రెవెన్యూ కార్యాలయాల పనితీరుపై ఇక సమీక్ష


రంగారెడ్డి: మండల రెవెన్యూ కార్యాలయాల పనితీరును ఇకపై డివిజన్ల వారిగా సమీక్షించనున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టరు ఎమ్‌.దానకిషోర్‌ వెల్లడించారు. జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న తహసీల్దార్ల కార్యాలయాల పనితీరును ఆయా డివిజన్‌ హెడ్‌క్వార్టర్స్‌ లో రెవెన్యూ అధికారుల సమావేశాలు నిర్వహించి క్షుణ్ణంగా సమీక్షించడంతోపాటు ప్రభుత్వ భూములను ప్రత్యేకంగా తనిఖీ చేస్తామని అన్నారు. ఇందులో బాగంగా జూలై 8న చేవెళ్శ డివిజన్‌కు సంబంధించి ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత రెవెన్యూ అధికారుల సమావేశాన్ని నిర్వహిస్తామని, జూలై 9న డివిజన్‌లోని ప్రభుత్వ భూములను తానుగాని, జాయింట్‌ కలెక్టర్‌గాని తనిఖీ చేస్తారని తెలిపారు. తూర్పు డివిజన్‌ రెవెన్యూ అధికారుల సమావేశాన్ని జూలై 13న సంబంధిత ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహిస్తామని కలెక్టరు పేర్కొంటూ, ఆ డివిజన్‌లోని ప్రభుత్వ భూముల తనిఖీని జూలై 14న చేపట్టనున్నట్లు తెలిపారు. అదే విధంగా వికారాబాద్‌ లోని సబ్‌కలెక్టరు కార్యాలయంలో జూలై 16న రెవెన్యూ అధికారుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు , జూలై 17న ప్రభుత్వ భూములను తనిఖీ చేయనున్నట్లు కలెక్టరు తెలిపారు. ప్రభుత్వ భూముల సర్వే కూడా అత్యంత ముఖ్యమైన అంశమని, ఇకపై నెలలో ప్రతి రెండవ, నాలుగవ శనివారాల్లో ల్యాండ్‌ సర్వే అండ్‌ రికార్డుల కార్యాలయ పనితీరును సమీక్షించడంతో పాటు, ఆయా భూములను తనిఖీ చేస్తానని కలెక్టరు వెల్లడించారు. ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై మరింతగా నమ్మకాన్ని పెంచేందుకు వీలుగా ఇప్పటికే జిల్లా స్థాయిలో ఎన్నో సంస్కరణలకు రూపకల్పన చేశామని కలెక్టర్‌ తెలిపారు. గతంలో నిశ్చయించినట్లు ఎన్‌ఓసి ల ( నిరంభ్యతర పత్రాలు ) జూరీకై ఏర్పాటు చేసిన కమిటి ప్రతీ మొదటి, మూడవ శుక్రవారాల్లో సమావేశమై ఎన్‌ఓసిలు జారీ చేస్తున్నదని అన్నారు. ఇదేగాకుండా ఇళ్శ స్థలాలు , భూములకు సంబంధించిన మ్యుటేషన్‌ ఉత్తర్వులు , ప్రొసీడింగ్‌ లు , కోర్టు ఉత్తర్వులు , తహసీల్దార్ల నివేదికలను, ఎన్‌ఓసి లను జిల్లా వెబ్‌సైట్‌లో ఉంచుతామని ప్రస్తుతం తుది దశలో ఉన్న జిల్లా వెబ్‌సైట్‌ జూలై మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు ఉంచడం వల్ల అదికార యంత్రాంగం చేసే ప్రతీ పనిలో పారదర్శకత ఉండడంతోపాటు, అధికారుల్లో జవాబుదారితనం కూడా పెరుగుతుందని తాను భావిస్తున్నట్లు కలెక్టరు పేర్కొన్నారు.

