మడ్డువలసకు జల కళ


శ్రీకాకుళం: గత రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా సువర్ణముఖి, వేగవతి నదుల ప్రవాహం పెరిగి మడ్డువలస ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు నీటిమట్టం పెరగడంతో ఐదు ప్రధాన గేట్లు ఎత్తి నాగావళి నదిలోకి నీటిని వదిలారు. ప్రాజెక్టులోకి 5.650 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరింది. ఐదు ప్రధాన గేట్ల ద్వారా ఐదువేల క్యూసెక్కుల నీరు కుడి ప్రధాన కాల్వ ద్వారా 650 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నట్లు ప్రాజెక్టు డిఇ రమేష్‌బాబు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 63.98 మీటర్లుగా నమోదై ఉందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగితే మరిన్ని గేట్లు తెరిచి నాగావళిలోకి నీటిని విడిచిపెట్టనున్నారు. ఇదిలాఉండగా నాగావళి నదిలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతుంది. దీంతో నారాయణాపురం ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం అధికమైంది. మడ్డువలల ప్రాజెక్టులో ఐదు గేట్లు ఎత్తివేసి ఐదు వేల క్యూసెక్కుల నీరు విడిచిపెట్టడంతో ఆ నీరు సంఘం వద్ద నాగావళి నదిలోకి కలుస్తుంది. దీంతో నదిలో నీటిమట్టం క్రమేపీ పెరిగింది.

Advertisements

నిలకడగా వంశధార


శ్రీకాకుళం: వంశధార నదిలో నీటి ప్రవాహం నిలకడగా ఉంది. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 3,821 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుందని సంబంధిత శాఖాధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజీ దిగువ భాగం నదిలోకి 444 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా, ఎడమ ప్రధాన కాల్వలోకి 1768 క్యూసెక్కుల నీరు వెళుతున్నట్లు చెప్పారు. కుడి ప్రధాన కాల్వలోకి 607 క్యూసెక్కుల నీరు విడుదలవుతుందని, గొట్టా బ్యారేజీ వద్ద 38.01 మీటర్ల నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం వస్తున్న ఇన్‌ఫ్లో కొనసాగితే ఎడమ, కుడి కాల్వల ఆయకట్టుకు సాగునీరు విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు అంటున్నారు. కాగా కాల్వల ఆధారంగా సాగవుతున్న వరినాట్లు వేయడం పూర్తయింది. ఎరువులు వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు.