విశాఖలో 530స్కూళ్లు మూసివేత


విశాఖపట్నం: విశాఖలో అనుమతిలేని 530 స్కూళ్లకు విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో దాదాపు 65వేల మంది విద్యార్థులు భవితవ్వం ప్రశ్నార్థకంగా మారింది. మొద్దు నిద్రపోతున్న అధికార యంత్రాంగం ఇప్పుడే మేల్కొన్నట్లు ఒక్కసారిగా నోటీసులు ఇవ్వడంపై విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు.

Advertisements

గుర్తింపు లేని 500 స్కూళ్లపై ఎఫ్‌ఐఆర్‌


విశాఖపట్నం: జిల్లావ్యాప్తంగా గుర్తింపు లేని అయిదు వందలకు పైగా పాఠశాలలపై జిల్లా విద్యా శాఖ ఆధ్వర్వంలో సంబంధిత పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా అనధికారికంగా నడపబడుతున్న ప్రైవేటు విద్యా సంస్థలపై ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ చట్టం (1982), సవరించిన ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ చట్టం(1987) ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయా మండలాలలో ఎంఇవోల ఆధ్వర్వంలో సమీప పోలీసు స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. జిల్లావ్యాప్తంగా అనధికారికంగా వేయికి పైగా ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తున్నాయి. అయితే, అధికారులవద్ద ఉన్న రికార్డుల ప్రకారం 486 స్కూళ్లు మాత్రమే ఉన్నాయి. వీటికి తోడుగా మరొక యాభై వరకూ కొత్త పాఠశాలలను గుర్తించినట్లుగా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

అయితే, అరవై వరకూ పాఠశాలలు తమకు తామే స్వచ్ఛందంగా మూసివేయడంతో అధికారులకు చర్యలు తీసుకునే శ్రమ తప్పింది. మిగిలిన 500 వరకూ పాఠశాలలపై గురువారం సాయంత్రానికి పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. గత మూడు రోజులుగా జిల్లాలోని అనేక మండలాలలో మండల రిసోర్స్‌ పర్సన్స్‌ సర్వే చేసి మరీ గుర్తింపు లేని పాఠశాలలను కనుగొన్నారు. కొన్నింటికి బోర్డులు తీసేసి మరీ నిర్వాహకులు జాగ్రత్తపడగా, మరికొన్ని పాఠశాలలు ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులకు సెలవులను ప్రకటించాయి. ఈ విధంగా నోటీసులకు చిక్కకుండా అరవై వరకూ పాఠశాలలు ఉండగా, మిగిలిన వాటిని గుర్తించి నోటీసులను ఎంఆర్‌పీలు అందచేశారు.

చాలా చోట్ల ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు గుర్తింపు కోసం తాము దరఖాస్తు చేసుకున్నామని, తమకు మరికొంత గడువు కావాలని అభ్యర్ధించారు. అయితే, ఇది హైకోర్టు తీర్పు మేరకు చేపడుతున్న చర్యని అందువల్ల తమకు ఏమీ అవకాశం లేదని తేల్చి చెప్పి మరీ నోటీసులు అందచేశారు. మొత్తం అయిదు వందలకు పైగా పాఠశాలలతో పాటు, ఇంకా వందల సంఖ్యలో నడుస్తున్న అనధికార పాఠశాలలన్నీ శుక్రవారం నుంచి తెరవరాదని నోటీసులో స్పష్టం చేశారు. ఆ విధంగా తెరిచే పాఠశాలలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతూ ఆయా పాఠశాలల చిరునామా, నిర్వాహకుల పేర్లు పాఠశాలల పేర్లతో సహా, ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేశారు.

ఇదిలా ఉండగా, నగరంలోనే అధిక సంఖ్యలో గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కార్పొరేట్‌ సంస్థల పాఠశాలలు కూడా ఉన్నాయి. ఈ పాఠశాలలు ఒక చిరునామాకు మాత్రమే గుర్తింపును పొంది మిగిలిన శాఖలను నిర్భయంగా కొనసాగిస్తున్నాయి. ఈ తరహా పాఠశాలలకు మాత్రం జిల్లా విద్యాశాఖ మినహాయింపు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే, వీటికి నోటీసులను అందచేయకుండా సర్దుబాటు చేశారనీ చెబుతున్నారు. మొత్తం మీద అన్ని గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తప్పవని మాత్రం అధికారులు పేర్కొనడం విశేషం. ఇంకొకవైపు ఈ పాఠశాలలలో చదువుతున్న అరవై నుంచి డెబె్బై వేల మంది వరకూ విద్యార్థులు, నాలుగు వేల మంది వరకూ ఉపాధ్యాయుల భవిష్యత్తు అంధకారంలో పడింది.

