సమన్వయంతో రైతు చైతన్య యాత్రలు


గుంటూరు: రైతు చైతన్య యాత్రల విజయవంతానికి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ బి. రామంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభంకానున్న రైతు చైతన్య యాత్రల కార్యక్రమాన్ని స్ధానిక కృషిభవన్‌లో కలెక్టర్‌ లాంచనంగా ప్రారంభించారు. ఈ నెల 17 నుండి జూన్‌ 2వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామాలలో సైతం ఈ యాత్రలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన రైతు చైతన్య యాత్రలలోని అనుభవాలను దృష్టిలో వుంచుకుని ఈ సవత్సరం తగిన ముండు జాగ్రత్తలతో, సమాచారంతోరైతుల వద్దకు వెళ్లాలన్నారు. ఇటీవల ముగిసిన ప్రజాప్ధం కార్యక్రమం వలెనే రైతు చైతన్య యాత్రలను కూడా ఘనంగా నిర్వహించాలన్నారు. రైతుచైతన్య యాత్రలలో అధికారుల దృష్టికి వచ్చిన రైతు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యమైన అంశాలపై జూన్‌ మాసంలో జరిగే రైతు సదస్సులలో ప్రస్తావించి తగిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని కలెక్టర్‌ తెలియచేశారు.

ఈ విషయాలను రైతులకు స్పష్టంగా తెలిజెప్పాలన్నారు. 2009-10 సంవత్సరంలో జిల్లాలో వ్యవసాయ ప్రణాళిక అమలును పకడ్బందీగా నిర్వహించడం, వ్యవసాయ విధానాలను సక్రమంగా అమలుపరచడం, రైతుల పట్ల అధికారుల స్పందన, తదితర కార్యక్రమాల నిర్వహణ వలన రాష్ట్రస్ధాయిలో ఉత్తమ సంయుక్త సంచాలకులుగా ఐ.రామకృష్ణమూర్తి ప్రభుత్వం నుండి అవార్డు పొందడం హర్షదాయకమని అన్నారు. ఇదే రీతిలో ఈ సంవత్సరం కూడా మరిన్ని ముందస్తు ప్రణాళికలతో అధికారులు పనిచేయవలసి ఉంటుందని కలెక్టర్‌ సూచించారు.

ప్రజాపధం కార్యక్రమంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీపై రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందేనని అన్నారు. అలాగే నిల్వ ఉన్న ధాన్యాన్ని కోనెందుకు ఎవరూ ముండుకు రావడంలేదన్న విషయాన్ని రైతులు అనేక సార్లు తెలియజేశారని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో దేశం మొత్తం మీద ఒకే నిబంధన ఉందన్నారు. రైతుల వద్ద వున్న ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని రైతు చైతన్య యాత్రలలో అధికారులు రైతులకు తెలియజేయాలన్నారు.

అదే విధంగా మిర్చి యార్డులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన రైతులకు ఇంకనూ కోటి 80 లక్షల రూపాయలు చెల్లించవలసి వుందని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన వెంటనే రైతులకు చెల్లించడం జరుగుతుందన్న విషయాన్ని కూడా రైతులకు వివరించాలన్నారు. అలాగే భీమా తాలూకు సొమ్ము నాలుగున్నర కోట్ల రూపాయలలో ఇప్పటి వరకూ 3 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పంట విస్తీర్ణం, దిగుబడి పెరిగే అవకాశం వుందన్నారు.

గ్రామాలలోని ఆదర్శ రైతుల ద్వారా ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేసింది వివరాలను ముందుగా జాగ్రత్త చేసుకోవాలన్నారు. అలాగే ప్రతి రైతు బ్యాంకులలో ఖాతాలు కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఏ ఒక్క రైతుకు కూడా బ్యాంకులో ఖాతా లేదు అని చెప్పడానికి వీలు లేకుండా అధికారులు కృషి చేయవలసి ఉంటుందని ఆయన సూచించారు. గ్రామాలలో సభలను నిర్వహించి ఖరీఫ్‌లో డిమాండ్‌ ఎంత ఉందో చర్చించాలన్నరు. రైతులకు అనుకూలమైన సమయాలలో అధికారులు వెళ్ళి పంట దిగుబడి పెంచేందుకు తీసుకోవలసిన చర్యలను వివరించాలన్నారు. విధి నిర్వహణ లో అలసత్వం, నిర్లక్ష్యం పనికిరాదని ఆయన స్పష్టం చేశారు.

