రాష్ట్రంలో ఉపాధి హామీ భేష్: మంత్రి ధర్మాన


శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్థి పధకాలలో ఉపాధి హామి పధకం అత్యంత సమర్థవంతంగా అమలవుతుందని రాష్ట్ర రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాధరావు అన్నారు. గార మండలం అంపోలు గ్రామంలో నిర్వహించిన ప్రజాపధం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర రెడ్డి చేపట్టిన అభివృద్థి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.

ముందుగా త్రాగునీరు, విద్యుత్తు, ఉపాధి హామి పధకం, 108, 104, పనితీరును అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు పూర్తిస్ధాయిలో వినియోగించుకోవాలన్నారు. ఉపాధిహామీ పథకం కింద ఒక్కొక్కరికి కూలీ ఎంత వస్తుంది అడిగితెలుసుకున్నారు. మే 1 నుండి కూలీ రేట్లు పెంచినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులను ఆరోగ్య పరిస్జితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌శాఖ పనితీరును అడిగి తెలుసుకొనగా కొన్ని పనుల నిమిత్తం గ్రామస్తుల భాగస్వామ్యంగా కొంత పైకం కట్టవలసిందిగా ఎఇ. వివరించారు.

మంత్రి గ్రామస్తులు చెల్లించవలసిన పైకాన్ని తన నిధులనుంచి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్డీఓ నక్కసత్యనారాయణ, మత్స్యశాఖ ఉపసంచాలకులు కోటేశ్వరరావు, అంపోలు సర్పంచ్‌ గొండు సౌధామణి, ఎంపిపి గొండు రఘురామ్‌, డిసిఎంఎస్‌.చైర్మన్‌ గొండు కృష్ణ హౌసింగ్‌ పిడి.విద్యాసాగర్‌ఒ, ఎంపిడిఓ వెంకటరామన్‌, తాహాశీల్దార్‌ఒ దయానిధి, విద్యుత్‌ శాఖ ఎఇ.తదితరులు పాల్గొన్నారు.

Advertisements

యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగిన సర్కారు


హైదరాబాద్: రాజకీయం, తీవ్రవాదం, వేర్పాటువాదం అన్నీ మరుగునపడిపోయాయి.. అటు జనంలోను, ఇటు సర్కారులోనూ ఇప్పుడంతా లైలా భయమే. తుపాను ముప్పు తీరాన్ని తాకడంతో.. సహాయచర్యలంటూ ప్రభుత్వం, ముందస్తుజాగ్రత్తల్లో జనం నిమగ్నమయ్యారు. సెలవు రద్దు చేసిమరీ అధికారులను పరుగుపెట్టిస్తోంది ప్రభుత్వం. వీలైనంత నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగింది సర్కారు. ఉత్తర, దక్షిణకోస్తాల్లో తుపాను అలజడి షురూ అవడంతో.. ప్రభుత్వం ముందే మేలుకుంది. సెక్రటేరియట్, కలెక్టరేట్లలో కదలిక కనిపించింది. స్వయంగా రంగంలో దిగిన ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు- శ్రీకాకుళం మధ్యనున్న తొమ్మిది జిల్లాల కలెక్టర్లు ఆన్‌లైన్లోకొచ్చి.. సహాయకచర్యలపై ఆదేశాలందుకున్నారు. తీవ్రత ఎక్కువగా వుండవచ్చని, తేలిగ్గా తీసుకోవద్దని సీఎం అధికారులను కోరారు. ప్రజలకు భరోసా కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈనెల 25 వరకూ అధికారులందరికీ సెలవులు రద్దయిపోయాయ్. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి స్పెషల్ కమిటీ ఒకటి నియమితమైంది. ముంపు ప్రాంతాల నుంచి RTC ప్రత్యేక బస్సులు నడపనుంది. బాధితులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అందించడానికి పౌరసరఫరా అధికారులు సమాయత్తమయ్యారు.

శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఉధృతి ఎక్కువగా కనిపించే అవకాశముంది కనుక.. అక్కడ 139 తుపాను షెల్టర్లు ఏర్పాటయ్యాయి. 224 లోతట్టు ప్రాంతాలను గుర్తించి.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు టాస్క్‌ఫోర్స్ అధికారులు. కళింగపట్నం ఓడరేవులో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. అత్యవసర సాయం కోసం ప్రజలకు టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో వుంచారు. తుపాను హెచ్చరికలతో ఉభయగోదావరి జిల్లాల్లో ఆందోళన నెలకొంది. భైరవపాలెం వద్ద ఓ ఫిష్షింగ్ బోట్‌ తప్పిపోయి.. 8 మంది మత్స్యకారుల ఆచూకీ కనబడక.. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం గాలింపు చర్యల్లో నిమగ్నమైంది. బాధిత కుటుంబాలను పరామర్శించిన కలెక్టర్ రవిచంద్ర, పొంచివున్న తుపాను ముప్పుపై కూడా సీరియస్‌గా స్పందిస్తున్నారు.

