజి వద్ద 10వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని అన్నారు. కృష్ణా, తూర్పు, పశ్చిమ డెల్టాలో రైతుల నీటి వినియోగం అధికమైందని అన్నారు. ప్రస్తుతం కృష్ణా బ్యారేజి వద్ద 10.1 అడుగుల నీరు ఉన్నదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నీరు డెల్టా ప్రాంతానికి సారిపోనందున సాగర్‌ నుండి 16 వేల క్యూసెక్కుల నీరు అవసరం కానున్నదని కావున్న కృష్ణా డెల్టాకు అదనపు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉందని చీఫ్‌ ఇంజనీర్‌ కోరినట్లు చెప్పారు. పశ్చిమ డెల్టాకు 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ప్రస్తుత నీటి వినియోగం పెరగడంతో దానిని వెయ్యి క్యూసెక్కులకు పెంచాలని కోరారు. కాల్వల ద్వారా రోజుకు 14 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నదని అన్నారు. కాల్వల విడుదలయే నీరు కూడా రైతులు ఉపయోగిస్తున్నందున మరో 2వేల క్యూసెక్కుల నీటిని కాల్వల ద్వారా విడుదల చేయాలని కోరారు. ఖరీఫ్‌ సీజన్‌లో నీటి ఎద్దడి కాలగకుండ పంటలకు సరిపడిన నీటిని సరఫరా చేస్తామని ఎలాంటి ఇబ్బందులు పడవదని ఎస్‌.వి.చంద్రరావు తెలిపారు.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు భవనానికి వై.ఎస్‌.ఆర్‌ పేరు


మచిలీపట్నం: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు భవనానికి వైఎస్‌ఆర్‌ సహకార భవన్‌గా నామకరణం చేయాలని కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకమండలి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆప్కాబ్‌ చైర్మన్‌ వసంతనాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సహకార సంఘానికి దివంగత నేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా మచిలీపట్నంలో నిర్మించనున్న సహకార బ్యాంకు నూతన భవనానికి ఆయన పేరు పెట్టాలని సమావేశం నిర్ణయించిందని అన్నారు. త్వరలోనే భవన నిర్మణానికి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించి, త్వరలో పూర్తి చేసి ఆయన పేరు పెడుతామని అన్నారు. 2004కు పూర్వం సహకార రంగం పూర్తిగా నష్టాల ఊబిలో పూడుకు పోయిందని ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సహకార రంగానికి చేయూత అందించారని అన్నారు. ఆయన అందించిన సహకారంతోనే తమ బ్యాంకు 3 కోట్ల రూపాయల లాభాలు అర్జించగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి తమ కేంద్ర సహకార బ్యాంకు కోటి రూపాయలు సహాయం అందించడం జరిగిందని అన్నారు. రైతులకు సహకార రంగం ద్వారా రుణాలు అందిస్తూ వారికి ఆర్థిక పరిపుష్టి చూపిన ఘనత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిదే అని అన్నారు. ఆప్కాబ్‌ 4 సంవత్సరాల కాలంలో 6 వందల కోట్ల రూపాయల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు టర్నోవర్‌ పెంచుకోవాడానికి కారణం వై.ఎస్‌ రాజశేఖరరెడ్డే అని అన్నారు. అందుచేత ఈ భవనానికి వైఎస్‌ఆర్‌ భవన్‌గా పేరు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

