దారితప్పిన శ్రీలంక జాలర్లు త్వరలో స్వస్థలాలకు


విజయవాడ: 2నెలల క్రితం నాగాయలంక చేరుకున్న శ్రీలంక జాలర్లను త్వరలోనే వారి దేశానికి పంపిస్తామని శ్రీలంక డిప్యూటి కమీషనర్‌ ఫెర్నాండో తెలిపారు. వారు సముద్రంలో చేపలవేటకు వెళ్లి దారితప్పి కృష్ణాజిల్లా నాగాయలంక ప్రాంతానికి రెండు నెలల క్రితం చేరుకున్నారు. మొత్తం ఏడుగురు శ్రీలంక జాలర్లు ఇక్కడ పునరావాసం పొందుతున్నారు. తొలుత వారిని శ్రీలంక తీవ్రవాదులుగా అనుమానించిన పోలీసులు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేయగా వారు దారితప్పి ఇక్కడకు చేరినట్లు ధ్రువపడింది. దీంతో వీరి విషయమై శ్రీలంక హైకమిషన్‌కు పీయూష్‌కుమార్‌లేఖ రాసారు. దానికి స్పందించిన ఫెర్నాండో రెండు వారాలలోగా శ్రీలంక జాలర్లను వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని అన్నారు.

Advertisements

ఆంధ్రాబ్యాంకు సమ్మెతో నిలిచిపోయిన కార్యకలాపాలు


విజయవాడ: ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగడంతో నగరంలోని 16శాఖల్లో బ్యాకింగ్‌ కార్యకలాపాలు స్థంభించిపోయాయి. కిందిస్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె చేపట్టారు. అయితే ముందస్తు లేకుండా వారు సమ్మెకు దిగడంతో ఖాతాదారులు ఇబ్బందులకు గురయ్యారు. వాణిజ్య రాజధాని అయిన విజయవాడలో ఆంధ్రాబ్యాంకు ద్వారా రోజుకు కనీసం రూ.30కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయని అంచనా సమ్మె కారణంగా ఆంధ్రాబ్యాంకు శాఖలు మూతపడ్డంతో ఖాతాదారులు ఎటిఎంల వైపు పరుగుతీసారు. అనేక ఆంధ్రాబ్యాంకు ఎటిఎంలలో మధ్మాహ్ననికే ఖాళీ కావడంతో ఖాతాదారులకు ఏమీ పాలుపోని పరిస్థితులు ఎదురయ్యాయి.

భారీ వర్షంతో మళ్లీ పాత(బస్తీ)సీనే


విజయవాడ: విజయవాడ వన్‌టౌన్‌ మళ్లీ జలమయమైంది. జనజీవనం స్థంభించింది. గురువారం రాత్రి కురిసిన కుంభవృష్టితో ముంపునకు గురైంది. సరిగ్గా పది రోజుల క్రితమే ఇదే పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులపాటు కురసిన ఎడతురిపిలేని వర్షాల కారణంగా వన్‌టౌన్‌ జలదిగ్భంధనంలో చిక్కుకోగా ప్రజలు అధికారులు పడవలను ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడ చిక్కుకున్న నీటినంతా బయటకు పంపించేందుకు రోడ్లకు గండిపెట్టాల్సి వచ్చింది. ఇంత జరిగినా అధికారులకు కనువిప్పు కాకపోవడంతో మళ్లీ అదే పరిస్థితులు ఏర్పడ్డాయి. డ్రైన్లలో పూడిక తీయకపోవడంతో ఎక్కడినీరు అక్కడే నిలిచిపోయి విజయవాడ పాతబస్తీ చెరువుగా మారింది. అయితే జిల్లా కలెక్టర్‌ పీయూష్‌కుమార్‌ పరిస్థితి తీవ్రతను గమనించి అధికారులను అప్రమత్తం చేయడంతో వారు ఉరుకులు, పరుగుల మీద సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నీటినంతా బయటకు తోడేందుకు జనరేటర్‌ను ఉపయోగిస్తున్నారు. కాగా తరచూ పాతబస్తీలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం పట్ల వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీ సమస్యలను శాశ్వతప్రాతిపదికన పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

త్వరలో దేవాలయాల్లో ఆస్తుల వివరాలతో వెబ్‌సైట్‌


విజయవాడ: రాష్ట్రంలో దేవాలయాల్లో ఉన్న నగలు ఇతర ఆస్తుల వివరాలన్నీ సేకరిస్తున్నామని వాటన్నింటినీ పొందుపరుస్తూ వచ్చే నెల 2వ తేదీన ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నామని దేవాదాయశాఖ కమీషనర్‌ సి.సుందర్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడో 1,2 చోట్ల తప్పితే మిగిలిన అన్ని దేవాలయాల్లోనూ నగలు, రికార్డులు భద్రంగానే ఉన్నాయన్నారు. ఎక్కడైనా నగల గల్లంతు జరిగితే సంబంధితులపై క్రిమినల్‌ కేసులు పెడతామన్నారు. అగిరిపల్లి శోభనాచలపతీశ్వర ఆలయంలో రికార్డుల్లో ఉన్న నగల కంటే తక్కువ పరిమాణంలో బంగారం, వెండి ఆభరణాలు లాకరులో ఉన్నట్లు తేలినందున ఆ విషయమై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. ఇలాంటి సంఘటనలు వెలుగుచూసిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. కాగా విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయంలో జరిగే శరన్నవరాత్రి వేడుకలకు పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు 10మంది అసిస్టెంటు కమీషనర్లు, ఐదుగురు డిప్యూటి కమీషనర్లను అమ్మవారి ఆలయంలో విధులకు వినియోగిస్తామని అన్నారు. దాదాపు రూ.2కోట్లు శరన్నవరాత్రి వేడుకలకు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి గోపాల్‌కృష్ణారెడ్డితో కమీషనర్‌ సమావేశమై దసరా వేడుకలకు జరుగుతున్న ఏర్పాట్ల గురించి సమీక్షించారు.

జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ యువకుడి దీక్ష


విజయవాడ: వై.ఎస్‌.జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్‌ చేస్తూ ఒక యువకుడు శుక్రవారం నుండి ఆమరణ దీక్ష చేపట్టాడు. కమ్యూనిస్టు యోధుడి మనవడైన జయదీప్‌ ఈ దీక్ష చేపట్టడం ప్రాథాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా జయదీప్‌ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కష్టించిన ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌ అసలు సిసలు కమ్యూనిస్టు అని నివాళులర్పించారు. ఆయన చేపట్టిన ఎన్నో పథకాలు పేదల జీవితాల్లో వెలుగునింపాయని అన్నారు. అలాంటి నాయకుడు మరణించిన ప్రస్తుత పరిస్థితుల్లో అవే ఆశయాలు కలిగిన ఆయన కుమారుడు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం ఎంతైనా అవసరమన్నారు. ఆ పదవి చేపట్టడానికి జగన్‌ అన్ని విధాలా అర్హుడని వయస్సు చాలదన్న వంకపెట్టడం అసమంజసమని అన్నారు. చరిత్రలో అలెగ్జాండర్‌తో సహా ఎంతోమంది చిన్నవయస్సులోనే విజయాలు సాధించారన్నారు. కాంగ్రెస్‌ అధిష్టాన వర్గం రాష్ట్ర ప్రజల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకుని జగన్‌ను తక్షణమే సిఎంగా ప్రకటించాలని జయదీప్‌ డిమాండ్‌ చేసారు. అది జరిగే వరకు ఆమరణ దీక్ష కొనసాగుతుందన్నారు. ఆయన విజయవాడసెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మద్ధతు ప్రకటించారు. జగన్‌ విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం మీనమేషాలు లెక్కించడం ఆ పార్టీకి మంచిదికాదని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు , మంత్రులు జగన్‌నాయకత్వాన్ని కోరుతున్నందున ఆయనకు రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని విష్ణుకోరారు.

పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల చేయలేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం


విజయవాడ: ప్రకాశం బ్యారేజీలో నీటిమట్టం ఘణనీయంగా తగ్గిపోవడంతో కృష్ణాపశ్చిమ డెల్టాకు తగినంత సాగునీరు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా పశ్చిమ డెల్టాపరిధిలోని ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అరకొరగా అందుతుండడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. అయితే ప్రకాశం బ్యారేజీ అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని రైతాంగం విమర్శిస్తోంది. బ్యారేజీ నిండా నీరు వచ్చినప్పుడు నిల్వచేసుకోకపోగా సముద్రంలోకి వదిలివేసి ఇప్పుడు నీరులేదని చేతులేత్తేయడం అధికారులు బాధ్యతారాహిత్యమని డెల్టా రైతాంగసమాఖ్య అధ్యక్షుడు ఎస్‌. రంగరావు ఆదివారం ఇక్కడ మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం డెల్టాకు రోజుకు ఐదువేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుండి విడుదల చేస్తున్నారని ఈ నీటిని రెండు జిల్లాలు సర్దుకోవాల్సి ఉంటుందని చివరి జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లా పొలాలకు సాగునీరు అందడమే లేదని ఆయన అన్నారు. ఇటివలే కురిసిన వర్షాలకు బ్యారేజీ నిండగా ఆనీటిని నిల్వ చేసుకుని ఉంటే ఇటువంటి సమస్య ఉండేది కాదని అన్నారు. అదిగాక ప్రకాశం బ్యారేజీ నుండి తూర్పు డెల్టాకు సాగునీరు అధికంగా విడుదల చేస్తూ పశ్చిమ డెల్టాను పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ అసమానతలను ప్రకాశం బ్యారేజీ యంత్రాంగం సవరించకపోతే పశ్చిమ డెల్టా రైతాంగం ప్రత్యక్ష ఆందోళనకు దిగగలదని హెచ్చరించారు.

వీడిపోయిన డిప్యూటి రిజిస్ట్రార్‌ మృతికేసు


విజయవాడ: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సీటీ డిప్యూటీ రిజిస్ట్రార్‌ చౌదరి మృతికేసు మిస్టరీ వీడిపోయింది. ఆయన కుటుంబకలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డట్టు పోలీసులు నిర్ధారించారు. శనివారంనాడు యూనివర్సిటీలోని తన ఛాంబర్‌లో అచేతనంగా పడిఉన్న చౌదరిని సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం వారు అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేయడం తెలిసిందే. మృతుడి తలపై గాయం కూడా ఉండడంతో ఆయన్ను ఎవరో హత్యచేసి ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోస్టుమార్టం నివేదికలో చౌదరి పురుగుల మందు తాగినట్లు వెల్లడైంది. దీన్ని బట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం ఉదయం ఇంట్లో గొడవపడి నేరుగా యూనివర్సీటీలోని తన ఛాంబర్‌లోకి వచ్చిన చౌదరి అక్కడే పురుగుల మందు త్రాగి స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆయన కిందకు జారీ పడినప్పుడు కేబుల్‌ మోన తగిలి తలకు గాయమై ఉంటుందని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. దీంతో చౌదరి కేసును ఆత్మహత్య కేసుగా పోలీసులు మార్చారు.