ఆదిలాబాద్: నిబంధనల ప్రకారం.. భద్రతా చర్యలు తీసుకుని ఉపయోగించాల్సిన పేలుడు పదార్థాల్ని ఇష్టారాజ్యంగా, బహిరంగంగా ఉపయోగిస్తుండటంతో ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోననే భయం జాతీయరహదారి పనులు సాగుతున్న ప్రాంతాల్లోని పల్లెవాసుల్లో వ్యక్తమవుతోంది. పేలుడు పదార్థ నిపుణుల పర్యవేక్షణలో రాళ్ళు, మట్టి లాంటివాటిని పేల్చాలని నిబంధనలున్నా అమలవడం లేదు. జిల్లాలో కొనసాగుతున్న ఏడో నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులకోసం కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగా పేలుళ్ళను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మూడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైనా ఎలాంటి చర్యలు లేవు. ఏడో నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఎత్తుపల్లాలను సరిచేసేందుకు, ఎత్త్తెన గుట్టలు, రాళ్ళను పిండిచేసేందుకు కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సిబ్బంది భారీగా పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చుట్టుపక్కల పల్లెలు, గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. 2009లో కుప్టి ఘాట్ వద్ద భారీ పేలుడు పదార్థాలను ఉపయోగించి చేసిన పేలుళ్ళతో ఆ గ్రామంలోని సగానికిపైగా పగుళ్ళిచ్చి దెబ్బతిన్నాయని అప్పట్లోనే గ్రామస్థులు నెత్తినోరు బాదుకున్నారు. 2009 జనవరి మూడో వారంలో చేసిన పేలుళ్ళ ధాటికి ఎగిరివచ్చిన ఒక పెద్దరాయి తగలడంతో కుప్టి గ్రామంలో ఉన్న ఆటో ధ్వంసమయ్యింది. ఇది పెద్ద సమస్యగా తయారుకావద్దనే ఉద్దేశంతో కాంట్రాక్టరు ఆ ఆటో యజమానికి పరిహారంకూడా ఇచ్చారు.
ఎలాంటి నిబంధనలు పాటించకుండా, భద్రతా చర్యలు తీసుకోకుండా పేలుడు పదార్థాలను ఇష్టారాజ్యంగా ఉపయోగిస్తున్నారని నిర్మల్‌కు చెందిన జగన్మోహన్‌రెడ్డి అనే వ్యక్తి నిర్మల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. దీనిని పరిశీలించిన కోర్టు 5.12.2008న కేసులు నమోదు చేయాలంటూ మామడ, నిర్మల్(రూరల్) పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. నిర్మల్ రూరల్ పోలీసు స్టేషన్‌లో 104/2008గా ఐపీసీ సెక్షన్లు 426, 427, 420, ఆర్/డబ్ల్యూ 34, పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3, పేలుడుపదార్థాల చట్టం 9-బి, 9-సి సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. అలాగే మామడ పీఎస్‌లోనూ కేసు నమోదయ్యింది. అదే వ్యక్తి రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును 12.1.2009న పోస్టుద్వారా స్వీకరించిన నేరడిగొండ పోలీసులు ప్రాథమికంగా విచారించడానికి దాదాపు నెలరోజుల సమయం తీసుకుని 16.2.2009న 15/09గా కేసు నమోదు చేశారు.
కేసులు నమోదవుతున్న అంశాన్ని తెలుసుకున్న కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీవారు జిల్లాలో ఉన్న పేలుడుపదార్థాల అనుమతి ఉన్న డీలరు శ్రీరామా ఎక్స్‌ప్లోజివ్స్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం రాసుకోవడానికి 27.10.2008నాడు రూ. 10 ముఖ విలువగల స్టాంపు పేపర్లను బోథ్‌లోని స్టాంప్ వెండర్ నుంచి కొనుగోలు చేశారు. ఒప్పందం కుదుర్చుకుంది మాత్రం 5.9.2008 నాడు కావడం గమనార్హం. అంటే దాదాపు స్టాంపు పేపర్ కొన్న నెలన్నర రోజుల ముందే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ఇంత జరిగినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇస్లాంనగర్ నుంచి మొదలుకుని కడ్తల్ వరకు జరుగుతోన్న పనుల్లో చాలాచోట్ల ఇప్పటికీ పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా.. పెద్దఎత్తున పేలుడు పదార్థాలను పెట్టడం వల్ల భారీ పేలుళ్ళకు ఏం జరుగుతుందోనని సమీపంలోని గ్రామాలు, పల్లెలు, తాండాల ప్రజలు భయపడుతున్నారు. పైగా పేలుడు పదార్థాల రవాణాలో సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా, బహిరంగంగా వాడుతున్నారు. దీనితో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఈ విషయమై జిల్లా ఎస్పీ ప్రమోద్‌కుమార్‌ను సంప్రదించగా.. పేలుడు పదార్థాలకు అనుమతి ఉన్న సంస్థతో కాంట్రాక్టరు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టుగా తన దృష్టికి వచ్చిందన్నారు. అయినా కేసుల విచారణ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకుంటానన్నారు.