వైఎస్‌ జ్ఞాపకాలను మరువలేము: మంత్రులు


వరంగల్‌: బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జ్ఞాపకాలను మరువలేమని రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ అన్నారు. కొత్త మంత్రివర్గంలో చేరిన తరువాత వారు మంగళవారం వరంగల్‌ వచ్చారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్‌కు ఘనంగా నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రజల కోసం వైఎస్‌ ప్రారంభించిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. పేదల కోసం తపించిన వైఎస్‌ మరణం నిరుపేదలకు, పార్టీకి తీరని లోటని అన్నారు.

Advertisements

18న బీఈడీ పరీక్ష


వరంగల్‌: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతి కారణంగా ఈనెల 4వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉండగా, వాయిదా వేసిన బీఈడీ మూడో పేపర్‌ పరీక్షను ఈనెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్‌.రాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది వరకు అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల్లోనే మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌లో పరీక్ష ఉంటుంది. మిగతా పరీక్షలు ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ఈనెల 3న జరగాల్సిన కేమూ బీఫార్మసీ ప్రథమ సంవత్సరం నాలుగో పేపర్‌ పరీక్ష ఈనెల 10న మధ్యాహ్నాం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. రెమిడియల్‌ మ్యాథమెటిక్స్‌, బయాలాజీలలో పరీక్ష ఉంటుంది. మిగతా పరీక్షల్లో, పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

వరంగల్‌లో పాఠశాల గదుల్ని కూల్చివేసిన దుండగులు


వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో గుర్తు తెలియని కొందరు దుండగులు ప్రభుత్వ పాఠశాల భవనాన్ని గత అర్థరాత్రి కూల్చివేశారు. జిల్లాలోని గోవిందరాజు గుట్టలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రోడ్డున పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పావలా వడ్డీ కింద రూ.2 కోట్లు


వరంగల్‌: రైతులకు పావలా వడ్డీ కింద పంట రుణాలు అందించడానికి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు జిల్లాకు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. 2008 ఖరీఫ్‌, రబీ, సీజన్లలో పొందిన పంట రుణాలను పూర్తిగా చెల్లించినవారికి ఈ పావలా వడ్డీ కింద రుణాలు అందించనున్నట్లు తెలిపారు. గత ఖరీఫ్‌లో రుణాలు పొందిన రైతులు తమ బాకీలు చెల్లించడానికి 2009 ఆగస్టు 31వ తేదీని, రబీలో రుణాలు పొందిన రైతులు తమ బాకీలను 2009 సెప్టెంబర్‌ 30వ తేదీని చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించందని కలెక్టర్‌ తెలిపారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయాను బంధ రంగాల ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందే దిశగా ఈ సంవత్సరం జిల్లాలో పశుక్రాంతి కింద ఐదు వేల మేలుజాతి పశువులను అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో పసుగ్రాసం కొరత తీర్చేందుకుగాను, పసుగ్రాసాన్ని పెంచడానికి 100 క్వింటాళ్ల పశుగ్రాసం కొరత తీర్చేందుకుగాను పశుగ్రాసాన్ని పెంచడానికి చర్యలు చేపట్టనున్నట్లుకలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో ఏర్పడిన కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులలో ఆత్మస్థైర్యం నింపే దిశగా బ్యాంకులు తమవంతు సహాయ సహకారాలందించాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు, నాబార్డు ఎజిఎం ఉదయభాస్కర్‌, పశుసంవర్థక శాఖ జె.డి డాక్టర్‌ లక్ష్మారెడ్డి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, వివిధ బ్యాంకుల కంట్రోలింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

