పర్యాటకరంగంపై సీఎం సమీక్ష


హైదరాబాద్‌: పర్యాటక రంగంపై ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రోశయ్య సమీక్షించారు. రాష్ట్రంలో కొత్త పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉద్యోగాలు సృష్టించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దేశంలోని వివిధ నగరాలతో పాటు విదేశాల్లో రాష్ట్ర పర్యాటక రంగంపై ప్రదర్శనలకు అనుమతిచ్చారు. జిల్లాల్లోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి గృహాలను బడ్జెట్‌ హోటళ్లుగా మార్చే అంళాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రపంచ పర్యాటక చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా భవిష్యత్‌లో 1500కోట్ల పెట్టుబడులు సమీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

Advertisements

వట్టేపల్లిని తాకిన అల్లర్లు


హైదరాబాద్‌: ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలు రాజేంద్రనగర్‌ పరిధి వట్టేపల్లిని తాకాయి. రెండు వర్గాలకు చెందిన వారు వేలాదిగా వేర్వేరు గ్రూపులుగా గుమిగూడారు. ఓ వర్గం వారు జరిపిన దాడిలో పలువురు విలేకరులు గాయపడ్డారు. గొడవలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు హైరానా పడుతున్నారు. పాతబస్తీలో అల్లర్లపై భాజపా, ఎంఐఎంలు వేర్వేరుగా నగర పోలీసు కమిషనర్‌ ఎ.కె.ఖాన్‌కు ఫిర్యాదు చేశాయి. ఓ ఆలయం వద్ద జెండాల ఏర్పాటు విషయమై చెలరేగిన వివాదంలో ఓ వర్గంపై మరో వర్గం వారు దాడి చేశారని.. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కమిషనర్‌ను కోరారు. ఈ వ్యవహారంలో పోలీసులు ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 30న హనుమాన్‌ జయంతి ప్రశాంతంగా జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు కమిషనర్‌ను కోరారు. ఎంఐఎం నేతలు కూడా కమిషనర్‌ను కలిసి ఘటనకు సంబంధించి చర్చించారు.

కోనేరుకు సీఎం ఘన నివాళి


విజయవాడ: రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా కోనేరు రంగారావు తిరుగులేని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రోశయ్య కోనేరు సేవలను కొనియాడారు. కృష్ణాజిల్లా గూడవల్లిలో మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు సంస్మరణ సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ముఖ్యమంత్రి దివంగత నేతకు ఘన నివాళులు అర్పించారు. పేదలకు ఉపయోగపడే ఆలోచనలు చేయడంలో రంగారావు అందరికంటే ముందుండేవారని, తామిద్దరం మంచి స్నేహితులమని సీఎం గుర్తు చేసుకున్నారు. స్వగ్రామం గూడవల్లి అభివృద్ధిలో కోనేరు అమిత శ్రద్ధ కనబరిచేవారన్నారు. దివంగత నేతతో తనకున్న అనుభవాలను మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్ధనరెడ్డి గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య రావడానికి ముందే కడప ఎంపీ జగన్మోహనరెడ్డి కోనేరుకు శ్రద్ధాంజలి ఘటించి వెళ్లిపోయారు.

ప్రధాన సమస్యలపై నిరసనలు: తెదేపా


హైదరాబాద్‌: శాసనసభ వేదికగా చర్చించలేకపోయిన ప్రధాన సమస్యలపై నిరసనలు చేపట్టడం ద్వారా ప్రజలకు మరింత దగ్గర కావాలని తేదేపా అధిష్ఠానం యోచిస్తోంది. నాలుగు నెలల విరామం అనంతరం సమావేశమైన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో శ్రేణులను దిశానిర్దేశం చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్రంలో ఏప్రిల్‌ ఒకటో తేదీన ప్రారంభమమ్యే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని పార్టీ అధినేత చంద్రబాబు పొలిట్‌బ్యూరో సభ్యులను ఆదేశించారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వాడవాడలా పసుపు పండగ ఘనంగా నిర్వహించాలని సూచించారు. శాసనసభ సమావేశాల కారణంగా రాజధానిలో పార్టీ ఎమ్మెల్యేలు ఉండిపోవడంతో మిగతా నాయకత్వం వ్యవస్థాపక దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని చంద్రబాబు కోరారు.

ఏడు భారతీయ నౌకల హైజాక్‌?


అహ్మదాబాద్‌: ఏడు భారతీయ నౌకలను సోమాలియా సముద్ర దొంగలు హైజాక్‌ చేసినట్లు తెలిసింది. గల్ఫాఫ్‌ ఏడెన్‌లో గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన నౌకలను అపహరించినట్లు సమాచారం. నరనారాయణ్‌, సీక్వీన్‌, ఒస్మానీ, కాదేరీ, అల్‌ ఎజాజ్‌, కళ్యాణ్‌, కృష్ణజ్యోత్‌ నౌకలు హైజాక్‌ అయ్యాయని అధికారులు గుర్తించారు. ఏడు భారతీయ నౌకల్లో 105 మంది నావికాదళ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. దొంగల చెర నుంచి వారిని రక్షించేందుకు నావికాదళ అధికారులు రంగంలోకి దిగారు.

శ్రీకాకుళంలో త్రీజీ సేవలు ప్రారంభం


శ్రీకాకుళం: బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రవేశపెట్టిన త్రీజీ సేవలను శ్రీకాకుళంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలో బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మానతో పాటు ఎంపీ డాక్టర్‌ కిల్లి కృపారాణి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠం, టెలికం జిల్లా మేనేజర్‌ కృష్ణశర్మ పాల్గొన్నారు. తొలుత త్రీజీ ఫోన్ల ద్వారా మంత్రి ధర్మాన, ఎంపీ కృపారాణి పరస్పరం సంభాషించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఈ సేవలు ఓ తార్కాణమని ధర్మాన ఈ సందర్భంగా కితాబిచ్చారు. ప్రైవేటు సంస్థలకు ధీటుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నాణ్యమైన సేవలందిస్తోందని ప్రశంసించారు.

‘నిట్‌’లో విచారణ ప్రారంభం


వరంగల్‌: వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (నిట్‌)లో అక్రమాలపై విద్యార్థులు చేసిన ఆందోళనలపై ప్రభుత్వం స్పందించింది. నిట్‌ ఛైర్మన్‌ దీక్షితులు విచారణను ప్రారంభించారు. ప్రస్తుత డైరెక్టర్‌ వైవీ రావు విద్యాసంస్థలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ విద్యార్థులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. డైరెక్టర్‌ రాజీనామా చేయాలని పట్టుబట్టి ఆయన చేత రాజీనామా చేయించారు. అయితే డైరెక్టర్‌ మాట మార్చడం వల్ల విద్యార్థులు ఢిల్లీకి వెళ్లి కేంద్రమానవ వనరుల మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నిట్‌ ఛైర్మన్‌ దీక్షితులు వరంగల్‌ విచ్చేసి విచారణ ప్రారంభించారు.