మహిళా సంఘాలపై సర్కారు సవతి ప్రేమ!


హైదరాబాద్‌: దళారుల బారి నుంచి రైతులను కాపాడటంతోపాటు గ్రామ స్థాయిలో మహిళా సంఘాలకు ఆదాయం సమకూర్చిపెట్టేందుకు ప్రవేశపెట్టిన ధాన్యం మార్కెటింగ్‌ పథకం మూలనపడింది. కొనుగోలుకు అవసరమైన సంచులను సకాలంలో సరఫరా చేయకపోవడమేగాక కొన్న ధాన్యాన్ని వెంటనే తరలించే చర్యలూ చేపట్టకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడంలేదు. కొనుగోలు చేసిన ధాన్యానికిగానూ రైతులకు డబ్బులు ఇప్పించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది.

కొనుగోళ్లు జరిపినందుకుగానూ మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన కమీషనూ సరిగ్గా అందడంలేదు. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రం మొత్తంమీద ఇప్పటిదాకా రూ.188 కోట్ల విలువైన 18.3 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా ఇప్పటి దాకా రైతులకు పంపిణీ అయింది రూ.14 కోట్లే. డబ్బులు ఇచ్చేందుకు పెట్టిన గడువు దాటినా ఇంకా రైతులకు అందలేదు. కమీషన్‌ ఆకర్షణీయంగా ఉండటంతో మహిళలు ఈ వ్యాపారంపై ఆసక్తి చూపుతూ వస్తున్నారు. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులకూ సౌకర్యంగా ఉంది.

మహిళా సంఘాలు కొనుగోలు చేసే ధాన్యాన్ని మొదట నిర్దేశించిన కొంత మంది మిల్లర్లకు ఇస్తారు. వాటిని మిల్లు పట్టి భారత ఆహార సంస్థకు మిల్లర్లు అందజేస్తారు. సంస్థ నుంచి డబ్బులు రాగానే మహిళా సంఘాలద్వారా రైతులకు చెల్లిస్తున్నారు. ఈ ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని 40 రోజుల తర్వాత డబ్బులు ఇస్తామని రైతులకు ముందుగానే చెబుతున్నారు.

బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధర లభించని నేపథ్యంలో డబ్బులు ఆలస్యమైనా అధిక ధరల ఆశతో రైతులు ధాన్యాన్ని మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అమ్ముతున్నారు. కానీ ఈసారి చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలను నెలకొల్పకపోవడంతో రైతులు దళారుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్దతు ధర లభించకపోయినా రైతుకు గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. మహిళా సంఘాలు కమీషన్‌నూ కోల్పోయాయి.

కరీంనగర్‌కు అన్యాయం
గత ఏడాది ధాన్యం కొనుగోలుచేసి పెట్టినందుకు కరీంనగర్‌ జిల్లాలో మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ.80 లక్షల కమీషన్‌ ఇవ్వలేదు. ఇక ఈ ఏడాదిలో ఆ జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రాన్నీ ఏర్పాటు చేయలేదు. రాష్ట్రం మొత్తంమీద గత ఏడాదిలో మహిళా సంఘాలద్వారా సేకరించిన ధాన్యంలో దాదాపు సగం కరీంనగర్‌ జిల్లాలోనే కొన్నారు. గత ఏడాది దాదాపు రూ.543 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఇందులో సింహ భాగం అంటే దాదాపుగా రూ.231 కోట్ల విలువైన ధాన్యాన్ని ఈ జిల్లాలోనే కొన్నారు.

Advertisements

రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన


మహబూబ్‌నగర్‌: ఆధునిక వ్యవసాయ పద్దతులు ఆచరించి అధిక దిగుబడులు సాధించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు పిలుపునిచ్చారు. వ్యవసాయం పట్ల రైతుల ఆలోచనావిధానం మారాలి, వ్యవసాయ పద్దతులు మారాలి, ఒకప్పటి వ్యవసాయం వేరు నేటి వ్యవసాయం వేరు ఎపంటవేస్తే లాభం వస్తుందో ఆపంటే వేయాలి , అని ఆయన చెప్పారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా మాచన్‌ పల్లి గ్రామంలో రైతు చైతన్య యాత్రలను ప్రారంభించారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 35 కోట్ల జనాభా వున్నప్పటికి ఆహరధాన్యాలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకొన్నామని, ప్రస్తుతం 110 కోట్ల జనాభా వున్నపటికి ఆహర ధాన్యాలు సమృద్దిగా వున్నాయని చెప్పారు. కొత్త వంగడాలు, ఆధునిక పద్దతుల వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న ఉద్దేశ్యంతో రైతుల సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం గత 6 సంవత్సరాల నుండి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని, ఇందులో భాగంగానే బ్యాంకు ఋణాలమాఫి, రాయితీ పై విత్తనాలు, ఎరువుల పంపిణి, వంటివి కల్సించటంతోపాటు 2003లో 530/- రూ.లుగావున్న వరి మద్దతు ధర 2010 నాటికి 1030/- రూ.లకు పెంచామని తెలిపారు.

