జగన్‌ పార్టీ కాలగర్భంలో కలసిపోతుంది: తులసిరెడ్డి


హైదరాబాద్‌: జగన్‌ పార్టీ మే 13న కాలగర్భంలో కలసిపోతుందని పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. తన పార్టీ పూర్తి పేరైన యువజన శ్రామిక రైతు పార్టీ పేరు చెప్పుకోలేని దుస్థితిలో జగన్‌ ఉన్నారని… వైఎస్‌కు, సోనియాకు పోటీ అనడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇది కడప, బెంగళూరుకు మధ్య పోటీ అని ఆయన చెప్పారు. సాక్షి మీడియా పత్రికా విలువలకు తిలోదకాలిచ్చి కథనాలు రాస్తోందని ఆయన ఆక్షేపించారు.

Advertisements

చెర్నోబిల్‌అణువిషాదానికి 25 ఏళ్లు


చెర్నోబిల్‌: చెర్నోబిల్‌లో అణుప్రమాదం జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రజలు ఆనాటి ప్రమాదంలో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటించారు. 1986 ఏప్రిల్‌ 26 ఉదయం యుక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్రంలో పేలుడు సంభవించింది. పదిరోజుల పాటు మండిన ఆ అణుమంటలవల్ల వెలువడిన రేడియోధార్మికత హీరోషిమా, నాగసాకిల మీద వేసిన అణుబాంబుల కన్నా 100 రెట్లు ఎక్కువ. ప్రమాదంలో వెలువడిన రేడియేషన్‌ యూరోప్‌ దేశాల వరకూ వ్యాపించింది. లెక్కకు ఆనాడు చనిపోయిన వారి సంఖ్య తక్కువే అయినా రేడియోధార్మికత ప్రభావంతో లక్షలాది మంది ప్రజలు క్యాన్సర్లు, పలు ఇతర వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి సహాయచర్యల్లో పాల్గొన్న 25,000 మంది ఆ తర్వాత కొంతకాలానికే అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పుడు పిల్లలుగా ఉన్నవాళ్లు పెద్దవాళ్లయ్యాక 6 వేలకు పైగా మంది థైరాయిడ్‌ క్యాన్సర్‌ బాధితులయ్యారు. చెర్నోబిల్‌ దుర్ఘటన జరిగి పాతికేళ్లయిన నేపథ్యంలో, తాజాగా జపాన్‌ సంఘటననూ గుర్తుచేస్తూ… అణువిద్యుత్‌ కేంద్రాలు మూసివేయాలంటూ ఫ్రాన్స్‌, జర్మనీలలో ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. గతవారం చెర్నోబిల్‌ సందర్శించిన ఐరాస సెక్రెటరీ జనరల్‌ బాన్‌ కి మూన్‌ ఈరోజు ఒక సందేశం వెలువరించనున్నారు.

బాలుడు చికిత్స పొందుతూ మృతి


సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌లోని నేరేడ్‌ మెట్‌ ప్రాంతంలో శుక్రవారం గాయాలతో కన్పించిన బాలుడు రాజేష్‌, గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మరణించాడు. రాజేష్‌ గురువారం రాత్రి కిరాణా షాపుకని ఇంటినుంచి బయటికెళ్లాడు. రాత్రి ఇంటికి తిరిగిరాని రాజేష్‌ మర్నాడు ఉదయం నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో అనుమానాస్పద పరిస్థితుల్లో తీవ్రగాయాలతో కన్పించాడు. బాలుడ్ని వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ప్రారంభించినా ఫలితం లేకపోయింది. రాజేష్‌ మీద దాడి చేసిందెవరు, కారణమేమిటన్నది ఇంతవరకు తెలియలేదు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమల: తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. ఆలయంలో మహా లఘుదర్శనం అమలుచేస్తున్నారు.

పుట్టపర్తికి చేరుకున్న ప్రత్యేక రైళ్లు


పుట్టపర్తి: విశాఖ, విజయవాడ, సికింద్రాబాద్‌లనుంచీ బయల్దేరిన ప్రత్యేక రైళ్లు ఉదయం పుట్టపర్తి చేరుకున్నాయి. రైళ్లలో వచ్చిన భక్తుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్‌నుంచి ప్రశాంతినిలయానికి 60 బస్సులను ఏర్పాటు చేశారు.

