రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన


మహబూబ్‌నగర్‌: ఆధునిక వ్యవసాయ పద్దతులు ఆచరించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు పిలుపునిచ్చారు. వ్యవసాయం పట్ల రైతుల ఆలోచనావిధానం మారాలి, వ్యవసాయ పద్దతులు మారాలి, ఒకప్పటి వ్యవసాయం వేరు నేటి వ్యవసాయం వేరు ఎపంటవేస్తే లాభం వస్తుందో ఆపంటే వేయాలి , అని ఆయన చెప్పారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా మాచన్‌ పల్లి గ్రామంలో రైతు చైతన్య యాత్రలను ప్రారంభించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 35 కోట్ల జనాభా వున్నప్పటికి ఆహరధాన్యాలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొన్నామని, ప్రస్తుతం 110 కోట్ల జనాభా వున్నపటికి ఆహర ధాన్యాలు సమృద్దిగా వున్నాయని చెప్పారు. కొత్త వంగడాలు, ఆధునిక పద్దతుల వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశ్యంతో రైతుల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం గత 6 సంవత్సరాల నుండి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని, ఇందులో భాగంగానే బ్యాంకు ఋణాలమాఫి, రాయితీ పై విత్తనాలు, ఎరువుల పంపిణి, వంటివి కల్సించటంతోపాటు 2003లో 530/- రూ.లుగావున్న వరి మద్దతు ధర 2010 నాటికి 1030/- రూ.లకు పెంచామని తెలిపారు.

అంతేకాక కేంద్రప్రభుత్వం గత సంవత్సరం ఒక్కడిఎపిపైనే లక్ష కోట్ల రూపాయల సబ్సిడి భరించి తక్కువధరకు రైతులకివ్వటం జరిగిందన్నారు. రైతులు అన్ని విషయాలు తెలుసుకోవాలని, లాభంవచ్చే పంటలేసాగు చేయాలని, ఇజ్రాయిల్‌ తరహలో బింధు, తుంపర సేద్యంతోపాటు ఆధునిక పద్దతులు పాటించాలని, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులే వాడాలని కోరారు. గుళికల మందు కొంటేనే ఎరువులు అమ్ముతామని ఎరువుల దుకాణాదారులు అంటున్నారని రైతులు మంత్రికి పిర్యాదు చేయగా, ఎరువులకు గుళికల మందుకు లంకెపెట్టే ఎరువుల దుకాణాదారులు, డీలర్లపై చర్య తీసుకుంటామని ,లైసెన్సు రద్దు చేస్తామని అంతేకాక సంబంధిత వ్యవసాయు శాఖ అధికారిపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

నెల్లూరు సన్న రకం ధాన్యం తక్కువధరకు అమ్మవద్దని, ఐకెపి, సివిల్‌ సప్లయ్స్‌ ద్వారా జిల్లాలో 10 కేంద్రాలు ఎర్పాటు చేసి ప్రభుత్వం ధాన్యం కొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి పాడి రైతులకు పశు గ్రాసవిత్తనాలు పంపిణి చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు వీరా రెడ్డి మాట్లాడుతూ సహకార పరపతిలో భాగంగా డిసిసి బ్యాంకు ద్వారా ధీర్గకాళిక రుణాలిచ్చేందుకు సిద్దంగా వున్నామని 6శాతం రిబేటుపై వీటిని ఇస్తున్నందున రైతులు ఉపయోగించుకోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్‌ యం .పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం, పంటలపై రైతులకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారుల ద్వారా ఈ నెల 17 నుండి వచ్చే నెల 2 వరకు రైతు చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎరువుల దుకాణాదారులు ఎరువులకు మందు గుళికలకు లంకె పెట్టరాదని, ఈ విషయంలో జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించి తగు చర్య తీసుకొంటామని చెప్పారు. రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు కొంటే తప్పక బిల్లులు తీసుకోవాలని సూచించారు.

