ఆరిన జ్వాల నక్సల్బరీ!


నిప్పుల విత్తనాలను చల్లి మంటలను పండించిన నేల… సాయుధ రైతాంగ ఉద్యమంతో రక్త పతాకాలను ఎగరేసిన వీర భూమి… దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసి భారత చరిత్రలో సగర్వమైన పుటను కేటాయించుకున్న గ్రామం… భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సస్ట్-లెనినిస్ట్) సాయుధ కార్యకర్తకు నక్సలైట్ బిరుదు ఇచ్చి నిఘంటవులో కొత్త పదాన్ని చేర్చిన నక్సల్ బరీ… గ్రామం. తాజాగా లాల్ ఘడ్ మావోయిస్టు ఉద్యమం దేశాన్ని కుదిపేస్తున్నప్పుడు అక్కడకు కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న నక్సల్ బరీ గ్రామం ప్రశాంతంగా కనిపించింది. పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి నుంచి అరగంట ప్రయాణం చేస్తే నక్సల్ బరీ గ్రామం వస్తుంది. ఇప్పుడు ఆ గ్రామాన్ని చూస్తే వేల మంది యువకులను అడవి దారి పట్టిస్తున్న నక్సలైట్ (మావోయిస్టు) ఉద్యమం పురుడు పోసుకున్నది ఇక్కడే అంటే నమ్మడం కష్టమే.

గ్రామీణ బెంగాల్ లో ఉండే అన్ని గ్రామాల మాదిరిగానే నక్సల్ బరీ ఉంది. పచ్చని పంట పొలాలు. కోతల కోసం ఎదురుచూస్తున్న చేలు. టీ దుకాణాలు…ఇక్కడే వృద్దులు, యువకులు తమ కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు. ప్రస్తుతం నక్సల్ బరీ గ్రామ పంచాయతీలో 21 గ్రామాలు ఉన్నాయి. 25 వేల మంది జనాభా ఉంది. దీనికి పక్కనే ఉన్న మూడు టీ తోటల్లో ఆరు వేల మందికి పైగా పనిచేస్తున్నారు. చాలా మంది తమ పొలాలను దున్నుకుంటున్నారు. ఇక్కడ పుట్టిన నక్సలైట్ ఉద్యమం గురించి అర్ధం చేసుకోవాలంటే 1940ల్లో ఆంధ్రదేశంలో సాగిన తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటాన్ని, పశ్చిమ బెంగాల్ లో సాగిన తెభగ ఉద్యమాన్ని ఆలోకన చేయాలి. ఈ దేశంలో రైతులు ఆయుధాలు పట్టిన ఏకైక ఉద్యమం తెలంగాణా పోరాటం అయితే హక్కుల సాధన కోసం వ్యవసాయ కూలీలు నడిపిన తెభగ ఉద్యమాన్ని బెంగాల్ ప్రజలు చూశారు.

