రంగా వర్థంతి గొడవలో పలువురి అరెస్టులు


విజయవాడ: విజయవాడలో వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా జరిగిన ఘర్షణలు, పరస్పర దాడుల్లో ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రంగా విగ్రహంపై కాంగ్రెస్‌ కండువాను ఆ పార్టీ కార్యకర్తలు కప్పటాన్ని రాధా అనుచరులు అడ్డుకోవటంతో వివాదం మొదలై దాడులకు దారితీసింది. దీంతో రంగా కుమారుడు రాధా అనుచరులు నలుగురిపైన, కాంగ్రెస్‌ కార్యకర్త ఒకరిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisements

భీమ్‌రావువాడ ఘటనలో చంద్రబాబు అరెస్టు


హైదరాబాద్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్టు చేశారు. భీమ్‌రావువాడ పేదల ఇళ్లను ఖాళీచేయించటాన్ని నిరసిస్తూ వారికి సంఘీభావాన్ని ఆయన ప్రకటించారు. వారికి అక్కడే తిరిగి ఇళ్లు నిర్మించి ఇచ్చేవరకు అక్కడినుంచి కదలమని ఆయన నడిరోడ్డుపై బైఠాయించటంతో ట్రాఫిక్‌ స్థంభించింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అక్కడినుంచి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇక్కడే ఇళ్లు కట్టించేవరకు కదలం : బాబు


హైదరాబాద్‌: భీమ్‌రావ్‌వాడ పేదలకు తిరిగి ఇక్కడే ఇళ్లు కట్టించి ఇచ్చేవరకు కదలమని, వారి తరపున పోరాడతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. భీమ్‌రావ్‌వాడ బాధితులను ఆయన పరామర్శించారు. ఇందిరాభవన్‌ నిర్మాణానికి పేదల ఇళ్లే కావాలా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం బందిపోట్లలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనను అడ్డుకున్న పోలీసులు ఆయన వెంట వచ్చిన కార్యకర్తలను అరెస్టు చేశారు.

పోలీస్‌స్టేషన్‌ ఎదుట టీడీపీ ధర్నా


హైదరాబాద్‌: భామ్‌రావువాడలో బాధితులకు మద్దతు తెలిపిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించటంతో ఆ పార్టీ కార్యకర్తలు వారిని ఉంచిన గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ముందు ధర్నా చేశారు. నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

శ్రీవారి దర్శనానికి 14 గంటలు


తిరుపతి: తిరుమలలో తీవ్ర రద్దీ నెలకొంది. సంవత్సరం చివరలో ఎప్పటిలాగే ఇక్కడ మహా రద్దీ నెలకొంది. కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఉన్నాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ దాటి 4 కిలోమీటర్ల మేర లైన్లు ఉండటంతో శ్రీవారి దర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పడుతోంది. ఈ రద్దీ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