త్వరలో భారీ ఎత్తున వైఎస్‌ విగ్రహాలు


మచిలీపట్నం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను వాడ వాడలా నెలకొల్పేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ అభిమానులు పెద్ద ఎత్తున సన్నద్ధమవుతున్నారు. ఇందుకుగానూ విగ్రహాలను రూపొందించే శిల్పుల వద్దకు వెళ్ళి తమకు సాధ్యమైనంత త్వరలో వైఎస్‌ విగ్రహాలు తయారు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఒకప్పుడు జాతీయ నాయకులైన మహాత్మాగాంధీ, పండిట్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహాల కోసమే దేశంలోనూ, రాష్ట్రంలోనూ తరచుగా తారసిల్లేవి. ఎక్కువగా మహాత్మాగాంధీ విగ్రహాలు మాత్రం చాలా గ్రామాల్లో కనిపించేవి. రానురాను రాజకీయ నాయకుల్లోనూ ప్రజల్లోనూ తమ తమ ఆరాధ్య దైవాలుగా భావించే నాయకుల విగ్రహాలను నెలకొల్పాలనే మోజు పెరగడంతో ఇటీవల కాలంలో ఈ విగ్రహాలు నెలకొల్పే సంస్కృతి బాగా పెరిగి పోయింది. ఒకప్పుడు జాతీయ స్థాయి నాయకులే పరిమితమైన ఈ సంస్కృతి నేడు రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు స్థానిక నాయకుల విగ్రహాలను సైతం నెలకొల్పడం జరుగుతోంది. ఇటీవలి కాలంలో అంబేద్కర్‌, ఎన్టీరామారావు విగ్రహాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీగా నెలకొల్పడం జరుగుతోంది. స్వాతంత్య్రం అనంతరం గాంధీ, నెహ్రూ, బోస్‌ విగ్రహాలకే పరిమితమైన ఈ విగ్రహాల సంస్కృతి రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, అంబేద్కర్‌, ఎన్టీరామారావు విగ్రహాల స్థాపనతో ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఎవరైన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మృతి చెందితే ఆయన జ్ఞాపకార్థం ఆ ప్రాంతంలో విగ్రహాన్ని నెలకొల్పడం గతం నుంచే వస్తోంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన ముఖ్యమంత్రి విగ్రహాలను తమ తమ ప్రాంతాల్లో నెలకొల్పేందుకు అభిమానులు, కార్యకర్తలు పోటీ పడుతున్నారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి దశ కర్మ కార్యక్రమంలోగా ఆయన విగ్రహాలను తమ గ్రామాల్లోనూ, వాడల్లోనూ నెలకొల్పేందుకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 విగ్రహాల వరకు నెలకొల్పేందుకు కార్యకర్తలు, అభిమానులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు గానూ జిల్లాలోని ముదినేపల్లి మండలంలోని బొమ్మినంపాడులో కళాప్రపూర్ణ అవార్డు గ్రహీత విగ్రహ శిల్పి అప్పారావుకు భారీగా వైఎస్‌ఆర్‌ విగ్రహాల తయారీలో ఇప్పటికే నిమగ్నమై ఉన్నారు. ఇందుకు గానూ ఆయనకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. కృష్ణాజిల్లాతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు, కడప, విశాఖ, వరంగల్‌ తదితర జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్‌ విగ్రహాల తయారీకి ఆర్డర్లు ఇస్తున్నారు. గతంలో ఈ శిల్పి స్వర్గీయ ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ తదితర నాయకుల విగ్రహాలను తయారు చేసి విక్రయించడం జరిగింది. ఈయన తయారు చేసిన విగ్రహాలకు మంచి గిరాకీ ఉండడంతో ఒక్కసారిగా వైఎస్‌ అభిమానులందరూ పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చారు. ఆరున్నర అడుగుల సిమెంటు విగ్రహానికి 25 వేల రూపాయల వరకు ఆ విగ్రహం ఖరీదు ఉండగా, కాంస్యవిగ్రహం 2 లక్షల రూపాయల వరకు అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 60 సిమెంటు విగ్రహాలు, 2 కాంస్య విగ్రహాలు తయారీకీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకను భారీ ఎత్తున ఆర్డర్లు వస్తున్నప్పటికీ తన వద్ద తగినంత సిబ్బంది లేనందున ఆర్డర్లు తీసుకోవడం లేదని కొంత సమయం గడువు ఇస్తే ప్రజలు కోరిన విధంగా విగ్రహాలు తయారు చేసి ఇవ్వగలనని ఆయన అభిమానులకు తెలిపారు. ఏదీ ఏమైనా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణం తీవ్ర సంచలనం రేపి ఎంతో మంది అభిమానుల ప్రాణాలను సైతం హరించివేసింది. ఆయన అన్ని విషయాల్లోనూ రికార్డులు సృష్టించినట్లే వైఎస్‌ విగ్రహాలు నెలకొల్పడంలో కూడా రికార్డును సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ నాయకుడి విగ్రహాలు ఇంత భారీ ఎత్తున ఒకేసారి నెలకొల్పిన దాఖలాలు లేవు. ఆ ఘనత కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌కే దక్కనుంది.

