12నుండి 16వరకు భారత్‌ నిర్మాణ్‌ ఉత్సవం


వినుకొండ: నరసరావుపేట పట్టణంలోని ఈ నెల 12వ తేదీ నుండి 16వరకు భారత నిర్మాణ సంఘ సమాచార ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని పౌరసరఫరాల శాఖాధికారి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అభివృద్ధి పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రదర్శనలు, మరియు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాతీయ ఆరోగ్య పథకం ప్రధానమంత్రి సడక్‌యోజనా, ఇందిరాఆవాస్‌యోజనా, రాజీవ్‌గాంధీ విద్యుద్దీకరణ, సర్వశిక్షాఅభియాన్‌, మధ్యాహ్న భోజన పథకం, రాజీవ్‌ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ గృహ నిర్మాణం, డ్వాక్రా మహిళలకు పావలావడ్డీవంటి పథకాలను విజయవంతం చేయడానికి ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శాససమండలి ఉపాధ్యక్షుడు మహ్మద్‌జానీ, ఉపసభాపతి మనోహర్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కె. విజయ, జడ్పీ కె. వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే కాసు వెంకటకృష్ణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, సమచారా కమీషనర్‌ దిలిప్‌రెడ్డి, కలెక్టర్‌ రామాంజనేయులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు.

Advertisements

4వ రోజుకు చేరిన ఎస్సీ సెల్‌ దీక్షలు


వినుకొండ: వై.ఎస్‌.జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలేనిరాహారాదీక్షలు శుక్రవారానికి 4వ రోజుకు చేరుకున్నాయి. వై.ఎస్‌. చేపట్టిన సంక్షేమ పథకాలు జగన్‌ నాయకత్వంలో సఫలమవుతాయని ఎస్సీసెల్‌ జిల్లా కార్యదర్శి ఎ.నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. దీక్షలకు మద్ధతు తెలిపిన వారిలో ఎంపీపీ ఎం. రామతులసీరెడ్డి, మార్కెటింగ్‌ యార్డు చైర్మన్‌ వెంకిరెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ప్రజల ఆక్షాంక్ష


వినుకొండ: వై.ఎస్‌.జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారని వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌ఛార్జీ చేబ్రోలు నరేంద్రనాథ్‌ తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ కార్యకర్త జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తాను హైదరాబాదులో బుధవారం వై.ఎస్‌. కుటుంబసభ్యులను పరామర్శించినట్లు తెలిపారు. ఈసందర్భంగా జగన్‌తో చర్చించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసారని, పార్టీని ప్రభుత్వాన్ని ముందకు నడిపేందుకు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.