బెంగాల్ లో యాభయ్యవ దశకంలో రైతుల అణచివేత ధోరణి, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కూలీల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. తెరాయ్ ప్రాంతంలో తెభగ ఉద్యమం ప్రభావం కనిపించింది. కాని టీ తోటల కార్మికుల అసంతృప్తిని బయటకు తెచ్చింది. `టీ తోటల కార్మికుల సంఘమే నక్సలైట్ ఉద్యమానికి అంకురార్పణ చేసింద’ని అప్పట్లో నక్సలైట్ ఉద్యమ నాయక ప్రముఖుల్లో ఒకరైన ముజిబుర్ రహ్మాన్ చెప్పారు. 1967 సంవత్సరంలో రైతాంగ ఉద్యమం అప్పటి రాజకీయ వాతావరణం నుంచి అనుకోకుండా పుట్టిందే అయినా అప్పటి నక్సల్ బరీ స్థానిక నాయకులు దానిని సాయుధ పోరాటంగా తీర్చిదిద్దారని నక్సలైట్ ఉద్యమ నిర్మాత, సిపిఐ (ఎంఎల్) వ్యవస్థాపకుడు చారు ముజుందార్ కుమారుడు అభిజిత్ ముజుందార్ పేర్కొన్నారు. `తెభగ ఉద్యమం సంపన్న రైతుల కుట్ర వల్ల భగ్నమైపోయిందని, ఈ ఉద్యమాన్ని మరింత శక్తిమంతంగా నిర్వహించాలంటే రైతులు ఆయుధం ధరించాల్సిన అవసరాన్ని మా నాన్న గ్రహించార’ని ఆయన చెప్పారు. ఆ తరువాత కానూ సన్యాల్ గా పేరుగాంచిన కృష్ణకుమార్ లో సరైన సహచరుడిని చారు ముజుందార్ గుర్తించారు. ఉద్యమం కాలంలో ఆయన సిపిఐలో చురుగ్గా పనిచేస్తున్న జంగల్ సంథాల్, కేసబ్ సర్కార్, బాబులాల్ విశ్వకర్మ, కదం మల్లిక్ తదితర నాయకులతో పరిచయాలు పెంచుకున్నారు. ‘1964లో సిపిఐ నుంచి విడిపోయి సిపిఐ(ఎం) ఏర్పడినప్పుడు, మావోయిస్టు విధానం పట్ల తనకున్న నిబద్ధతను మా నాన్నగారు ఎంత మాత్రం దాచుకోకుండా ప్రకటించేవార’ని అభిజిత్ వివరించారు. భూమి కోసం పేద రైతులు చేస్తున్నఆందోళన 1967 మే నెలలో కీలక మలుపు తిరిగింది. మొదటి బులెట్ పోలీసు తుపాకీ నుంచి దూసుకు వచ్చింది. అప్పటి నుంచే రైతాంగ ఉద్యమం హింసాత్మక దశలోకి మళ్ళింది. నక్సలైట్ ఉద్యమ నాయకుల్లో ఒకరైన పంజాబ్ సింగ్ భార్య సావిత్రి రావ్ ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి. ఆమె చెప్పిన కథనం ప్రకారం `ఒక రోజు ఉదయం కొంతమంది మగవాళ్ళు భూములు దున్నడానికి వెళ్ళారు. సాయంత్రం అయినా రాలేదు. వీళ్ళంతా తాగడానికి పోయారనుకున్నాం. మర్నాడూ వాళ్ళు రాకపోయే సరికి మేము ఆందోళనకు గురయ్యాం. భయపడ్డాం. మరుసటి రోజు కూడా భూముల్లోకి వెళ్ళిన మరో బృందం కూడా అదృశ్యమైంది. తర్వాతి రోజు ఉదయమే మేము కొంతమందిమి పొదల వెనకాల దాక్కుని పొలాల్లో ఏం జరుగుతుందో చూశాం. పొలాలు దున్నడానికి మగవాళ్ళు తయారుకాగానే పోలీసులు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళను తీసుకుపోయారు. ఆ భూములను జోత్ దార్ సొంతం చేసుకున్నాడని, అక్రమంగా దున్నేవాళ్ళను అరెస్టు చేయమని ఉత్తర్వులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. మరుసటి రోజున మేం అందరం బొరోజొరుజోట్ పొలాల్లో సమావేశమయ్యాం. ఏం జరిగినా కాని పోలీసులను పొలాల్లోకి రానివ్వకూడదని తీర్మానించుకున్నాం. దాంతో పోలీసులకు మాకు ఘర్షణ మొదలైంది. మాలో ఒకరు వేసిన బాణం తగిలి ఇనస్పెక్టర్ సోనమ్ వాంగ్డీ మరణించాడు. ఆ బాణం వేసింది ఎవరో ఇప్పటికీ మాకు తెలియద’ని ఆమె వివరించింది.

