మనిషిని చంపే హక్కు పోలీసులకెక్కడిది..?


నిజామాబాద్‌: రాష్ట్రంలో పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లు జరుపుతూ.. కాల్చి చంపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో హై కోర్టు వెలువర్చిన సంచలన తీర్పు పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. `ప్రతీ ఎన్‌కౌంటర్‌ సంఘటనకు సంబంధించి తప్పనిసరిగా పోలీసులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలివ్వడం సరైన చర్యగా వివిధ పార్టీల నేతలు, విద్యావంతులు పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల బూటకపు ఎన్‌కౌంటర్లు తగ్గుముఖం పడ్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తోటి మనిషిని తీవ్రవాదం, తదితర నేరాల ముసుగులో కాల్చి చంపడం అమానుషమని, పోలీసులకు ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారంటూ ధ్వజమెత్తారు. మరోవైపు తాజాగా వెలువర్చిన హైకోర్టు తీర్పు బాధితుల కుంటంబసభ్యులు తమ వాదనను వినిపించే వెలుసుబాటు దొరికిందని, అయినప్పటీకీ పోలీసులు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకోవడానికి మరిన్ని అవకాలున్నాయంటూ పౌర హక్కుల సంఘం భావిస్తోంది. శుక్రవారం హైకోర్టు వెలువర్చిన తీర్పు పై పలువురి అభిప్రాయాలను సేకరించినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.

తీర్పు పాతదే… : కె.రాజారత్నం నాయుడు, నిజామాబాద్‌ రేంజ్‌ డిఐజి
గతంలో మాదిరిగానే ఈ తీర్పు ఉంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత రిపోర్టును ఇప్పటికీ మెజిస్ట్రేట్‌కు పంపుతాం. ఇపుడు కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నాం.. కోర్టుకు పంపిస్తున్నాం. అడవిలో సాయుధులైన తీవ్రవాదులు ఎదురుపడితే తప్పనిసరై ఆత్మరక్షణ కొరకు ఎదురుకాల్పులకు దిగాల్సి వస్తుంది. అంతేగానీ అనవసరంగా ఎవరి ప్రాణాలను తీయాలని పోలీసులకుండదు.

బాధితులకు కాస్త వెసులుబాటు… : మాధవరావు, ఎపీపీసీఎల్సీ జిల్లా నేత
ఎన్‌కౌంటర్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు హైకోర్టు తీర్పు కాస్త వెసులుబాటును కల్పించింది. అయితే గతంలోనూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేవారు. పోలీసుల మీద హత్యాప్రయత్నం జరిగిందంటూ 307 కింద కేసు నమోదు చేసేవారు. ఫైనల్‌ రిపోర్టును మెజి్స్ట్రేట్‌కు పంపిస్తారు. ఇందులో 95 శాతం కేసులు పెండింగ్‌లోనే ఉంటాయి. అయితే తాజా తీర్పు వల్ల పోలీసులు చెప్పిన కారణాన్ని రుజువు చేయాల్సి వస్తోంది. కోర్టులో వారికి ప్రతికూలంగా గానీ..అనుకూలంగానీ తీర్పు రావచ్చు. దీంతో భయస్తులైన పోలీసులు ఎన్‌కౌంటర్ల జోలికి వెళ్లరు. కానీ, ఇపుడు కూడా పోలీసులు తప్పించుకునేందుకు అనేక మార్గాలున్నాయి. ఇది కేవలం విధినిర్వహణలో భాగంగానే చేశాం అంటూ తప్పించుకునే అవకాశాలూ ఉన్నాయి.

