రేడియేషన్ గమనించండి: బార్క్‌


ముంబై: ఢిల్లీలోని మాయాపురి ప్రాంతంలో తుక్కు విక్రయించే డీలర్లు రేడియోషన్‌ బారిన పడిన పరిణామం నేపథ్యంలో తీవ్ర రేడియేషన్‌ ప్రభావం (ఎక్కువ పరిణామంలో) వల్ల సంభవించే భౌతిక లక్షణాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, వెంటనే సంబంధిత అధికార్లు, అంటే పోలీసులకు తెలియజేయాలని బార్క్‌ నిపుణులు సూచించారు.

”తీవ్రమైన (అత్యధిక) రేడియేషన్‌ ప్రభావం వల్ల రేడియేషన్‌ గాయాలు, జుట్టు రాలిపోవడం, అనారోగ్యానికి గురికావడం, వాంతులు చేసుకోవడం అనే లక్షణాలు కనిపిస్తాయి. అనారోగ్యం, వాంతులనేవి ఆందోళన వంటి ఇతర కారణాల వల్ల కూడా సంభవించవచ్చు” అని భాభా ఆటమిక్‌ రిసెర్చి కేంద్రంలోని ఆరోగ్య భౌతికశాస్త్రం, భద్రతా నిపుణులు అన్నారు. రేడియేషన్‌ను చూడటం, వాసనను గ్రహించడం కుదరదు కనుక పుకార్లతో ముందుకెళ్లరాదన్నారు.

”పరిస్థితిని అంచనావేసేందుకు, ఆందోళనకు కారణమైన దానిని తొలగించేందుకుగాను పర్యవేక్షణ జరిగితే తప్ప పూకార్లు భయాందోళనలు కల్గిస్తాయి. ప్రభావానికి గురికానప్పటికీ ప్రభావానికి గురైనట్లు నమ్మేవారు చాలామంది ఉంటారు. అందువల్ల ప్రజలు ఈ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించి మాయాపురిలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యాలి” అని వారన్నారు. గత నెలలో చేపట్టిన మొత్తం ఆపరేషన్‌లో మన దేశంలోని రేడియేషన్‌ ఎమర్జెన్సీ వ్యవస్థ (ఆర్‌ఇఆర్‌ఎస్‌)కు మాయాపురి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఇఒ రాజేంద్ర పటానియా చాలా సహకరిస్తున్నారని, ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా అనుమానిస్తున్న మరిన్ని మూల కారకాల కోసం అన్వేషిస్తున్న డిఎఇ – ఎఇఆర్‌బి – ఆర్‌ఇఆర్‌ఎస్‌ సంయుక్త బృందానికి చేయూతను కొనసాగిస్తున్నారని వారన్నారు.

ప్రభావిత ప్రాంతంలో ప్రజలు తీసుకోవలసిన రక్షణ చర్యలపై బార్క్‌ ఆరోగ్య విభాగంతో పాటు జాతీయ విపత్తు నివారణ సంస్థ సూచనలు చేసింది.

కాలుష్యానికి కారణమయ్యే వాటిపట్ల మరింత జాగ్రత్తగా ఉండటం, మెరిసే ఎలాంటి వస్తువుల పట్లా ఆకర్షణకు గురికాకుండా ఉండటం, అలాంటివి కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయడం, కాలుష్య ప్రాంతాల్లో తినడం, తాగడం, స్మోకింగ్‌ వంటివి చెయ్యకపోవడం, చేతుల్ని నోటికి దూరంగా ఉంచడం, గాయాల్ని మూసి ఉంచడం, రేడియో ధార్మిక సామగ్రితో పని చేసిన తర్వాత పొగతాగకుండా ఉండటం, చేతులు కడుక్కోవడం లేదా ఆ ప్రాంతాన్ని విడిచి పెట్టడం లాంటి సూచనలు ఆందులో ఉన్నాయి.

Advertisements

రాష్ట్ర రాజధానిలో భద్రత గోల్‌’మాల్‌’


హైదరాబాద్‌: ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో నగరంలో భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ముఖ్యంగా వాణిజ్య కేంద్రాలలో భద్రత పోలీసులకు పెద్ద తలనొప్పిగా పరిణమించింది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు తమ దుకాణాల వద్ద సొంత సెక్యూరిటీని ఏర్పాటుచేసుకుంటున్నా దాని వల్ల ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు.