`ఇనస్పెక్టర్ వాంగ్డీ హత్యతో పోలీసులు దళాలు పొలాల్లో మొహరించాయి. ముందురోజు ఘర్షణలో పోలీసుల నుంచి లాక్కున్న తుపాకులను గిరిజనులు ఈ దళాలకు అప్పగించేశారు. కాని మే 25 వ తేదీన పెద్ద పోలీసు పటాలం నక్సల్ బరీ గ్రామం మీద విరుచుకుపడింది. దాంతో గ్రామస్థులు తమ చేతికి దొరికిన ఆయుధాలను అందుకున్నారు. మహిళలు తమ పసికందులను వీపున కట్టుకుని ముందుకు ఉరికారు. పోలీసులు తుపాకులు పేల్చారు. తొమ్మిది మంది మహిళలను, ఇద్దరు పసివాళ్ళను తూటాలకు బలి చేశారు. ప్రాణ త్యాగం చేసిన వీర వనితల పేర్లతో ఒక ఫలకం నక్సల్ బరీ రైల్వే స్టేషన్ సమీపంలో బెన్ గాయ్ జోట్ దగ్గర ఇప్పటికీ ఉంద’ని అభిజిత్ ముంజుందార్ వివరించారు.

ఈ సంఘటనతోనే నక్సల్ బరీ రైతాంగ ఉద్యమం వ్యవసాయ భూమి ఉద్యమ లక్షణాలను కోల్పోయింది. తీవ్రవాద సాయుధ పోరాట రూపం తీసుకుంది. సాయుధ పోరాటం పై కానూ సన్యాల్ కు వ్యక్తిగతంగా తనకు ఉన్న అభిప్రాయాలను పక్కనపెట్టి చారు ముజుందార్ తో పాటు ఆయుధాన్ని అందుకున్నాడు. నక్సల్ బరీ గ్రామానికి సమీపంలో ఉన్న ఫాన్సిద్వ గ్రామంలో 1967 జూన్ 28 న జరిగిన అతి పెద్ద రైతుల ప్రదర్శనలో ఈ సాయుధ పోరాటాన్ని చివరి వరకు అంటే భూమిపై హక్కును సాధించుకునే వరకు కొనసాగించాలని తీర్మానం చేసుకున్నారు. కాని ఈ పోరాటం సిపిఎం లో అంతర్గత ఆందోళనను రేపింది. హరే కృష్ణ కొనార్ లాంటి సిపిఎం నాయకులు మొదట్లో చాలా ఉత్సాహం చూపించారు. భూస్వాముల నుంచి భూములను స్వాధీనం చేసుకుని పేద రైతులకు పంచాలని ఉపన్యాసాలు దంచారు. తీరా పోరాటం మొదలయ్యే సరికి వారంతా పక్కకు తప్పుకున్నారు. `పేదలు హక్కులు సాధించుకోడానికి శాంతియుత మార్గం అంటూ ఏదీ ఉండదు. తుపాకీ గొట్టమే వాటిని సాధించిపెడుతుంద’ని అన్నారు ముజుబుర్ రహ్మాన్. అలనాటి విప్లవ స్మృతులను గర్తు చేసుకుని చెబుతున్నప్పుడు వృద్ధుని కళ్ళలో వెలుగు కనిపించింది. అప్పుడు యునైటడ్ ఫ్రంట్ ప్రభుత్వంలోని మంత్రుల బృందం నక్సల్ బరీ ప్రాంతాన్ని సందర్శించింది. కొన్ని భూ సంస్కరణలను ప్రతిపాదించింది. చివరకు 1967 జూలై 5 వ తేదీన ఒక ప్రణాళిక అమలు చేయడానికి అంగీకారం కుదిరింది. సాయుధ పోరాట నాయకులను లొంగిపోవాలని ప్రభుత్వం కోరింది. ఆగస్టు నెలాఖరుకల్లా వేలాది మంది సాయుధపోరాట యోధులు అరెస్టయ్యారు. కానూ సన్యాల్, చారు ముజుందార్, విశ్వనాథ్ ముఖర్జీ లాంటి ముఖ్య నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పశ్చిమ దినాజ్ పూర్, జల్పాయిగురి లాంటి చుట్టుపక్కల జిల్లాల్లో తలదాచుకున్నారు.

