జూన్‌ 1న రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు


విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు ఈ నెల 28న కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే ఈ రుతుపవనాలు జూన్‌ 1వ తేదీన మన రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రాష్ట్రంలో చాలాచోట్ల వర్షాలు పడతాయి.

Advertisements

చెలికాని మృతి పట్ల రోశయ్య సంతాపం


విశాఖపట్నం: ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొంటూ శ్రీకాకుళం జిల్లా రాజం మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ చెలికాని హరనాథ్‌ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.రోశయ్య విచారం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారానికై నేటి ఉదయం ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొంటూ ఆకస్మికంగా ఆనారోగ్యానికి గురై ఆయన మరణించడం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో రాజీలేదు : సీఎం


విశాఖపట్నం: రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాలలో ఒక్క చుక్క నీటిని కూడా నష్టపొకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే అంశాలలో ఎలాంటి రాజీ లేకుండా అధికారులు, వ్యూహాత్మకంగా పకడ్బందీగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు.

ఢిల్లీలో సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న కృష్ణ ట్రిబ్యునల్‌ వాధనలు, అలాగే 12వ తేదీన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి సిడబ్యుసి వద్ద అధికారుల సమావేశం, వంశధార ట్రిబ్యునల్‌ తదితర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర భారీ మధ్యతరహా నీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య నీటి పారుదల, అంతర్రాష్ట్ర జల మండలి శాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలిఫోన్‌లో సుదీర్ఘంగా చర్చించారు.

ప్రధానంగా కృష్ణ ట్రిబ్యునల్‌ వాధనలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో కర్ణాటక ఆల్‌మటి ప్రాజెక్టు ఎత్తు పెంపు విషయాలు, మిగుల జలాల పంపిణీ తదితర అంశాలలో పట్టుపడుతున్న సందర్భంగా మన రాష్ట్ర న్యాయనిపుణులు, అంతర్రాష్ట్ర జల వివాదాల మండలి అధికారులు పకడ్బంధీగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రానికి ఒక్క చుక్క నీరు కూడా నష్టపోకుండా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా, ప్రయోజనాల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా తగిన విధంగా కృషి చేయాలని ఆదేశించారు.

అల్‌మట్టి ఎత్తు పెంపు వల్ల రాష్ట్రానికి కృష్ణా జలాలు తీవ్రంగా నష్టపోతామని, వర్షాలు తక్కువగా ఉన్న సమయంలో మన రాష్ట్రంలో పంటకాలం చాలా ఆలస్యమవుతుందని దీని వల్ల రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆల్‌మట్టి ఎత్తు పెంపు విషయంలో వారికి కేటాయించిన నీరు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా పాటించేలా సకల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నది దిగువ రాష్ట్రమైన మన రాష్ట్రానికి గత బచావత్‌ అవార్డులో కేటాయించిన విధంగానే మిగులు జలాల విషయంలో మనకు న్యాయం జరిగే విధంగా చూడాలని ముఖ్యమంత్రి వివరించారు.

అలాగే ఈ నెల 12వ తేదీన ఢిల్లీలో జరగనున్న ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నీటిపారుదల ఉన్నతాధికారుల సమావేశం గురించి ముఖ్యమంత్రి చర్చించారు. మహారాష్ట్ర రెండు రాష్ట్రాల ఒప్పందాలను, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను, సుప్రీం కోర్టు తీర్పులను ధిక్కరించి ప్రాజెక్టులను, అక్రమంగా నిర్మిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర 13 అక్రమ బ్యారేజీలను నిర్మిస్తుందని ముఖ్యమంత్రి ఆరోపించారు. 13 బ్యారేజీలు నిర్మించి మహారాష్ట్రకు కేటాయించిన 60 టి.ఎం.సి.ల నీటి కంటే ఎక్కువ నీటిని తరలించుకునేందుకు ఎత్తులు వేస్తుందని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు.

ఈ విషయంలో గతంలో అనేక సార్లు అటు ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి పవన్‌ కుమార్‌ బన్సాల్‌ను, కేంద్ర జల వనరుల మండలి అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని వివరించారు. వారి ఆదేశాల మేరకు 12వ తేదీన రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహారాష్ట్రను సిడబ్ల్యుసి పూర్తి సమాచారంతో రావాల్సిందిగా ఆదేశించడంతో కేంద్రం వద్ద మన ప్రయత్నాలు ఫలించినట్లుగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలను కేంద్ర జల మండలి అధికారుల ముందు ఉంచాలనే అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌ సరైన ఆధారాలను చూపిస్తే కేంద్రం, మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులను నిలిపివేసేందుకు ఆదేశాలు ఇచ్చే అవకాశముందని ఈ విషయంలో అధికారులు చురుగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే మన న్యాయవాదులు, అంతరాష్ట్ర జల వివాదాల మండలి, సాగునీటి శాఖ అధికారులు క్రియాశీలకంగా, చురుగ్గా పనిచేస్తున్నారని అన్నారు. అత్యంత కీలకమైన అంతరాష్ట్ర జల వివాదాల విషయంలో అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకొని ఇంకా చాకచక్యంగా పనిచేయాలని లేనిపక్షంలో రాష్ట్రం పెద్దగా నష్టపోయే ప్రమాదముంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

వంశధార ట్రిబ్యునల్‌ ఏర్పాటు: వంశధార నదిలో జలాల పంపకానికి సంబంధించి మనకు న్యాయమైన వాట సాధించే విధంగా సమర్ధవంతంగా వాధించేందుకు జల వనరుల అంశాలలో సుదీర్ఘ అనుభవం వున్న న్యాయవాదుల బృందంతో ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు సంబంధించి చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. వంశధార ట్రిబ్యునల్‌లో మన రాష్ట్రానికి సంబంధించి హక్కులను కాపాడడంలో న్యాయవాదులు సమర్ధవంతంగా, పకడ్బందీగా, పక్కా వ్యూహంతో తమ వాదనలను వినిపించాల్సి వుంటుంది. ఈ వాదనల ఆధారంగా ఒక నివేదిక రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