సర్పంచుమళ్లికార్జున రెడ్డి ఎంపిటిసిలు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌ నగర్‌ శాసనసభ్యులు ఎన్‌ .రాజేశ్వర్‌ రెడ్డి, పశుసంవర్దకశాఖ జె.డి రామచంద్రుడు, ఆర్డీఓ రాజేశం, తహశీల్దారు, ఎంపిడిఓలు హజరయ్యారు. అంతకుముందు ఆయాశాఖల అధికారులు వారి శాఖలపై రైతులకు అవగాహన కల్పించారు.

Advertisements

రీఫ్‌కు ఎరువులు సిద్ధం


కాసిపేట: రానున్న ఖరీఫ్‌ కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఎరువులను దిగుమతి చేసుకుంటున్నారు. వ్యవసాయాధికారుల ఆదేశాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన్‌లో 770 బ్యాగుల ఎరువులను దిగుమతి చేసుకుంటున్నారు. వ్యవసాయాధికారుల ఆదేశాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన్‌లో 770 బ్యాగుల ఎరువులు సిద్దం చేసినట్లు అధికారులు రాజేందర్‌ తెలిపారు. రానున్న ఖరీఫ్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరికీ సరిపడేలా ఎరువులు పంపిణీకి సిద్దంగా ఉన్నాయి. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ఆయన సూచించారు.

సమన్వయంతో రైతు చైతన్య యాత్రలు


గుంటూరు: రైతు చైతన్య యాత్రల విజయవంతానికి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ బి. రామంజనేయులు అన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభంకానున్న రైతు చైతన్య యాత్రల కార్యక్రమాన్ని స్ధానిక కృషిభవన్‌లో కలెక్టర్‌ లాంచనంగా ప్రారంభించారు. ఈ నెల 17 నుండి జూన్‌ 2వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామాలలో సైతం ఈ యాత్రలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత సంవత్సరం జరిగిన రైతు చైతన్య యాత్రలలోని అనుభవాలను దృష్టిలో వుంచుకుని ఈ సవత్సరం తగిన ముండు జాగ్రత్తలతో, సమాచారంతోరైతుల వద్దకు వెళ్లాలన్నారు. ఇటీవల ముగిసిన ప్రజాప్ధం కార్యక్రమం వలెనే రైతు చైతన్య యాత్రలను కూడా ఘనంగా నిర్వహించాలన్నారు. రైతుచైతన్య యాత్రలలో అధికారుల దృష్టికి వచ్చిన రైతు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యమైన అంశాలపై జూన్‌ మాసంలో జరిగే రైతు సదస్సులలో ప్రస్తావించి తగిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని కలెక్టర్‌ తెలియచేశారు.

ఈ విషయాలను రైతులకు స్పష్టంగా తెలిజెప్పాలన్నారు. 2009-10 సంవత్సరంలో జిల్లాలో వ్యవసాయ ప్రణాళిక అమలును పకడ్బందీగా నిర్వహించడం, వ్యవసాయ విధానాలను సక్రమంగా అమలుపరచడం, రైతుల పట్ల అధికారుల స్పందన, తదితర కార్యక్రమాల నిర్వహణ వలన రాష్ట్రస్ధాయిలో ఉత్తమ సంయుక్త సంచాలకులుగా ఐ.రామకృష్ణమూర్తి ప్రభుత్వం నుండి అవార్డు పొందడం హర్షదాయకమని అన్నారు. ఇదే రీతిలో ఈ సంవత్సరం కూడా మరిన్ని ముందస్తు ప్రణాళికలతో అధికారులు పనిచేయవలసి ఉంటుందని కలెక్టర్‌ సూచించారు.