రెండేళ్ళ తరువాత… 1969 మేడే రోజున…కోల్ కతాలోని ఆక్టర్ లూనీ స్మారక చిహ్నం దగ్గర జరిగిన అతిపెద్ద మేడే ర్యాలీలో కానూ సన్యాల్ చరిత్రాత్మక ప్రకటన చేశారు. అదే దేశంలో మూడో వామపక్ష పార్టీ సిపిఐ(ఎంఎల్)ను స్థాపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు (దీనినే ఇప్పుడు మావోయిస్టు పార్టీగా పేరు మార్చారు). అగ్రగామి నేతగా, సిద్ధాంతకర్తగా నక్సలైట్లు ఆరాధించే కానూ సన్యాల్ ఇంకా బతికే ఉన్నారు. నక్సల్ బరీ గ్రామంలో ఓ చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. ఏడాది క్రితం సన్యాల్ పక్షవాతానికి గురయ్యారు. జ్ఞాపకాల పొరలను చీల్చుకుంటూ ఆయన ఇలా చెప్పారు. `సిపిఐ(ఎంఎల్) ఏర్పాటు చేయడానికి ముందే నాకు చారు ముంజుందార్ తో తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ప్రజలను చంపడం అనే సిద్ధాంతాన్ని ఆయన అనుసరించారు. నేను దానికి విరుద్ధం. అదే విభేదం. నేను అంతకు నెల రోజుల ముందే జైలు నుంచి విడుదల అయ్యాను. ఒక రోజు నన్ను హఠాత్తుగా పిలిచి కోల్ కతా వెళ్ళి పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయమన్నారు. కామ్రేడ్ సరోజ్ దత్తా, మరి కొంతమంది తయారుచేసి ఇచ్చిన ప్రకటనను మాత్రం నేను చదివాను’ అని ఆయన వివరించారు.

ఉవ్వెత్తున రగిలిన ఈ మంటలు 1960-70 సంవత్సరాల మధ్యకాలంలో బెంగాల్ అంతా వ్యాపించాయి. గ్రామీణ రైతుల కోసం సాగిన ఈ ఉద్యమానికి కోల్ కతా నగరంలో కూడా అద్భుతమైన మద్దతు లభించింది. అంతకు ముందు గానీ, తరువాత గానీ ఏ ఉద్యమానికీ ఇలాంటి అభిమానం లభించలేదు. సిర్ధార్ద్ శంకర్ రే నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన అణచివేతతో ఈ మంటలు చల్లారి పోయాయి. 1977లో వామపక్ష కూటమి బెంగాల్ లో అధికారంలోకి రావడంతో అనేక మంది నక్సల్స్ జైళ్ళ నుండి విముక్తి పొందారు.` కానీ చాలా మంది భావిస్తున్నట్లుగా వామపక్ష ప్రభుత్వం మమ్మల్నేమీ కరుణించలేదు. మమ్మల్ని అక్రమంగా ఆంధ్రప్రదేశ్ జైళ్ళలో నిర్బంధించారు. మేము ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో న్యాయ పోరాటం చేసి మా స్వాతంత్ర్యాన్ని గెలుచుకున్నామ’ని కానూ సన్యాల్ స్పష్టం చేశారు. గత విప్లవోద్యమ స్మృతుల జాడలు నక్సల్ బరీ గ్రామంలోనూ, అక్కడి ప్రజలలోనూ కనిపించడం కష్టమే. అక్కడికి దగ్గరలో ఉన్న తుకురియా అడవుల్లో నక్సలైట్లు గెరిల్లా యుద్ధ శిక్షణ ఇస్తుంటారన్న సమాచారన్ని దృష్టిలో పెట్టుకుని ఒక చిన్ని పిల్లవాడిని ప్రశ్నిస్తే `మేము రోజూ ఆ అడవిలో తిరుగుతూనే ఉంటాం. అక్కడ నక్సలైట్లు ఎవరూ లేరు. పాములు మాత్రం ఉన్నయ’ని సమాధానం ఇచ్చాడు. 1980కు ముందు అక్కడ నివసించామని అంగీకరించడానికి వృద్ధులు సైతం నిరాకరిస్తారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా ‘మేం ఎప్పుడో విన్నాం. కొంతమంది విధ్వంసకారులపై పోలీసులు కాల్పులు జరిపారట’ అని మాత్రం చెబుతారు. `మీరు నక్సల్ ఉద్యమ జాడలను తెలుసుకోడానికి నక్సల్ బరీ వెళితే ఏమీ ప్రయోజనం ఉండదు. ఆ స్మృతులను ఒక పద్ధతి ప్రకారం తుడిచేశారు. దానిని గురించి మాట్లాడటానికి ఇప్పటీకీ ఆ ప్రజలు భయపడతార’ని అభిజిత్ ముజుందార్ చెప్పారు.