నెలకు రెండు నుంచి మూడు వేల వరకూ జీతాలను అందుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న చిరుద్యోగులైన ప్రైవేటు టీచర్లు హైకోర్టు తీర్పుతో షాక్‌ తిన్నారు. అదే సమయంలో తమ పిల్లలను మంచి పాఠశాలలలో చదివిస్తున్నామని ఇన్నాళ్లుగా ఆనందంగా ఉన్న తల్లిదండ్రులు సైతం విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాలలు మూతపడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. హైకోర్టు తీర్పు వచ్చేంతవరకూ తమ పిల్లలు చదివే పాఠశాలలకు గుర్తింపు లేదన్న సంగతి తెలియనే తెలియదని అంటున్నారు. మొత్తం ఏడాది ఫీజులను ఒకేసారి కట్టేసిన తమకు ఈ శిక్ష ఏమిటని వాపోతున్నారు. కోర్టు తీర్పు, ప్రభుత్వ నిబంధనల సంగతి అలా ఉంచితే తమ బిడ్డల భవిష్యత్తును పాడుచేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

నేడు సర్కార్‌కు నివేదిక

ఇదిలా ఉండగా, జిల్లావ్యాప్తంగా గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలపై తీసుకుంటున్న క్రిమినల్‌ చర్యల గురించి ప్రభుత్వానికి నివేదికను జిల్లా విద్యాశాఖ పంపించనుంది. ఈ విషయమై పాఠశాలల రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌ జగన్నాధరెడ్డి మాట్లాడుతూ, తాము గుర్తింపు లేని పాఠశాలలన్నింటికీ నోటీసులను అందచేశాం, ఇది లాంఛనప్రాయమని, నోటీసులు ఇవ్వకపోయినా అనధికారికంగా నడిపే ఏ పాఠశాలపైనైనా శుక్రవారం నుంచి చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ విషయంలో విద్యా శాఖ చట్టం ప్రకారం కేసులు ఉంటాయని తెలిపారు. ఎవరైనా గుర్తింపు లేకుండా పాఠశాలలు నిర్వహించినట్లైతే వాటిని తక్షణం మూసివేయాలని ఆయన ఆదేశించారు.

దత్తతకు సర్కారు బడులు


రంగారెడ్డి: సమస్యల పరిష్కారం పేరిట ప్రభుత్వ పాఠశాలలను దత్తతకు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఇక దశలవారీగా జిల్లాలోని పాఠశాలలను దాతలకు అప్పగించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ ఎం.దానకిశోర్‌ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. పాఠశాలలను దత్తతకు తీసుకునే కమిటీకి ఛైైర్మన్‌గా జిల్లా కలెక్టర్‌ ఎం.దానకిశోర్‌, కన్వీనర్‌గా జిల్లా విద్యాధికారి పీవీ శ్రీహరి, సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు గిరీష్‌కుమార్‌ సంఘీ, శాసనమండలి సభ్యుడు నాగేశ్వర్‌, మేడ్చెల్‌ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, లోక్‌సత్తా కన్వీనర్‌, కూకట్‌పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్‌ నారాయణ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, ఆర్‌ఐఓలను ఎంపి చేశారు.

జిల్లాలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి అధ్వానంగా తయారైందని, విద్యావంతుల సేవలను కూడా వినియోగించుకోవడంలేదని, తనను పిలిస్తే నెలకు నాలుగురోజులు ప్రభుత్వ పాఠశాలల్లో బోధిస్తానని ఎమ్మెల్సీ నాగేశ్వర్‌, పాఠశాలలను దత్తతకు ఇస్తే పరిస్థితి మెరుగవుతుందని, అనేక స్వచ్ఛంద సంస్థలు దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తాయని రాజ్యసభ సభ్యుడు గిరీష్‌కుమార్‌ సంఘీ బుధవారం జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో సూచించడంతో స్పందించిన కలెక్టర్‌ దానకిశోర్‌ ఈ దత్తత కార్యక్రమానికి సన్నాహాలు చేశారు.

ఎపీపీఎస్సీలో నాగులదిన్నె ఆణిముత్యం


నందవరం: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించిన పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏఈ ఉద్యోగాలకు జరిగిన వ్రాత పరీక్షల్లో నాగలదిన్నె వాసి సతీష్‌కుమార్‌ తన ప్రతిభను చాటి రాష్ట్రంలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో రాయలసీమలో ప్రథమ స్థానం చోటుచేసుకుంది. నవంబర్‌ 17న నిర్వహించిన వ్రాత పరీక్షల్లో పాల్గొన్న సతీష్‌కుమార్‌ ఆగష్టు 7వ తేది విడుదల అయిన ఫలితాలలో ఈ ఘనతను సాధించాడు. సాదారణ రైతు కుటుంబంలో జన్మించిన సతీష్‌ తన పదవ తరగతి విద్యాభ్యాసాన్ని నాగలదిన్నె ఉన్నత పాఠశాలలో కొనసాగించాడు. శ్రీశైలంలో పాలిటెక్నికల్‌ విద్యనభ్యసించి అటుపిమ్మట బిటెక్‌ సివిల్‌ ఇంజనీర్‌గా హైదారాబాద్‌ జేఎన్‌టీయూలో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ మౌళిక పరిశ్రమల సంస్థలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పులివెందులలో పని చేస్తున్నాడు. ఆయన పడ్డ కఠోర శ్రమకు పూర్తి స్థాయిలో ఫలితం దక్కిందని తల్లిదండ్రులు సుబ్బయ్యశెట్టి, వేదావతి, అన్న వీరేష్‌లు సంబంరపడిపోతున్నారు. సతీష్‌ తనను ద్వితీయ స్థానంలో రావడం శ్రమకు తగ్గ ఫలితం దక్కిందనే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.