రైలు ఢీకొని 6 ఏనుగులు, ఒక వ్యక్తి మృతి


భువనేశ్వర్‌: ఒడిషాలోని గంజాం జిల్లాలో ఆదివారం రైలు ఢీకొని ఆరు ఏనుగులు, ఒక వ్యక్తి చనిపోయారు. హౌరానుంచి చెన్నై వెళుతున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రంభ, గూమా స్టేషన్‌లమధ్య ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏనుగులగుంపు రైలుపట్టాలను దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, పొగమంచు కారణంగా డ్రైవర్‌లకు ఏనుగులు కనబడిఉండకపోవచ్చని బెర్హంపూర్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మిశ్రా చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన ఆరు ఏనుగులలో రెండు గున్న ఏనుగులుకూడా ఉన్నాయి. మరోవైపు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి రైలులో అటెండెంట్‌ అని తెలిసింది. అయితే అతను ఎలా చనిపోయాడనేది తెలియరాలేదు. ప్రమాదంకారణంగా రైలుకూడా దెబ్బతినడంతో అది అక్కడే కొంతకాలం నిలిచిపోవాల్సివచ్చింది. దీనితే కొన్నిగంటలపాటు బెర్హంపూర్‌, భువనేశ్వర్‌ స్టేషన్‌లమధ్య కొన్నిగంటలపాటు రైల్వే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రైలు సర్వీసులను పునరుద్ధరించడానికి ఎనిమిదిగంటల సమయం పట్టింది. ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారంగురించి ఇంతకుముందే రైల్వే అధికారులకు తెలియజేశామని అటవీశాఖ అధికారులు చెప్పారు.

Leave a comment