కానూ సన్యాల్ తో కలిసి పనిచేసిన మరో అగ్రనేత జంగల్ సంథాల్ 1987లో మరణించారు. చివరి రోజుల్లో మద్యానికి బానిసైన సంథాల్ చివరకు ఆ వ్యసనానికే బలైపోయారు. విప్లవం పట్ల సంథాల్ కు ఉన్న భ్రమలు తొలగిపోయాయట అన్న ప్రశ్నకు కానూ సమాధానం ఇస్తూ లేదు, అలా జరగలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత సంథాల్ కారు కొనుక్కున్నాడు. నేను వద్దని సలహా చెప్పాను. అతను కారులో తిరగడంలో అర్ధంలేదు. అతను నాలుగు సార్లు పెళ్ళిళ్లు చేసుకున్నాడు. భార్యలను ఎలా పోషించేవాడో ఇప్పటికీ నాకు తెలియదు. ఉద్యమం కాదు మద్యమే అతని ప్రాణాలు తీసిందని వివరించారు.

ముజిబుర్ రహ్మన్ కుటుంబం ఇప్పుడు చిన్న దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఉజ్జ్వలమైన ఉద్యమ జ్ఞాపకాలను ఈ వృద్ధుడు ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. `నా తలపై అప్పటి ప్రభుత్వం 50 వేల రూపాయల నజరానాను ప్రకటించింది. నన్ను బతికుండగా గాని, శవంగా గాని అప్పగించిన వారికి ఆ బహుమతి ఇస్తామంది. అయినా నేను భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగేవాడిని. పోలీసులకు గాని, సిఆర్ పిఎఫ్ జవాన్లకు గాని నన్ను ముట్టుకునే ధైర్యం లేద’ని గర్వంగా చెబుతారు. మరో అగ్గిబరాటా నాయకుడు ఖోకొన్ ముజుందార్ యేడాది కాలంగా పక్షవాతంతో మాట పడిపోయి, బాధపడుతూ తన చివరి రోజులను గడుపుతున్నారు.

ఇప్పుడు సాగుతున్నలాల్ ఘడ్ ఉద్యమానికి నక్సల్ బరీకి పోలికలు కలుస్తాయా అన్న ప్రశ్నకు అభిజిత్ ముజుందార్ సమాధానం ఇస్తూ `నక్సలైట్ ఉద్యమం భూమిలేని నిరుపేదలను ఆధారం చేసుకుని వారి ప్రయోజనాల కోసం సాగింది. దానికి ఒక ప్రాంతం, కులం, జాతి అనే భేదాలు లేవు. కాని ఇప్పటి లాల్ ఘడ్ లో మావోయిస్టులు కేవలం గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నార’ని వివరించారు. కానూ సన్యాల్ కు అయితే మావోయిస్టుల మీద ఎలాంటి ఆశలూ లేవు. రెడ్ కారిడార్ అనే ఆ పదాన్నే నేను ద్వేషిస్తున్నానని ఆయన చెప్పారు. `మావోయిస్టుల ప్రభావం ఏవో కొన్ని అడవులకే పరిమితమైపోయింది. వాళ్ళ మనుగడ గెరిల్లా యుద్ధ తంత్రం మీదే ఆధారపడింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ అడవులను దాటి మావోయిస్టు ప్రభావం ప్రజల్లోకి వెళుతుందని నేను అనుకోవడం లేదని’ ఒకప్పటి నక్సలైట్ ఉద్యమ నిర్మాత కానూ సన్యాల్ అన్నారు.

Leave a comment