ఆయేషా కేసు నేటికి వాయిదా


విజయవాడ: బి-ఫార్మసి విద్యార్థి ఆయేషామీర హత్యకేసు విచారణలో భాగంగా పాదముద్రల నిపుణులు, డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించిన అధికారులు సోమవారం కోర్టులో హాజరయ్యారు. సంఘటన స్థలంలో దొరికిన పాదముద్రలు ఈ కేసులోని నిందితుడైన సత్యంబాబు పాదముద్రలతో సరిపోయాయని నిపుణులు సాక్ష్యం ఇచ్చారు. అలాగే బిఎన్‌ఎ పరీక్షల్లో కూడా సత్యబాబు సంబంధించిన అంశాలే ఉన్నట్లు తెలిందని అధికారులు కోర్టులో వివరించారు. శాస్త్రీయ పద్ధతిలో పరీక్షలు నిర్వహించామని అన్ని సరిగానే ఉన్నాయని వారు నిందితుడి తరపు న్యాయ వాధి కె. రామ్మోహన్‌రావు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా వారిని మరికొన్ని ప్రశ్నలు అడగాల్సిఉందని డిఫెన్స్‌ న్యాయవాధి కోర్టుకు తేవడంతో మంగళవారం కూడా వారిని క్రాస్‌ పరీక్ష చేసేందుకు న్యాయమూర్తి అంగీకరించారు.

Advertisements

కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు


విజయవాడ: విజయవాడ కాంగ్రెస్‌లో మళ్లీ వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇబ్రహీంపట్నంలో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌పై, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ వర్గీయులు కుర్చి విసరగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. సమావేశం వేదికపైకి ఇబ్రహీంపట్నం ఎంపిపి మధవరావును పిలవకపోవడం ఈ వివాదానికి దారితీసింది. దీంతో ఎమ్మెల్యే రమేష్‌ వర్గీయుడు అగ్రహోదగ్రులై లగడపాటి మీద కుర్చీలు విసిరారు. కాగా, ఎంపి వర్గీయులు కూడా ఎదురు దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సంఘటనతో మనస్తాపం చెందిన ఎంపి లగడపాటి సమావేశాని అర్థంతరంగా ముగించి వెళ్ళిపోయారు.

ఆరవిదనగర్‌లో గ్రామీణ బ్యాంకు శాఖ ప్రారంభం


కడప: రాష్ట్ర గ్రామీణ బ్యాంకు ఐదు జిల్లాల్లో 359 శాఖల్లో 72లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తున్నదని ఆ బ్యాంకు చైర్మన్‌ జయప్రకాశ్‌ చెప్పారు. కడపలోని అరవిదనగర్‌లో సోమవారం గ్రామీణ బ్యాంకు శాఖను ప్రారంభించారు. 6200 కోట్ల రూపాయలు లావాదేవీలు తమ బ్యాంకు ద్వారా జరుగుతున్నాయని అన్నారు. త్వరలోనే తమ శాఖలో అన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయనున్నామని ఆయన చెప్పారు. గత ఏడాది స్వయం సంఘాలకు 750 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామని, ఈ ఏడాది 800 కోట్ల రూపాయలు లక్ష్యంగా ఇవ్వాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు రిజనల్‌ మేనేజర్‌ సెల్వ రాజుతోపాటు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

9న సిఎం కడప జిల్లా పర్యటన


కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి, సెప్టెంబర్‌ 9న జిల్లా పర్యటనకు వస్తున్నట్లు కలెక్టర్‌ కార్యాలయానికి సమాచారం అందింది. సింహాద్రిపురం మండలం పైడిపాటెం రిజర్వాయర్‌ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఆ తరువాత ముఖ్యమంత్రి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలను తనిఖీ చేస్తారని ఈమేరకు కలెక్టర్‌ కార్యాలయానికి సమాచారం అందింది.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి


కడప: పొద్దుటూరు పట్టణంలోని గోకుల్‌నగర్‌లో మహేశ్వరి (19) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పట్టణ మూడవ టౌన్‌ పోలీసులు చెప్పారు. చాపాడు మండలం గుడివాడకు చెందిన మహేశ్వరికి గోకుల్‌నగర్‌కు చెందిన రవికుమార్‌రెడ్డితో పెళ్లిఅయింది. ఇంట్లో నిద్రిస్తున్న ఆమెను పాము కాటు వేసినట్టు, పాటు చంపి శరీరంవద్ద పడవేశారు. కాగా, తమ కుమార్తెను అదనంపు కట్నం కోసం భర్త రవికుమార్‌, అత్తమామలు వేధించి, హత్య చేసి, పాము కాటుకు గురైనట్టుగా చిత్రికరించారని మహేశ్వరి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి గోకుల్‌నగర్‌ దర్యాప్తు జరుపుతున్నారు.

రామకృష్ణారెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన వెల్దుర్తి జడ్పీటీసీ ఉప ఎన్నిక


మాచర్ల: ఎమ్మెల్సీగా గెలుపొందిన కొద్దిరోజులకే వచ్చిన వెల్దుర్తి జడ్పీటీసీ ఉప ఎన్నిక పి.రామకృష్ణారెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. తన రాజీనామాతో ఖాళీ అయిన జడ్పీటీసీ సీటును కాంగ్రెస్‌ పార్టీ చేజారకుండా అన్ని మార్గాలలో ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలో పూర్తిస్థాయి పట్టున్నా ప్రత్యర్థులకు అంతతక్కువగా అంచనా వేయడానికి వీల్లేదన్న కోణంలో ఉన్నారు. తెదేపా తరఫున ఎంపి యోదుగల ప్రత్యేక దృష్టిపెట్టి ఆర్థిక వనరులు సమకూర్చడం, అభ్యర్థి కోటిరెడ్డికి మండలంలో సత్సంబంధాలు ఉండడం తెలుగుదేశానికి కలిసివచ్చిన అదృష్టం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పల్లెబాట పట్టింది. కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొనటానికి వ్యూహం రచిస్తూనే ఉంది. ఎంపి ప్రతిరోజు ఫోన్‌లో తెదేపా నాయకులతో మాట్లాడుతూ, సమాయత్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మంచి మెజార్టీతో గెలుస్తామని పేర్కొన్నా తెదేపా వేగానికి పల్లెలో అడ్డుకట్ట వేసి కాంగ్రెస్‌ బలం మరింత పెంచుకునేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో ఎనిమిది రోజులే ఎన్నికలకు సమయం ఉండడంతో ఆ రెండు పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేసేపనిలో పడ్డాయి. ప్రచారానికి పెద్ద నాయకులు రానున్నట్లు సమాచారం.

జిల్లాలో రూ.189 కోట్లతో అభివృద్ధి పనులు


గుంటూరు: జిల్లాలో 189.44 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని ప్రజారోగ్య శాఖ ఎన్‌.ఇ పి.రామారావు తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, వినుకొండలో 12.37 కోట్ల రూపాయలు, నరసరావుపేటలో 17 కోట్ల రూపాయలు, సత్తెనపల్లిలో 205 కోట్ల రూపాయలు, బాపట్లలో 15.31 కోట్ల రూపాయలు, పొన్నూరులో 18 కోట్ల రూపాయలు, తెనాలిలో 19.51 కోట్ల రూపాయలతో తాగునీటి పథకం అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన చెప్పారు. ఓవర్‌హెడ్‌ ట్యాంకుల పైపు విస్తరణ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇవన్నీ విఐజిఎస్‌ఎన్‌ఎంటి పథకం నిధులతో చేస్తున్నామన్నారు. ఐహెచ్‌ఎసిజిపి పథకం కింద మొదటి విడతగా 75 కోట్ల రూపాయలతో వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, బాపట్ల పురపాలక సంఘాల్లో మురికివాడల అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండో విడతలో రేపల్లె, తెనాలి పట్టణాలలో రూ.11.75 కోట్లతో విలువైన పనులు ఇటీవల ప్రారంభించామని తెలిపారు.