గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారం


తిరుపతి: డివిజనల్‌ స్థాయిలో గ్రీవెన్స్‌ డే నిర్వహించడం వలన మారుమూల ప్రాంతాల నుండి వచ్చే వారికి వెసులు బాటు కలుగుతుందని చిత్తూరు జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్‌ శారదదేవి అన్నారు. సోమవారం స్థానిక రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆమె ప్రసంగిస్తూ ప్రతి రెండొ సోమవారం తిరుపతిలోను, నాల్గవ సోమవారం మదనపల్లిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ముఖ్యమైన సమస్యలుగా ఇంటి పట్టాలు, భూమి స్వాధీనం, రేషన్‌ కార్డుల ఏరివేత, మునిపల్‌ పరిధిలోని సమస్యలు ముఖ్యమైనవన్నారు.

గత సోమవారం అందిన ఫిర్యాదు మీద స్పందించి అనధికారంగా నిర్వహిస్తున్న బెల్టు షాపును మూయించడం జరిగందన్నారు. తిరుపతి పట్టణం 8 వ వార్డులో నిర్వహిస్తున్న మునిసిపల్‌ పాఠశాలకు సొంత భవనం పై చర్యలు చేపట్టాలని మునిసిపల్‌ అధికారులకు జిల్లా కలెక్టర్‌ గారు ఆదేశాలు జారీ చేసారన్నారు. రేషన్‌ కార్డుల ఏరివేత సందర్బంగా అన్యాయం జరిగిందని భావించినవారు పై అధికారులకు అప్పీలు చేసుకుని న్యాయం పొందవచ్చని సూచించారు.

ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నదని, అధికారులు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు. సోమవారం తప్పనిసరిగా అధికారులు తమ కార్యస్థానాలలో ప్రజలకు అందుబాటులో వుండాలన్నారు.

ఈ సమావేశంలో తిరుపతి రెవిన్యూ డివిజనల్‌ అధికారి ప్రసాద్‌, సహాయ బి.సి. సంక్షేమ అధికారి వెంకటయ్య, డివిజనల్‌ పంచాయతీ అధికారి ఎన్‌.ఎ.రజాక్‌, ఎ.టి.డబ్ల.ఒ ఇ. లలితబాయి, పశుసంవర్థక అధికారి డాక్టర్. ఎన్‌. శైలజ, హౌనింగ్‌ డివిజనల్‌ ఇంజనీరు బాలకృష్ణారెడ్డి, తిరుపతి రూరల్‌ ఎం .పి.డి.ఒ రాజశేఖరరెడ్డి, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన 8 అర్జీలు అందాయి.

చిత్తూరులో సీఎం ‘రచ్చబండ’ జాప్యం


తిరుపతి: భారీ వర్షం కారణంగా ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో జాప్యం చోటుచేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కర్నూలు జిల్లా పాములపాడు సమీపంలో అత్యవసరంగా దిగడంతో అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గాన చిత్తూరు చేరుకున్నారు. ముందుగా ఎక్కడికి వెళ్లేది చెప్పకుండా ఆయన రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదట ఆయన చిత్తూరు జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటిస్తారు. చిత్తూరు జిల్లాలో కూడా ఆయన ఎక్కడ పర్యటించేదీ ఉదయం ఆయన జిల్లా సరిహద్దుల్లో అడుగుపెట్టే వరకు కింది స్థాయి అధికారులకు తెలియలేదు.

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు


తిరుపతి: జిల్లా కేంద్రానికి సుమారు 11 కిలోమీటర్ల పరిధిలో గల కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో ఈనెల 23వ తేదీనుంచి సెప్టెంబర్‌ 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలతో కూడిన పోస్టర్లు, హోర్డింగులు, ఆహ్వానపత్రికలు మరియు అంతరాష్ట్ర ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. ఇందులోభాగంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకేగాక తిరుపతి, కడప వెళ్లే మార్గాలలో సైతం ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 23వ తేదీ వినాయకచవితిని పురస్కరించుకొని 23వ తేదీ సాయంత్రం పుష్పకావళ్ళ సమర్పణ, రాత్రి గ్రామోత్సవం, 24న ధ్వజారోహణం, రాత్రి హంసవాహనం, 25న నెమలి వాహనం, 26న మూషిక వాహనం, 27న శేషవాహనం, 28న వృషభ వాహనం, 29న గజ వాహనం, 30న రథోత్సవం, 31న తిరుకల్యాణం, రాత్రి అశ్వ వాహనం, సెప్టెంబర్‌ 1వ తేదీన ధ్వజారోహనం, రాత్రి వడాయత్తు ఉత్సవం, ఏకాంతసేవ 2వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 11వ తేదీ వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి అధికారనంది, 3వ తేదీ రావణబ్రహ్మ, 4న యాళి వాహనం, 5న పుష్పపల్లకి, 6న సూర్యప్రభ, 7న చంద్రప్రభ, 8న పూలంగిసేవ, 9న కల్పవృక్ష వాహనం, 10న కామధేను, 11 విమానోత్సవం, 12వ తేదీ తెప్పోత్సవంతో కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా కాణిపాకం ఉత్సవాలలో ఆలయ పరిసర ప్రాంతాలలో విద్యుద్దీపాలతో స్వామివారిని వివిధ రూపాలలో పెద్దఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు ఆలయ ఇ.వో పూర్ణచంద్రరావు విలేఖరులకు తెలియజేశారు.