మెదక్‌ జిల్లాలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె


మెదక్‌: సమస్యల పరిష్కారం కోసం పరిశ్రమల కాంట్రాక్టు కార్మికులు మెదక్‌ జిల్లా వ్యాప్తంగా నేడు సమ్మె చేపట్టారు. దీంతో పలు పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కనీస వేతనాలు అమలు చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పటాన్‌చెరులో పెన్నార్‌ పరిశ్రమ వద్ద యాజమాన్యానికి, సీఐటీయూ నాయకులకు కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపు చేశారు.

Advertisements

ఏఐసీసీ నిర్ణయం హర్షణీయం: దానం


హైదరాబాద్‌: వైఎస్‌ హఠాన్మరణం వల్ల చనిపోయినవారి కుటుంబాలను ఓదార్చాలన్న ఏఐసీసీ నిర్ణయం హర్షణీయమని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. ఏఐసీసీ నిర్ణయం తర్వాత కూడా జగన్‌ ఓదార్పుయాత్ర నిర్వహిస్తే అతడికే చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్‌ది ప్రస్తుతం మహాభారతంలో అభిమన్యుడి పరిస్థితని… జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు


విశాఖపట్నం: రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఏర్పడిన ద్రోణి ఒడిషా వద్ద తీరం దాటిందని తెలిపారు. ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ తీరం వెంబడి అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని చెప్పారు. నైరుతీ రుతుపవనాలు బలంగా ఉండడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

బీహార్‌ ప్రభుత్వానికి మావోయిస్టుల అల్టిమేటం


పాట్నా: జైలులో ఉన్న ఎనిమిది మంది సహచరులను విడుదల చేయకపోతే తమ చెరలో ఉన్న నలుగురు జవాన్లను చంపేస్తామంటూ మావోయిస్టులు బీహార్‌ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. సీపీఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా చెప్పుకొన్న అవినాష్‌ అనే వ్యక్తి మంగళవారం ఫోన్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. ఆదివారం లఖిసరాయ్‌ జిల్లాలో ఏడుగురు పోలీసుల మృతికి… భద్రతాదళ సభ్యుల కిడ్నాప్‌కు తామే కారణమని ఆయన చెప్పారు. బుధవారం 4 గంటల కల్లా తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు

సీఎం ఢిల్లీ పర్యటన రద్దు


హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొనాల్సి ఉంది. సెప్టెంబర్‌ 1న రాష్ట్రంలో ప్రధాని పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియాను సమర్థిస్తూ ఇప్పటికే పత్రాలు పంపడం కూడా రోశయ్య పర్యటన రద్దుకు కారణంగా కనిసిస్తోంది. ఇదిలా ఉండగా పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.

గిరీష్‌కుమార్‌కు ఘనంగా వీడ్కోలు


హైదరాబాద్‌: నేటితో పదవీకాలం ముగియనున్న రాష్ట్ర డీజీపీ గిరీష్‌కుమార్‌కు పోలీస్‌ శాఖ ఈ ఉదయం ఘనంగా వీడ్కోలు పలికింది. గౌరవ పరేడ్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా పనిచేసినందుకు గర్వంగా ఉందని అన్నారు.

మథర్‌ థెరిస్సా పేరిట అమెరికా పోస్టల్‌ స్టాంప్‌


వాషింగ్టన్‌: మథర్‌ థెరిస్సా గౌరవార్థం పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేయాలని అమెరికా నిర్ణయించింది. మానవ సేవతో 1979లో నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్న మథర్‌ థెరిస్సాకు అంజలి ఘటిస్తూ పోస్టల్‌ స్టాంపును విడుదల చేస్తున్నట్లు అమెరికా పోస్టల్‌ సర్వీస్‌ ఓ ప్రకటనలో తెలిపింది. వాషింగ్టన్‌లో సెప్టెంబర్‌ 5న జరిగే కార్యక్రమంలో ఈ స్టాంపును విడుదల చేయనున్నారు.