అంతేకాక కేంద్రప్రభుత్వం గత సంవత్సరం ఒక్కడిఎపిపైనే లక్ష కోట్ల రూపాయల సబ్సిడి భరించి తక్కువధరకు రైతులకివ్వటం జరిగిందన్నారు. రైతులు అన్ని విషయాలు తెలుసుకోవాలని, లాభంవచ్చే పంటలేసాగు చేయాలని, ఇజ్రాయిల్‌ తరహలో బింధు, తుంపర సేద్యంతోపాటు ఆధునిక పద్దతులు పాటించాలని, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులే వాడాలని కోరారు. గుళికల మందు కొంటేనే ఎరువులు అమ్ముతామని ఎరువుల దుకాణాదారులు అంటున్నారని రైతులు మంత్రికి పిర్యాదు చేయగా, ఎరువులకు గుళికల మందుకు లంకెపెట్టే ఎరువుల దుకాణాదారులు, డీలర్లపై చర్య తీసుకుంటామని ,లైసెన్సు రద్దు చేస్తామని అంతేకాక సంబంధిత వ్యవసాయు శాఖ అధికారిపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

నెల్లూరు సన్న రకం ధాన్యం తక్కువధరకు అమ్మవద్దని, ఐకెపి, సివిల్‌ సప్లయ్స్‌ ద్వారా జిల్లాలో 10 కేంద్రాలు ఎర్పాటు చేసి ప్రభుత్వం ధాన్యం కొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి పాడి రైతులకు పశు గ్రాసవిత్తనాలు పంపిణి చేశారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు వీరా రెడ్డి మాట్లాడుతూ సహకార పరపతిలో భాగంగా డిసిసి బ్యాంకు ద్వారా ధీర్గకాళిక రుణాలిచ్చేందుకు సిద్దంగా వున్నామని 6శాతం రిబేటుపై వీటిని ఇస్తున్నందున రైతులు ఉపయోగించుకోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్‌ యం .పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం, పంటలపై రైతులకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారుల ద్వారా ఈ నెల 17 నుండి వచ్చే నెల 2 వరకు రైతు చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎరువుల దుకాణాదారులు ఎరువులకు మందు గుళికలకు లంకె పెట్టరాదని, ఈ విషయంలో జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించి తగు చర్య తీసుకొంటామని చెప్పారు. రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు కొంటే తప్పక బిల్లులు తీసుకోవాలని సూచించారు.

సర్పంచుమళ్లికార్జున రెడ్డి ఎంపిటిసిలు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌ నగర్‌ శాసనసభ్యులు ఎన్‌ .రాజేశ్వర్‌ రెడ్డి, పశుసంవర్దకశాఖ జె.డి రామచంద్రుడు, ఆర్డీఓ రాజేశం, తహశీల్దారు, ఎంపిడిఓలు హజరయ్యారు. అంతకుముందు ఆయాశాఖల అధికారులు వారి శాఖలపై రైతులకు అవగాహన కల్పించారు.

కరువులో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం


ఆదిలాబాద్‌: రాష్ట్రంలో కరువు నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందని అఖిలభారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రంగయ్య ఆరోపించారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని కరువుతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ముఖ్యమంత్రి తమకు పట్టనట్లుగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. వేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు ఐదువేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులను ఉచితంగా అందించాలని ఆయన డిమాండ్‌ చేసారు. రైతులకు పావలవడ్డీకే రుణాలు అందించి వ్యవసాయ సాగుకు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. అంతేకాకుండా కరువు ప్రాంతాల్లోని రైతులకు, కూలీలకు నెలకు వేయ్యి రూపాయల చొప్పున జీవనభృతి కల్పించి, కరువు పెన్షన్లు అందించాలని ఆయన డిమాండ్‌ చేసారు. రైతాంగ సమస్యలపై తమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