మంచినీటికి గిరిజనుల పాట్లు


మండుటెండల్లో మూడు కిలోమీటర్ల నడక
మెదక్ : పరిశుభ్రమైన మంచినీటిని, కాచి, చల్లార్చి తాగాలని ప్రభుత్వం ఢంకా బజాయిస్తోంది. అలా చేయకుంటే రోగాల బారిన పడతారని సెలవిస్తోంది. కనీసం నీరే దొరక్క అల్లాడుతున్న ప్రజలు, దాని కోసం కోసుల కొద్ది నడిచిపోతున్నారని గుర్తించి, ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం మరీ శోచనీయం. నారాయణఖేడ్‌ మండలంలోని అంబేదా గ్రామ పంచాయతీలోని పిర్లతండా గిరిజనులు గుక్కెడు నీటి అనునిత్యం యాతన అనుభవిస్తున్నారు. ప్రతి రోజూ ఒకటి కాదు, రెండు కాదు మూడు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటు న్నారు ఆ గ్రామ గిరిజనులు. ఎండలో నరకయాతన అనుభవిస్తూ వారు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు. సోమవారం నాడు మన్యసీమ ఆ గ్రామాన్ని సందర్శించింది. వారి సమస్యలను తెలుసుకొంది. గ్రామపంచాయతీలోని పిర్ల తండా గిరిజనులు నీటి కోసం కోటి తిప్పలు పడుతున్నారు. ఆ గ్రామంలో 120 గృహాలు ఉంటాయి. కాని ఇప్పటి వరకు ఒక్క చేతి పంపును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. తండా బయట ఒకే ఒక్క చేతిపంపు ఉంది. అది కూడా ఎండాకాలం భూగర్భ జలాలు ఇంకి పోవడంతో గంటల తరబడి కొట్టినా కాస్తో, కూస్తో నీరు రాల్చదు. ఇక గత్యంతరం లేక ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరు బావులపై ఆధారపడి నీటికోసం యాతన అనుభవిస్తున్నారు. ఆ తండాలో సుమారు 500 గేదెలు ఉన్నాయి. వాటి పరిస్థితి మరీ దయనీయం. నీరు లేక మూగ జీవులు అల్లాడుతున్నాయి. మనుషులకే నీరు లేని ఆ ప్రాంతంలో ఇక వాటి పరిస్థితి ఊహిస్తేనే గుండెలు తరుక్కుపోతున్నాయి. తండాల్లో జనాన్ని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప వారి సమస్యలు పట్టించుకోవడం లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం వచ్చినప్పుడు ఎన్నో హామీలిస్తారు. కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆ గ్రామంలో ఎవ్వరిని కదిలించినా కన్నీటితో నిండిన మొహంతో చెబుతున్నారు. ‘అయ్యా నాయకులంతా ఫిల్టర్‌ నీరంట అది తాగుతారు. కానీ మాకు కనీసం మంచినీరు కూడా అందడం లేదు. మేము ఓట్లేస్తేనే కదా మీరు అక్కడిదాకా వెళ్తున్నది. మా సమస్యలు పరిష్కరిస్తామంటేనే కదా ఆశతో మేము ఓటేసింది. మా సమస్యలు మర్చిపోయారా?’ అని ప్రజాశక్తి సాక్షిగా ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. ‘సారూ.. నీటి కోసం వెళ్లే రోడ్డంతా రాళ్లతో నిండి ఉంటుంది. ఈ ఎండలకు కాలుతున్న రాళ్లపై నడుస్తూ వెళ్లి తెచ్చుకుంటున్నాం. ఇక మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి. వారికి ఇది కనపడడం లేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఆ బావి నీరు రోగాలకు నిలయం

ఇక్కడి గిరిజనులు మైళ్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకుంటున్న బావి నిండా చెత్తా చెదారంతో నిండి ఉంటుంది. ఆ నీటిని తాగడం రోగాలకు రహదారి వేసినట్లే. ఇప్పటికే చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. అయినా తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది తండాలు వదిలి ఎండాకాలం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎండా కాలం మరీ దారుణం : లాలు గ్రామస్తుడు

ఎండ కాలం వచ్చిందంటే చాలు నీటి కోసం కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆ తండా వాసి లాలు తెలిపారు. నీటి కోసం ఊరి బయట ఉన్న బావి వద్దకు వెళ్లాలని తెలిపాడు. ఇక్కడ మనుషులతో పాటు పశువులు కూడా నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. ఓటు కోసం మాత్రమే నాయకులు ఇక్కడికి వస్తారని, ఆ తర్వాత మా కష్టాలు చుసేవారే ఉండరన్నారు. ఎండాకాలంలో నీటి కష్టాలను తీర్చాలని కోరుతున్నామని ఆయన తెలిపారు.