కార్మికులకు బీమా సౌకర్యం


మచిలీపట్నం: జిల్లాలోని అసంఘటిత రంగంలో పని చేస్తున్న భవన నిర్మాణ కార్మికుల పేర్ల నమోదు కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా జరుగుతున్నట్లు కార్మిక శాఖ డిప్యూటి కమీషనర్‌ షేక్‌ యూనిస్‌ తెలిపారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రమాద బీమా కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుండి సభ్యులను చేర్పించే కార్యక్రమం అన్ని మండలాలలోనూ చురుకుగా జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 25 వేల మంది భవన నిర్మాణ కార్మికులను ఈ పథకం కింద సభ్యులుగా చేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా వ్యాప్తంగా లక్ష మంది కార్మికులకు ఈ ప్రమాద బీమా సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం 25 వేల మంది సభ్యులే చేరినప్పటికీ త్వరలో 70 వేల మంది కార్మికులకు ఈ పథకం కింద సభ్యులుగా చేర్పించేందుకు కృషి చేస్తున్నామని ఇందుకు గానూ అన్ని మండల కేంద్రాల్లో కార్మికులను సభ్యులుగా చేర్పించుకునే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నదని జిల్లాలోని 19 కార్మిక శాఖ కార్యాలయాల ద్వారా ఈ నమోదు కార్యాక్రమం జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ విధంగా సభ్యులుగా చేరిన కార్మికులందరికీ అక్టోబర్‌ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగా గుర్తింపు కార్డులు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ బీమా సౌకర్యాన్ని కార్మికులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు గానూ జిల్లాలో గల భవన నిర్మాణానికి సంబంధించి ఇతర నిర్మాణాలకు సంబంధించిన కార్మికులందరూ తమకు దగ్గరలోని మండల కేంద్రాలకు వెళ్ళి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలోని కొన్ని పట్టణాల్లోనూ, మండల కేంద్రాల్లోను కార్మిక చట్టానికి విరుద్దంగా ప్రభుత్వ సెలవు దినాల్లో దుకాణాలు, షాపులు తెరిచి ఉంచుతున్నారని ఈ విధంగా సెలవు రోజుల్లో షాపులు తెరిచి ఉంచినవారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇందుకు గానూ తమ కార్మిక శాఖ అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తారని ఆయన తెలిపారు.

సంతాప సభలను విస్మరిస్తున్న నాయకులు


మచిలీపట్నం: హెలికాప్టర్‌ దుర్ఘటనలో అకాల మరణం పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సంఘటనను ప్రజలు ఇంకా మరువకముందే రాజకీయ నాయకులు మాత్రం ఒ పక్క ఆయన మృతుకి సంతాపాలు ప్రకటిస్తూనే మరోపక్క తన కుమారుడు కడప ఎంపి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ ఆందోళనలు చేపడుతున్నారు. కాకలు తీరిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల నుండి చోటా నాయకుల వరకు ప్రతిఒక్కరూ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలంటూ సంతాప దినాలను సైతం విస్మరించి ఆందోళన పేరిట రాస్తారోకోలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ తరహా ఆందోళనకు సాక్షాత్తు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తూ దగ్గరుండి కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు. అంతేగాక తమవంత బాధ్యతగా చేపట్టాల్సిన సంతాపసభలు, సంస్మరణ సభలు విస్మరించి వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేవరకు పోరాడుతామంటూ, అవసరమైతే ఎమ్మెల్యేల పదవులకు, సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తామంటూ ప్రకటనలు ఇవ్వడం శోచనీయంగా ఉందని అన్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన యువత ఆందోళనల పేరిట పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ర్యాలీలు జరుపుతూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అసందర్భ వ్యాఖ్యలు చేశారంటూ పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇలాంటి అసందర్భ కార్యకలాపాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, శాసనసభ్యులు దీనిపై నోరు మెదకపోవడం శోచనీయమని అన్నారు. ప్రజా నాయకుడిగా ప్రజలలో మమేకమై నిరంతరం శ్రమించిన నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సంతాప దినాలలోనైనా చేపట్టాల్సిన సంస్మరణ సభలు, సంతాప కార్యక్రమాలు విడనాడి కార్యకర్తలు, నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడడం ప్రజల్లో విస్మయం కలిగిస్తున్నది.