హోంమంత్రిని కలిసిన సాంబశివుడు


హైదరాబాద్‌: మావోయిస్టు మాజీ నేత సాంబశివుడు ఈరోజు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. ఈనెల 25న తాను నల్గొండ జిల్లా భువనగిరిలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ సాధన యాత్ర, బహిరంగసభకు అనుమతి ఇవ్వాలని ఆయన మంత్రిని కోరారు. సభ అనంతరం మహబూబ్‌నగర్‌ వరకు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. తన యాత్రకు ప్రభుత్వం అడ్డంకులు కలిగిస్తోందని అయినా తాను అనుమతికోసం మానవహక్కుల సంఘాన్ని, కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు.

Advertisements

సమాచారవ్యవస్థను మారుమూలకు విస్తరిస్తాం: మంత్రి రాజా


హైదరాబాద్‌: సమాచార వ్యవస్థను మారుమూలప్రాంతాలకు విస్తరించాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎ.రాజా అన్నారు. టెలికాం రంగంలో ప్రపంచంలోనే భారత్‌ హబ్‌ కావాలన్నారు. 600 మిలియన్ల టెలిఫోన్‌ వినియోగదారులతో భారత్‌లో ప్రతి మారుమూల ప్రాంతానికి టెలిఫోన్‌సౌకర్యం ఉందన్నారు. ప్రతినెల 20 మిలియన్ల కొత్త కనెక్షన్లు తీసుకుంటున్నారని తెలిపారు. అంతర్జాతీయ టెలి కమ్యూనికేషన్‌ యూనియన్‌ అయిదవ సదస్సును ఈరోజు హైదరాబాద్‌లో ఆయన ప్రారంభించారు. నాలుగేళ్లకు ఓసారి జరిగే ఈ సదస్సు ఈ ఏడాది భారత్‌లో జరుగుతోంది. దీనికి 142 దేశాలనుంచి 1226మంది ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సులో ముందుగా మంగుళూరు విమాన ప్రమాదం బాధితులకు సంతాపం ప్రకటించారు. ఈ సదస్సు వచ్చే నెల 4వరకు జరుగుతుంది.

మహిళా సంఘాలపై సర్కారు సవతి ప్రేమ!


హైదరాబాద్‌: దళారుల బారి నుంచి రైతులను కాపాడటంతోపాటు గ్రామ స్థాయిలో మహిళా సంఘాలకు ఆదాయం సమకూర్చిపెట్టేందుకు ప్రవేశపెట్టిన ధాన్యం మార్కెటింగ్‌ పథకం మూలనపడింది. కొనుగోలుకు అవసరమైన సంచులను సకాలంలో సరఫరా చేయకపోవడమేగాక కొన్న ధాన్యాన్ని వెంటనే తరలించే చర్యలూ చేపట్టకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడంలేదు. కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ రైతులకు డబ్బులు ఇప్పించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది.

కొనుగోళ్లు జరిపినందుకుగానూ మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన కమీషనూ సరిగ్గా అందడంలేదు. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రం మొత్తంమీద ఇప్పటిదాకా రూ.188 కోట్ల విలువైన 18.3 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పటి దాకా రైతులకు పంపిణీ అయింది రూ.14 కోట్లే. డబ్బులు ఇచ్చేందుకు పెట్టిన గడువు దాటినా ఇంకా రైతులకు అందలేదు. కమీషన్‌ ఆకర్షణీయంగా ఉండటంతో మహిళలు ఈ వ్యాపారంపై ఆసక్తి చూపుతూ వస్తున్నారు. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులకూ సౌకర్యంగా ఉంది.

మహిళా సంఘాలు కొనుగోలు చేసే ధాన్యాన్ని మొదట నిర్దేశించిన కొంత మంది మిల్లర్లకు ఇస్తారు. వాటిని మిల్లు పట్టి భారత ఆహార సంస్థకు మిల్లర్లు అందజేస్తారు. సంస్థ నుంచి డబ్బులు రాగానే మహిళా సంఘాలద్వారా రైతులకు చెల్లిస్తున్నారు. ఈ ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని 40 రోజుల తర్వాత డబ్బులు ఇస్తామని రైతులకు ముందుగానే చెబుతున్నారు.

బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధర లభించని నేపథ్యంలో డబ్బులు ఆలస్యమైనా అధిక ధరల ఆశతో రైతులు ధాన్యాన్ని మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అమ్ముతున్నారు. కానీ ఈసారి చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలను నెలకొల్పకపోవడంతో రైతులు దళారుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్దతు ధర లభించకపోయినా రైతుకు గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. మహిళా సంఘాలు కమీషన్‌నూ కోల్పోయాయి.

కరీంనగర్‌కు అన్యాయం
గత ఏడాది ధాన్యం కొనుగోలుచేసి పెట్టినందుకు కరీంనగర్‌ జిల్లాలో మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ.80 లక్షల కమీషన్‌ ఇవ్వలేదు. ఇక ఈ ఏడాదిలో ఆ జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రాన్నీ ఏర్పాటు చేయలేదు. రాష్ట్రం మొత్తంమీద గత ఏడాదిలో మహిళా సంఘాలద్వారా సేకరించిన ధాన్యంలో దాదాపు సగం కరీంనగర్‌ జిల్లాలోనే కొన్నారు. గత ఏడాది దాదాపు రూ.543 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఇందులో సింహ భాగం అంటే దాదాపుగా రూ.231 కోట్ల విలువైన ధాన్యాన్ని ఈ జిల్లాలోనే కొన్నారు.

‘వేటూరి భార్యకు ఇంటిని సమకూర్చండి’


హైదరాబాద్‌: సరస్వతీదేవి ముద్దుబిడ్డ, ప్రముఖ గేయరచయిత వేటూరి సుందరరామమూరికి హైదరాబాద్‌లో ఇల్లు లేదని, ఆయన భార్యకు ఇంటిని సమకూర్చి న్యాయం చేయాలని ప్రముఖ నటుడు విజయచంద్ర కోరారు. ఇటీవల వేటూరి ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేశారన్నారు. 30 ఏళ్ల నుంచి సినీపరిశ్రమలో ఉన్న తనకి హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఇల్లు లేదని బాధ వ్యక్తం చేశారని చెప్పారు.

ప్రభుత్వం గానీ, సినీపరిశ్రమ ప్రముఖులు గానీ ఆయన భార్యకు అండగా ఉంటామని తెలుపుతూ ఇంటిని సమకూర్చి, ఆ తెలుగు కవికి న్యాయం చేయాలన్నారు. వేటూరి చనిపోలేదని, పాటల రూపంలో ఎప్పుడూ బతికే ఉంటారని విజయచంద్ర అన్నారు.

28 నుంచి ఓటర్ల నమోదు


హైదరాబాద్‌: భారత ఎన్నికల కమిషన్‌ ఈ సంవత్సరం వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు లోపాలు లేని ఓటరు గుర్తింపు కార్డులు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఐ.వి. సుబ్బారావు ఉద్ఘాటించారు.

18 ఏళ్లు దాటిన పౌరులందరినీ ప్రజాస్వామ్యంలో భాగస్తుల్ని చేయాలన్న ఉద్దేశంతో ఈ నెల 28 నుంచి 12 వరకు 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టినట్లు తెలిపారు. ఇదే సమయంలో పాత కార్డుల్లో లోపాల సవరణ చేపట్టినట్లు చెప్పారు.

రోశయ్య, డీఎస్‌ ఢిల్లీ పర్యటన


హైదరాబాద్‌: రెండురోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం రాత్రి పదిగంటలకు ఢిల్లీకి బయల్దేరుతున్నారు. సీఎంతో పాటు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కూడా వెళ్లనున్నారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు సీఎం, డీఎస్‌లు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆదివారం ఇక్కడి పటాన్‌చెరులో ఓ కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్న అనంతరం కలిసే ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం వరకు అక్కడే ఉంటారు.

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమౌతారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం, డీఎస్‌ల పర్యటన కీలకంగా మారనుందని అధికార, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా సంక్షేమ పథకాల అమలు వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలపై సోనియా, ప్రధానిలతో వీరు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికేరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి సీఎం రోశయ్య నివేదిక పంపినట్లు తెలిసింది. రోశయ్య అనుకూల వర్గం వై.ఎస్‌. ప్రవేశపెట్టిన పథకాలను సమీక్షించాలని డిమాండ్‌ చేస్తుండగా, మరోవైపు జగన్‌ వర్గం దీన్ని వ్యతిరేకిస్తోంది.

