మక్కామసీదులో పేలుళ్లకు మూడేళ్ళు!


హైదరాబాద్: రాష్ట్రాని‌కే తలమానికంగా, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మక్కా మసీద్‌లో పేలుళ్లు జరిగి మూడేళ్లు. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేట్రేగిన ముష్కరులు… మొత్తం 14 మందిని బలిగొన్నారు. ఘటన జరిగి మూడేళ్లు కావస్తున్నా ఇంత వరకూ నిందితుల ఆచూకి కనిపెట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నగర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటన అనేక మందిని కలచివేసినా నగర వాసుల మనోధైర్యాన్ని మాత్రం దెబ్బతీయ లేకపోయింది.

మక్కా మసీద్… నిత్యం ప్రార్థనలతో… సందర్శకుల రద్దీతో… అడుగడుగునా ఆద్యాత్మికతతో విలసిల్లే ప్రాంతం. సుమారు 315 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ అద్భుతమైన కట్టడం… 2007 మే 18న ఒక్క సారిగా పేలుళ్లతో దద్దరిల్లింది. శుక్రవారం రోజు ప్రార్థనలు జరుగుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. పవిత్ర స్థలంలో ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు బాంబులు అమర్చి సెల్‌ఫోన్ ద్వారా భారీ పేలుడుకు పాల్పడ్డారు. హృదయ విదారకంగా జరిగిన ఈ ఘటనలో అనేక మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసాయి. అనంతరం జరిగిన ఘర్షణల్లో మరికొంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

అయితే… ఈ ఘటన జరిగి మూడేళ్లు పూర్తవుతుంది. అయినా ఇప్పటి వరకు ఈ ఘటనకు సంభందించిన నిందితుల ఆచూకిని పోలీసులు కనుక్కోలేక పోయారు. ఈ ఘటన జరిగిన తరువాత నగర ప్రజలు ఎంతో సంయమనం పాటించారు. ఎలాంటి మత కల్లోలాలకు ఆస్కారం లేకుండా సంయమనంతో మెలిగారు. నగర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటన అనేక మందిని కలచివేసినా నగర వాసుల మనోధైర్యాన్ని మాత్రం దెబ్బతీయ లేకపోయింది. ఎవరు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా తామంతా ఒక్కటేనని, మతసామరస్యానికి కట్టుబడి ఉంటామని హైదరాబాదీలు చాటిచెప్పారు.

బట్… టెర్రరిస్ట్‌లు మాత్రం తమ పంథా వీడలేదు. సరిగ్గా ఘటన జరిగిన రెండో ఏడాది పోలీసులపై పంజా విసిరారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను పొట్టనబెట్టుకున్నారు. అంతే కాకుండా నగరంలో ప్రతీ ఏడాది మే ఎయిటీన్త్‌ ఇన్సిడెంట్స్ రిపీట్‌ చేస్తామని హెచ్చరించారు. దానికి తగ్గట్లుగానే మరో కానిస్టేబుల్‌పై విరుచుకుపడ్డారు. మరోవైపు… ఈ ఏడాది కూడా మే 18న ముష్కరులు విధ్వంసాలకు పాల్పడే అవకాశముందని సమాచారమందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘటనలు జరుగుకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.ప్రపంచ ఖ్యాతి గాంచిన నగరాన్ని కాపాడు కోవడానికి అందరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. నగర ప్రజలంతా ఏక తాటిపై నిలిచి ముష్కరుల భారినుండి భాగ్యనరగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో లాగే ఈ సారి ఎలాంటి ఘటనలు జరక్కూడదని ఆశిద్దాం…

