గైర్హాజరుపై అళగిరినే అడగండి: కరుణ


న్యూఢిల్లీ: యుపిఎ రెండవ విడత అధికారం చేపట్టిన సంవత్సరం తర్వాత తొలిసారిగా ఆదివారం రాజధాని సందర్శనకు వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి స్పెక్ట్రమ్‌ వివాదంలో చిక్కుకున్న టెలికాం మంత్రి రాజాకు బాసటగా నిలిచారు. స్పెక్ట్రమ్‌ వివాదంలో రాజా రాజీనామా చెయ్యాలంటున్న ప్రతిపక్షం డిమాండ్‌లపై వ్యాఖ్యానించాలని అడిగినప్పుడు ”మీ అందరికీ ఏదో శుభవార్త చెప్పడానికి నేనిక్కడికి రాలేదు” అని ఆయన తమిళభాషలో వ్యంగ్యంగా అన్నారు.

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీలతో ఆయన చర్చల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వస్తుందా అన్న ప్రశ్నను ఆయన దాటవేశారు. జూన్‌ నెలలో కోయంబత్తూరులో జరుగబోయే 9వ ప్రపంచ తమిళ సదస్సు ప్రారంభోత్సవానికి రావలసిందిగా ఆహ్వానించేందుకుగాను దేశాధ్యక్షురాలు ప్రతిభా పాటిల్‌ను కలుసుకున్న తర్వాత ఇక్కడున్న తమిళనాడు హౌస్‌లో కరుణానిధి విలేఖర్లతో మాట్లాడారు. మన్మోహన్‌, సోనియాలను ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం కరుణానిధి కలుసుకుంటారు.

స్పెక్ట్రమ్‌ కేసులో మంత్రి రాజాకు వ్యతిరేకంగా సిబిఐ వద్ద సాక్ష్యం ఉన్నట్లుగా ఒక వార్తాపత్రికలో వచ్చిన వార్తాకథనంపై మొత్తం విపక్షాలన్నీ పార్లమెంట్‌ కార్యకలాపాలను స్తంభింపజేసిన కొన్ని రోజుల అనంతరం రాజాపై ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. ఆయన కుమారుడు, కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి ఎం కె అళగిరి వరుసగా పార్లమెంట్‌కు గైర్హాజరవడంపై వ్యాఖ్యానించాలని అడిగినప్పుడు ‘మీరు ఆయన్నే అడగండి’ అని కరుణానిధి ముక్తసరిగా బదులిచ్చారు. డిఎంకె అధినేతగా ఈ అంశంపై వ్యాఖ్యానించాలని ఒత్తిడి చేసినప్పుడు ”ముందు ఆయన అభిప్రాయమేంటో చెప్పనివ్వండి. తర్వాత నేను చెబుతాను” అన్నారు.

జీరో సైజులో సంజన సంతోషం!


”కన్నడ రంగానికి చెందిన ఏ తారకైనా ఆ కోరిక ఉంటుంది. నాకూ ఆ కోరిక ఉంది” అంటోంది బెంగళూరు బ్యూటీ సంజన. ఇంతకీ ఆ కోరిక ఏమిటీ అనుకుంటున్నారా? ఆ విషయానికే వస్తున్నాం. కన్నడ రంగంలో డాక్టర్ రాజ్‌కుమార్‌కి నటుడిగా ఓ విశిష్టమైన స్థానం ఉంది. పాత తరం నాయికలు ఎంతోమంది రాజ్‌కుమార్‌ సరసన జతకట్టారు. నేటి తరం నాయికల్లో చాలామంది రాజ్‌కుమార్‌ తనయుల సరసన సినిమా చేయడం తమ అదృష్టంగా భావిస్తారు.

అలా అనుకునే వారిలో సంజన ఒకరు. కన్నడ రాజ్‌కుమార్‌ తనయుడు శివరాజ్‌కుమార్‌ సరసన ఆమె ఓ చిత్రంలో నటిస్తున్నారు. దీని గురించి చెబుతూ ”కన్నడంలో రాజ్‌కుమార్‌గారిది చాలా పెద్ద ఫ్యామిలీ. ఆయన తనయుడి సరసన నటించాలనే నా కోరిక తీరడం ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మడు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కొత్త లుక్‌లో కనిపించి అలరించబోతున్నానంటూ సెలవిచ్చింది. ఈ మధ్యకాలంలో ‘జీరో సైజ్‌’ ట్రెండ్‌ నడుస్తోంది కదా.

బహుశా ఆ ట్రెండ్‌కి అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో సంజన జీరో సైజ్‌కు మారినట్లుంది. ఈ కొత్త లుక్‌ అందరికీ నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారామె. శివరాజ్‌కుమార్‌ సరసన చేస్తున్న సినిమా కాకుండా ఆమె రవీంద్ర దర్శకత్వంలో ఓ కన్నడ సినిమా చేస్తున్నారు. మలయాళంలో అంగీక రించిన చిత్రం షూటింగ్‌ జూన్‌లో ఆరంభం కానుంది. కేరళలో ఇది ఆమెకు తొలి చిత్రం. తెలుగులో కూడా అవకాశాలు ఉన్నాయని, అధికారికంగా ఒప్పందం కుదిరిన తర్వాత ఆ చిత్రాల గురించి చెబుతానని సంజనా అన్నారు.

