వరంగల్‌లో జిల్లాలో జోరుగా చంద్రబాబు యాత్ర


వరంగల్‌: న్యూఢిల్లీలో అఖిలపక్ష భేటీ అనంతరం తన యాత్రకు వస్తున్న స్పందనతో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవటంతో పాటుగా తమ పార్టీ 42 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న పక్షంలో వంట గ్యాస్‌ సిలిండర్లను రాయితీపై అందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరంగల్‌ జిల్లాలో ‘వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర రెండవ రోజైన ఆదివారంనాడు వరంగల్‌ జిల్లాలో నవాబ్‌ పేట వద్ద ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తాను పాదయాత్ర చేస్తున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు లాంటి వరంగల్‌లో టిడిపి అధినేత స్వేచ్ఛగా సంచరిస్తున్నట్టుగా కనిపించారు. అఖిలపక్ష సమావేశంలో పార్టీ తెలిపిన ఏకాభిప్రాయంతో నాయుడు, ఆయన పార్టీ నేతలకు తెలంగాణ ప్రాంతంలో అడ్డంకులు తొలగిపోయాయి. ఒకానొక దశలో ఫోటో జర్నలిస్టుల నుంచి కెమెరా తీసుకున్న టిడిపి అధినేత కెమెరాను క్లిక్‌మని అనిపించటంతో పార్టీ కార్యకర్తలు కేరింతలు కొట్టారు. చంద్రబాబునాయుడు ఆదివారం నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలైన చిట్యాల మండలంలో సుబ్బక్కపల్లి, నవాబ్‌ పేట, మొగుళ్లపల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. పోలీసు భద్రత నడుమ నాయుడు యాత్ర సాగుతున్నప్పటికీ మాదిగ విద్యార్ధి సంఘం, తెలుగునాడు విద్యార్థి సంఘం కార్యకర్తలు వరంగల్‌లో యాత్ర ఆసాంతం టిడిపి అధినేతకు రక్షాకవచంగా నిలిచారు. తొలుత శనివారం రాత్రి బసచేసిన సుబ్బక్కపల్లి నుంచి చంద్రబాబు ఆదివారం తన యాత్ర ప్రారంభించారు. ప్రజాసంఘాల జేఎసీ ఛైర్మన్‌ గజ్జెల కాంతం, ఉస్మానియా విశ్వవిద్యాలయం జేఎసీ ఛైర్మన్‌ రాజారామ్‌ యాదవ్‌లు టిడిపి అధినేతను కలుసుకున్నారు. ఆయన పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. రాజకీయ సమీకరణాలు క్రమక్రమంగా తమకు అనుకూలంగా మారుతుండటం పట్ల టిడిపి శ్రేణులు సంతోషంగా ఉన్నాయి.