దక్షిణకోస్తాలోనూ అదే పరిస్థితి. రుతుపవనాల రాక, లైలా తుపానుల కారణంగా భారీవర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంతాల్లో టూరేశారు. తీరంలోని మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. తీరప్రాంతం తక్కువగా వున్న గుంటూరు లాంటి జిల్లాల్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు అన్ని ఓడరేవుల్లోనూ డేంజర్ లైట్లే వెలుగుతున్నాయి. చేపల వేట ఆగిపోయింది. ఫిష్షింగ్ బోట్లన్నీ లంగరేసి రెస్ట్ తీసుకుంటున్నాయి. ప్రస్తుతానికి ఓ మోస్తరు వర్షంతో సద్దుచేయకుండా కనిపిస్తున్న రాష్ట్రంలో.. రేపు తెల్లారేసరికి తుపాను తీరం దాటితే.. సీను మారిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా తీరప్రాంతం భారీగా నష్టపోవడం గ్యారంటీ అన్న హెచ్చరికల నడుమ.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు జనం.

రాజశేఖర్‌, జీవిత కేసు కొట్టివేత


శ్రీకాకుళం: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారంలో భాగంగా జిల్లాలోని టెక్కలిలో కులం పేరుతో ప్రచారం నిర్వహించారని సినీ హీరో రాజశేఖర్‌, జీవితపై టెక్కలి పోలీసులు అప్పటిలో కేసు నమోదు చేశారు. ఈ కేసు టెక్కలి కోర్టులో విచారణ సాగుతుండగా హైకోర్టులో న్యాయమూర్తి డి.భవానిప్రసాద్‌ కేసును కొట్టివేసినట్లు వారి తరఫున ఇక్కడి న్యాయవాది వివేకానంద తెలిపారు. టెక్కలి పోలీసులు రాజశేఖర్‌, జీవితపై కులం పేరుతో ప్రచారం నిర్వహించి, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని అప్పటిలో కేసు పెట్టారు.

రాధాకృష్ణ ఆలయంలో చోరీ


శ్రీకాకుళం: కంచిలి మండల కేంద్రంలోని రాధాకృష్ణ ఆలయంలో చోరీ జరిగినట్టు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆలయ గర్భ గుడికి వేసిన రెండు తాళాలు, సైకిల్‌ చైన్‌లు విరగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించి గర్భ గుడిలోని రాధాకృష్ణ విగ్రహాలకు ఉన్న బంగారు కళ్లు, బొట్లు, బీర్వాలో దాచి ఉంచిన వేయి రూపాయల నగదును అపహరించారు. విరగొట్టిన తాళాలను ఆలయ గర్భ గుడి పక్కనే వదిలి పారిపోయారు. విశాఖపట్నం నుంచి క్లూస్‌ టీం సంఘటనా స్థలానికి చేరుకొని వేలు ముద్రాలను, ఆధారాలను సేకరించారు. ఆలయ అర్చకులు సుభాష్‌ పురోహిత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి పోలీస్‌స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మత్స్యకారులకు త్వరలో గుర్తింపుకార్డులు


