ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు: చిరంజీవి


రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా సాధన కోసం ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. పోలవరం సాధన కోసం ఆయన ఈ రోజు మధ్యాహ్నాం అంతర్వేది నుంచి బస్సుయాత్ర ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ నుంచి విమానంలో మధురపూడి చేరుకున్న చిరంజీవికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరం అయితే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. తన బస్సుయాత్ర తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదన్నారు. అసవరం అయితే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులపై కూడా పోరాడతామని చిరంజీవి స్పష్టం చేశారు.

Advertisements

29న జిల్లాకు రానున్న రఘువీరారెడ్డి


రాజమండ్రి: వ్యవసాయ శాఖ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి ఈనెల 29వ తేదీన జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో 29 ఉదయం 10.30 గంటలకు అన్నవరం చేరుకొని సత్యనారాయణస్వామిని, అనంతరం 12.15 గంటలకు తలుపులమ్మ తల్లిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు గండేపల్లిలో క్షేత్ర సందర్శన జరిపి రైతులతో ముచ్చటిస్తారు. 4.30 గంటలకు రాజమండ్రి చేరుకొని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీజనల్‌ వ్యాధులపై సమీక్షిస్తారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఇరిగేషన్‌, ట్రాన్స్‌కో అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 6 గంటలకు అటునుంచి పశ్చిమగోదావరి జిల్లాకు బయలుదేరి వెళతారు.

అశ్లీల చిత్రాలు చూపించి కోరిక తీర్చమంటున్న గురువు


రాజమండ్రి: తొమ్మిదవ తరగతి విద్యార్థినికి అశ్ల్లీల చిత్రాలు చూపించి కోరిక తీర్చమన్న కీచక గురువు దయాసాగర్‌పై గతంలోను విద్యార్థులపై వేధింపులకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. దయాసాగర్‌ తమతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ అతను పనిచేస్తున్న ఇంటర్నేషనల్‌ పాఠశాల యాజమాన్యానికి గతంలో ఓ విద్యార్థి ఫిర్యాదు చేసింది. కానీ స్కూలు పరువు పోతుందేమోనని యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు.

గోదావరినదిలో యువకుడి అనుమానాస్పద మృతి


రాజమండ్రి: ఈనెల 13వ తేదీన అదృశ్యమైన యువకుడు గోదావరి నదిలో శవమై తేలింది. స్థానిక దానవాయిపేటకు చెందిన కోటారి సతీష్‌(22) మృతదేహం గౌతమి ఘాట్‌ సమీపంలోని ఇసుక తెన్నెలపై కనిపించింది. సతీష్‌ స్నేహితులతో కలిసి ఈనెల 13వ తేదీన కేతవరం పోతురాజు గుడికి వెళ్లిన సతీష్‌ తిరిగి రాలేదని తండ్రి అన్నవరం ఈనెల 20వ తేదీన వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా బుధవారం గౌతమి ఘాట్‌ సమీపంలో మృతదేహం ఉన్నట్టు సమాచారం తెలుసుకొని వెళ్లి పరిశీలించగా సతీష్‌ మృతదేహంగా గుర్తించారు. మృతదేహం బాగా కుమ్మిపోయి ఉండడంతో కొద్దిరోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహానికి సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి వన్‌టౌన్‌ ఎస్సై రామకృష్ణ అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వైన్‌ఫ్లూతో మరో యువకుడి మృతి


రాజమండ్రి: కాకినాడ రూరల్‌ మండలం అరహ్యకట్టకు చెందిన ప్రత్తిపాటి రాజేష్‌(18) కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. అరహ్యకట్టలో స్వైన్‌ఫ్లూ వ్యాపించిందన్న ఉదంతం నేపథ్యంలో రాజేష్‌ మృతితో గ్రామంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. రాజేష్‌ తల్లి ప్రతిపాటి వరలక్ష్మి, అదే వీధిలో ఉంటున్న సత్యనారాయణ, బి.రాజేష్‌కుమార్‌ మృతి చెందిన విషయం విదితమే. రాజేష్‌ రక్త పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ నెగిటివ్‌ రిపోర్టు వచ్చిందని, గ్రామంలో స్వైన్‌ఫ్లూ లేదని మండల వైద్యాధికారిణి డాక్టర్‌ ఎం.రత్నడిర్తీ తెలిపారు. రాజేష్‌ మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే శ్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు.

మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు


రాజమండ్రి: నగరంలో ఇటీవల మహిళలపై జరుగుతున్న వరుస దాడులపై పోలీస్‌ యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. లుఫరన్‌ కళాశాల విద్యార్థుల వ్యవహారం దగ్గర నుండి అనూషపై ఉన్మాది దాడి, విద్యార్థినీపై టీచర్‌ అఘయిత్యం వంటి ఉదంతాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో మహిళల రక్షణకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖ నిర్ణయించింది. దీనికోసం యాంటి ఈవ్‌టీచింగ్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించారు. మహిళలు తమకు ఎటువంటి సమస్య వచ్చినా స్వయంగా తనతో చెప్పుకోవచ్చునని డిఎస్పీ డి.జానకి తెలిపారు. మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాంటి ఈవ్‌టీచింగ్‌ ఫోర్సును పండుగ సెలవు అనంతరం రంగంలోకి దింపుతామన్నారు. ఈ ఫోర్సుకు సిఐ బి.పూర్ణచందర్‌రావును ప్రత్యేక అధికారిగా నియమించినట్టు ఆమె తెలిపారు. నగరంలోని రద్దీ కూడళ్లలో, కళాశాలల వద్ద ఇకనుండి ఎవరైనా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినవారికి, ఇబ్బంది కలగజేసినా ఈ ఫోర్సు వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎన్నిసార్లు కౌన్సిలింగ్‌ ఇచ్చినా, శిక్షల గురించి అవగాహన కల్పించినా మహిళలపై వేధింపులు, దాడులు తగ్గకపోవడానికి ఆకతాయిలకు భయం లేకపోవడమే కారణమన్నారు. మహిళలకు ఎవరికైనా వేధింపులు ఎదురైతే తనకు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. వీటితోపాటు వారానికి ఒకసారి నగరంలో నాకాబందీ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