Advertisements

గోపీనాథ్‌ కంపెనీపై కింగ్‌ ఫిషర్‌ పైలట్ల ఆశ


ముంబయి: డెక్కన్‌ ఎయిర్‌ లైన్స్‌ మాజీ వ్యవస్థాపకుడు కెప్టెన్‌ గోపీనాధ్‌ కొత్తగా మరో కంపెనీ పెడుతున్నట్లు వార్తలు రావటంతో సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ ఉద్యోగులు ఆరాలు తీస్తున్నారు. వీరిని జెట్‌ ఎయిర్‌ వేస్‌, స్పైస్‌ జెట్‌, ఇండిగో లాటి కంపెనీలు ఉద్యోగాలలోనికి తీసుకోవటం లేదు. ఇంతవరకు వీరికి 8 నెలల నుంచి జీతాలు రాలేదు. ఇపుడు గోపీనాథ్‌ కంపెనీపై వారు ఆశలు పెట్టుకున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కొంతమంది పైలట్లు గోపీనాథ్‌ను ఇప్పటికే సంప్రదించారు. మరికొంత మందికి మాత్రం కింగ్‌ ఫిషర్‌ పునరుద్ధరణ జరుగుతుందని ఆశలున్నాయి. విజయ్‌ మల్యా విదేశీ భాగస్వామి సంయుక్త భాగస్వామ్యంతో తన కంపెనీని నడపాలని వార్తలు వచ్చిన నేపధ్యంలో ప్రస్తుత ఉద్యోగులలో కొంతమంది అది నిజమవుతుందేమోనన్న ఆశతో ఉన్నారు. అయితే మరికొంతమందికి ఈ వాదన రుచించటం లేదు. సమీప భవిష్యత్తులో కింగ్‌ ఫిషర్‌ పునరుద్ధరణ జరుగుతుందని తాము భావించటం లేదని ఒకవేళ అలా జరిగినప్పటికీ చాలా తక్కువస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించవచ్చని పేరు చెప్పని కొంతమంది పైలట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కింగ్‌ ఫిషర్‌ సిఇఓ సంజయ్‌ అగర్వాల్‌ తమ సిబ్బందికి వేతనాలిస్తామని వాగ్దానం చేసినప్పటికీ ఆచరణలో అలా జరుగలేదు. దీపావళిన మే నెల వేతనం చెల్లిస్తామని చెప్పి వాగ్దానభంగానికి పాల్పడ్డారు. ఇప్పటివరకు మే నెల జీతాలు అందలేదని పైలట్లు చెప్పారు.

2013లో బంగారం ధర పదిగ్రాములు రూ.33,000


ముంబయి: బంగారం ధర 2013లో పదిగ్రాములు రూ.33,000 వద్ద స్థిరపడవచ్చని ప్రముఖ ఆర్ధికవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక ప్రగతి అవకాశాల మెరుగుదల, కొన్ని అంతర్జాతీయ అంశాలు పచ్చలోహం ధర పెరుగుదలకు కారణభూతమవుతాయని కోటక్‌ కమాడిటీ సర్వీసెస్‌ విశ్లేషకురాలు మాధవిమెహతా పేర్కొన్నారు. పలుదేశాల కేంద్రీయ బ్యాంకులలో బంగారం స్థాయి స్థిరంగా ఉంది. మార్కెట్లలో ద్రవ్యప్రవాహం అందువల్ల అధికమవుతుంది. ఇది బంగారం నిల్వలు పెంచుకునేందుకు కారణమవుతుంది అని ఆమె చెప్పారు. బ్రాజిల్‌, రష్యా కేంద్రీయ బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకోవాలన్న వ్యూహంతో ఉన్నట్లు ఆమె తెలిపారు. అందువల్ల దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రూ.28,000-33,000 మధ్య స్థిరపడవచ్చని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాని రూపాయి పతనం, ఆర్ధికమాంద్యం బంగారం ధరపై ప్రభావం చూపవచ్చని అన్నారు. ఇది బేరిష్‌ ధోరణిలో ఉండవచ్చన్నారు. వస్తువు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నపుడు విక్రయాలు చేసి అదే వస్తువు ధర పడిపోయినపుడు కొనుగోలు చేయటం బేరిష్‌ ధోరణిగా స్టాక్‌ మార్కెట్‌లో పారిభాషికపదంగా వినియోగిస్తారు. ఇక విదేశీసంస్థాగత ఇన్వెస్టర్‌లు(ఎఫ్‌ఎఫ్‌ఐ)లు కూడా ఈక్విటీమార్కెట్లో పెట్టుబడులు అధికంగా పెట్టుబడి పెట్టినట్లయితే అది కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమవుతుందని చెప్పారు. గత వారం మార్కెట్‌లో బంగారం ధర దేశీయమార్కెట్‌లో 10 గ్రాములు రూ.30,600గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు 1658 డాలర్లు పలికింది.