Advertisements

ఆదిలాబాద్ జిల్లాలో 40 ఆరోగ్య శ్రీ శిబిరాలు


ఆదిలాబాద్: జులై నెలలో జిల్లా వ్యాప్తంగా 40 రాజీవ్‌ ఆరోగ్య హెల్త్‌ క్యాంపులను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ పి.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. 1వతేదీన కెరమెరి మండలం ధనోరాలో, తలమడుగు మండలం సకినాపూర్‌లో, కాగజ్‌నగర్‌ మండలం శివపురంలో, నిర్మల్‌ మండలం విశ్వనాధ్‌పేట, మందమర్రి పట్టణం 15వ వార్డులో, 2వ తేదీన మామడ మండలం బూరుగుపల్లి, నెన్నెల మండలం దమ్మిరెడ్డిపేట, తాంసి మండలం గోత్కూరి, జైనూర్‌ మండలం లెండిగూడ, 3న వేమనపల్లి మండలం బయ్యారం, దహేగాం మండలం గొర్రెగుట్ట, ఆదిలాబాదు పట్టణంలోని 5 వార్డు, 4న కుభీర్‌ మండలం వర్ని, 5న తాండూర్‌ మండలం అన్నారం, వాంకిడి మండలం కనర్గాం, ఉట్నూర్‌ మండలం కీపెర్‌గఢ్‌, ఇచ్చోడ మండలం చించోలి, ఇంద్రవెల్లి మండలం పిప్రి, రన, లక్షట్‌పేట ఎల్లారం, 9న చెన్నూర్‌ మండలం పొన్నారం, 11న కాసిపేట మండలం గట్రావుపల్లి, 17న జన్నారం మండలం దొంగపల్లి, 19న బైంసా మండలం తక్లి, 24న కౌఠాల మండలం చీపురుదుబ్బ, తానూర్‌ మండలం దౌలతాబాద్‌, ఆదిలాబాదు మండలం ఖానాపూర్‌, రెబ్బెన మండలం వంకులం, 26న ఖానాపూర్‌ మండలం ఇక్బల్‌పూర్‌, 28న ఉట్నూర్‌ మండలం కొత్త నర్సాపూర్‌, సారంగాపూర్‌ మండలం సారంగాపూర్‌, 29న జైనధ్‌ మండలం కేదర్‌ పూర్‌, 30న బెజ్జూర్‌ మండలం చిన్న సిద్దాపూర్‌, కడెం పెద్దూర్‌ మండలం చిట్యాల్‌, సిర్పూర్‌ (యు) మండలం దేవడ్పల్లి, కాగజ్‌నగర్‌ మండలం వల్లకొండ, ముధోల్‌ మండలం వడ్తాల్‌, 31న బేల మండలం జునోని, భీమిని మండలం కర్జి బీంపూర్‌, దిలావర్‌పూర్‌ మండలం లోలమ్‌, మంచిర్యాల పట్టణం 19 వ వార్డులో ఈ హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ప్రముఖ వైద్యశాలల ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హెల్త్‌ క్యాంపులలలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ సంస్థకు టోకరా


హైదరాబాద్‌: వ్యాపార సంస్థగా నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ప్రముఖ సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ సంస్థ నుంచి కనెక్షన్లు సంపాదించి, మూడు రోజుల్లో 30 లక్షల రూపాయల మేర బిల్లుచేసి బిచాణా ఎత్తేసిన ఒక ముఠా వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ కనెక్షన్ల ద్వారా వ్యక్తిగత వినియోగదారులకే కాకుండా చిన్న చిన్న కాల్‌ సెంటర్లకు కూడా అంతర్జాతీయ కాల్స్‌ చేసుకొనేందుకు అవకాశం కల్పించి భారీగా డబ్బులు దండుకున్నారు. బిల్లు గరిష్ఠ పరిమితి దాటగానే తప్పుకున్నారు. కొన్నాళ్లకు మరో వ్యాపార సంస్థగా నకిలీ ధ్రువపత్రాలతో అదే సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ సంస్థకు రెండోసారి టోకరా ఇవ్వబోయి దొరికిపోయారు.