పండుగ సీజన్‌లో బ్లాక్ దందా


రాజమండ్రి: అసలే పండుగల సీజన్‌.. ఆపై మండుతున్న ధరలు… మరోవైపు అక్రమ నిల్వలపై పౌర సరఫరాల శాఖ అధికారుల దాడులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని నిత్యావసర సరకులు పెద్దఎత్తున బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో.. దీనిని నియంత్రించేందుకు జిల్లా అధికార యంత్రాగం పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ గొడౌన్లలో అక్రమంగా నిల్వచేసిన సరకులపై అధికారుల దాడులు ముమ్మరమయ్యాయి.

రాజమండ్రిలోని ఎస్‌విజి మార్కెట్‌లో కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు పలు దఫాలుగా దాడులు నిర్వహించి అక్రమ నిల్వలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి నగరాలతో పాటు పలు పట్టణాలలో నిత్యావసర సరకులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోను ఈ సమస్య పట్టిపీడిస్తుంది. బియ్యం, కందిపప్పులతో పాటు ఇటీవల కాలంలో పంచదార ధర గణనీయంగా పెరిగింది. కిలో నాణ్యమైన బియ్యం 30 రూపాయలు, కందిపప్పు 85 నుంచి 90 రూపాయలు విక్రయిస్తుండగా.. మార్కెట్‌లో పంచదారను కిలో 35 నుంచి 38 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.

పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కొంతమంది వ్యాపారులు కందిపప్పుతో పాటు పంచదారకు కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు సమాచారం. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు మొదలుకొని రంజాన్‌, దసరా, బక్రీద్‌, క్రిస్ట్‌మస్‌ పండుగలు కొన్ని రోజుల వ్యవధిలో వరుసగా ఉండడంతో.. ఆయా పర్వదినాలలో ఎక్కువగా వినియోగించే సరకులను బ్లాక్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే భారీఎత్తున పంచదార నిల్వలను మూడో కంటికి తెలియకుండా కొంతమంది వ్యాపారులు రహస్య ప్రదేశాలకు తరలించినట్లు చెప్పుకుంటున్నారు. సాధారణంగా మార్కెట్‌ గొడౌన్లు, వ్యాపారుల సొంత గొడౌన్లలో సరుకును నిల్వ చేస్తుంటారు. అధికారుల దాడులు అధికమైన తరుణంలో గొడౌన్లలో కొద్దిపాటి నిల్వలనే అందుబాటులో ఉంచుతున్నారు.

ఒకవేళ అధికారులు దాడిచేసి అక్రమ నిల్వలు స్వాధీనం చేసుకున్నప్పటికి అంతగా నష్టం ఉండదని ఆయా వర్గాల ఆలోచన. అధికారుల దాడుల నుంచి అక్రమ నిల్వలను కాపాడుకోవటానికి కొంతమంది వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఎవరి దృష్టి పడకుండా నివాస ప్రాంతాలలోని అద్దె భవనాలలో సరకును దాచిపెడుతున్నట్లు తెలిసింది. కొంతమంది వ్యాపారులు లైసెన్స్‌లు లేకుండానే భారీ ఎత్తున నిత్యావసర వస్తువులను నిల్వచేస్తున్నారు. అడపాదడపా అధికారులు నిర్వహిస్తున్న దాడులలో ఇటువంటి సరకు కూడా చేతికి చిక్కుతుంది.

ఇటువంటి వ్యాపారులకు అధికార వర్గాలలోను పలుకుబడి ఉన్నట్లు తెలిసింది. కొంతమంది అధికారులు ఇటువంటి వ్యాపారులకు అండగా నిలిచి.. దాడుల సమయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాలలో ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు కొద్దిపాటి సరకునే స్వాధీనం చేసుకుని.. పెద్దఎత్తున అక్రమ నిల్వలను విడిచిపెడుతున్నారని చెబుతున్నారు. ఫలాన చోట అక్రమ నిల్వలు ఉన్నాయని అధికారులకు స్పష్టమైన సమాచారం వెళుతున్నప్పటికి.. తనిఖీలలో మాత్రం ఇటువంటిదేమీ లేదని అధికారులు పెదవి విరుస్తుండడం గమనార్హం.

ఆర్థిక మాంద్యం ప్రభావంతో సగటు మనిషి అన్నిరకాలుగా చితికిపోతున్న ప్రస్తుత తరుణంలో బ్లాక్‌ మార్కెట్‌* సమస్య మరింత కుంగదీస్తుంది. పండగ సీజన్‌ అయినప్పటికి చేతిలో సరిపడనంత సొమ్ము లేకపోవడంతో మధ్య తరగతి ప్రజలు సైతం ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. నిత్యావసర వస్తువులను కొనలేని పరిస్థితి ఉండడంతో పండుగ రోజుల్లో కూడా పప్పన్నం* చేసుకోలేని దుస్థితి నెలకొందని మథనపడుతున్నారు. గోరుచుట్టుపై రోకలిపోటు* చందంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్న సరకులు పేద, మధ్య తరగతి ప్రజలను వెక్కిరిస్తున్నట్లుగా ఉన్నాయి.