గిన్నెస్‌బుక్‌లో ఆరేళ్లపాప


కరీంనగర్‌: ఆరేళ్ల పాప ఫ్రాంజోనియా 20 భాషలలో 15 దేశాల జాతీయగీతాలు పాడి గిన్నెస్‌ రికార్డులకు ఎక్కింది. ఆదివారం ఇక్కడ ఒక స్టార్‌ హోటల్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఈ కార్యక్రమం జరిగింది. ఈమె రెండవ తరగతి చదువుతోంది. ఆమె ప్రదర్శనకు అరోరా డిగ్రీ కాలేజ్‌ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆమె జాతీయగీతాలను పాడుతున్నపుడు రికార్డ్‌ చేశారు. జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థ కార్యద ర్శి వి.బాలభాస్కర్‌ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. గిన్నెస్‌ రికార్డ్‌ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. కేవలం 3 నెలల్లో తమ కుమార్తె వీటిని నేర్చుకుందని బాలిక తండ్రి విజయభాస్కర్‌ చెప్పారు. దక్షిణాఫ్రికా జాతీయగీతాన్ని ఆమె సులభంగా నేర్చుకుందన్నారు. శిక్షణ పొందిన ఒక ఉపాధ్యాయుడిని ఆమె శిక్షణ కోసం నియోగించామన్నారు.

హత్యచేసి పైగా కోర్టులో పగలబడి నవ్వు!


న్యూయార్క్‌: ఒక సబ్‌వే రైలు కిందకు ఒక మనిషినితోసేసి రెండు రోజుల క్రితం అతడి హత్యకు కారణమయిన ఒక 31 ఏళ్ల యువతిపై నేరారోపణ చేశారు. తాను హిందువులను ముస్లింలను ద్వేషిస్తున్న కారణంగా బాధితుడిని రైలు కిందకు తోసేసినట్లు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించింది. నిందితురాలు ఎరికా మెనెండెజ్‌కు బెయిలు నిరాకరించారు. తన నేరానికి ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ఆమె నిర్వాకం వల్ల 46 ఏళ్ల సునందోసేన్‌ రైలుకిందపడి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం రాత్రి ఆమెను నిర్బంధంలోనికి తీసుకున్నపుడు ఆమె పిచ్చిదాని మాదిరి నవ్వింది. కోర్టులో కూడా న్యాయమూర్తి ఎదుట ఇలాగే వ్యవహరించటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివరాలను న్యూయార్క్‌ డైలీ ఆదివారం ప్రచురించింది. ఆమె క్వీన్స్‌ ప్రాంతంలో నివసిస్తోంది. ప్రాసిక్యూటర్లు తమ వాదన వినిపిస్తుంటే ఆమె నవ్వటం ప్రారంభించింది. ‘‘నేను టైమ్స్‌ స్కేర్‌లో కాలంగడిపాను. విడియోలో నేను ఎక్కడ గడిపిందీ చూడవచ్చు. నేను క్వీన్స్‌ ప్రాంతంలో లేను’’ అని చెప్పింది. తర్వాత మాట మార్చుతూ తాను ఒక ముస్లింను రైలుపట్టాలమీదకు తోసేశానని చెప్పింది. ఇది వర్ణవిద్వేషంతో కూడిన హత్య. అందువల్ల సేన్‌ మృతికి కారణ భూతమైనందుకు ఆమెకు అత్యధికం 25 ఏళ్ల శిక్షపడవచ్చు. సేన్‌ను ముస్లిం అని ఆమె భావించింది. 2001 సెప్టెంబర్‌ 11 యుఎస్‌ దాడుల అనంతరం తాను హిందువులపైన ముస్లింలపైన ద్వేషం పెంచుకున్నట్లు తెలిపింది. ‘‘చెప్పాలంటే నేను ఒక ముస్లింను పట్టాలపైకి తోసేశాను. 2001నుంచి హిందువులపైన ముస్లింల పైన నాకు చాలా ఆగ్రహంగా ఉంది. న్యూయార్క్‌లోని ట్విన్‌ టవర్స్‌ను వారు కూల్చేసి వందలాదిమంది మృతికి కారణమయ్యారు. అందువల్ల వారిని శిక్షిస్తున్నాను’’ అని ఆమె చెప్పింది. ఆమె ప్రవర్తన క్వీన్స్‌ క్రిమినల్‌ కోర్టు న్యాయమూర్తి జియామారిస్‌కు కోపం తెప్పించింది. నిందితురాలి లాయర్‌ డైట్రిక్‌ ఎప్పర్‌సన్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్లయింటు సరిగా ప్రవర్తించేట్లు చూడాలని మందలించారు. ఇలా సేన్‌ను చంపేసిన తర్వాత ఆమె బ్రూక్‌లిన్‌లో హుక్కా తాగింది. తన మిత్రుడితో శృంగారం జరిపింది. పోలీసులు ఆమెకు సంకెళ్లు వేసి కోర్టుకు నడిపించారు. ఆమెకు మానసిక చికిత్సాలయంలో పరీక్షలు నిర్వహిస్తారు.