ఇక పోలీసులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిందే… పోశెట్టి, తెరాస జిల్లా అధ్యక్షులు
బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో పోలీసులు అమాయకులను అనవసరంగా చంపకుండా హై కోర్టు సరైన నిర్ణయం తీసుకుంది. పోలీసులు చంపాలనుకున్న వారిని తీవ్రవాదులను చేసి పట్టుకెళ్లి చంపుతున్నట్లు పత్రికల్లో చూస్తున్నాం. అలాంటి ఘటనలు ఇక జరగకుండా ఉంటాయి. పోలీసులపై చర్యలు తీసుకునేందుకు ఈతీర్పు దారి సుగమం చేసింది. ఇక నుంచి పోలీసులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంటుందని హైకోర్టు ఈవిధంగా హెచ్చరికలు జారీ చేసింది.

Advertisements

గుబాలిస్తున్న గంజాయి ఘాటు!


నర్సంపేట (వరంగల్): డివిజన్‌లోని వివిధ మండలాల్లోని సరిహద్దు గ్రామాల్లో గంజాయి పంట అక్రమంగా సాగవుతోంది. ఈ సాగు చాపకింద నీరులా ప్రతియేట విస్తరిస్తూనే ఉంది. తక్కువ పెట్టుబడులతో అధికలాభాలు పొందవచ్చనే ఉద్దేశంతో రైతులు పసుపు, కంది పంట, మిర్చిపంటలలో మిశ్రమ పంట గంజాయిని సాగు చేస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని బాహాటంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డివిజన్‌లోని దుగ్గొండి, చెన్నారావుపేట, గీసుకొండ, ఆత్మకూర్‌ గ్రామాల సరిహద్దు మండలాల్లో గంజాయి అక్రమంగా సాగవుతోంది. నల్లబెల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో వందలాది ఎకరాలు ఓ విప్లవ గ్రూపు ఆధ్వర్యంలో సాగవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గంజాయి సాగవుతున్నట్లు పోలీసు, ఎక్సైజ్‌ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకునే పరిస్థితి లేదు. గూడూరు, కొత్తగూడ మండలాల పరిధిలోని శివా రు తండాల్లోని అటవి ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. శీలవతి రకం గంజాయి కిలో రూ. 1500 నుంచి 2000 వరకు స్థానికంగా పలుకుతోంది. దీన్ని ఎండ బెట్టి ప్యాకెట్లు చేసి బెంగుళూరు, కర్నాటక, మహారాష్ట్ర, హైదరా బాద్‌ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన గంజాయి దళారులు గ్రామాల్లో గోప్యంగా వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్ళి వారి స్వస్థలాలకు తీసుకెళ్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం గంజాయి సాగు విపరీతంగా ఉండేది. తగ్గు ముఖం పట్టిందనుకుంటున్న తరుణంలోనే చాపకింద నీరులా గంజాయి విస్తరిస్తోంది.

రెండు శాఖల మధ్య సమన్వయ లోపం
ఎక్సైజ్‌, పోలీసు శాఖల మధ్య సమన్వయ లోపంతోనే గంజాయి నియంత్రణ జరగడంలేదని తెలుస్తోంది. గంజాయి అక్రమ సాగు తమ శాఖకు సంబంధం లేదని పోలీసులు మిన్నకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల సహాకారంలేనిది గంజాయి పంటలపై ఎక్సైజ్‌శాఖ అధికారులు దాడులు చేసే పరిస్థితిలేదని పలువురు అంటున్నారు. దీంతో రెండు శాఖల మధ్య సమన్వ య లోపంతో గంజాయి నియంత్రణ జరగడంలేదని తెలుస్తోంది. కొన్ని మండలాల రైతుల నుంచి ముందస్థుగా మామూళ్ళ పుచ్చుకొని గంజాయి సా గు ప్రొత్సహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

రాజకీయ నాయకుల అండదండలు
గంజాయి సాగు చేసే రైతులకు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రొద్బలంతో ఎక్సైజ్ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో గంజాయి సాగు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోందని పలువురు బాహటంగానే ఆరోపిస్తున్నారు.

నీరు గారిన ‘ఉపాధి’ పథకం!