రైతు చైతన్య యాత్రలలో ప్రతి శాఖ అధికారి రైతులకు అండుబాటులో వుండాలని, వారు చెప్పిన సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో నిర్వహించవలసిన ఉమ్మడి కార్యక్రమం రైతు చైతన్య యాత్రలని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీ ఐ.రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. రైతు చైతన్య యాత్రలలో చేపడుతున్న కార్యక్రమాల గురించి కలెక్టర్‌ కు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాౖయ, సశుసంవర్ధక, మత్స్య, అటవీ, పట్టు పరిశ్రమ, ఉద్యానవన శాఖలు ముద్రించిన కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం రైతు చైతన్య యాత్రలను కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ దామోదర నాయుడు, మత్స్య శాఖ ఉప సంచాలకులు బసవరాజు, డివిజనల్‌ అటవీ శాఖాధికారి శ్రీనివాస శాస్త్రి, పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు సులేమాన్‌ బాషా, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు మధుసూధన రెడ్డి, పద్మావతి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

రైతు దిగుబడి పెంచడమే యాత్రల లక్ష్యం


విజయనగరం: దిగుబడి, ఇతర ఆదాయ మార్గాల ద్వారా రైతు ఆదాయాన్ని పెంచేందుకు రైతు చైతన్య యాత్రలు చేపట్టామని విజయనగరం జిల్లా కలక్టర్ జి.రామనారాయణరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం కలక్టరు క్యాంప్‌ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు చైతన్య యాత్ర జీపును కలక్టర్ ప్రారంభించారు. మే 17 నుంచి జూన్‌ 2వ తేది వరకు జిల్లాలో రోజుకి రెండు, మూడు పంచాయితీల్లో రైతు చైతన్య యాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు.

రైతు చైతన్య యాత్రలు ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి 10.30 గంటల వరకు మరల 11 గంటల నుండి 1 గంట వరకు గ్రామ పంచాయితీల్లో నిర్వహిస్తారన్నారు. మే, జూన్‌ నెలల్లో రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ నందు పంటల దిగుబడి, అభివృద్ది పెంచేందుకు ఆధునిక విషయాలు, రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు చైతన్య యాత్రలు దోహదపడతాయన్నారు. వ్యవసాయ శాఖ మాత్రమే కాకుండా వ్యవసాయ అనుబంధ శాఖలు ఉద్యాన, పశుసంవర్థక, పట్టు పరిశ్రమలు, మత్య్సశాఖ, మార్కింటింగ్‌, ఎ.పి.సీడ్సు, ఇరిగేషన్‌, షుగర్సు, జలయాజమాన్య సంస్థ, ఐ.కె.పి., ఎ.పి.యం .ఐ.పి., వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్తలు, ఉపాధి హామీ, ఆగ్రోస్‌, పంచాయితీరాజ్‌, ట్రాన్సుకో,అటవీ శాఖ, వ్యవసాయ రీసెర్స్‌ సెంటరు వంటి శాఖలు అన్నియును రైతు చైతన్య యాత్రలో పాల్గొంటాయని ఆయా శాఖల ద్వారా రైతులకు అనుబంద శాఖల ద్వారా సూచనలు, సలహాలు అందజేస్తారన్నారు.

ఆధునిక వ్యవసాయ ద్వారా అధిక దిగుబడులు పెంచే దశగా కొత్త వ్యవసాయ దారులకు ఋణాలు కల్పన, కౌవుల భూము దారులకు జాయింట్‌ లైయబులిటితో ఋణాలు అందజేయటం వంటి విషయాలపై అవగాహన కల్పించడం ముఖ్యోద్దేశ్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల రైతుల ఆదాయాల వృద్ది చేసేందుకు, రైతు చైతన్య యాత్రలతో యితర ఆదాయ మార్గాలు అవలంబనతో దిగుబడులు పెంచడం ప్రతీ గ్రామంలో అవగాహన కల్పించాలన్నారు. అన్ని శాఖల సమన్యయంతో రైతు చైతన్య యాత్రలు కార్యక్రమం చేపట్టడమైనదని కలక్టరు అన్నారు.