ధరల కౌగిట్లో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి!


విశాఖపట్నం: పండగ వచ్చింImageదంటే చాలు మార్కెట్లో సరకుల ధరలకు రెక్కలు వచ్చేస్తాయి. సామాన్యుడే లక్ష్యంగా వ్యాపారులు ఒక్కసారిగా ధరలను పెంచేసి సొమ్ము చేసుకోవాలని చూస్తుంటారు. తాజాగా దీపావళి సందర్భంగా కూడా టోకు వ్యాపారులు అదే పని చేశారు. పండగ పూట ఎక్కువగా అమ్ముడయ్యే నిత్యావసర సరకుల ధరలను ఒక్కసారిగా పెంచేసి లాభార్జనకు నడుం బిగించారు. బియ్యం, పప్పులు, నూనెలు, పంచదార వంటి సరకుల ధరలను దసరా ముందే పెంచేయగా, తాజాగా టమోటా, ఉల్లిపాయల ధరలను కూడా పెంచేసి పండగ ఆనందాన్ని హరించే ప్రయత్నం చేశారు. కర్నూలు మార్కెట్‌కు భారీఎత్తున వస్తున్న ఉల్లి పంటను కారుచౌకగా కొనేస్తూ నేరుగా తమ గోదాములకు తరలిస్తున్న వ్యాపారులు చిల్లర వర్తకుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం పీనాసి బుద్ది ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దాంతో ఎక్కడ చూసినా ఉల్లి ధర భగ్గుమంది. పది రోజుల కిందట కూడా కిలోకు రూ.10 నుంచి రూ.12 పలికిన నాణ్యమైన ఉల్లి ఇప్పుడు అమాంతం కొండెక్కింది. సోమవారం హైదరాబాద్‌ రైతు బజార్లలోనే సాధారణ రకానికి రూ.16 వసూలు చేశారు. బహిరంగ మార్కెట్లో రూ.18 పలుకుతోంది. దీపావళికి వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులే చెబుతున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి కర్నూలు బడా వ్యాపారుల గోదాములపై దాడులు చేయకపోతే ఉల్లి రేటు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రం ఉల్లి అవసరాలను ప్రధానంగా కర్నూలు, మహారాష్ట్రలోని నాసిక్‌ మార్కెట్లు తీరుస్తున్నాయి. మహారాష్ట్రలో వర్షాల వల్ల ఉల్లి రవాణాకు స్వల్ప అంతరాయాలు ఏర్పడ్డాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న కర్నూలు ఉల్లి వ్యాపారులు ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టారు. కర్నూలు జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తుంటారు. డిసెంబర్‌ వరకు కర్నూలు మార్కెట్‌కు భారీగా సరకు వస్తుంది. హోల్‌సేల్‌ వ్యాపారులు కొని లారీల్లో అన్ని జిల్లాలకు సరఫరా చేస్తారు. మొన్నటి వర్షాలకు కొద్దిపాటి పంట నష్టపోయినా ఉత్పత్తికి పెద్ద ఇబ్బందులు లేవని చెబుతున్నారు. నవంబరులోనే రోజూ 70 వేల క్వింటాళ్ల సరకు కర్నూలు మార్కెట్‌ యార్డుకు వస్తోంది. రైతుల