శ్రీకాకుళం: మత్స్యకారులకు త్వరలో గుర్తింపుకార్డులు ఇస్తామని మత్స్యశాఖ సహాయ సంచాలకులు, ఇన్‌ఛార్జ్‌ అదనపు సంచాలకులు ఎం.ఎస్‌.యాకుబ్‌ బాష అన్నారు. స్థానిక మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో జిల్లా మత్స్యకారుల సహకార సంఘం ఆధ్వర్యాన మైలపల్లి లక్ష్మణుడు అధ్యక్షతన మహజన సభ జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, మత్స్యకారుల ప్రయోజనార్థం గుర్తింపుకార్డులు అందజేసేందుకుగాను జిల్లాలో 75 శాతం వరకు సర్వే పూర్తయిందని అన్నారు. మిగిలిన ప్రాంతాలలో దీనిని పూర్తి చేసి గుర్తింపుకార్డులు అందజేస్తామన్నారు. మత్స్యకారులకు సముద్రంలో చేపట వేట నిషేధ సమయమైన ఏప్రిల్‌, జూన్‌ నెలలకు సంబంధించి ఉచితంగా బియ్యం అందజేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. సమావేశానికి అధ్యక్షతన వహించిన జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు మైలపిల్ల లక్ష్ముడు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి దివాకర్‌ తదితరులు మాట్లాడారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా అమలవుతున్న ఐసిడిపి పథకం కింద మత్స్యకారులకు చేపట వేట పరికరాలు చేప పిల్లల సరఫరా మేత కొనుగోలు చేసేందుకు అర్హత గల సంఘాలను ఎంపిక చేయనున్నారు. ఎన్‌ఎఫ్‌పిడి పథకం ద్వారా ప్రతి మత్స్యకార సంఘానికి మినీ ఐస్‌ ప్లాంట్‌, ఫిష్‌ ట్రాన్స్‌పోర్టు వాహనం కొనుగోలుకు స్వదేశీ మత్స్యకార సంఘాలకు చేప పిల్లలు, చేపల ఆహారం, చేపల వేట పరికరాల కొనుగోలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని సభ్యులు కోరారు. స్వదేశీ మత్స్యకార సహకార సంఘాలకు బీసీ ప్యాకేజీ కింద చేప పిల్లల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ వర్తింపజేయాలని సభ్యులు కొంతమంది డిమాండ్‌ చేశారు.

ఢిల్లీకి పయణమైన థర్మల్‌ పోరాట సమితి


శ్రీకాకుళం: జిల్లాలోని సోంపేట మండల పరిధిలో గల బేల ప్రాంతంలో నిర్మించతలపెట్టిన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా కృష్ణారావు, రామారావు, బి.సుందరయ్య తదితరుల ఆధ్వర్యంలో స్థానిక పర్యావరణ పరిరక్షణ సమితి బృందం ఢిల్లీకి పయణమైంది. ఈ సందర్భంగా పోరాట సమితి సభ్యులు మాట్లాడుతూ, ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు జయరాం రమేష్‌, మమత బెనర్జీలతోపాటు ఆంధ్ర ఎంపిలను కలవనున్నట్లు తెలిపారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల జరిగే నష్టాలను వారికి వివరిస్తామని చెప్పారు. వారినుంచి స్పష్టమైన పొందేంత వరకు తిరిగి రామని అన్నారు. కేంద్ర మానవహక్కుల కమీషన్‌కు కలవనున్నట్లు తెలిపారు. జంతర్‌మంతర్‌ వద్ద అక్కడ ఉన్న మన ప్రాంతానికి చెందినవారితో ఆందోళన చేపట్టనున్నట్లు వివరించారు. ఢిల్లీకి పయణమైన వారిలో బి.ఢిల్లీరావు, టి.కామేష్‌, ఎం.శరత్‌చంద్రుడు, ఎం.రాఘవులు తదితరులు ఉన్నారు.

కోఆప్టేక్స్‌ రిబేటు అమ్మకాలు ప్రారంభం


శ్రీకాకుళం: తమిళనాడు హ్యాండ్‌లూమ్స్‌ కోఆప్టేక్స్‌ వారి అన్నిరకాల చేనేత వస్త్రాలపై రిబేటు అమ్మకాలు శ్రీకాకుళం పట్టణంలో ప్రారంభం అయ్యాయి. స్థానిక జిపి రోడ్డులో ఏర్పాటు చేసిన వీటి అమ్మకాలను జిల్లా పౌరసంబంధాల అధికారి డి.రమేష్‌ ముఖ్య అతిథిగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బ్రాంచ్‌ మేనేజర్‌ టి.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ, రంజాన్‌, దసరా, దీపావళి పండగల సందర్భంగా తమ అన్నిరకాల వస్త్రాలపై 30 శాతం గవర్నమెంటు రిబేటు ఇస్తున్నామని చెప్పారు. ఇవిగాకుండా మరికొన్ని ప్రత్యేక రకాల వస్త్రాలపై 30 నుండి 70 శాతం వరకు రాయితీ కల్పిస్తున్నామని అన్నారు. కంచిపట్టు చీరలు, కాటన్‌ చీరలు, కోయంబత్తూరు, మదురై, ఆర్‌ఫోర్ట్‌ ఫ్యాన్సీకాటన్‌, సికోలో సరికొత్త డిజైన్లలో ఉన్న వెండి, జెరీ చీరలతోపాటు బెడ్‌షీట్స్‌, దుప్పట్లు, షర్ట్స్‌, చుడిదార్లే కాకుండా దావతులు, లుంగీలు తదితర మరెన్నో నాణ్యమైన వస్త్రాలు తమవద్ద ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సేల్స్‌ మేనేజర్‌ టి.రామారావుతోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.