రబీ సీజన్‌లో విత్తనాలకు 50 శాతం సబ్సిడీ


హైదరాబాద్: రబీ సీజన్‌లో రైతుకు కావాల్సిన ప్రతి విత్తనాన్ని 50 శాతం సబ్సిడీతో ఇస్తామని వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో సిఎం రోశయ్య అధ్యక్షతన రబీ సీజన్‌పై సమీక్షా సమావేశం జరిగింది. రబీకి అవసరమైన విత్తనాల్లో ఐదు లక్షల క్వింటాళ్లు ఇప్పటికే పంపించామని, మరో 8 లక్షల క్వింటాళ్లు మండల కేంద్రాల్లో సిద్థంగా ఉంచామని రఘువీరా తెలిపారు. ఆహార భద్రత దృష్ట్యా రబీ వరి సాగు ఎక్కువగా చేయాల్సిందిగా రైతులకు సూచించారు. ఈ రబీ సీజన్‌లో 43 లక్షలు 65 వేల 103 హెక్టార్లలో నీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.

‘ఇస్రో’ బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్‌


హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా నిమితులైన రాధాకృష్ణన్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గత చైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ స్థానంలో నిమితులైన రాధాకృష్ణన్‌ 35 సంవత్సరాలుగా భారత అంతరిక్ష పరిశోధన రంగంలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. ఇంతకు ముందు ఆయన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌కు డైరెక్టర్‌గా పని చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో నేనీ బాధ్యతలు చేపట్టాను. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు.

తెరాస పోటీ చేయాలి: తలసాని


హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఫ్రీజోన్‌ వంటి పెద్ద అంశాన్ని తీసుకుని పోరాటం చేస్తూ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెరాస అనుకోవడం విడ్డూరమని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పోటీ చేస్తే తెరాసకు సహకారం ఎంత లభిస్తుందో తెలుస్తుందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీగా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం విడ్డూరమని ఆయన అన్నారు. తెరాస గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనేది తన విజ్ఞప్తి కాకుండా డిమాండ్‌ కూడా అని ఆయన అన్నారు. ఎవరి బలమెంతో తెలుసుకోవాలంటే కూడా తెరాస పోటీ చేయాలని ఆయన అన్నారు.

ఇందిరాగాంధీకి నివాళులర్పించిన సిఎం


హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్య శనివారం గాంధీభవన్‌లో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పగుచ్చములుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల అభ్యున్నతికోసం కృషి చేసిన మహా నాయకురాలు ఇందిరాగాంధీ అని రోశయ్య పేర్కొన్నారు. దేశం కోసమే ప్రాణాలు త్యాగం చేశారని అన్నారు. అలాంటి త్యాగమూర్తిని ఈరోజు మనం స్మరించుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

110 డివిజన్లలో ‘రాజ్యం’ పోటీ


హైదరాబాద్: రాబోయే గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు సంబంధించి ప్రజారాజ్యం పార్టీ ఒక ప్రకటన వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత హరిరామ జోగయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తాము 110 పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తమకు 40 డివిజన్లలో గెలుపు గుర్రాలున్నాయని, వీటిలో తమకు 20 నుంచి 30 స్థానాలు వచ్చినా కార్పొరేషన్‌ను ఆటాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనేక పార్టీలు పోటీ పడుతున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి 50కి మించి సీట్లు లభించే అవకాశాలే లేవన్నారు. పొత్తుల కోసం కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల నుంచి మంచి సంకేతాలు అందుతున్నాయని జోగయ్య వెల్లడించారు.

మజ్లీస్‌తో పొత్తు ఆలోచన లేదు: డిఎస్‌


హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మజ్లీస్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచనగానీ, ఆ ఆలోచన గానీ లేదని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు. మజ్లీస్‌పై మీకు అంత ప్రేమ పెరిగిందేమిటని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. తాము గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మొత్తం 150 డివిజన్లలో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో 70 శాతం సీట్ల గెలుపే ధ్యేయంగా పని చేస్తామని ఆయన అన్నారు. ప్రచారం పెద్దగా ఉండదని, ప్రచారంపై విజయం ఆధారపడి ఉండదని, అభ్యర్థుల ఎంపికను బట్టే విజయం ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో జయాపజయాలకు తానో, ముఖ్యమంత్రి ఎవరో ఒక్కరం బాధ్యత వహించబోమని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలుపు అందరి బాధ్యత అని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ, లోకసభ ఎన్నికల్లో పెద్ద మనిషిగా కాంగ్రెస్‌ పార్టీ ఓడినా గెలిచినా తనదే బాధ్యత అని దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారని, పరిస్థితి అలా ఉండదని ఆయన అన్నారు. మజ్లీస్‌ ఎన్ని స్థానాలకు పోటీ చేసినా తమకు సంబంధం లేదని ఆయన అన్నారు.