నీటి సౌకర్యం కల్పించండి : గాణు తండా వాసి

తండాలో చేతిపంపులు లేకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరం నుండి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తండాకు చెందిన గాణు తెలిపారు. ఎండలు ఈ తండాలో బోరు వేసి నీటి ఎద్దడి తీర్చాలని ఆయన కోరారు.

ఎండలో నీటి కోసం తిప్పలు పడుతున్నాం : లకిëభాయి తండావాసి

మండుతున్న ఎండలో, కాలు కాలుతున్నా కిలోమీటర్ల దూరం నీటి కోసం వెళ్లాల్సి వస్తోందని తండాకు చెందిన లకిëభాయి తెలిపింది. ఒక్కరు, కాదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిందెలు చేతపట్టుకొని నీటి కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. చిన్న పిల్లలు సైతం నీటి కోసం ఎండలో నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

నీటి ఎద్దడి నివారణకు రూ.3 కోట్లు

గత ఆదివారం నాడు అంబేద గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ను అడ్డుకొని నీటి ఎద్దడిని తీర్చాలని ఆందోళనకు దిగారు. వెంటనే కలెక్టర్‌ స్పందిస్తూ ఈ గ్రామంలో నీటి ఎద్దడి నివారణకు మూడు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలో మంజీరా నది నుంచి పైప్‌లైన్‌ను ప్రారంభించి నీరు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

గిరిజన రైతుల సమస్యలు పష్కరించాలి


– గిరిజన సంఘం ఆధ్వర్యాన ఐటిడిఎ వద్ద ధర్నా
విజయనగరం: ఏజన్సీలో జీడిరైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పార్వతీపురం ఐటిడిఎ వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యాన రైతులు ధర్నా చేశారు. ముందుగా ఆర్టీసి బస్టాండ్‌ నుంచి ఐటిడిఎ వరకు ర్యాలీ నిర్వహించారు. గిరిజన రైతులు లోపలకు వెళ్లకుండా ఐటిడిఎ ప్రధానగేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ గిరిజన రైతుల సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఏజన్సీలో గతంలో జీడిపంటను వేయించారని, పంటను మాత్రం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నారని అన్నారు. ఏడాదిలో ఎక్కువ శాతం మంది గిరిజనులు జీడి పంటపైనే ఆధారపడుతున్నారని, వారంతా దళారుల బారిన పడి మోసపోతున్నారని అన్నారు. కొన్ని గ్రామాల్లో గిరిజనులు సాగుచేస్తున్న భూములకు పట్టాలు లేవని, దీని వల్ల పంట నష్టం వస్తే వారికి పరిహారం రావడం లేదని అన్నారు. ఇప్పటికైనా జీడిపిక్కలను జిసిసి కొనుగోలు చేయాలని, కిలో ధర రూ.100 ప్రకటించాలని, నష్టపోయిన జీడి రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జీడిపంటకు అవసరమైన రుణాలు, ఎరువులు ఐటిడిఎ ద్వారా సరఫరా చేయాల న్నారు. పోడుభూములను సాగుచేస్తున్న రైతులందరికీ పట్టాలివ్వా లన్నారు. వీటిని పరిష్కరించేంతవరకూ ఇక్కడ నుంచి వెళ్లేదిలేదని తేల్చిచెప్పారు. విషయాన్ని సిఐ రాధకృష్ణ పిఓకు చెప్పగా, గిరిజన సంక్షేమశాఖ డిడి మణికుమార్‌ను ఆందోళన వద్దకు పంపారు. ఈ సమస్యలపై పిఓ వచ్చి సమాధానం ఇస్తేనేగానీ ఇక్కడ నుంచి వెళ్లేది లేదని తేల్చిచెప్పడంతో కొంతసేవు పోలీసులకు, రైతులకుమధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం అక్కడకు వచ్చిన పిఓకు సమస్యలను వివరించారు. జీడిరైతులు ఐకెపి వద్ద రుణాలు తీసుకోవాలని, పట్టాలు లేని గిరిజనరైతులు దరఖాస్తులు చేసుకుంటే అటవీహక్కుల చట్టంలో ఇస్తామని హామీ ఇచ్చారు. ధర నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉందన్నారు. కోలక మాట్లాడుతూ పిఓ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లాకార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి, గిరిజనసంఘం జిల్లాకార్యదర్శి కె.అవినాష్‌, నాయకులు ఎం.రమణ, టి.తిరుపతిరావు, కె.సీతారాం, రైతుసంఘం నాయకులు బి.దాసుంగునాయుడు, కె.సాంబమూర్తి, ఎంపిటిసి సభ్యులు అడ్డమేశ్వరరావు, నాయకులు రంజిత్‌కుమార్‌, గిరిజనరైతులు పాల్గొన్నారు.