రూ.600 కోట్లు పంటరుణాలు: కలెక్టర్‌


వరంగల్‌: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ రైతులకు ఇవ్వాల్సిన పంటరుణాలు 600 కోట్ల రూపాయలను సెప్టెంబర్‌ మొదటివారంలోగా అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ తెలియజేశారు. పంటరుణాల పంపిణీపై కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రత్యేకంగా బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ను రూ.600 కోట్లు పంటరుణాలు అందించాలన్న లక్ష్యానికిగాను ఇప్పటివరకు 242 కోట్ల రూపాయలను పంపిణీ చేశామని చెప్పారు. మొత్తం లక్ష్యంలో 41 శాతం అని, మిగిలిన 258 కోట్ల రూపాయలను ఈ మాసాంతంలోగా అందజేయాలని బ్యాంకు అధికారులను కోరారు. జిల్లాలో మొత్తంమీద 60 శాతం తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ గత మూడు, నాలుగు రోజులుగా జిల్లావ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నందున తిరిగి వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయని చెప్పారు. వరి పంట వేయని భూముల్లో ప్రత్యామ్నాయ పంటలుగా కంది, పెసర, మొక్కజొన్న తదితర స్వల్పకాల పంటలను వేసేవిధంగా రైతులకు విత్తనాలను అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి బ్యాంకుకు ఆయా మండలాల వ్యవసాయాధికారులు, తహశీల్దార్లు, ఇతర మండలస్థాయి అధికారులను ప్రత్యేకంగా పంపి ఆయా బ్యాంకుల సర్వీసు ఏరియాలోని రైతులను బ్యాంకుల వద్ద తీసుకువచ్చి రుణాలు అందజేసేవిధంగా చర్యలు చేపడతామని కలెక్టర్‌ చెప్పారు. రాష్ట్రంలో మన జిల్లాకన్నా వర్షపాతం ఉన్న కొన్ని జిల్లాల్లో పంటరుణాల పంపిణీ అధికంగా ఉందని, ఈ నెలాఖరు వరకు వంద శాతం పంటరుణాలు అందజేయడం ద్వారా జిల్లాను ఆదర్శవంతంగా చేయాలని కలెక్టర్‌ బ్యాంకర్లకు సూచించారు. పంటరుణాల పంపిణీ ప్రగతిపై ప్రతిరోజు బ్యాంకర్లవారీగా తాను సమీక్షిస్తానని, తిరిగి ఈ నెలాఖరుకు ప్రత్యేకంగా బ్యాంకర్ల డిసిసి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బ్రాంచీలవారీగా పంటరుణాల పంపిణీపై ప్రతిరోజు సమీక్షించుకోవాలని కంట్రోలింగ్‌ అధికారులను సూచించారు. పంటరుణాలు పొందిన రైతులు తమ పంట నష్టం జరిగినా, పంట బీమా కింద పరిహారాన్ని పొందే అవకాశం ఉంటుందని, ఒకవిధంగా రైతులలో ఆత్మస్థైర్యాన్ని కలిగించేదిగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌కు ఇవ్వాల్సిన 600 కోట్ల రూపాయలు పంటరుణాలలో ప్రధానంగా ఉన్నాయని, వీటిలో తమ లక్ష్యం 91 కోట్ల రూపాయలలో 72 కోట్ల రూపాయలు పంటరుణాలను అందించినందున ఆంధ్రాబ్యాంకును కలెక్టర్‌ అభినందించారు. ఆంధ్రాబ్యాంకును ఆదర్శంగా తీసుకొని మిగిలిన బ్యాంకులు కూడా తమ లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు.

31లోగా పూర్తిస్థాయి నీరు: కలెక్టర్‌


వరంగల్‌: దేవాదుల ఎత్తిపోతల ద్వారా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌కు ప్రతిరోజు 30 ఎంసిఎఫ్‌టి జలాలను పంపింగ్‌ చేయడం వల్ల ఈనెల 31వ తేదీన పూర్తిస్థాయి మట్టానికి నీరు చేరుకుంటుందని, అదేరోజు ధర్మసాగర్‌ ద్వారా వడ్డెపల్లి చెరువుకు నీటిని పంపింగ్‌ చేయనున్నామని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ ప్రకటించారు. నగరంలోని మంచినీటి సరఫరాపై కార్పొరేషన్‌, పబ్లిక్‌ హెల్త్‌, దేవాదుల ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. నగర మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, ఇన్‌ఛార్జ్‌ కమీషనర్‌ వాకాటి కరుణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదుల నుండి రెండు మోటార్లు నిరాటంకంగా కొనసాగుతోందని, ఈనెల 31వ తేదీ వరకు ధర్మసాగర్‌ పూర్తి నీటిమట్టం స్థాయి 304.2 అడుగులకు చేరుకుంటుందని వివరించారు. దీనితో సెప్టెంబర్‌ 1న ధర్మసాగర్‌ నుంచి కాలువ ద్వారా వడ్డెపల్లికి ప్రతిరోజు 2.5 ఎంసిఎఫ్‌టి నీటిని పంపిస్తామని చెప్పారు.

రోగుల నుంచి వసూళ్లు ఆపాలి: కలెక్టర్‌


వరంగల్‌: ఎంజిఎం ఆస్పత్రిలో రోగుల నుండి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న సెక్యూరిటీగార్డును వెంటనే తొలగించడంతోపాటు మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సెక్యూరిటీ ఏజెన్సీ కాంట్రాక్ట్‌ను రద్దు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ హెచ్చరించారు. ఎంజిఎం ఆస్పత్రిలో రోగుల అటెండెంట్ల నుంచి సెక్యూరిటీ సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారని వచ్చిన వార్తల పట్ల కలెక్టర్‌ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎంజిఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సురేందర్‌ను కలెక్టర్‌ శ్రీధర్‌ ఆదేశించారు.