ప్రజాపధం కార్యక్రమంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీపై రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందేనని అన్నారు. అలాగే నిల్వ ఉన్న ధాన్యాన్ని కోనెందుకు ఎవరూ ముండుకు రావడంలేదన్న విషయాన్ని రైతులు అనేక సార్లు తెలియజేశారని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో దేశం మొత్తం మీద ఒకే నిబంధన ఉందన్నారు. రైతుల వద్ద వున్న ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని రైతు చైతన్య యాత్రలలో అధికారులు రైతులకు తెలియజేయాలన్నారు.

అదే విధంగా మిర్చి యార్డులో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా నష్టపోయిన రైతులకు ఇంకనూ కోటి 80 లక్షల రూపాయలు చెల్లించవలసి వుందని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన వెంటనే రైతులకు చెల్లించడం జరుగుతుందన్న విషయాన్ని కూడా రైతులకు వివరించాలన్నారు. అలాగే భీమా తాలూకు సొమ్ము నాలుగున్నర కోట్ల రూపాయలలో ఇప్పటి వరకూ 3 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పంట విస్తీర్ణం, దిగుబడి పెరిగే అవకాశం వుందన్నారు.

గ్రామాలలోని ఆదర్శ రైతుల ద్వారా ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేసింది వివరాలను ముందుగా జాగ్రత్త చేసుకోవాలన్నారు. అలాగే ప్రతి రైతు బ్యాంకులలో ఖాతాలు కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఏ ఒక్క రైతుకు కూడా బ్యాంకులో ఖాతా లేదు అని చెప్పడానికి వీలు లేకుండా అధికారులు కృషి చేయవలసి ఉంటుందని ఆయన సూచించారు. గ్రామాలలో సభలను నిర్వహించి ఖరీఫ్‌లో డిమాండ్‌ ఎంత ఉందో చర్చించాలన్నరు. రైతులకు అనుకూలమైన సమయాలలో అధికారులు వెళ్ళి పంట దిగుబడి పెంచేందుకు తీసుకోవలసిన చర్యలను వివరించాలన్నారు. విధి నిర్వహణ లో అలసత్వం, నిర్లక్ష్యం పనికిరాదని ఆయన స్పష్టం చేశారు.

రైతు చైతన్య యాత్రలలో ప్రతి శాఖ అధికారి రైతులకు అండుబాటులో వుండాలని, వారు చెప్పిన సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో నిర్వహించవలసిన ఉమ్మడి కార్యక్రమం రైతు చైతన్య యాత్రలని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీ ఐ.రామకృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. రైతు చైతన్య యాత్రలలో చేపడుతున్న కార్యక్రమాల గురించి కలెక్టర్‌ కు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాౖయ, సశుసంవర్ధక, మత్స్య, అటవీ, పట్టు పరిశ్రమ, ఉద్యానవన శాఖలు ముద్రించిన కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం రైతు చైతన్య యాత్రలను కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ దామోదర నాయుడు, మత్స్య శాఖ ఉప సంచాలకులు బసవరాజు, డివిజనల్‌ అటవీ శాఖాధికారి శ్రీనివాస శాస్త్రి, పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు సులేమాన్‌ బాషా, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు మధుసూధన రెడ్డి, పద్మావతి, ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ఐదవ కాంటూరు వరకు కొల్లేరు అభివృద్ధికి ప్రణాళిక


ఏలూరు: పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లాల పరిధిలో గల కొల్లేరు మరోసారి వార్తల్లోకెక్కింది. గతంలో ఆనాటిముఖ్యమంత్రి డా వైఎస్‌ రాజశేఖరరెడ్డి సారధ్యంలో కొల్లేరు అభయారణ్య పరిధిని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు తగ్గించాలని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే ఆ ప్రతిపాదనలను కేంద్రం తిరస్కరించినట్లు విదితమవుతోంది. రాజధానిలో కొల్లేరు సరస్సుపై ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది.