యుద్ధంపై స్వరాన్ని తగ్గించిన పాక్‌


ఇస్లామాబాద్‌: పాక్‌ వ్యాఖ్యలు, చర్యలపై అంతర్జాతీయంగా రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుండటం, ఇతర దేశాల ఒత్తిళ్లతో పాక్‌ కొంత వెనుకకు తగ్గింది. యుద్ధానికి సిద్ధమంటూ పెంచిన స్వరాన్ని తగ్గించింది. తమ వైపునుంచి ఎలాంటి కవ్వింపు చర్యలూ ఉండవని, యుద్ధంకోసం తాము ఉబలాటపడటంలేదని ఐరాస ప్రతినిధులకు, భారత్‌కు స్పష్టం చేసింది. ఐరాస శాశ్వత సభ్యత్వ దేశాలైన జపాన్‌, జర్మనీ, అమెరికా, రష్యా, యుకె ప్రతినిధులు పాక్‌ విదేశాంగశాఖ కార్యదర్శి సల్మాన్‌ బషీర్‌తో భేటీ అయ్యారు. వారితో భారత్‌ను కవ్వించే ఎలాంటి చర్యలకు పాక్‌ః పాల్పడదని ఆయన హామీ ఇచ్చారు. ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ కూడా సైన్యాన్ని సరిహద్దుల్లో మొహరించటం, సెలవులు రద్దుచేయటం వంటివి ఉద్రిక్తత తలెత్తినప్పుడు రొటీన్‌గా చేసేదేనని, ఇరుదేశాలు అలాగే చేశాయని ఇది యుద్ధానికి సిద్ధమవటం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. భారత హైకమిషనర్‌ సత్యవ్రతపాల్‌తో భేటీ అయిన పాక్‌ విదేశాంగ కార్యదర్శి పాల్‌ కూడా ముంబయి పేలుళ్లపై సంయుక్త విచారణకు తాము సిద్ధమని, దీనికోసం త్వరలో పాక్‌ విదేశాంగమంత్రి ఢిల్లీ వస్తున్నారని తెలిపారు.

ఇలియానాకు బెస్ట్ రెస్ట్!


తినికూర్చున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో బెస్ట్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిన ఆహార్యంలో అనూహ్య మార్పులు వస్తాయనే బెంగ చాలామందిలో ఉంటుంది. గ్లామర్ వరల్డ్ లో ఉన్న వాళ్లకైతే ఈ బెంగ మరింత ఎక్కువ. నాలుగు పెద్ద చిత్రాలు, బిజీ షూటింగ్ షెడ్యూల్స్ ఉన్న గ్లామర్ నటి ఇలియానాకు ఇప్పుడు బెస్ట్ రెస్ట్ బెంగ పట్టుకుందట. నాలుగైదు రోజుల క్రితం నితిన్ తో కలిసి నటిస్తున్న చిత్రంలో ఓ డాన్స్ సీక్వెన్స్ లో పాల్గొన్నప్పుడు ఇలియానా కుడికాలి చీలమండకు గాయమైంది. దీంతో వైద్యులు కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించడంతో ఆమె ప్రస్తుతం ముంబైలో తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్నారు. ‘ప్రస్తుతం నా పరిస్థితి మెరుగ్గా ఉంది’ అని ఇలియానా అక్కడ్నించే చెప్పింది. గాయమైన మొదటి రోజు విపరీతమైన నొప్పితో బాధపడ్డాననీ, వైద్యులు ఎక్సెరే తీశారనీ, ఫ్యాక్చర్ కాలేదని తేల్చడం ఊరట కలిగించిందనీ ఆమె చెప్పుకోచ్చింది. ఆసమయంలో నితిన్ ఎంతో సహాయం చేశాడని గుర్తు చేసుకుంది. ప్రస్తుతం కాలక్షేపం ఎలా ఉందనేది చెబుతూ ‘కాలు కదపుకుండా కూర్చోవడం అంత బాధ మరొకటి ఉండదు. ఎప్పుడెప్పుడు లేచి గెంతులేస్తానా అని ఉంది. అయితే పక్క మీద నుంచి లేచే ప్రయత్నం చేస్తే ఇంట్లో వాళ్లంతా చీవాట్లు పెట్టేస్తున్నారు. టీవీల్లో సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. తీరిగ్గా ఉండటం వల్ల దొరికినవన్నీ తినేస్తున్నాను. బరువు కూడా పెరిగిపోతున్నాను’ అంటూ బెంగపడిపోతోంది. ప్రస్తుతం చేతినిండా పని ఉన్నందున వారం రోజుల్లో డాక్టర్ తో పరీక్ష చేయించుకుంటాననీ, కాలికి ఉన్న ప్లాస్టర్ తీసేసినా డాన్సులు, పరిగెత్తడాలు మాత్రం చేయడం కుదరకపోవచ్చనీ చెప్పింది. ఇలియానా స్పీడ్ గా రికవర్ అవుతుందనే ఆశిద్దాం.