సినీ వాణిజ్యంలో మనదే సింహభాగం!


భారతదేశంలో జరుగుతున్న మొత్తం సినీ వాణిజ్యంలో సింహభాగం దక్షిణాదిదే. ఈ నిజాన్ని అంగీకరించడానికి బాలీవుడ్ వాణిజ్య వర్గాలు అంగీకరించవేమో గానీ, వాస్తవంలో మాత్రం దీన్ని ఎవరూ కాదనలేరు. దేశంలోని మొత్తం సినీ పరిశ్రమ ఆదాయంలో నాలుగింట మూడొంతుల వాటా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలదే. 2008-09లో ఈ నాలుగు దక్షిణాది భాషా చిత్రాలు రూ.1,700కోట్ల పైగా ఆదాయం ఆర్జించాయి. సాధారణంగా దక్షిణాది చిత్రాల మొత్తం ఆదాయాల్లో తెలుగు, తమిళ సినిమాల వాటా చెరి 45శాతం, మలయాళం 8శాతం, కన్నడ చిత్రాల భాగం సుమారు 2శాతం వుంటోంది.

మొత్తం హిందీ చిత్ర పరిశ్రమ నిర్మించే చిత్రాల కన్నా తెలుగులో తయారయ్యే సినిమాలే అత్యధికం. ఎర్న్ స్ట్ అండ్ యంగ్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ డౌన్ సౌత్ సంస్థలు కలిసి తయారుచేసిన నివేదిక ప్రకారం గత ఏడాది 230 తెలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఇక దేశంలోని థియేటర్లలో సగభాగం దక్షిణాదిలోనే వున్నాయి.

దక్షిణాదిన సినిమాల నిర్మాణం స్ర్కిప్ట్ నుంచి స్ర్కీన్ దాకా ఓ క్రమశిక్షణతో సాగిపోతుంది. గడిచిన అయిదేళ్ళుగా దక్షినాది చిత్రాలు ఓ రకంగా భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీలు, యానిమేషన్, స్పెషల్ ఎఫెక్ట్ లు ఉపయోగించుకోవడంలోనూ సౌత్ సినీ ఇండస్ట్రీ ముందుంటోంది.

ఆస్కార్ను అందుకున్న ఎ.ఆర్.రెహమన్, రసూల్ పొకుట్టి కూడా దక్షిణాది వారే. సౌత్ సినిమాలంటే రజనీకాంత్ స్టయిల్స్, క్విక్ గన్ మురుగన్ తరహా పాత్రలేనని మిగతా ప్రాంతాల వారు అనుకున్నా బాక్సాఫీసు దగ్గర కాసులు రాబట్టుకోవడంలో ఈ చిత్రాలే ముందుంటున్నాయి.

సినిమా విడుదల హక్కులను పరిశ్రమ గట్టిగా నియంత్రించడం దక్షిణాది చిత్రాల విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని ఎర్న్ స్ట్ అండ్ యంగ్ కి చెందిన ఫారుఖ్ బర్సాలా అభిప్రాయపడ్డారు. పైరసీ సంగతి పక్కనపెడితే సినిమా విడుదలైన ఏడాది దాకా టీవీల్లో ప్రసారం కాకుండా జాగ్రత్త పడతాయి కాబట్టి థియేటర్ల కలెక్షన్లు ఎక్కువగా వుంటాయని ఆయన విశ్లేషించారు.

2008-09లో వచ్చిన రూ.1,700కోట్ల ఆదాయంలో రూ.1,300కోట్లు దేశీయంగా థియేటర్ల కలెక్షన్ల ద్వారానే రావడం దీనికి ఊతమిస్తోంది. దక్షిణాది పరిశ్రమ వ్యాపార ధోరణిని కూడా మార్చుకుంది. కోటి, రెండు, మూడు కోట్ల బడ్జెట్ సినిమాలనుంచి ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది. ఈ ప్రభావం కలెక్షన్లమీద కూడా కనిపిస్తోంది. రూ.7కోట్లపైగా బడ్జెట్ తో తీసిన సినిమాలపై ఆదాయం గతంలో 45శాతం దాకా వుండగా, ప్రస్తుతం 65శాతం వుంటోంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పంపిణీ తక్కువే అయినా, ఈ సినిమాలు దక్షిణాదిలోని పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లనే సాధించుకోగలుగుతున్నాయి.

తమిళ సినిమాల ఆదాయంలో నాలుగోవంతు పొరుగు రాష్ట్రాల నుంచే వుంటోంది.

దక్షిణాది సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి ఆదరణ దక్కించుకోగలిగే సామర్థ్యం వుందని బల్సారా చెప్పారు. అయితే, థియేటర్ కలెక్షన్ల విషయంలో పారదర్శకత లేకపోవడం, తరచూ టికెట్ ధరలు పెంచడం అడ్డంకులని ఆయన అభిప్రాయపడ్డారు. సెన్సార్ బోర్డు ఆమోదం పొందిన తర్వాత కూడా వివిధ కారణాల వల్ల 35శాతం సినిమాలు విడుదల కావన్నారు. దీనికితోడు తారల పారితోషికం ఆకాశాన్నంటుతుండడంతో బడ్జెట్ లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

పి.టి.నాయుడు.