ఈ ముఠా కాన్ఫరెన్స్‌ కాల్‌ పద్ధతిలో అవసరమైన వాళ్ల మధ్య అంతర్జాతీయ కాల్స్‌ కలుపుతూ లక్షలు వసూలుచేస్తోంది. విదేశాల్లో ఉన్నవారికీ, హైదరాబాద్‌లో ఉన్న వారికి ఇద్దరికీ ఇన్‌కమింగ్‌ కాల్సే కాబట్టి ఎవరికీ బిల్లు పడదు. అంతర్జాతీయ కాల్‌ మాట్లాడించినందుకు స్వదేశంలో ఖాతాదారుల నుంచి డబ్బు వసూలు చేస్తారు. ‘రన్‌కాబ్స్‌’ పేరుతో గులాం ముస్తఫా యజమానిగా ఓ నకిలీ సంస్థ స్థాపించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సమీపంలోని ఆరాంగఢ్‌ వద్ద షాప్‌ నెంబరు 1, ప్లాట్‌ నెంబరు 5లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ధ్రువపత్రాలన్నీ నకిలీవి సృష్టించారు. ప్రముఖ సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ సంస్థ నుంచి 42 సిమ్‌కార్డులు తీసుకున్నారు.

మామూలు ఖాతాదారులతోపాటు అంతర్జాతీయ కాల్స్‌చేసే కొన్ని కాల్‌సెంటర్లకు కూడా వీరు ‘సేవలు’ అందించారు. మూడు రోజుల వ్యవధిలో రూ.30 లక్షల విలువైన కాల్స్‌ చేశారు. ఇదే ముఠా ‘హల్లో కాల్‌ కాబ్స్‌’ పేరుతో రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లి వద్ద లాల్‌ధాబా రింగ్‌రోడ్డులో ఉన్న విజేత అపార్ట్‌మెంట్‌ చిరునామాతో నలభై సిమ్‌కార్డుల కోసం దరఖాస్తు చేసింది. మోసాన్ని గుర్తించిన సెల్‌ నెట్‌వర్క్‌ సంస్థ ప్రతినిధులు బేగంపేట పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటి వరకూ నలుగుర్ని అరెస్టు చేశారు. ఇద్దరు కీలక నిందితుల కోసం గాలిస్తున్నారు.

కలక్టర్ క్యాంప్‌ కార్యాలయానికి హంగులు


విజయనగరం: జిల్లా కలక్టరు కేంప్‌ కార్యాలయంపై నిర్మించిన సమావేశ మందిరంను జిల్లా కలక్టరు జి.రామనారాయణ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భరగా కలక్టరు మాట్లాడుతూ జిల్లా అధికారులందరికీ కలిపి సమావేశం ఏర్పాటు చేసేటప్పుడు ఇబ్బంది కలిగేదని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశ మందిరాన్ని నిర్మించ తలపెట్టామని తెలిపారు. జిల్లా అధికారుల సమావేశాలకు సౌఖ్యంగా వుంటుందని, అయితే మందిరాన్ని సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహారావు మాట్లాడుతూ ఈ సమావేశ మందిరం జిల్లా కలక్టరు గారు జిల్లాఅధికారులకు ఇచ్చిన బహుమతిగా అభివర్ణించారు. అవసరాల్ని గుర్తించి వెంటవెంటనే స్పందించడం రామనారాయణరెడ్డిగారి ప్రత్యేకతయని కితాబునిచ్చారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో అదనపు జె.సి ఎం.రామారావు, ఎ.పి.ఎం.ఐపి ప్రోజక్టు డైరెక్టరు ఐ.సత్యన్నారాయణ, కలక్టరేట్‌ సిబ్బంది, పలువురు తహసీల్దార్లు హాజరైనారు.

