గుట్టుగా రేప్‌ బాధితురాలి అంత్యక్రియలు


న్యూఢిల్లీ: సింగపూర్‌ మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచిన ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలికి ఆదివారం వేకువజామున హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు. సాధారణ ప్రజలకు తెలియకుండానే ఈకార్యక్రమం ముగించేశారు. నగర అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమె శవపేటిక వేకువజామున రాగానే నివాళులర్పించారు.

ఆమె చితికి వెక్కివెక్కి ఏడుస్తున్న తండ్రి నగరశివారులోని ద్వారక వద్ద ఉన్న దహనవాటిక వద్ద నిప్పంటించారు. రోదిస్తున్న బంధువులు మిత్రులు ఆమె ఇంటిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆఖరి వీడ్కోలు పలికారు. దక్షిణఢిల్లీలో ఆమె నివాసం ఉంది.

ఎయిరిండియా ప్రత్యేక విమానంలో సింగపూర్‌ నుంచి మృతదేహం ఇక్కడకు వచ్చింది. ఆమెతో పాటు తల్లిదండ్రులు ఇద్దరు సోదరులున్నారు. విమానాశ్రయంలో దట్టంగా పొగమంచు అలుముకుని ఉన్నది. జాతి మనోభావాలను ఇది ప్రతిబింబిస్తున్నట్లుంది. ఉదయం 3.30 గంటలకు విమానం ఇక్కడ దిగింది. సింగ్‌, సోనియాలు మృతురాలి తల్లిదండ్రులను ఓదార్చారు. తమ వేదనను వారితో పంచుకున్నారు. భారీ పోలీస్‌ బందోబస్త్‌ మధ్య మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ కొన్ని అంత్యకార్యక్రమాలు జరిగాయి. తర్వాత ద్వారక సెక్టర్‌ 4 లోని దహనవాటిక వద్దకు తీసుకువెళ్లారు. అంత్యక్రియలు జరిగేటపుడు ఢిల్లీ సిఎం షీలాదీక్షిత్‌, హోమ్‌ శాఖ సహాయమంత్రి ఆర్‌.పి.ఎన్‌.సింగ్‌ తదితర ముఖ్యులు అక్కడే ఉన్నారు. మీడియాను దగ్గరకు రానివ్వలేదు. శనివారం అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత పోలీసులు దహన వాటిక వద్దకు వెళ్లి ఆదివారం వేకువజామున అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. ఇదీ చాలా రహస్యంగా.

తెల్లవారకుండానే దహనం చేద్దామనుకున్నారు. కాని అది వీలుకాలేదు. హిందూ సాంప్రదాయాల ప్రకారం సూర్యోదయం అయిన తర్వాతే అంత్యక్రియలు జరగాల్సి ఉంది. 7.30 గంటలకు మృతురాలి తండ్రి ఆమె సోదరుల సమక్షంలో చితికి నిప్పంటించారు.

దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విషాదం
రేప్‌ బాధితురాలి మృతితో సత్వర న్యాయం చేకూర్చాలని ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విషాదవాతావరణంలో ప్రార్ధనలు నిర్వహించారు. కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. వివిధనగరాలలో విషాదం ప్రస్ఫుటంగా కనిపించింది. ఆరుగురు నిందితులకు ఉరి విధించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఉదయం నుంచి చీకటిపడేవరకు ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాలేజ్‌, స్కూల్‌ విద్యార్ధులు హైదరాబాద్‌,విజయవాడ, విశాఖ, కర్నూలు, వరంగల్‌ తదితర నగరాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మహిళాగ్రూపులు, యువజన సంఘాలు, వివిధ రాజకీయపార్టీల వారు ఈ ప్రదర్శనలలో పాల్గొని నినాదాలు చేశారు.

హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. చండీగఢ్‌, బెంగుళూరు, ముంబయిలలో జరిగిన ప్రదర్శనలకు భారీగా ప్రజలు హాజరయ్యారు.

మృతురాలి స్వస్థలమైన ఉత్తరాఖండ్‌ లోని గర్హ్‌వాల్‌లో ప్రజలు వారు వీరు అన్న భేదం లేకుండా ఇళ్లనుంచి బైటకు వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు.

అమితాబ్‌ హృదయావేదన
మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఢిల్లీ రేప్‌ మృతురాలికి గేయకవిత రూపంలో ఇలా నివాళి అర్పించారు. ఆమెను దామిని, అమానత్‌లుగా అభివర్ణించారు. ఆ కవిత ఇలా ఉంది.

కాలం గడుస్తున్న కొద్దీ కొవ్వొత్తులు కరగిపోతాయి మంటలు మరుగునపడతాయి
భక్తితో సమర్పించిన పూలు తేమలేమితో రాలిపోతాయి
నిరసన గళాలు మూగపోతాయి
కాని వెలిగించిన నిర్భయత్వ అగ్ని మా హృదయాలలో జ్వాలలను తిరిగి రగిలిస్తాయి
కన్నీటి తేమ రాలిపోయిన ఎండిపోయిన పూలు తిరిగి జీవవంతమవుతాయి
‘దామిని’ ‘అమానత్‌’ ఆత్మ గళం విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది
భారత్‌ నా మాతృదేశం
నాగురించి మరచిపోండి కాని మీ దేశపుత్రులుగా గుర్తింపు తెచ్చుకోండి.