విజృంభిస్తున్న జ్వరాలు


విశాఖపట్నం: జిల్లాలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. ఎక్కువగా మలేరియా, టైఫాయిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. జ్వరపీడితులతో ప్రైవేట్‌ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. కెజిహెచ్‌లో ప్రతిరోజూ సుమారు 800 ఒపిలు వస్తుంటాయి. వారం రోజుల నుంచి రోజుకు వెయ్యి ఒపిలు వస్తున్నాయి. ఇందులో 400 ఒపిలు వరకు జ్వరానికి సంబంధించినవే. అపారిశుద్ధ్యం, వాతావరణంలో మార్పుల వల్ల జ్వరాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. మైదాన ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌గున్యా వంటి వ్యాధులతో రోగులు బాధపడుతుంటే, గిరిజన ప్రాంతాల్లో వీటికితోడు క్షయ, పచ్చకామెర్లు, డయోరియా వంటి వ్యాధులు గిరిజనులను మంచంపైకి నెడుతున్నాయి. మైదాన ప్రాంత సిహెచ్‌సిల్లో రోగులకు వైద్యం అందినట్లు గిరిజన ప్రాంతాల్లో వ్యాధి తీవ్రతకు తగ్గట్టు వైద్యం అందడంలేదు. కెజిహెచ్‌కు జ్వరాలతో వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఏజెన్సీలో సీజనల్‌ వ్యాధులుగానే అధికారులు చూస్తున్నారు తప్ప ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదు. పర్యవసానంగా అనేక మంది వ్యాధి బారినపడుతుండగా, కొంతమంది మృత్యువాతపడుతున్నారు. వైద్య సేవలు సక్రమంగా అందకపోవడంతో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏజెన్సీలోని అనంతగిరి, అరకులోయ, జి.మాడుగులు, హుకుంపేట, తదితర గ్రామాల్లో గిరిజనులు మలేరియా, డయేరియా, క్షయ, పచ్చకామెర్లు, టైపాయిడ్‌ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు.

వైఎస్‌ ఆత్మకు శాంతి చేకూరాలంటే జగన్‌ను సిఎం చేయాలి: మంత్రి బాలరాజు


విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆయన తనయుడు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని జిల్లా మంత్రి వర్యులు పసుపులేటి బాలరాజు అధిష్టానాన్ని కోరారు. మండల కేంద్రమైన చీడికాడలో నూతనంగా నిర్మించనున్న వైఎస్‌ విగ్రహానికి ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం వైఎస్‌ చిత్రపటానికి మంత్రి బాలరాజు పూలమాలవేసి నివాళులర్పించారు. డిసిసి కార్యదర్శి బొడ్డు మహాలక్ష్మి నాయుడు అధ్యక్షతన జరిగిన సంతాపసభలో మంత్రి బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మతాలు, కులాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజల మనస్సుల్లో అభిమాన నాయకునిగా పేరుపొందిన నాయకుడు రాజశేఖర్‌రెడ్డి అని ఆయన అన్నారు. ఈయన చేసిన పథకాలకు ఇతర దేశాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఆయన మనముందు బౌతికంగా లేకపోయినా అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ప్రజల సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలనే ఉద్ధేశ్యంతో రచ్చబండ కార్యక్రమం ప్రవేశపెట్టి ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి మృత్యువాతపడడం విచారకరమన్నారు.

పాడిపశువుల కొనుగోలుకు వడ్డీలేని రుణాలు


విశాఖపట్నం: కరువును దృష్టిలో పెట్టుకొని విశాఖ డెయిరీ పరిధిలో ఉన్న రైతులందరికీ పాడి పశువులు కొనుగోలుకు వడ్డీలేని రుణాలు అందజేయనున్నట్టు డెయిరీ ఛైర్మన్‌ ఆడారి తులసీరావు తెలిపారు. చీడికాడ పాల సొసైటీ సమావేశ మందిరంలో పాడి రైతులకు 412 కుర్చీలు, 162 స్టీల్‌ కంచాలు ఆయన చేతల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని పాడి రైతులందరికీ ఈ రుణాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. దీని నిమిత్తం ఇప్పటికే రూ.31 కోట్లు పాల సొసైటీకి పంపించామన్నారు. చీడికాడలో మినీ డెయిరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. స్థానిక పాల సంఘం అధ్యక్షురాలు మాట్లాడుతూ కేంద్రంలో 180 లీటర్లుపైగా పాలు పోసిన వారికి కుర్చీలు, 100 లీటర్లు పైబడి పాలు పోసిన రైతులకు స్టీల్‌ కంచాలు అందించినట్టు తెలిపారు.

గిరిజనుల ఆర్థికాభివృద్ధికి ‘కాఫీ’ తోడ్పాటు


విశాఖపట్నం: గిరిజనుల ఆర్థికాభివృద్దికి కాఫీ పంట తోడ్పాటునందిస్తుందని అరకు నియోజక వర్గం శాసన సభ్యుడు సివేరి సోమ అన్నారు. కాఫీ పంట సాగుదారులకు పాడేరు డివిజన్‌ ఎడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రోత్సాహక చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాఫీ పంటకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అధిక ప్రాధాన్యత ఉందన్నారు. కాఫీ పంట మీద దృష్టి సారిస్తే అధిక లాభం పొందవచ్చన్నారు. అనంతరం మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లోని రెండు వేల 318 మంది కాఫీ రైతులకు చెక్కులు అందజేశారు.