వ్యవసాయానికి 9గంటలు ఉచిత విద్యుత్‌


గుడుపల్లె: రాష్ట్ర రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని ప్రస్తుతం వ్యవసాయానికి ఇస్తున్న 7గంటలు ఉచిత విద్యుత్‌ను ఇకపై 9 గంటల పాటు సరఫరా చేయటం జరుగుతుందని రాష్ట్ర అటవీ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను 7 గంటలు మాత్రమే ఇవ్వడం జరుగుతోందని అయితే త్వరలోనే 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధ్దమవుతున్నట్లు పేర్కొన్నారు.

కుప్పం నుండి ఎన్నికై తొమ్మిదేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. తన తొమ్మిదేళ్ల పాలనను హైదరాబాదుకే మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు, రైతుల కష్టాలను పరిష్కరించటంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడన్నారు. కాగా రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తూ.. ప్రజల మనసులో చరగని ముద్ర వేసుకున్నారన్నారు.

చంద్రబాబుకు ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్ర ప్రజలు గుర్తుకువస్తారని, దీంతో ఓట్ల కోసం ఆచరణకు సాధ్యం కాని వాగ్దానాలను చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించినందుకు ఆయనకు రాష్ట్ర ప్రజలు 2009 ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పారన్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు పరిచిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత న ా వల్ల కాదంటూ రూ.5.30 చేశారన్నారు. అయితే రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లో కిలో బియ్యం రూ.30 ఉన్నా..

మరలా రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. నిరుద్యోగ భృతి, ఏటిఎంల ద్వారా మహిళలకు నగదు బదిలీ చేస్తామన్న చంద్రబాబు 9 ఏళ్ల పాలననలో వాటిని ఎందుకు విస్మరించారని, అసలు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అమలు పరిచేందుకు నిధులు ఎక్కడ నుండి సమకూర్చుతాడో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రలకు తెలియజేయలేకపోయాడన్ని ఆయన విమర్శించారు. కుప్పం ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు గెలుపొందుతూ వస్తున్నాడన్నారు. ఇకపై కుప్పం ప్రజలు అభివృద్ధిని చూసి ఆదరించాలన్నారు.

రాజకీయాలకు అతీతంగా కుప్పంను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని కుప్పం అభివృద్ధి విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. రెండో రోజు మంత్రి పర్యటనలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న పంచాయతీల్లో సైతం ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టడాన్ని చూస్తే కుప్పంలో కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందనే విషయం స్పష్టంగా తెలుస్తోందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా మంత్రి తన రెండు రోజుల పర్యటనలో ఓ వైపు చంద్రబాబుపై విమర్శానాస్త్రాలు సంధిస్తూ.. మరో వైపు రాజశేఖరరెడ్డి హయాంలోనే రాష్ట్రంతో పాటే కుప్పం అభివృద్ధి సాధ్యమని కుప్పం ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఎంతమంది చనిపోతే స్పందిస్తారు: చిరు


హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంతమంది రైతులు చనిపోతే ప్రభుత్వం కదలిక వస్తుంది, ఎన్ని పంటలు ఎండిపోతే స్పందిస్తారు అని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాసనసభలో చిరంజీవి మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం వెంటనే రాష్ట్రాన్ని కరవు రాష్ట్రంగా ప్రకటించాలి. ఆకలితో జనం నకనకలాడుంతంటే ప్రభుత్వం ఆలోచిస్తూ కూర్చోవడం సరికాదు. సత్వర చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు. అదే వచ్చే నెలలోనే ఎన్నికలుంటే ప్రభుత్వం ఇలా వ్యవహరించేదా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించి సత్వరమే రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుల రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని, పశుగ్రాసం ఉచితంగా పంపిణీ చేయాలని, పింఛన్లు వెయ్యి రూపాయలు ఇవ్వాలి డిమాండు చేశారు.