వలన రైతు కూలీలకు ఉపాధి హామీ


విజయనగరం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం వలన రైతుకూలీలకు ఉపాధి లభిస్తోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి వట్టి వంతకుమార్‌ అన్నారు. జిల్లా రాక సంబంధర్భంగా మంత్రి పూసపాటిరేగ మండలం గోవింధపురం గ్రామంలోని గీతా భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులు గర్వించదగిన రీతిలో సాగుతున్నాయని చెప్పారు. ఈ సంవత్సరం ఈ మూడు మాసాల కాలంలోనే సుమారు రూ. 165 కోట్ల పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇటీవల కాలంలో రోజూ సమారు 3.30 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున చిన్న నీటి పారుదల చెరువుల పనులు ఈ పధకం క్రింద చేయడం జరిగిందన్నారు. అందువలన ప్రతీ చెరువు నీటితో కళకళ లాడుతున్నాయన్నారు. పంట కాలువలను కూడ పునఃరుద్దరించుకోవడం జరిగిందన్నారు. యివేకాక రైతు కూలీలకు ఉపాధి కల్పస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అనేకమైన యితర కార్యక్రమాలను కూడ చేయడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా లింక్‌ రోడ్లు ఏర్పాటు తదితరమైనవి యిందులో వున్నాయన్నారు. విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా యన్నారు. వ్యవసాయ పరంగా వెనుకబడివుందన్నారు. కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌ సస్‌స్టైనబుల్‌ అగ్రికల్చర్‌ కార్యక్రమం చేబడుతున్నామన్నారు. షెడ్యూల్డ్‌ కులములు మరియు తెగలకు చెందిన మహిళా గ్రూపుల్లో మగవారిని కూడ చేర్చి ఫిక్‌స్డ్‌ చేయడం జరుగుతోందన్నారు. వారికి భూమి అభివృద్ది చేయడానికి ఉపాధి హామీ క్రింద పనులు యివ్వడం జరుగుతుందన్నారు. దీనితో పాటు బోర్లు, విద్యుత్‌ సౌకర్యాలు కూడ కల్పించబడతాయన్నారు. ఈ పధకంలో పనిచేసే కూలీల చెల్లింపులు, చెక్‌ మెజర్‌ మెంట్లు తదితరమైన విషయాలు ఫీల్డ్‌ అసిస్టెంట్లు చూడడం జరుగుతోందన్నారు. అయితే ప్రతీ 20 మంది కూలీలకు కలిపి ఒక మేస్త్రిని (మేట్‌) ఏర్పాటు చేస్తామని యితను కూలీలకు సంబంధించిన అన్ని విషయాలు చూడడం జరుగుతుందన్నారు. దీనికి ముందు మంత్రి కుమిలి గ్రామంలో గల మీసాలవాని చెరువుకు సంబంధించిన ఉపాధి హామీ పధకం పనులను తనిఖీ చేసారు. కూలీలతో ఈ సందర్భంగా మాట్లాడారు. రూ. 3 లక్షలతో చెరువు పూడిక తీత, గట్టు దిట్టపరిచే పనులు చేయడం జరుగుతోందని ఫిల్డ్‌ అసిస్టెంటు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల శాసన సభ్యులు బడుకొండ అప్పలనాయుడు, జిల్లా జలయాజమాన్య సంస్థ ప్రొజెక్టు డైరెక్టరు గోపాలకృష్ణ, డి.ఆర్‌.డి.ఎ. ప్రోజెక్టు డైరెక్టు వాసుదేవరావు, తదితర్లు పాల్గొన్నారు.

ఐదు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్‌


రాంచీ: మావోయిస్టులు ఐదు రాష్ట్రాల్లో రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌లలో మంగళవారం అర్థరాత్రి నుంచి బంద్‌ ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లెఫ్ట్‌ వింగ్‌ గెరిల్లాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ దృష్ట్యా రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకలను దారిమళ్లించింది. రాంచీ-ఢిల్లీ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌, రాంచీ-వారణాసి ఇంటర్‌సిటీ, సంబల్‌పూర్‌-వారణాసి ఇంటర్‌సిటీ రైళ్లను గోమో-గయా-మొగల్‌సరాయ్‌ రూట్లలో నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే బంద్‌ ప్రారంభానికి ముందు మంగళవారం రాత్రి మావోయిస్టులు గర్హ్వ జిల్లాకు చెందిన స్థానిక నేతను అపహరించి చంపేశారు.