పరస్పర విరుద్ధ భావనల నేపథ్యంలో సీఎం, డీఎస్‌ల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపైనా చర్చ జరిగే అవకాశాలున్నట్లు తెలిసింది. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు, రాష్ట్రంలో లైలా తుపాను ప్రభావం, కేంద్రసాయం తదితర అంశాలపైచర్చించనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలను సీఎం వారి దృష్టికి తీసుకెళ్లనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

చంద్రబాబా రోశయ్యను విమర్శించేది: తులసిరెడ్డి
తొమ్మిదేళ్ల తన పాలనలో అభివృద్ధిని అటకెక్కించి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన తెదేపా అధినేత చంద్రబాబు ఇప్పుడు సీఎం రోశయ్యను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్‌.తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగడం లేదని, దీనికి వైఎస్‌, రోశయ్యలే బాధ్యులనటం విడ్డూరంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గణాంకాలు పరిశీలిస్తే ఎవరు సంక్షేమానికి పెద్దపీట వేశారో అర్థమవుతుందని తెలిపారు.

మావోయిస్టులపై ఆకాశ దాడులు!


రంగంలోకి హెలికాప్టర్లు
వైమానిక మద్దతు కోరుతున్న రాష్ట్రాలు
ఎటూ తేల్చుకోని కేంద్రం
లాభం కంటే నష్టమే ఎక్కువ: నిపుణులు
హైదరాబాద్‌: మావోయిస్టుల చేతుల్లో వరుస ఎదురుదెబ్బలు తింటున్న భద్రతా బలగాలకు ఇక ‘ఆకాశమార్గం’ తప్పేటట్లులేదు. నక్సల్స్‌పై పోరాటంలో గగనతల దాడులే శరణ్యమని రాష్ట్రాలు కోరుతున్నాయని కేంద్ర హోంమంత్రి చిదంబరం సోమవారం ఢిల్లీలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాబోయే రోజుల్లో హెలికాప్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అడుగడుగునా మందుపాతర్లు అమర్చడంతో ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల్లో భద్రతా బలగాలు ఎటూ కదలలేని పరిస్థితి. ఇక మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం ఆకాశమార్గమే. ఇది కాస్త క్లిష్టమైన ప్రక్రియే అయినప్పటికీ ఇంతకు మించి ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో ఇప్పుడు కేంద్రం కూడా ఆలోచనల్లో పడింది.

వాస్తవానికి మావోయిస్టులపై దాడులకు వైమానిక మద్దతు తీసుకోవాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. చాలాకాలం నుంచి నలుగుతూనే ఉంది. దశాబ్దకాలం క్రితమే మన రాష్ట్ర పోలీసులు ఏరియల్‌ సర్వేకోసం గ్రేహౌండ్స్‌ ఆధ్వర్యంలో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొనుగోలు చేశారు. కాని వాటివల్ల ఆశించిన ఫలితాలు రాలేదు. అత్యవసర సరిస్థితుల్లో బలగాలను తరలించేందుకు 35 మందిని మోసుకొని వెళ్లగలిగే ట్రూప్‌ క్యారియర్‌ హెలికాప్టర్‌ అందించాలని మన రాష్ట్రం నాలుగైదేళ్ల నుంచీ కేంద్రాన్ని కోరుతోంది. దీనికి కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. ఛత్తీస్‌గఢ్‌లో మావోలు పెట్రేగిపోతుండటంతో వారిపై గగనతల దాడులు మినహా గత్యంతరం లేదని కేంద్రం భావిస్తున్నట్లు చిదంబరం వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