నుంచి వ్యాపారులు కారు చౌకగా సరుకును కొనేస్తున్నారు. కిలోకు రూ.3 నుంచి రూ.5 వరకు చెల్లిస్తున్నారు. నామమాత్రపు సరకును రూ.9కి కొంటున్నారు. ఏరోజు కొన్న సరకు ఆరోజు సక్రమంగా జిల్లాలకు వెళితే ఉల్లి రేటు పెరగదు. అయితే, బడా వ్యాపారులు కొన్నది కొన్నట్లే గోదాములకు తరలిస్తున్నారు. ఇటీవల వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతిందని అందుచేత పంట రాక తగ్గిందని, దీనివల్లే రేటు పెరిగిందని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాల కారణంగా మహారాష్ట్ర వ్యాపారులు ఆంధ్రప్రదేశ్‌కు ఉల్లి రవాణాను నిలిపేస్తే కోస్తాలో తప్ప అంతగా ప్రభావం చూపని నీలం తుపాను పేరు చెప్పి ఉల్లి వ్యాపారులు పది రోజులుగా కర్నూలు గోదాముల నుంచి సరకు బయటకు తీయడం లేదు. మరోపక్క కర్నూలు మార్కెట్‌కు రైతులు తెచ్చిన సరకును కొనేసి గోదాములకు తరలిస్తున్నారు. మహారాష్ట్రలో పరిస్థితి సర్థుబాటైనా కూడా అక్కడి నుంచి ఉల్లి లారీలు రాకుండా అడ్డుకుంటున్నారు. ఫలితంగా వారం రోజులుగా బహిరంగ మార్కెట్లో ఉల్లి నిల్వలు తగ్గిపోయాయి. దాంతో ఉల్లి రేట్లు అమాంతం పెరిగాయి. కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల గోదాముల్లో పెద్దఎత్తున ఉల్లి నిల్వలు ఉన్నాయని సమాచారం. విజిలెన్సు ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు దాడులు చేస్తే పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు బయటపడే అవకాశం ఉంది. విజిలెన్సు అధికారుల నిర్లక్ష్యం కూడా అనుమానాలకు తావిస్తోంది. మరోపక్క బెల్లం రేటు కూడా ఆకాశాన్ని తాకేలాగే ఉంది. వ్యాపారుల మాయాజాలంతో రాష్ట్రంలో బెల్లం రేటు కూడా పెద్దఎత్తున పెరిగింది. వారం రోజుల కిందట కేజీ బెల్లం రూ.40 నుంచి రూ.45 ఉంటే ఇప్పుడది కేజీ రూ.55 నుంచి రూ.60కు పెరిగి పోయింది. ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు చిల్లర వ్యాపారులు. అనకాపల్లి నుంచి నిల్వలు మార్కెట్లోకి రాకపోవడం వల్ల దీని ధర పెరిగిందని చెబుతున్నారు. వంట నూనెల ధరలు గరిష్ఠంగా పెరిగాయి. గతంలో లీటరు రూ.70 నుంచి రూ.85 రూపాయల మధ్య లభించిన నాణ్యమైన నూనె ఇప్పుడు రూ.100 నుంచి రూ.168 మధ్య దొరుకుతోంది. పప్పుల పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ పండగ వచ్చినా ముందు పెరిగేది పప్పు దినుసుల ధరలే.

15న ఉప ఎన్నికల ఫలితాలు


15న ఉప ఎన్నికల ఫలితాలు