చంద్రబాబుపై దాడి ప్రభుత్వ వైఫల్యమే: ప్రరాపా


హైదరాబాద్‌: ప్రతిపక్షనేత చంద్రబాబుపై జరిగిన దాడి కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజారాజ్యం పార్టీ పేర్కొంది. ఎవరు ఎక్కడికైనా వెళ్లి తమ అభిప్రాయాలను వెల్లడించుకునే స్వేచ్ఛ ఉందని దానిని అడ్డుకోవడం తెరాసకు తగదని ఆపార్టీ అధికార ప్రతినిధిగౌతం విమర్శించారు. విద్యార్థులను రెచ్చగొట్టి భావోద్వేగాలతో రాజకీయాలు చేయాలనుకోవడం కేసీఆర్‌కు సరికాదన్నారు. పరిస్థితులను నియంత్రించడంలో పోలీసులు కూడా వైఫల్యం చెందారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడానికి హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు

Advertisements

వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయం: సీఎం


హైదరాబాద్‌: వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయమని ముఖ్యమంత్రి రోశయ్య స్పష్టం చేశారు. ఎరువుల సమస్యపై సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. రాజకీయ పార్టీలు రైతులను అడ్డం పెట్టుకుని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సబబుకాదన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 11.73లక్షల టన్నుల యూరియా, 5.80లక్షల టన్నుల డీఏపీ సరఫరా చేసినట్లు వెల్లడించారు. సంవత్సరాంతానికి 15లక్షల టన్నులకు పైగా యూరియా ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన


హైదరాబాద్‌: తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే తామే ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేస్తామని అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) హెచ్చరించింది. తెలంగాణకు నిజాం నిరంకుశ పరిపాలన నుంచి విముక్తి లభించిన రోజైన సెప్టెంబరు 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కాచిగూడ నుంచి నారాయణగూడ వరకూ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అధికారికంగా ఉత్సవాలు నిర్వహించేలా చేయాలని డిమాండ్‌ చేశారు.

శ్రీకాకుళం జిల్లా ప్రయోగశాల కాదు: చిరంజీవి


శ్రీకాకుళం: ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి విచ్చలవిడిగా థర్మల్‌ ప్రాజెక్టులు కట్టడానికి శ్రీకాకుళం జిల్లా ప్రయోగశాల కాదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు.పేదలకు కాలుష్యాన్ని, పెద్దలకు కోట్లు తెచ్చిపెట్టే ఈప్రాజెక్టులను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో చిరంజీవి ప్రజాచైతన్యయాత్రను ప్రారంభించారు. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే ప్రజా చైతన్యయాత్ర లక్ష్యమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలతో ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని ఆరోపించారు.

ఎలాంటి ప్రాంతీయ అభిమానాలు లేవు: సీఎం


హైదరాబాద్‌: ముఖ్యమంత్రిగా తనకు ఎలాంటి ప్రాంతీయ అభిమానాలు లేవని సీఎం రోశయ్య స్పష్టం చేశారు. ఫిక్కి జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ … శ్రీకృష్ణ కమిటీ నివేదికకు అందరూ కట్టుబడాల్సిన అవసరముందన్నారు.ప్రాంతీయ ఉద్యమాలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తున్నాయన్నారు. ఉద్యమాల కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కంపెనీలు భయపడుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లాంటి అభివృద్ధి చెందిన నగరాల్లో ఇలాంటి వాతావరణం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ప్రభుత్వం తరుపున పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని తెలిపారు.

సంగం డెయిరీ తెదేపా ఛైర్మన్‌ అభ్యర్థిగా నరేంద్ర


గుంటూరు: సంగం డెయిరీ తెదేపా ఛైర్మన్‌ అభ్యర్థిగా పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర పేరును ఆపార్టీ ఖరారు చేసింది. రెబల్‌ అభ్యర్థిగా మారుతీ ప్రసాద్‌ బరిలో దిగనున్నట్లు సమాచారం. సంఘం డెయిరీ అధ్యక్ష పదవికి ప్రస్తుత ఛైర్మన్‌తో పాటు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈనెల 23న ఛైర్మన్‌, ముగ్గురు డైరెక్టర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

విధులు బహిష్కరించిన న్యాయవాదులు


హైదరాబాద్‌: సికింద్రాబాద్‌, నాంపల్లి కోర్టుల్లో మంగళవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. హైకోర్టు నియామకాల్లో 42శాతం తెలంగాణ వారికి కేటాయించాలని కోరుతూ న్యాయవాదులు నిరసన చేపట్టారు.