అనుబంద శాఖలు కరపత్రములు, గోడపత్రికలు రైతులకు తెలిసే విధంగా ముద్రించడమైనదని అన్ని పంచాయితీలకు సరఫరా చేస్తున్నామన్నారు. అనంతరం వ్యవసాయ సమాచారం, సలహాలు అందించేందుకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు టోల్‌ ఫ్రీ నెంబరు 1551/ 1100 కూడ ఏర్పాటు చేయడమైనదని దీనికి సంబంధించి స్టిక్కర్లను కూడ కలక్టరు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టరు అశోక పురోహిత్‌, పశుసంవర్థక శాఖ జాయింట్‌ డైరెక్టరు సయ్యద్‌ అబ్దుల్‌ వాసీ, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు లక్ష్మణరావు, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు పి.ఎన్‌.వి. లక్ష్మీనారాయణ, పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు డా. ఎన్‌. కోటేశ్వరరావు, ఉపాధి హామీ పధకం అదనపు ప్రోగ్రాం అధికారి ఒ. రంగరావు, ఎ.పి. సీడ్స్‌ కార్పొరేషన్‌, ఆగ్రోస్‌, మార్కిటింగ్‌ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అన్ని గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు


మహబూబ్‌నగర్‌: వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాలలో రైతు చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ యం.పురుషోత్తం రెడ్డి తెలిపారు. రైతు చైతన్య యాత్రలలో వ్యవసాయాధికారులతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఒక వ్యవసాయ శాస్త్రవేత్త కూడా గ్రామాలను సందర్శించి రైతులను చైతన్య పరుస్తారని అన్నారు. ఈ సదస్సులలో ప్రసంగాలు లేకుండా గ్రామ రైతులు వేసుకుంటున్న పంటలు, వారి భూముల స్వభావము, వేసుకోవలసిన పంటలు, వాటికి వాడవలసిన రసాయనిక ఎరువులు వాడకం గురించి వివరించడం జరుగుతుందన్నారు.

వచ్చే ఖరీఫ్‌లో రైతులు వారి భూముల స్వభావము గుర్తించి అవసరమైన పంటలు వేసుకొని అధిక దిగుబడి సాధించడానికి వీలుగా ఈచైతన్య యాత్రలు దోహదపడతాయన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు ఉద్యానవనం, మత్స్యశాఖ, పశుసంవర్దక శాఖ, పట్టుపరిశ్రమ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు పాల్గోని రైతులకు చైతన్యపరుస్తారని అన్నారు. ఈ ఖరీఫ్‌లో మండలాల వారిగా గ్రామాల వారిగా అవసరమైన విత్తనాలు, రసాయనిక ఎరువులు ముందుస్తుగానే నిలువ చేసి వుంచనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. వచ్చే ఖరీఫ్‌లో రైతులు అనుసరించవలసిన మెళకువలు ఈ యాత్రలలో తెలియజేయడం జరుగుతుందన్నారు.

దాంతో పాటు రైతులకు రాయితీపై అందించనున్న పనిముట్ల గురించి అవగాహన కల్పించబడునని చెప్పారు. మండల వారిగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సారి క్యాట్‌ ఫిష్‌ పెంపకం ప్రాంతాలలో కూడా అధికారులు సందర్శించి క్యాట్‌ ఫిష్‌ పెంపకం నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవడానికి ఆదేశించడం జరిగిందని కలెక్టర్‌ చెప్పారు. గత ఖరీఫ్‌లో తీవ్ర కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం వారి అకౌంట్లలో జమ చేయబడునని కలెక్టర్‌ వెల్లడించారు.

రైతు చైతన్య సదస్సులలో అధికార బృందాలు సందర్శించే రోజు, సమయం, ముందుగానే ఆయా గ్రామాలలో ప్రచారం ద్వారా తెలియపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ రైతు చైతన్య యాత్రలలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని వినూత్న వ్యవసాయ విధానాలను అవగాహన పరచుకోవాలని కలెక్టర్‌ కోరారు. ఇటీవల వడగండ్ల వానకు జరిగిన పంట నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి పరిహారం మంజూరుకై ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని ఆయన తెలిపారు.

ఈ వసూవేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వినయ్‌ చంద్‌ పాల్గొన్నారు.