అనంతపురం‌: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పథకం నీరు గారిపోయిందని టిడిపి, సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు పేర్కొన్నారు. స్థానిక వికె భవన్‌లో శనివారం ఉపాధి హామీ అమలు, ప్రభుత్వ వైకరిపై జరిగిన జిల్లా సదస్సులో ముఖ్య అథితులుగా టిడిపి జిల్లా అధ్యక్షులు ఉన్నం హనుమంతురాయ చౌదరి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఓబుళకొండారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ , ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి ఓ నల్లప్పలు హాజరై మాట్లాడుతూ వామ పక్షాల ఒత్తిడితో వచ్చిన ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఉపాధి హామీ చట్టం స్పూర్తిని నీరు గార్చి కేంద్రం నుంచి వచ్చిన రూ. 4600 కోట్లు నిధులను దుర్వినియోగం చేసి అవినీతి మయం చేశారని వారు ఆరోపించారు. ఉపాధి హామీ కూలీలకు వందరోజులు పని కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చట్టవిరుద్దంగా గత ఆరు నెలలుగా ఉపాధి హామీ పనులు నిలిపివేశారని వారు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రే చట్ట విరుద్ధంగా పనులు నిలిపివేడంతో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రజలు పొందాల్సిన వందల కోట్ల రూపాయలు నష్టపోయారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యవసాయ కార్మికునికి ఏడాదికి వందరోజులు ఉపాధిని కల్పిస్తూ తెచ్చిన చట్టం ఫిబ్రవరి 2006లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను జిల్లాలోని నార్పల మండలం బండ్లపల్లిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హంగు ఆర్భాటాలతో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, యుపిఏ చైర్మెన్‌ సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారన్నారు. సాక్షాత్తు దేశ ప్రధాని ప్రారంభించిన ఈ గ్రామంలో 3 సంవత్సరాలలో కేవలం 42 కుటుంబాలు మాత్రమే వందరోజులు పని పొందరాని వారు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో 73425 మంది ఉపాధి కార్డులు పొందారన్నారు. వీరిలో 2006-07 సంవత్సరంలో 226851 కుటుంబాలు, 2007-08 సంవత్సరంలో 350645 కుటుంబాలు, 2008-09 సంవత్సరంలో 292831 కుటుంబాలు పనిచేశాయని పేర్కొన్నారు. ఈ కుటుంబాలలో కూడా 7 శాతం మాత్రమే వంద రోజుల పనిని పొందారన్నారు. ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతిని అరికట్టి వెంటనే ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని, ప్రతి వ్యవసాయ కూలీకి 150 రోజులు పని కల్పించి రూ. 150 రోజు వేతనం ఇవ్వాలని, ఉపాధి హామీ పనులలో యంత్రాలు, కాంట్రాక్టు నామినేషన్‌ వర్‌‌కను నిషేదించాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే ఫీల్‌‌డ అసిస్టెంట్‌ల వేతనం రూ.4800లకు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.

ఫ్యాక్షనిస్టుల ఇళ్లపై కన్ను!


