మైనర్‌ బాలిక కిడ్నాప్‌…ఆలస్యంగా వెలుగులోకి


గుంటూరు: మైనర్‌ బాలికను నాలుగు నెలలు నిర్భందించిన యువకులు కేసు పెట్టినా పట్టించుకోని పోలీసులు గుంటూరు జిల్లాలో ఓ మైనర్‌ బాలిక కిడ్నాప్‌ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నలుగురు యువకులు కలసి తుమ్మలపాలెంకు చెందిన మైనర్‌ బాలికను ఎత్తుకుపోయి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పెట్టారు. అయితే వారి నుంచి తప్పించుకున్న బాలిక కుటుంబ సభ్యులతో కలసి పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Advertisements

మిస్టరీగా మారిన వైష్ణవి కిడ్నాప్‌


విజయవాడ: విజయవాడలో నిన్న కిడ్నాప్‌కు గురైన వైష్ణవి జాడ ఇంకా తెలియరాలేదు. నిన్న గుంటూరు జిల్లా సీతానగరం దగ్గర కిడ్నాపర్లు ఉపయోగించిన కారులో సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని ద్వారా వారి జాడ తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు చిన్నారిని శ్రీకాకుళం తీసుకెళ్ళినట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందం ఒకటి అక్కడకు బయలుదేరి వెళ్ళింది. తాడేపల్లిలో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. విజయవాడలో కిడ్నాప్‌కు గురైన నాగవైష్ణవిని కాపాడటం కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారి పలగాని ప్రభాకర్ కుమార్తె నాగవైష్ణవి, కుమారుడు సాయితేజేష్‌లు తవేరా వాహనంలో స్కూలుకు వెళ్తుండగా మోటారు బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు అటకాయించారు. డ్రైవర్ లక్ష్మణ్ రావును హతమార్చిన దుండగులు నాగవైష్ణవిని కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్ల బారినుంచి సాయితేజేష్ మాత్రం తప్పించుకున్నాడు. అయితే కిడ్నాప్‌కు ఉపయోగించిన వాహనాన్ని గుంటూరు జిల్లా సీతానగరం స్క్రూ బ్రిడ్జ్ వద్ద వదిలివేసిన దుండగులు బాలికను మరో వాహనంలో తీసుకొని వెళ్లారు. సమాచారమందుకున్న మంగళగిరి డీఎస్పీ అన్నపూర్ణదేవి కిడ్నాపర్లు వదిలి వెళ్లిన వాహనం వద్దకు చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే పోలీసు జాగీలం తాడేపల్లిగూడెంలోని ఓ రేకుల షెడ్డు వద్దకు వెళ్లి ఆగిపోయింది. దీంతో షెడ్‌లో నివసిస్తున్న ఇద్దరు మహిళలతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నాగవైష్ణవిని డబ్బు కోసమే కిడ్నాప్ చేశారా లేక ప్రభాకర్ వ్యాపార శత్రువులెవరైనా ఈ పని చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 1995లో నాగవైష్ణవి ఓసారి కిడ్నాప్‌కు గురవ్వగా కేసు చేధించిన పోలీసులు కిడ్నాపర్లను అరెస్టు చేశారు. దీంతో అప్పటి కిడ్నాపర్లపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. పలు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.

16వేల రూపాయలతో చిన్న విమానం


మెదక్‌: మెదక్‌ జిల్లా వర్గల్‌ పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్ధులు ఓ బుల్లి విమానాన్ని తయారుచేశారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎరోనాటికల్‌ విద్యార్ధులు 16వేల రూపాయలతో ఈ చిన్ని విమానాన్ని రూపొందించారు. ముంబాయిలో జరిగిన ఎరోక్రాప్ట్‌ ఎగ్జిబిషన్‌లో దీనిని ప్రదర్శించి అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఏడున్నర కిలోలువున్న ఈ విమానం వైర్‌లెస్ సెట్‌ సహాయంతో ఏడునిమిషాలపాటు గాలిలో ఎగురుతుంది. దీని తయారికి అల్యూమినియం, ప్లాస్టిక్ అట్టలు, బ్యాటరీ సెల్స్, మిథైల్‌ ఆల్కాహాల్‌, క్యాస్ట్రాల్‌ వంటి రసాయనాలు ఉపయోగించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను కళాశాలచైర్మన్‌ సత్తిరెడ్డి అభినందించారు.

ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తా


నెల్లూరు: నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తా కొట్టింది. కె.ఎం.బిటి ట్రావెల్స్‌కు చెందిన బస్సు దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకోగానే డ్రైవర్‌ అజాగ్రత్తగా నడపడం వల్ల డివైడర్ ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్‌ మరణించగా, సుమారు పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.

పడవ ప్రమాదం..కొనసాగుతున్న గాలింపు చర్యలు


పశ్చిమ గోదావరిజిల్లా: పశ్చిమ గోదావరిజిల్లాలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం రెండోరోజు గాలింపు కొనసాగుతోంది. విశాఖపట్నం, రాజమండ్రిల నుంచి వచ్చిన నేవీ బోట్లు, హెలికాఫ్టర్‌ ద్వారా మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిన్న పౌర్ణమి కావడం, అందులోనూ సాగర సంగమం దగ్గరగా ఉండటంతో కొంత మంది సముద్రంలోకి కొట్టుకొనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 12 మృతదేహాలు లభ్యంకాగా ఆచూకీ తెలియని మరో 20 మంది వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పలువురు పోలీసు, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులు సహాయ కార్యక్రమాలను పర్యేవేక్షిస్తున్నారు.

నగరంలో ప్రైవేటు బస్సు బోల్తా ఒకరి మృతి


హైదరాబాద్‌: నగరంలోని దిల్‌సుఖనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు కందూకూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పది మంది గాయాలపాలయ్యారు. బస్సు అతివేగంతో ఢీకొనడంతో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

హోంమంత్రిని కలిసిన తెలంగాణ జేఏసీ


హైదరాబాద్‌: రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదివారం ఉదయం తెలంగాణ ఐక్యకార్యచరణ కమిటీ నేతలు కోదండరామ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటెల రాజేందర్‌ కలిశారు. తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థుల, ఆందోళకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ నేతలు వినతి పత్రం అందజేశారు.