తగ్గుతున్న పంటల దిగుబడి… తప్పని ఆహార ధాన్యాల కోరత


చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వివిధ పంటలను సాగుచేస్తారు. తూర్పు మండలాలలో అధిక శాతం రైతులు వరిసాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే జిల్లాను కరవు రక్కసి పట్టి పీడిస్తోంది. 1982-83 సంవత్సరంలో మూడు లక్షల 90 వేల ఎకరాలలో రైతులు వరి సాగు చేశారు. మూడు లక్షల 20 వేల టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగింది. 1981-82లో 16,163 టన్నులు జొన్నలు ఉత్పత్తి జరిగింది. 1992 సంవత్సరానికి జొన్నపంట దిగుబడి తొమ్మిది వేల టన్నులకు పడిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా ప్రజలను కరవు పీడిస్తోది. ప్రతి ఏడాది ఆహారపంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది.

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 17,066 హెక్టార్లలో వరి సాగు చేయాల్సి వుండగా 7,604 హెక్టార్లలో మాత్రమే సాగవుతోంది. ఈ పంట సాగు కూడా తూర్పు మండలాలలోనే రైతులు సాగుచేస్తున్నారు. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో వివిధ మండలాలలో నామమాత్రంగానే వరి పంట సాగుచేస్తున్నారు. రాగి పంట 8,913 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 954 హెక్టార్లలో సాగువుతోంది. జొన్న పంట సాగు చేసేందుకు కూడా రైతులు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లా ప్రజలకు సరిపడే ఆహార ధాన్యాలు ఉత్పత్తి కావడం లేదు. ఇలాగే కొనసాగితే ఆహార ధాన్యాల కోసం తీవ్ర ఇక్కట్లకు గురికావాల్సిందేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు ఆధారపడాల్సి వస్తోంది. ఇదిలావుండగా చౌకదుకాణాల ద్వారా పేద ప్రజలకు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ద్వారా అందిస్తోంది. అయితే ఈ పథకం పక్కదోవ పడుతూ రాష్ట్రాల సరిహద్దులు దాటుతోంది. అక్రమార్కులకు చౌకబియ్యం సిరులు కురిపిస్తోంది. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. పేద ప్రజలకు ఆహారభద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పంచింది, రైతులకు పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సిందిగా పలువురు కోరుతున్నారు.

ఘనంగా పొలాల అమావాస్య : పల్లెల్లో సందడి


ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలో పొలాలను ఘనంగా జరుపుకున్నారు. మండలాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రైతులు ఎద్దులను శుభ్రంగా కడిగి పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం పొలాల అమావాస్య సందర్భంగా పశువులను పూజించడం ఆనవాయితీ. సాయంత్రం ఎద్దుల కొమ్ములకు రంగులు వేసి ఎద్దుల జతలను అలంకరించి స్థానిక ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువచ్చి పూజలు జరిపారు. అనంతరం పశువులను ఇళ్లలోకి తీసుకెళ్లి నైవేద్యాన్ని సమర్పించారు.

నేరడిగొండలో..
అన్నదాతకు అసరాగా ఉంటూ వారి కష్టాలను గట్టెక్కిస్తున్న మూగజీవాలైన పొలాల పండుగకు ఒక్కరోజు ముందుగానే ఎమి దించుతున్నావని ఒకరు, బరువులు దించుతున్నామని మరోకరు అంటు సంప్రాదాయ రితీలో కార్యక్రమన్ని పూర్తి చేస్తారు. పండుగ రోజు ఉదయం పూటనే ఎడ్లను సమీపంలోని వాగులోకి తీసుకేళ్లి శుభ్రంగా కడిగి రోజంతా వాటితో ఎపని చేయనీయకుండా చూస్తారు. వడూర్‌, తేజాపూర్‌, వాంకిడి తదితర గ్రామాలలో పండుగను ఘనంగా నిర్వహించారు. ఎద్దులను అందంగా అలంకరించి గ్రామాల్లో ఊరేగింపులు నిర్వహించారు. హరహరమహ దేవా శంబో శంకర.. అంటూ గ్రామాల్లో తిప్పుతు హరతులను పట్టారు. పండుగ కార్యాక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు ఆధికారులు తమ సొంత గ్రామా కేళ్లి పండుగను చేశారు. పలువురు ఆధికారులు, ప్రజా పతినిధులు తమ అనందాన్ని పంచుకున్నారు. ఎంపిటిసి గాదే రవిందర్‌, సర్పంచ్‌ రంజీత్‌కుమార్‌, గ్రామ పెద్దకాపు తోట పోతన్న, కాంగ్రెస్‌ నాయకులు ఆదిముల్ల రాములు, టిడిపి కన్వీనర్‌ గాదె శంకర్‌, పాల శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.