Advertisements

అటవీభూముల పరిరక్షణకు ప్రత్యేక పోలీసు బృందాలు


పీఏసీ సూచన
అటవీశాఖ పనితీరుపై సమీక్ష
హైదరాబాద్‌: రాష్ట్రంలో అటవీ ప్రాంతం క్రమంగా తగ్గిపోతోందని, అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) రాష్ట్ర అటవీశాఖ ముఖ్యకార్యదర్శికి సూచించింది. నాగం జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారమిక్కడ శాసనసభా కమిటీ హాలులో ప్రజాపద్దుల సంఘం సమావేశమై అటవీశాఖ పనితీరును సమీక్షించింది. 1997 నుంచి ఆడిట్‌ శాఖ అభ్యంతరాలు, వాటికి ఇచ్చిన సమాధానాలు, వివిధ ఆరోపణలపై చేసిన దర్యాప్తులు, తీసుకున్న చర్యలను ప్రధానంగా సమీక్షించారు. మిగిలిన శాఖలతో పోలిస్తే అటవీశాఖ మెరుగ్గా ఉందని పీఏసీ అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. 33 శాతం అటవీప్రాంతం ఉండాలని, కానీ రాష్ట్రంలో 23 శాతం మాత్రమే ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయని వెల్లడించారు.ఇప్పటి వరకు వేల ఎకరాల అటవీభూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకోవడానికి, భవిష్యత్తులో అన్యాక్రాంతం కాకుండా చూడడానికి అటవీశాఖకు 25 ప్రత్యేక పోలీసు బృందాలు అవసరమవుతాయని చెప్పారు. వీటిని రాష్ట్ర హోంశాఖ ద్వారా సమకూర్చాలని ముఖ్యమంత్రికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తమ వద్ద ఉన్న సమాచారం మేరకు ఒక్క కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలోనే సుమారు మూడువేల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు తెలుస్తోందని, ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అటవీభూములు గిరిజనేతరుల ఆక్రమణల్లో ఉన్నాయని చెప్పారు. కొన్నిచోట్ల రికార్డులను పూర్తిగా తారుమారుచేసినట్లు కనపడుతోందని, ఇలాంటివాటన్నింటిని పీఏసీ స్వయంగా పరిశీలించాలని యోచిస్తోందన్నారు. తాము క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తామన్నారు. అటవీభూములను ఆక్రమిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

తుపానుపై సిఎం సమీక్ష


హైదరాబాద్: తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రోశయ్య కోరారు. తుపానుపై మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని…. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. మచిలీపట్నానికి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాను ప్రభావంతో టవర్లు, కట్టడాలు కూలే అవకాశం ఉందన్నారు. అన్ని ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగిన సర్కారు


హైదరాబాద్: రాజకీయం, తీవ్రవాదం, వేర్పాటువాదం అన్నీ మరుగునపడిపోయాయి.. అటు జనంలోను, ఇటు సర్కారులోనూ ఇప్పుడంతా లైలా భయమే. తుపాను ముప్పు తీరాన్ని తాకడంతో.. సహాయచర్యలంటూ ప్రభుత్వం, ముందస్తుజాగ్రత్తల్లో జనం నిమగ్నమయ్యారు. సెలవు రద్దు చేసిమరీ అధికారులను పరుగుపెట్టిస్తోంది ప్రభుత్వం. వీలైనంత నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగింది సర్కారు. ఉత్తర, దక్షిణకోస్తాల్లో తుపాను అలజడి షురూ అవడంతో.. ప్రభుత్వం ముందే మేలుకుంది. సెక్రటేరియట్, కలెక్టరేట్లలో కదలిక కనిపించింది. స్వయంగా రంగంలో దిగిన ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు- శ్రీకాకుళం మధ్యనున్న తొమ్మిది జిల్లాల కలెక్టర్లు ఆన్‌లైన్లోకొచ్చి.. సహాయకచర్యలపై ఆదేశాలందుకున్నారు. తీవ్రత ఎక్కువగా వుండవచ్చని, తేలిగ్గా తీసుకోవద్దని సీఎం అధికారులను కోరారు. ప్రజలకు భరోసా కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈనెల 25 వరకూ అధికారులందరికీ సెలవులు రద్దయిపోయాయ్. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి స్పెషల్ కమిటీ ఒకటి నియమితమైంది. ముంపు ప్రాంతాల నుంచి RTC ప్రత్యేక బస్సులు నడపనుంది. బాధితులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అందించడానికి పౌరసరఫరా అధికారులు సమాయత్తమయ్యారు.

శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఉధృతి ఎక్కువగా కనిపించే అవకాశముంది కనుక.. అక్కడ 139 తుపాను షెల్టర్లు ఏర్పాటయ్యాయి. 224 లోతట్టు ప్రాంతాలను గుర్తించి.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు టాస్క్‌ఫోర్స్ అధికారులు. కళింగపట్నం ఓడరేవులో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. అత్యవసర సాయం కోసం ప్రజలకు టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో వుంచారు. తుపాను హెచ్చరికలతో ఉభయగోదావరి జిల్లాల్లో ఆందోళన నెలకొంది. భైరవపాలెం వద్ద ఓ ఫిష్షింగ్ బోట్‌ తప్పిపోయి.. 8 మంది మత్స్యకారుల ఆచూకీ కనబడక.. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం గాలింపు చర్యల్లో నిమగ్నమైంది. బాధిత కుటుంబాలను పరామర్శించిన కలెక్టర్ రవిచంద్ర, పొంచివున్న తుపాను ముప్పుపై కూడా సీరియస్‌గా స్పందిస్తున్నారు.

దక్షిణకోస్తాలోనూ అదే పరిస్థితి. రుతుపవనాల రాక, లైలా తుపానుల కారణంగా భారీవర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంతాల్లో టూరేశారు. తీరంలోని మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. తీరప్రాంతం తక్కువగా వున్న గుంటూరు లాంటి జిల్లాల్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు అన్ని ఓడరేవుల్లోనూ డేంజర్ లైట్లే వెలుగుతున్నాయి. చేపల వేట ఆగిపోయింది. ఫిష్షింగ్ బోట్లన్నీ లంగరేసి రెస్ట్ తీసుకుంటున్నాయి. ప్రస్తుతానికి ఓ మోస్తరు వర్షంతో సద్దుచేయకుండా కనిపిస్తున్న రాష్ట్రంలో.. రేపు తెల్లారేసరికి తుపాను తీరం దాటితే.. సీను మారిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా తీరప్రాంతం భారీగా నష్టపోవడం గ్యారంటీ అన్న హెచ్చరికల నడుమ.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు జనం.

టీటీడీ సిబ్బందిపై హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు


హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానంలో సిబ్బంది దురుసు ప్రవర్తన, సౌకర్యాల లేమిపై కొందరు భక్తులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. గంటలు తరబడి క్యూలైన్లలో నిలబడి స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులపై టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఈ నెల 22వ తేదీలోగా నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ సుభాషణ్‌రెడ్డి టీటీడీ ఈవోను ఆదేశించారు.

గోపీచంద్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ చిత్రం


హైదరాబాద్‌: వైష్ణో అకాడమీ పతాకంపై ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయిలాంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్ని, ‘పోకిరి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ని నిర్మించిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ తాజాగా గోపీచంద్‌తో ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్‌ వివరిస్తూ ‘గోపిచంద్‌ హీరోగా నిర్మించి ఈ చిత్రం పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. వైష్ణో అకాడమీ బ్యానర్‌పై నవంబర్‌లో ప్రారంభించి సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేస్తాం. ఇక నుంచి నా దర్శకత్వంలో వచ్చే చిత్రాలన్నీ వైష్ణో అకాడమీ బ్యానర్‌లోనే ఉంటాయి అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం పూరి జగన్నాథ్‌ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

కరవు పల్లెలకు సిఎం పలకరింపు


హైదరాబాద్: కరవుతో బాధ పడుతున్న పెల్లెలను ఇక మీద ప్రతి నెలా ముఖ్యమంత్రి పలకరించనున్నారు. అధికారులు ఎలాంటి చర్యలు తసుకున్నారో నేరుగా ప్రజల్నే అడిగి తెలుసుకుంటారు. గ్రామాల్లోని రచ్చబండవద్దే కరవుపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్రంలో కరవుపై యాక్షన్‌ ప్లాన్‌ను సిఎం ప్రకటించారు. కరవుతో బాధ పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్లను సిఎం ఆదేశించారు. కరవు నుంచి బయటపడే వరకు ఎవరూ సెలవు పెట్టకూడదని, ప్రతి ప్రభుత్వ పథకం ప్రజలకు అందేలా చూడాలని సిఎం అధికారులకు సూచించారు. హైదరాబాదులో కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏడుగురు మంత్రులు కూడా హాజరయ్యారు.