అనంతపురం: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించడం అధికారులకు ఒక ఎత్తయితే అనంతపురం జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించడం మరో ఎత్తని చెప్పవ… చ్చు. 2004 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాని వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ సంఘటనలకు సంబంధించిన జరిగిన ఘర్షణల వల్ల దాదాపు 180 కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు పోలీసు అధికారులు ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవడంతోపాటు రెండు అంకెలకు మించి కేసులు నమోదు కాకూడదని ఎస్పీ యం.కె.సింగ్‌ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు ఏవిధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఎస్పీ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే… అనంతపురం ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తరువాత గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఒక్కో గ్రామానికి ఒక్కో కానిస్టేబుల్‌ను పోలీస్‌ ఆఫీసర్‌గా నియమించా. ఆ గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరిగినా ఆ కానిస్టేబుల్‌దే బాధ్యత అనే విధంగా వారికి తర్పీదు ఇచ్చాను. ఈ విధంగా చేయడం వల్ల గ్రామాల్లో జరుగుతున్న సంఘటనలు సునాయాసంగా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలైంది. వీటిని ఆధారం చేసుకొని ఆయా గ్రామాలకు నియమించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ ద్వారా ఫ్యాక్షనిస్టుల కదలికలు, గత ఎన్నికల్లో ఎవ్వరైనా దౌర్జన్యం చేసి వుంటే ప్రస్తుతం వారి పరిస్థితులు తదితర వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. వీటికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు శనివారం నిర్వహించిన సెట్‌ కాన్ఫెరెన్స్ ద్వారా అందరికీ అర్థమయ్యేలా క్షణ్ణంగా వివరించానని చెప్పారు. అంతేకాకుండా కొన్ని వివరాలు సేకరించడానికి పోలీస్‌ కానిస్టేబుళ్ళ చేతకాకపోతే వాటి బాధ్యతను డిఎస్‌పి లేదా సిఐలకు అప్పగించినట్లు చెప్పారు. అప్పుడే జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో పోలీసులు ఏ పార్టీకీ కొమ్ముకాయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో పోలీసు అధికారులు తరచూ తిరిగే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

పెళ్లిచేసుకోవాలని ఒకరు! భర్తకోసం మరొకరు!!


ఆదిలాబాద్: నాభర్తను నాకు దూరం చేయకండి అని మంచిర్యాలకు చెందిన చంద్రకళ తన భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి సిద్దపడింది. వివరాల్లోకి వెలితే నస్పూర్‌ కాలనీకి చెందిన లెక్కల శంకర్‌ కూతురు చంద్రకళ, మంచిర్యాలకు చెందిన నులిగొండ రాజయ్య కొడుకు మధుకర్‌కు గత సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి కాగా నాటి నుంచి నేటివరకు దంపతులు ఇద్దరు సవ్యంగా కాపురం చేయలేదని, పెళ్లి అయిన నాటి నుంచి అదనపు కట్నం కోసం తన భర్త తనను వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపిస్తుంది. తన ఒదిలించు కోవడానికి తన భర్త మధుకర్‌ సిద్దపడిన నేపధ్యంలో తాను భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి సిద్దపడినట్లు పేర్కొంది. తన పోరాటానికి పోలీసు శాఖ, మహిళా స్వచ్చంద సంఘాలు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటుంది. ఇదిలా ఉండగా గతంలో భార్యభర్తలు ఇద్దరిని పోలీసుల సమక్షంలో కౌన్సిలింగ్‌ నిర్వహించే సవ్యంగా కాపురం చేసుకోవాలని సూచించినట్లు మంచిర్యాల పట్టణ సిఐ రమణకుమార్‌ తెలిపారు. శనివారం మధుకర్‌ తల్లిదండ్రులను చంద్రకళ కుటుంబసభ్యులను సిఐ పిలిపించి మాట్లాడినప్పటికి ఫలితం లేకపోయిందని వినని పక్షంలో కేసునమోదు చేయడం జరుగుతుందని సిఐ తెలిపారు. ఎలాంటి ఆందోళన జరుగకుండా ఉండటానికి మౌనపోరాటం చేస్తున్న స్థలానికి పోలీసులను పంపించి చర్యలు తీసుకున్నారు.