అనంతరం రాష్ట్ర అటవీ శాఖామంత్రి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కొల్లేరు సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, 5వ కాంటూరు వరకు అభివృద్ధి చేస్తామని, అందుకోసం తక్షణ సాయంగా కేంద్రాన్ని రూ.665 కోట్లు విడుదల చేయాలని కోరాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. మరోవైపున కొల్లేరులో ప్రస్తుతం తవ్విన చేపల చెరువుల ధ్వంసానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే మరోసారి ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.

గతంలో జిల్లా కలెక్టరుగా లవ్‌ అగర్వాల్‌ బాధ్యతలు నిర్వహించిన సమయంలో సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున చేపల చెరువులు ధ్వంసం చేశారు. దీంతో కొల్లేరు ప్రాంతంలోని దళితులు, బిసిలు ఘోరంగా నష్టపోయారు. ముఖ్యంగా బిసి వర్గానికి చెందిన వడ్డీ కులస్తుల చెరువులు, బడా భూస్వాముల ఆధీనంలో ఉన్న లీజు చెరువులు ధ్వంసమయ్యాయి. మళ్ళీ అదే తరహాలో ఈ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందు విచ్చలవిడిగా, నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువులు తవ్వారు. అనూహ్యరీతిలో ఎన్నికల్లో కొల్లేరు పెద్దలు అధికార కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ మళ్ళీ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో వారు ఖంగుతిన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా మౌనంగానే ఉన్నారు.

ఈ దశలో మరోసారి చేపల చెరువులు ధ్వంసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.మూడు కోట్లు మంజూరు చేసింది. మరో రూ.మూడు కోట్లు అవసరమవుతాయని కూడా అధికారులు అంచనా వేసి నివేదిక పంపినట్లు తెలిసింది. ఈ పరిస్థితిపై మంత్రి రామచంద్రారెడ్డి 5వ కాంటూరు వరకు కొల్లేరు అభయరణ్యాన్ని అభివృద్ధిపరచేందుకు కేంద్రాన్ని సహాయం కోరాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. దీనిని బట్టి గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం బుట్టదాఖలైనట్లు తెలుస్తోంది.

అంతేగాకుండా కొల్లేరును ప్రముఖ టూరిస్టు సెంటర్‌గా తీర్చిదిద్దడానికి ఒక ప్రైవేటు ఏజెన్సీకి లీజుకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విధంగా కొల్లేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. ఈ పరిణామం కొల్లేరు ప్రాంత ప్రజలకు మింగుడుపడని సమస్యగా మారింది. ఏది ఏమైనా టూరిస్టు సెంటర్‌గా కొల్లేరును తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయిస్తే స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో అగ్ర ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 5వ కాంటూరు వరకు అభివృద్ధి చేసే క్రమంలో కొల్లేరు స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

సాగర్‌ నీటిని పంటలకు విడుదల చేయాలి: కోడెల


వినుకొండ (గుంటూరు): వినుకొండ ప్రాంత పరిధిలోని సుమారు 8లక్షల ఎకరాల భూమికి నాగర్జున సాగర్‌ జలాలను విడుదల చేయాలని మాజీ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నర్సారావుపేట టిడిపి కార్యాలయంలో జరిగిన టెలికాన్పరెన్సులో ఆయన మాట్లాడుతూ, తమది రైతు ప్రభుత్వమని చెపుకుంటున్న ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, ఖరీఫ్‌ ముగుస్తున్న నీటిని విడుదల చేయలేకపోవడం శోచనీయమని అన్నారు. 2003 -04 టిడిపి ప్రభుత్వం, సాగర్‌ రిజర్వాయర్‌లో నీటి పరిమానం అశించిన విధంగా లేకపోయిన సాగునీటిని విడుదల చేశామని అన్నారు. ప్రస్తుతం సాగర్‌ రిజర్వాయర్‌లో 500 అడుగులు, శ్రీశైలం రిజర్వాయర్‌ 800 అడుగుల నీరు ఉన్నప్పటికీ సాగునీటిని విడుదల చేయకపోవడం సమంజసంగా లేదని అన్నారు. శ్రీశైలం నీటిని, సాగర్‌ రిజర్వాయర్‌కు పంపకుండా పోతిరెడ్డిపాడు రిజర్వాయర్‌కు పంపడంలో ప్రభుత్వ విధానం ఏమిటో అర్థం కావడంలేదని అన్నారు. సాగర్‌ నీటిపై హక్కుఉన్న కృష్ణ, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం జిల్లాలోని 30లక్షల మంది రైతులు సకాలంలో నీరు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోడెల అన్నారు. బియ్యం, కందిపప్పు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సామాన్యులు వాటిని కొనలేని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం ధరలను తగ్గించడంలో చోద్యం చూస్తున్నదే తప్ప అదుపు చేయలేకపోతున్నదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని పెరిగిన ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోడెల శివప్రసాద్‌ కోరారు. టెలికాన్పరెన్సులో మాజీ యార్డు చైర్మన్‌ ఆర్‌.లక్ష్మినారాయణ, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రోజురోజుకు పెరుగుతున్న ఎరువుల కొరత