ఒకవేళ నిజంగా కేంద్రం వైమానిక దాడులు మొదలుపెడితే పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పూర్తిస్థాయి యుద్ధం సమయంలోనే వైమానిక దాడులు నిర్వహిస్తారు. శత్రువులు సమూహాలుగా సంచరించేటప్పుడు వారందర్నీ మట్టుబెట్టే ఉద్దేశంతో నిముషానికి ఆరువేల రౌండ్ల వరకూ కాల్చగలిగే సామర్థ్యం ఉన్న ‘మల్టీ బ్యారెల్‌ గ్యాట్లింగ్‌ గన్‌’ బిగించిన హెలికాప్టర్‌ను రంగంలోకి దింపుతారు. ఇలాంటి తుపాకులు కొనుగోలు చేసేందుకు ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వశాఖ టెండర్లు పిలిచింది. శత్రుదేశంపై దాడి సమయంలో ఈ తరహా దాడుల వల్ల ప్రయోజనం ఉటుందేమోకాని దేశ ప్రజలతో కలిసిపోయి ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న మావోయిస్టులను ఏరివేయడానికి మాత్రం పనికి రాకపోగా కొత్త సమస్యలు ఎదురవుతాయనే వాదన బలంగా వినిపిస్తోంది.

మావోయిస్టులు ఇంకా గెరిల్లా యుద్ధతంత్రంతోనే పొంచి ఉండి దాడులు చేస్తున్నారు. ఎదురుబొదురు నిలబడి పోరాడే పొజిషనల్‌వార్‌ దశకు ఇంకా చేరుకోలేదు. అటవీ ప్రాంతంలో గిరిజనులతో కలిసి ఉన్న వీరిపై ఆకాశమార్గంలో గుర్తించి దాడిచేయడం సాధ్యంకాదు. ఒకవేళ అటువంటి ధైర్యం చేస్తే మావోయిస్టుల కంటే సాధారణ ప్రజలకే ఎక్కువ నష్టం కలుగుతుంది. అనేక పురాతన గిరిజన జాతులు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో సాధారణ ప్రజలకు ప్రాణహాని కలిగే పక్షంలో వెల్లువెత్తే విమర్శలు తట్టుకోవడం కష్టం. పైగా శత్రువు బలంగా ఉన్నప్పుడు ఒక అడుగు వెనక్కి వేసినా తప్పులేదన్నది గెరిల్లా సిద్దాంతం. ఒకవేళ ప్రభుత్వం వైమానిక దాడులకు దిగే పక్షంలో మావోయిస్టులు సాధారణ ప్రజల్లో కలిసిపోతారు. అటువంటప్పుడు వారిని గుర్తించడం కూడా కష్టమే. అన్నిటికంటే ముఖ్యంగా మావోయిస్టులు రాకెట్‌ లాంచర్లు సమకూర్చుకున్నారు. వీటిద్వారా హెలికాప్టర్లపై దాడిచేసే పక్షంలో నష్టం అపరిమితంగా ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మావోయిస్టులపై వైమానిక దాడుల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందనేది నిపుణుల వాదన. అయితే బలగాలను తరలించేందుకు పరిమితంగానైనా హెలికాప్టర్లను వినియోగించడం వల్ల ప్రయోజనం ఉంటుందని మావోయిస్టు కార్యకలాపాలు ఎదుర్కోవడంలో విశేష అనుభవం ఉన్న ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ముందుగా మావోయిస్టుల కదలికలకు సంబంధించి నిర్దుష్టమైన సమాచారం సేకరించిన తర్వాత వారికి సమీపంలో ట్రూప్‌ క్యారియర్ల ద్వారా బలగాలను తరలించాలి. ఆపరేషన్‌ పూర్తి చేసిన తర్వాత మళ్లీ హెలికాప్టర్‌లో వారిని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం ద్వారా కొంతవరకైనా ప్రయోజనం ఉంటుంది. ఇక ఇదే పద్దతిలో హెలికాప్టర్‌ల ద్వారా బలగాలను ఒక ప్రాంతంలో దింపి కొంతదూరం అడవుల్లో గాలింపులు నిర్వహించిన తర్వాత మరో ప్రదేశం నుంచి వారిని తరలించడం వల్ల కూడా లాభం ఉంటుంది. అయితే హెలికాప్టర్లను వాడుతున్నప్పుడు వాటిని కూల్చివేసేందుకు జరిగే ప్రయత్నాలను తట్టుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా మావోలపై విరుచుకుపడటం సాధ్యంకాకపోయినా వాటిని వ్యూహాత్మకంగా వాడుకోగలిగితే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.