శ్రీవారి ఆశీస్సులతో.. కల్యాణమస్తు


తిరుపతి: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం శ్రీవారి ఆశీస్సులతో జరుగుతున్న కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 7802 జంటలు ఒక్కరి కానున్నాయి. ఈ కార్యక్రమానికి గత ఏడాదికంటే అధికంగా స్పందన వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శేషారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకూ 27 వేల పెళ్ళిళ్లు నిర్వహించామన్నారు. ఐదవ విడత కళ్యాణమస్తు కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని జిల్లాల కేంద్రాలకు తాళిబొట్లు, మెట్టెలు, బట్టలు, పుస్తక ప్రసాదం, వివాహ ధృవీకరణ పత్రాలు ఉచిత దర్శనం పాసులఉరి పంపామన్నారు. బుధవారం ఉదయం 9.20 నుండి 9.32 గంటల మధ్య ముహAర్తంగా నిర్ణయించారు. కళ్యాణమస్తులో మొదటి విడతగా 5వేలు, రెండవ విడత 8 వేలు, మూడు విడత 6 వేలు, నాలుగవ విడత 7 వేల మందికి వివాహాలయ్యాయి.

సక్సెస్‌ పథకంకు పలు అడ్డంకులు


కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన సక్సెస్‌ పాఠశాలల పథకం కొండెక్కేలా ఉంది. ప్రారంభించినా రెండవ యేటే చతికిన పడే సూచనలు కనబడడంతో ప్రభుత్వం శాస్త్రీయ సర్వేకు నడుం బిగించింది. ఇందుకు సంబంధించి అందరి అభిప్రాయాలను సేకరించి, క్రోడీకరించి సక్సెస్‌కు వచ్చిన మార్కుల ఆధారంగా కొనసాగించాలా వద్దా అని నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అన్ని జిల్లాలో వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. గ్రామీణులకు సైతం పూర్తి స్థాయి ఇంగ్లీష్‌ మీడియం హైస్కూళ్లను అందుబాటులోకి తేవాలని 2008 – 09 విద్యా సంవత్సరంలో సక్సెస్‌కు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 312 సక్సెస్‌ స్కూళ్ళను దాదాపు 23 వేల మంది విద్యార్థులు 6, 7 తరగతుల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లీష్‌ మాధ్యమంపై సమాన్య జనానికి కూడా మోజు పెరగడం, ప్రైవేటు స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో జన బహAళ్యం కోరుకుంటున్న తరహాలో సక్సెస్‌ను ప్రవేశపెట్టిన ఆశించిన ఫలితాలు లభించలేదు. సక్సెస్‌లో సిబిఎస్‌ఇ సిలబస్‌ ప్రవేశపెట్టడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్న వాదన కూడా ఉంది. పైగా సిలబస్‌కు తగినట్లు ఉపాధ్యాయులకు ముందుగా శిక్షణ లేకపోవడం, సాధారణ ఉపాధ్యాయులనే సక్సెస్‌ తరగతుల బోధనకు ఉపయోగించడం పెద్ద లోటుగా కనిపిస్తోంది. స్టేట్‌ సిలబస్‌లోని ఇంగ్లీష్‌ మీడియంకు, సెంట్రల్‌ సిలబస్‌లోని ఇంగ్లీష్‌ మీడియంకు చాలా వ్యత్యాసం ఉండడంతో పాఠాలు చెబడానికి పిజి చదివిన ఉపాధ్యాయులే మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా డైట్‌ నేతృత్వంలో 8 మంది లెక్చరర్ల బృందం అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. అలాగే ఉపాధ్యాయ సంఘాలు పథకం ప్రారంభం నుండి వ్యతిరేకిస్తుంటే ఇతర మేధావులు, నిఫుణులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించే పనిలో బృందం సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో చేరికను పెంచేందుకు, డ్రాప్‌ ఔట్ల సంఖ్యను తగ్గించేందుకు, ఇంగ్లీష్‌ మధ్యయం రహదారి కాగలదనుకున్న ప్రభుత్వం మొత్తం పథకాన్ని డ్రాప్‌ ఔట్‌ చేసుకునే బాటలో ఉన్నట్లు పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సర్వే సక్సెస్‌ పథకం ప్రారంభించే ముందు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం విద్యాశాఖలో, ఉపాధ్యాయుల్లో వినిపిస్తోంది.

