డీఎస్సీ ఫలితాలు విడుదల


హైదరాబాద్‌: డీఎస్పీ ఫలితాలు విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఈ రోజు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 52,675 పోస్టులకు గాను, 5,47,220 మంది పరీక్ష రాశారని అన్నారు. మొత్తం 93 తప్పుడు ప్రశ్నలకు గాను అర మార్కు కలుపుతున్నట్లు చెప్పారు. వచ్చే నెలాఖరులో నియామకాలు ఉండవచ్చు. ఈ ఫలితాలను http://www.suryaa.com, http://www.manabadi.com, http://www.schools9.com, deccanpost.com లో చూడవచ్చు.

Advertisements

2014 నాటికి సమగ్రాభివృద్ధి: వైఎస్‌


హైదరాబాద్‌: 2014 నాటికి మురికివాడల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారులను సూచించారు. మున్సిపల్‌ శాఖాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి మున్సిపాల్టీలో రెండు, మూడు గంటలు మంచినీటిని అందిస్తున్నామని, 2011 నాటికి 24 గంటలు నీటిని అందించేందుకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. అలాగే 166 జీవోలో మార్పులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ప్రజా భద్రత, రక్షణ కోసం సలహాసంఘం


హైదరాబాద్‌: ప్రజా భద్రత, రక్షణ కోసం సలహా సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. దీనికి చైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, కో డైరెక్టర్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి, డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్‌లు వ్యవహరిస్తారు. సభ్యులుగా హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీపీ, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీపీ, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌లు ఉంటారు.

వరుణయాగం ఫలితాలనిస్తోంది : గాదె


హైదరాబాద్: రాష్టవ్య్రాప్తంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వరుణయాగం సత్ఫలితాలను ఇస్తోందని ఆ శాఖ మంత్రి గాదె వెంకట్‌ రెడ్డి తెలిపారు. సికింద్రాబాదులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి వరుణ యాగం, సహస్రాభిషేకం నిర్వహించారు. వరుణ యాగం వల్ల గత ఐదేళ్లలో విస్తారంగా వర్షాలు కురిసాయని మంత్రి అభిప్రాయ పడ్డారు. జూలై 2 నుంచి మూడు రోజుల పాటు టీటీడీ ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

గ్రేటర్‌ ఎన్నికలపై పీసీసీ కసరత్తు


హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు ప్రారంభించింది. గాంధీ భవన్‌లో జరగుతున్న కాంగ్రెస్‌ పార్టీ సమీక్ష సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌, డీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌లతో చర్చించారు. పార్టీ గెలుపునకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.అనంతరం వీరప్పమొయిలీ మాట్లాడుతూ గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పొత్తుల నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు.

మాయావతికి సుప్రీంకోర్టు నోటీసులు


లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో ఇబ్బడి ముబ్బడిగా విగ్రహాల ఏర్పాటు వివాదస్పదంగా మారింది. నగరంలో ప్రతీ గల్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి, బడుగు నేత కాన్షీరాం విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే వీటి ఏర్పాటులో అవకతవకలు జరిగినట్లు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు యూపీ సిఎం మాయావతికి నోటీసులు పంపింది. నెలరోజుల్లో ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం


కరీంనగర్‌: ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు డిగ్రీ చదువుతున్న విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేశారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం ఉల్లంపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్రవంతి, సుమతి, భవాని అనే ముగ్గురు విద్యార్థినులు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీన్ని గమనించిన స్థానికులు వీరిని ఆసుపత్రికి తరలించారు. అందులో సుమతి పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమ వ్యవహరమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. దీనిపెై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.