బేగంపేటలో ఉన్న లైఫ్‌స్టయిల్‌ కాంప్లెక్స్‌లోకి ప్రవేశిస్తే, మీ కారు తనిఖీ చెయ్యడానికి అక్కడ ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా కనిపించడు. వాహనాల్లో పేలుడు పదార్థాలేవైనా ఉంటే వాటిని కనిపెట్టేందుకు వారి దగ్గర కనీస పరికరాలు కూడా లేవు. ఈ భవనాన్ని పేల్చేందుకు ఏ ఉగ్రవాది అయినా దీనిపై కన్నవేసి ఉంచితే ఇది ఒక ‘ఆహ్వానం’ లాంటిదే.

భద్రత పెంచాలని హైదరాబాద్‌ పోలీసులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఇక్కడి పలు మాల్స్‌లో నెలకొన్న నిర్లిప్తతతో అవన్నీ గాల్లో కలిసిపోయాయి. లైఫ్‌ స్టయిల్‌ వద్ద మేనేజిమెంట్‌ పట్టించుకుంటున్న విషయం పార్కింగ్‌ ఫీజు ఒక్కటే. రోజంతా లేదా కొన్ని గంటలపాటు ఇక్కడ వందల సంఖ్యలో కార్లు, టూవీలర్లు పార్క్‌ చేసి ఉంటాయి.

ఇక జివికె ఒన్‌ దగ్గర పెద్ద సంఖ్యలో కనిపించే ప్రయివేటు భద్రతా సిబ్బంది వాహనాల్ని తనిఖీ చేస్తుంటారు. ఆయుధ పరికరాల లేమి సుస్పష్టం. ఎలాంటి తనిఖీ లేకుండానే బేస్‌మెంట్‌ నుంచి ఎగ్జిట్‌ డోర్‌ ద్వారా ఈ ప్రతినిధి రాగలిగారు. ఎలివేటర్‌ ద్వారా వచ్చే వారిని మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ప్రసాద్స్‌ ఐమాక్స్‌లోకి ఎవరైనా రెండంచెల భద్రత గుండా వస్తారు. డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్స్‌ నుంచి, తర్వాత క్షుణ్ణమైన తనిఖీల మధ్య రావడం. అయితే, ఒక పోలీసు బృందం వెనుక నుంచి ఈ ఆవరణలోకి అడుగుపెట్టి లోపల డమ్మీ బాంబుల్ని పెట్టడం చూస్తూ ఇక్కడ ఏ మాత్రం సన్నద్ధత ఉందనేది తెలుస్తుంది.

వాస్తవానికి ఇక్కడ సుమారు 100 మంది సెక్యూర్టీ గార్డులు ఉన్నప్పటికీ వారి వద్ద ఒక్క ఆయుధం కూడా లేదు.

”మా వాళ్ళకు అన్నీ లోతుగా తెలియజేశాం. ఒక బాంబు తయారు చెయ్యడానికి ఉపయోగించే సామగ్రిని వారికి చూపించాం. ఉగ్రవాదులు విడివిడిగా లోపలికి తీసుకురావడానికి వీలుండే నట్లు, బోల్ట్‌లు, స్క్రూలు, మేకులు, వైర్లు లాంటి సామగ్రిని తనిఖీ చేస్తున్నారు” అని ప్రసాద్స్‌ వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే అజైల్‌ సెక్యూరిటీ సిఎండీ విఆర్‌కె రావు చెప్పారు.

అయితే, ”ప్రసాద్స్‌ అనేది వినోద కేంద్రం. మావాళ్ళకు ఆయుధాలిచ్చి ప్రజల్ని భయభ్రాంతుల్ని చెయ్యాలని మేం అనుకోవడంలేదు” అను రావు అన్నారు.