మచిలీపట్నం: జిల్లాలో ఎరువుల కొరత రోజురోజుకు పెరుగుతున్నది. నేటివరకు సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడిన రైతులు, ఎరువుల కోసం నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన ఎరువులు 70 శాతం ప్రైవేట్‌ డీలర్లకు, 30 శాతం సహకార సంఘాలకు కేటాయించడం జరిగింది. అయితే సహకార సంఘాల ద్వారా రైతులకు అందించే ఎరువులు 30 శాతం మాత్రమే అవడంతో ఈ ఎరువులు సరిపోక రైతులు ప్రైవేట్‌ డీలర్ల నుండి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తున్నది. రైతుల అవసరాలనుబట్టి డీలర్లు తమ ఇష్టానుసారం ధరలను పెంచుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో నలుగురు శాసనసభ్యులు, ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకురాగా సమావేశంలో ఉన్న జిల్లాకు చెందిన రాష్ట్ర పశుసంవర్థక శాఖమంత్రి కె.పార్థసారథి జోక్యం కల్పించుకొని ప్రభుత్వం నిర్ణయించిన ధరకన్నా అధిక ధరలకు ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆచరణలో మాత్రం ఇది జరగడం లేదు. తాజాగా మచిలీపట్నంలోని ఒక ఎరువుల గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన కాంప్ల్లెక్స్‌ ఎరువులను రెవిన్యూ అధికారులు పట్టుకున్నారు. మచిలీపట్నం ఆర్డీవో హైమవతి ఆధ్వర్యంలో రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పట్టణంలోని ఎరువుల గోడౌన్‌లపై ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 180 బస్తాల కాంప్లెక్స్‌ ఎరువులను స్వాధీనపర్చుకున్నారు. ఏ విధమైన అనుమతి లేకుండా ఉన్న గోడౌన్‌లలో నియమ, నిబంధనలకు విరుద్ధంగా ఎరువులను నిల్వ ఉంచి విక్రయిస్తున్నందుకు వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో తెలిపారు.

136 క్వింటాళ్ల బియ్యం పట్టివేత


ఏలూరు: కృష్ణా జిల్లానుండి, తూర్పుగోదావరి జిల్లాకు ఆక్రమంగా రవాణా అవుతున్న 136 క్వింటాళ్ల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం ఏలూరులో పట్టుకున్నారు. బియ్యం విలువ 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరైన ఈ బియ్యాన్ని లారీలో కృష్ణా జిల్లా విస్సన్నపేట నుంచి రవాణా చేస్తున్నారు. సమాచారం అందున్న జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధికారి కె. రంగాకుమారి సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఏలూరు బైపాస్‌ రోడ్డులో లారీని పట్టుకున్నారు. ఆనంతరం బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్‌ చేశారు.