జీతం 20 రూపాయలే!


రూపాయి విలువ పడిపోయిన ఈ రోజుల్లో 20 రూపాయలకు ఏం వస్తుంది… మార్కెట్ లో ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు కూడా రావు. కూరగాయలు సరేసరి.. మహా అయితే గీచిగీచి బేరం ఆడితే… ఓ రకమైన అరటి పళ్ళు డజను లేదంటే పది పళ్ళు మాత్రమే వస్తాయి. కానీ రాజస్థాన్ లోని బలపుర గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాలలో జగదీష్ శర్మ నెలవేతనం మాత్రం అక్షరాలా 20 రూపాయలే! అదీ ఎప్పటి నుంచో తెలుసా! 1986 నుంచి… అంటే 23 ఏళ్ళుగా అతను ఈ మొత్తమే నెలవారీ జీతంగా జీవితాన్ని గడిపాడు!

రాజస్థాన్ ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక వేతనంపై ఫ్యూన్ గా పనిచేస్తున్న పాఠశాల ప్రారంభం, ముగింపు సమయాల్లో గంట మోగిస్తాడు. ఎప్పటికప్పుడు తన వేతనం పెంచాలని జగదీష్ ఎందరికి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. నిరక్షరాస్యుడైన ఈ పేదవాడి మొర ఎవరు గుండెల్నీ 23 ఏళ్ళుగా కరిగించలేదు. ‘నేను పాఠశాలను శుభ్రం చేస్తాను. గంట కొడతాను. జీతం పెంచుతారని ఆశపడ్డాను. నాబోటి పేదవాడిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’ అని జగదీష్ ఆవేదన చెందాడు. వేతనాల పట్టీలో నీళ్ళు తెచ్చే పనివాడుగా జగదీష్ ను పేర్కొన్నారు.

కానీ… అవసరమైనప్పుడు వంట పాత్రలను కూడా అతనే తోమేసేవాడు. ఆయన ఎంత అంకిత భావంతో పనిచేసినా వేతనం పెరిగే దారి కనిపించలేదు. పాఠశాల ప్రిన్సిపాల్ రాంప్రకాష్ బైరా మాట్లాడుతూ, ‘ఆయన 20 ఏళ్ళుగా 20 రూపాయల వేతనానికి పనిచేస్తున్నాడు. కానీ ప్రభుత్వ రికార్డుల్లో అతని పేరు తీసేశారు’ అని చెప్పారు. 23 ఏళ్ళపాటు నెలకి 20 రూపాయాలు మాత్రమే చెల్లించి… ఇప్పుడు ఉద్యోగంలో నుంచి తీసివేయడంతో… జగదీష్ కోర్టు కెక్కాడు. ఈ కేసులో ఒక నిర్ణయానికి వచ్చే వరకూ ఉద్యోగం నుంచి తొలగించవద్దని కోర్టు ఆదేశించింది. అన్నట్టు… తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగాన్ని పదేళ్ళు చేసిన వారిని ఇటీవలే గెహ్లాట్ ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. కానీ… జగదీష్ కు మాత్రం మోక్షం కలుగలేదు.

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం: యనమల


కాకినాడ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని తెలుగుదేశం పార్టీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా పార్టీ కార్యాలయంలో కాకినాడ సిటి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా యనమల మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ధనార్జనే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసమస్యలపై పోరాడేది టిడిపి మాత్రమేనని అన్నారు. స్థానిక సమస్యలపై విస్తృత పోరుకు సిద్ధం కావాలని అన్నారు. మాజీ మంత్రి సిహెచ్‌ రామచంద్రరావు మాట్లాడుతూ నవంబర్‌ 16 నుంచి జరగబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించాలని అన్నారు. త్వరలోనే బూత్‌ ఇన్‌ఛార్జులను నియమిస్తున్నట్లు తెలిపారు. త్రిసభ్య కమిటీ సభ్యులు కొల్లు రవీంద్ర, కల్పన, నాయకులు సత్య, జి.బాబ్జి, రమణరాజు, బి.కృష్ణమోహన్‌, ఎం.ఎ.తాజుద్దీన్‌, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.