బాబును ఏమీ అనను: రోజా


హైదరాబాద్‌: తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ఏమీ అనబోనని రోజా అన్నారు. తెలుగుదేశంలో వారే కొందరు తనను ఎన్నికల్లో మోసం చేసి ఓడించారని, చంద్రబాబుకు కూడా ఆ విషయం తెలుసునని రోజా అన్నారు. పార్టీ నాయకులు కొందరు అమ్ముడుపోయి కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన విషయం అందరికీ తెలుసునని ఆమె అన్నారు. పనిచేసే వారని పార్టీలో ఇబ్బంది పెడుతుంటే పనిచేయలేమని, అలాంటివి చేసినవారి విషయం చంద్రబాబు నాయుడికి కూడా తెలుసునని ఆమె అన్నారు. అలాంటి వారిని పక్కన పెట్టకపోతే ఎలా అని ఆమె అడిగారు. చంద్రబాబు కొందరు నాయకులు చెప్పినట్లే వింటూ పని చేసేవారిని ప్రోత్సహించలేకపోతున్నారని ఆయన అన్నారు. తనకు వాయల్పాడు గానీ నగరి గానీ ఇవ్వాలని కోరారని, కొత్త నాయకులు కావాలనే పేరుతో కొందరు తనను వాటికి దూరం చేశారని ఆమె అన్నారు. పార్టీలో జరిగిన వ్యవహారాలకు తన మనసు గాయపడిందని ఆమె అన్నారు. కాంగ్రెసులో చేరితే గనుక ప్రజలకు ఉపయోగపడేలా కార్యకర్తలను కాపాడుకుంటానని ఆమె అన్నారు. ముఖ్యమంత్రిపై ఆమె ప్రశంసలు కురిపించారు.

రోజాను బెదిరించారు: ఎర్రబెల్లి


హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వర్గీయులు బెదిరించడం వల్లనే ఆమెకు కాంగ్రెస్‌లోకి వెళ్లాలని లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ తీర్థం పుర్చుకోవడానికి సిద్ధమైదని టీడీపీ సీనియర్‌నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో రోజాకు చాలా ప్రాధాన్యం ఇచ్చామని, ఎన్నో అంశాల్లో సీనియర్లను కాదని ఆమెకు సముచిత స్థానం కల్పించామన్నారు. పార్టీ నేతల వల్లనే తాను ఓడిపోయానని, తనకు పార్టీలో అవమానం జరిగిందని రోజా ఆరోపణలు చేయడంలో అర్థం లేదన్నారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటే పట్టుబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిందని, మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వలేదంటూ రాద్ధాంతం చేస్తుందన్నారు.