‘బాధితురాలి’ మృతిపై మిల్కాసింగ్‌ కన్నీరు
పాతతరం భారత్‌ అథ్లెట్‌ మిల్కాసింగ్‌, ఢిల్లీ రేప్‌ బాధితురాలి మరణంపై కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. ఆమె మరణవార్త ఆయనను కలచివేసింది. బాధితురాలి కుటుంబానికి రూ.3 లక్షలు విరాళం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. 82 ఏళ్ల మిల్కాసింగ్‌ కొంతమంది పౌరులతో కలసి మృతురాలికి నివాళి అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగపూర్‌ నుంచి ఆమె మృతదేహాన్ని శనివారం రాజధానికి తీసుకువచ్చారు. బాధితురాలి కుటుంబీకులు ఒంటరితనం అనుభూతి చెందనక్కరలేదు. వారి కుమార్తె మా కుమార్తెగా భావిస్తాం. ఇంకా చెప్పాలంటే ఆమె భారతదేశపు కుమార్తె. ఆమె లేని లోటు మాకు కూడా లోటే అని ఆయన అన్నారు. తన కుమారుడు జీవ్‌తో కలసి ఢిల్లీ వెళ్లి ప్రదర్శనలలో పాల్గొనాలని కోరుకున్నానని కాని తన భార్య నిర్మల్‌ కౌర్‌ అస్వస్థతతో ఉండటంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నానని చెప్పారు. సాహసవంతురాలైన ఆ యువతి మరణం దేశాన్ని కదలించింది. ఈ నేరానికి పాల్పడిన ఘోరనేరస్తులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని ప్రభుత్వానికి రాస్తాను అని ఆయన అన్నారు. ఈ సంఘటనపై దిగ్భ్రాంతి చెందిన కొంతమంది మిత్రులు తనకు యుకె కెనడా యుఎస్‌ఎల నుంచి ఫోన్లు చేశారని ఆయన వెల్లడించారు. విదేశాలలో భారత్‌ ప్రతిష్ట దిగజారిందన్నారు.

ఢిల్లీలో ఐదుమెట్రోస్టేషన్‌ల పునఃప్రారంభం
సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలదృష్ట్యా నగరంలో నిరవధికంగా మూసేసిన 10 మెట్రో రైల్వే స్టేషన్‌లలో ఐదింటిని ఆదివారం మధ్యాహ్నం తెరిచారు. ఇండియా గేట్‌కు దారితీసే రాజ్‌పథ్‌, విజయ్‌చౌక్‌ మార్గాలలోమాత్రం ప్రజలను ఇంకా అనుమతించడంలేదు. ఈ మార్గాలలో వెళ్ళే పౌరులు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని సూచించామని ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు.

మరోవైపు నిరసన ప్రదర్శనలు జరుగుతున్న జంతర్‌మంతర్‌వద్ద ఆందోళనకారులకు, పోలీసులకుమధ్య ఆదివారం మధ్యాహ్నం ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇండియాగేట్‌వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించిన నిరసనకారులు, పోలీసులు పెట్టిన బ్యారికేడ్‌లను విరగ్గొట్టడానికి విఫలయత్నంచేశారు.

పోలీసులతో ఎబివిపి కార్యకర్తల ఘర్షణ
న్యూఢిల్లీ నగరంలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆదివారం ఎబివిపి కార్యకర్తలు పోలీసులతో ఘర్షణపడ్డారు. ఢిల్లీగ్యాంగ్‌ రేప్‌ మృతురాలికి సత్వర న్యాయంజరగాలని వారు ప్రదర్శనలు నిర్వహించిన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. అప్పటివరకు శాంతియుతంగా జరిగిన ప్రదర్శన మధ్యాహ్నం 1.00 గంటకు హింసాత్మకంగా తయారైంది. ఎబివిపి కార్యకర్తలు పతాకాలు చేబూని కన్నాట్‌ ప్లేస్‌ వైపు ఊరేగింపుగా వెళుతుండగా పోలీసులు నిరోధి ంచారు. దాంతో అది ఘర్షణకు దారితీసింది. ఒక గ్రూపు శాంతియుతంగా ముందుకు పోగా మరో గ్రూపు బ్యారికేడ్లను ఛేదించేందుకు ప్రయత్నించింది. వారిని పోలీసులు వెనక్కు తరిమారు.

రేప్‌ నేర నిరోధానికి కాంగ్రెస్‌ బిల్లు
ఢిల్లీగ్యాంగ్‌ రేప్‌ బాధితురాలు మరణించటంతో కాంగ్రెస్‌ కఠినమైన చట్టాలను తీసుకురానుంది. అందులో రసాయనిక వృషణ నిర్వీర్యం (కెమికల్‌ కాస్ట్రేషన్‌) కూడా చేరి ఉంది. కాని కాంగ్రెస్‌ ముసాయిదా బిల్లు ఇంకా తయారు కాలేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జస్టిస్‌ జె.ఎస్‌.వర్మ కమిటీ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి ఈ బిల్లును సమర్పించాల్సి ఉంది. అత్యాచార నిందితులకు అత్యధికంగా 30 సంవత్సరాల జైలు, కేసులవిచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు తదితర అంశాలు ఇందులో చేరి ఉన్నాయి. డిసెంబర్‌ 23న ఈ అంశాలను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలో చర్చించారు. సోనియా నేతృత్వంలోని జాతీయ సలహామండలి ఇందులో ప్రమేయం చేసుకోవచ్చు. సమాచార హక్కు చట్టం లాటి చట్టాలను ఈ మండలి రూపొందించింది. ఇక మహిళాశిశుసంక్షేమశాఖ మంత్రి కృష్ణతీర్ధ్‌ నేతృత్వంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. తమకు అందిన సలహాలను సూచనలను ఈ శాఖ జస్టిస్‌ వర్మ కమిటీకి సమర్పిస్తుంది.

Leave a comment