తీరప్రాంత భద్రతలో నావికాదళం కీలకపాత్ర


విశాఖపట్నం: భారత దేశ భద్రతతో పాటు తీర ప్రాంత రక్షణ కోసం రూపొందించిన ఐ.ఎన్‌.ఎస్‌ కంకార్సో మరియు ఐ.ఎన్‌.ఎస్‌. కొండుల్‌ పాస్ట్‌ ఎటాక్‌ నౌకలు నౌకాదళానికి కలికితురాయిగా రాష్ట్రగవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరశింహన్‌ అభివర్ణించారు. సువిశాల తీరప్రాంతాన్ని స్మగ్లర్లు, తీవ్రవాదుల నుండి రక్షించడానికి దేశీయంగా నిర్మించిన అత్యాధునిక నౌకలుగా పేర్కొన్నారు. జీ.ఆర్‌.ఎస్‌.ఇ. కలకత్తావారు నిర్మించిన నౌకలను రూపొందించిన ఇంజనీర్లను, నేవల్‌ అధికార్లను, సిబ్బందిని ఆయన ప్రశంసించారు. తూర్పున సూర్యోదయమౌతుందని, తూర్పుతీర రక్షణ విషయంలో దిన దిన ప్రవర్తమానమౌతుందని అభిప్రాయపడ్డారు. నౌకల జలప్రవేశం తనచేతులమీదుగా నిర్వహించడం సంతోషదాయకమని, నౌకా దళానికి గర్వకారణమని అభిలషించారు. ఎంతో సామర్ద్యం, ధైర్య సాహసాలతో నౌకా సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారని, ఈ రెండు నౌకల సిబ్బంది అదేవిధంగా అంకిత బావంతో, కేబిన్‌లలో సేవలందించడానికి నియమించబడిన వారిని , వారి కుటుంబాలను అభినందిస్తూన్నానని గవర్నర్‌ పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలో దేశీయ పరిజ్ఞానంతో కవల నౌకలను నిర్మించి, జలప్రవేశం చేయించిన నౌకాదళాధికారులను, ఇంజనీర్లను ప్రత్యేకముగా అభినందించారు. తీర ప్రాంత పాస్ట్‌ ఎటాక్‌ క్రాప్ట్‌లలో ఐ.ఎన్‌.ఎస్‌ కాంకర్సో ఐదవదని, ఐ.ఎన్‌.ఎస్‌ కొండుల్‌ ఆరవదని పేర్కొన్నారు. ఆహ్లాదకరమైన, ఆనందకరమైన వాతావరణంలో వైస్‌ ఎడ్మిరల్‌ ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ – ఇన్‌ – చీఫ్‌ ఈ స్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ సారధ్యంలో 50 మంది నేవీ సిబ్బంది రాష్ట్ర గవర్నర్‌కు గౌరవ వందనాన్ని చేసారు. అనంతరం యం /ఎస్‌ గార్డెన్‌ రీచ్‌షిఫ్‌ బిల్డర్స్‌ మరియు ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మరియు మేనేజింగ్‌ డైరక్టర్‌ రియర్‌ అడ్మిరల్‌ కె.సి.శేఖర్‌ ప్రారంబోపన్యాసం గావించారు. అనంతరం ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండింగ్‌ – ఇన్‌ – చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అనూప్‌ సింగ్‌ కార్యక్రమాన్నుద్దేశించి సమగ్రంగా ఉపన్యసించారు. తదుపరి కమాండింగ్‌ ఆఫీసర్‌ ఐ.ఎన్‌.ఎస్‌. కాంకర్సో లెప్ట్‌ నెంట్‌ కమాండర్‌ అరుణ్‌ బహుగుణ, ఐ.ఎన్‌. ఎస్‌. కొండుల్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ శశిధర్‌ ఆర్‌. పాటిల్‌ కమిషనింగ్‌ వారంట్లను చదివి వినిపించారు. నౌకల కమిషనింగ్‌ కార్యక్రమం జాతీయ గీతాలాపనతో పూర్తిచేశారు. ప్లాగ్‌ ఆఫీసర్‌ గోవానేవిల్‌ ఎరియా రియర్‌ అడ్మిరల్‌ సుధీర్‌ పిళ్లై, ఇతర ప్లాగ్‌ ఆఫీసర్లు, కమాండింగ్‌ ఆఫీసర్లు , సీనియర్‌ అధికార్లు, షిప్స్‌ ఎస్టాబ్లిష్‌ మెట్‌ ఆఫ్‌ ఈస్టన్‌ నేవల్‌ కమాండ్‌, పోలీస్‌ కమీషనర్‌ జె.పూర్ణచంద్రరావు, జిల్లా కలెక్టర్‌ జె.శ్యామలరావు తదితరులు హాజరైనారు. అనంతరం ముఖ్య అతిధి పలువురు అధికారులకు జ్ఞాపికలను బహకరించారు.