భారీగా ఎరచ్రందనం పట్టివేత


మంచిర్యాల: 30 లక్షల రూపాయలకు పైబడి విలువ కలిగిన ఎర్ర చందనం దుంగలను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల రేంజ్‌ అటవీ శాఖ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత కరీంనగర్‌, ఆదిలాబాద్‌ సరిహద్దులోని గోదావరి నది సమీపంలోని ఇందారం చెక్‌పోస్టు వద్ద అటవీ సిబ్బంది కాపు కాసి అతి విలువైన ఎరచ్రందనాన్ని పట్టుకున్నారు. విజిలెన్స్ వర్గాల సమాచారంతో ఈ కలప లారీని పట్టుకున్నట్లు పైలయింగ్‌ స్కా్వడ్‌ డిఎఫ్‌ఓ ఆంజనేయులు తెలిపారు, ఇంకా దాడిలో ఎఫ్‌ఆర్‌ఓ రవి ప్రసాద్‌, ఎఫ్‌ఎస్‌ఓ గోలి రాములు, బీట్‌ ఆఫీసర్‌లు కె.ప్రభాకర్‌, మూర్తి, ఎ.రవిందర్‌, సుభాన్‌లున్నారు. సంఘటనా స్థలంలో దొరికిన ఇద్దరు నిందితులను అటవీ శాఖ అధికారులు తమ అదుపులోకి తీసుకునే సందర్భంలో ఒకరు అదికారుల కన్నుగప్పి తప్పించుకొని పారిపోయాడు. అటవీ సిబ్బంది పట్టుకున్న నిందితుడి పేరు రమేష్‌గా సిబ్బంది తెలిపారు. పట్టుబడిన నిందితుడు తాను కలకత్తా చూడటానికి వెళ్తున్నట్లు పేర్కొన్నాడు. లారీ నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి వస్తున్నట్లు తెలిపినా అతడు చెప్పిన దాంట్లో నిజం లేదని అటవీ సిబ్బంది పేర్కొంటున్నారు. లారీ, కర్ర ఎవరికి సంబంధించిందనే అనే వివరాలు సేకరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఎర్ర చందనం దుంగలను పట్టుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చిత్తూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను కలకత్తాకు చేర్చి అక్కడ నుంచి విదేశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో అక్రమ కలప రవాణా జిల్లాలో కూడా యధేచ్చగా సాగతున్నప్పటికి సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా చోటుచేసుకున్నాయి. జిల్లాలో రోజుకో చోట అక్రమ కలప పట్టుబడిందనే సమాచారం వస్తున్నప్పటికి దానిని పూర్తిగా నిర్మూలించడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి చెక్‌పోస్టు వద్ద నిఘాను పెంచి అక్రమ రవాణను అడ్డుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

రంగుమారుతున్న గులాబీ!


గులాబీ తోటలను పెంచటంమంటే ఆమెకు భలే సరదా. గులాబీ మొక్కలను పెంచుకుంటూ వాటిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటోందామె. అయితే ఈ ఏడాది దిగుబడి సరిగా రాకపోవటంతో పాటు మొక్కలకు పురుగు సోకటంతో ఆమెకు కన్నీళ్లే మిగిలాయి. ప్రకాశంజిల్లా గిద్దలూరుకిచెందిన గురవమ్మకు గులాబీ తోటల పెంపకమంటే ఎంతో ఇష్టం. అంతే ఇష్టంతో కర్నాటకనుంచి మొక్కలను తెచ్చి మూడు సంవత్సరాలుగా తోటను సాగు చేసింది. ఒక్కోఎకరానికి నలభై వేల నుంచి యాభైవేల వరకు ఖర్చు చేసి తోటను కాపాడుకుంటూ వస్తున్నది. అయితే అనుకోకుండా ఈఏడాది గులాబీ తోటకు పురుగుసోకటంతో ఆశించిన విధంగా దిగుబడి రాలేదు. పోనీ చేతికి వచ్చిన గులాబీలైనా బాగా వున్నాయంటే నల్లబడి అధికశాతం గులాబీమొక్కలు చనిపోతున్నాయి. పురుగులమందులు వినియోగించినా ఎటువంటి ప్రయోజనం లేదని మొగ్గ దశలో రాలిపోవటంతో గురవమ్మ ఆందోళన వ్యక్తం చేసింది. ఊహించని విధంగా గులాబీ తోటలకు పురుగుసోకటంతో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని సాగుదారులు కోరుతున్నారు.