లాభాలను ప్రకటించని సింగరేణి యజమాన్యం


ఆదిలాబాద్‌: సింగరేణి యజమాన్యం 2008-09 ఆర్థిక సంవత్సరానికి గానూ గడించిన లాభాల వివరాలను ఇంకా ప్రకటించకపోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా సింగరేణి 131 కోట్ల రూపాయలను లాభాలను అర్జించిందని వివిధ కార్మిక సంఘాలు ప్రకటించడం జరిగింది. సింగరేణి కార్మికులకు 2000 సంవత్సరం నుంచి గడించిన లాభాలలో కార్మికుల వాటాగా పది శాతం చెల్లిస్తూ వచ్చింది. ప్రభుత్వం లాభాల శాతాన్ని ప్రతి ఏడాది పెంచుకుంటూ పోతూ 2007 – 08 సంవత్సరానికి గానూ 15 శాతానికి పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కార్మికుల వాటాను వివిధ సంఘాల డిమాండ్‌ మేరకు 16 శాతానికి పెంచడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తై అయిదు నెలలు గడుస్తున్నా లాభాన్ని సింగరేణి యజమాన్యం ప్రకటించకపోవడంతో కార్మికులకు రావాల్సిన వాటా విషయమై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సింగరేణి యజమాన్యం అధినాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నప్పటికీ ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ లెక్కలను ప్రకటించకపోవడంతో వివిధ సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల గుర్తింపు కార్మిక సంఘాలైన ఎఐటియుసి, తెలంగాణా బొగ్గుగనుల కార్మిక సంఘాలు లాభాల వాటాను ప్రకటింపజేసి కార్మికులకు రావాల్సిన వాటాను ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్నప్పటికీ ఈ విషయంలో యజమాన్యం స్పందించకపోవడం కార్మికులకు మరింత కష్టాలు తెచ్చింది. ఇప్పటికైనా సింగరేణి యజమాన్యం లాభాలను ప్రకటించి కార్మికులకు రావాల్సిన వాటాను చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు.

దేశవ్యాప్తంగా విస్తరించనున్న ఆంధ్రాబ్యాంక్‌


నెల్లూరు: ఆంధ్రబ్యాంక్‌ చైర్మన్‌ ఆర్‌.ఎస్‌.రెడ్డి మంగళవారం నాడు వెంకటాచలం మండలంలోని స్వర్ణభారత ట్రస్ట్‌లో పూర్తి స్థాయి ఆంధ్రబ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ బ్యాంకును పూర్తిస్థాయిలో ఇక్కడ ప్రారంభించడం వల్ల వెంకటాచలం మండలంలోని చుట్టుప్రక్కల గ్రామాలకు మెరుగుగా రుణాలను ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆంధ్రాబ్యాంకు దేశంలోనే అత్యున్నత బ్యాంకుగా ఎదగడమే కాకుండా గత ఏడాది లక్ష కోట్ల వ్యాపారాన్ని చేసిందని చెప్పారు. అలాగే గత సంవత్సరం 650 కోట్లు లాభాలు ఆర్జించగా ఈ ఏప్రిల్‌ మాసాంతం వరకు 250 కోట్లరూపాయల లాభాలను గడించినట్లు తెలిపారు. రైతులు, వ్యవసాయ అనుబంధ సంస్థలు, కోళ్లఫారాలు, డైలీపారాలకు ఆర్‌బిఐ నిబంధనల ప్రకారమే రుణాలను ఇస్తామని తెలిపారు. రైతులు బ్యాంకు ఇచ్చే రుణాలను సద్వినియోగంచేసుకోవాలని తెలియజేశారు. తమ బ్యాంకుల్లో జాప్యాన్ని నివారించేందుకు ఒక వేయి అయిదు బ్యాంకులు కంప్యూటరీకరణ చేసినట్లు చైర్మన్‌ తెలిపారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు గడుస్తున్న కేవలం 32 శాతం మంది మాత్రమే బ్యాంకుల్లో రుణాలు పొందుతున్నారని మిగతా 68 శాతం ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు పొందడం వల్ల ఒడ్డిలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయానికి మెరుగ్గా రుణాలు లభించకపోగా గత ఏడాది 4 లక్షల టన్నులు కందిపప్పు పండించగా ఈ ఏడాది కేవలం రెండు లక్షల కందిపప్పును మాత్రమే పండించారని దీని వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. రైతాంగం ఎదుర్కొంటున్నసమస్యలను దృష్టిలోపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రైతులకు డీజిల్‌ మీద 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారతి ట్రస్ట్‌ చైర్మన్‌ రాజేంద్రప్రసాద్‌, నిర్వాహకులు దీపావెంకట్‌, ఆంధ్రాబ్యాంకు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ నాగేశ్వరరావు, తదితరులుపాల్గొన్నారు.