సెంట్రలో జోన్‌ డిసిపి డాక్టర్‌ అకున్‌ సభర్వాల్‌ మాట్లాడుతూ 26/11 లాంటి ఘటన సంభవిస్తే దానిని పోలీసులే తప్ప ప్రయివేటు గార్డులు ఎదుర్కొనలేరన్నారు. ”సెక్యూరిటీ ఏజెన్సీలు సింగిల్‌ లేదా డబుల్‌ బ్యారెల్‌ గన్స్‌ సంపాదించగలరు. అవి ఎకె-47కు సమానం కాదు” అన్నారు. కాగా, కొన్ని ఆయుధాల్ని తేలిగ్గా తీసుకురావచ్చని మరో అధికారి అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌ నగర పోలీసులు బస్టాండ్లలో తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ బస్సుల్లో ప్రయాణీకుల్ని సోదా చేస్తున్నారు.

అదే సమయంలో కొందరు పోలీసులు వివిధ ప్రాంతాల్లోకి అడుగుపెట్టి అద్దెకుంటున్నవారిలో కొందరిని తనిఖీ చేశారు.

”ఏడాదికంటే తక్కువ కాలం అద్దెకున్న వారి గురించి మాకు సమాచారం ఇవ్వాలని మేం ఇళ్ళ యజమానుల్ని కోరుతున్నాం” అని సభర్వాల్‌ విజ్ఞప్తి చేశారు. ఇక రోడ్లపైన ఖాకీ దుస్తుల్లో ఉన్న పోలీసులు ప్రతిచోటా సోదాలు చేస్తుండటం కనిపిస్తూనే ఉంది.

గైర్హాజరుపై అళగిరినే అడగండి: కరుణ


న్యూఢిల్లీ: యుపిఎ రెండవ విడత అధికారం చేపట్టిన సంవత్సరం తర్వాత తొలిసారిగా ఆదివారం రాజధాని సందర్శనకు వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి స్పెక్ట్రమ్‌ వివాదంలో చిక్కుకున్న టెలికాం మంత్రి రాజాకు బాసటగా నిలిచారు. స్పెక్ట్రమ్‌ వివాదంలో రాజా రాజీనామా చెయ్యాలంటున్న ప్రతిపక్షం డిమాండ్‌లపై వ్యాఖ్యానించాలని అడిగినప్పుడు ”మీ అందరికీ ఏదో శుభవార్త చెప్పడానికి నేనిక్కడికి రాలేదు” అని ఆయన తమిళభాషలో వ్యంగ్యంగా అన్నారు.

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీలతో ఆయన చర్చల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వస్తుందా అన్న ప్రశ్నను ఆయన దాటవేశారు. జూన్‌ నెలలో కోయంబత్తూరులో జరుగబోయే 9వ ప్రపంచ తమిళ సదస్సు ప్రారంభోత్సవానికి రావలసిందిగా ఆహ్వానించేందుకుగాను దేశాధ్యక్షురాలు ప్రతిభా పాటిల్‌ను కలుసుకున్న తర్వాత ఇక్కడున్న తమిళనాడు హౌస్‌లో కరుణానిధి విలేఖర్లతో మాట్లాడారు. మన్మోహన్‌, సోనియాలను ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం కరుణానిధి కలుసుకుంటారు.

స్పెక్ట్రమ్‌ కేసులో మంత్రి రాజాకు వ్యతిరేకంగా సిబిఐ వద్ద సాక్ష్యం ఉన్నట్లుగా ఒక వార్తాపత్రికలో వచ్చిన వార్తాకథనంపై మొత్తం విపక్షాలన్నీ పార్లమెంట్‌ కార్యకలాపాలను స్తంభింపజేసిన కొన్ని రోజుల అనంతరం రాజాపై ఆయన వ్యాఖ్యలు వచ్చాయి. ఆయన కుమారుడు, కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి ఎం కె అళగిరి వరుసగా పార్లమెంట్‌కు గైర్హాజరవడంపై వ్యాఖ్యానించాలని అడిగినప్పుడు ‘మీరు ఆయన్నే అడగండి’ అని కరుణానిధి ముక్తసరిగా బదులిచ్చారు. డిఎంకె అధినేతగా ఈ అంశంపై వ్యాఖ్యానించాలని ఒత్తిడి చేసినప్పుడు ”ముందు ఆయన అభిప్రాయమేంటో చెప్పనివ్వండి. తర్వాత నేను చెబుతాను” అన్నారు.