యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగిన సర్కారు


హైదరాబాద్: రాజకీయం, తీవ్రవాదం, వేర్పాటువాదం అన్నీ మరుగునపడిపోయాయి.. అటు జనంలోను, ఇటు సర్కారులోనూ ఇప్పుడంతా లైలా భయమే. తుపాను ముప్పు తీరాన్ని తాకడంతో.. సహాయచర్యలంటూ ప్రభుత్వం, ముందస్తుజాగ్రత్తల్లో జనం నిమగ్నమయ్యారు. సెలవు రద్దు చేసిమరీ అధికారులను పరుగుపెట్టిస్తోంది ప్రభుత్వం. వీలైనంత నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన చర్యల్లో దిగింది సర్కారు. ఉత్తర, దక్షిణకోస్తాల్లో తుపాను అలజడి షురూ అవడంతో.. ప్రభుత్వం ముందే మేలుకుంది. సెక్రటేరియట్, కలెక్టరేట్లలో కదలిక కనిపించింది. స్వయంగా రంగంలో దిగిన ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు- శ్రీకాకుళం మధ్యనున్న తొమ్మిది జిల్లాల కలెక్టర్లు ఆన్‌లైన్లోకొచ్చి.. సహాయకచర్యలపై ఆదేశాలందుకున్నారు. తీవ్రత ఎక్కువగా వుండవచ్చని, తేలిగ్గా తీసుకోవద్దని సీఎం అధికారులను కోరారు. ప్రజలకు భరోసా కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈనెల 25 వరకూ అధికారులందరికీ సెలవులు రద్దయిపోయాయ్. తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి స్పెషల్ కమిటీ ఒకటి నియమితమైంది. ముంపు ప్రాంతాల నుంచి RTC ప్రత్యేక బస్సులు నడపనుంది. బాధితులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అందించడానికి పౌరసరఫరా అధికారులు సమాయత్తమయ్యారు.

శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఉధృతి ఎక్కువగా కనిపించే అవకాశముంది కనుక.. అక్కడ 139 తుపాను షెల్టర్లు ఏర్పాటయ్యాయి. 224 లోతట్టు ప్రాంతాలను గుర్తించి.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు టాస్క్‌ఫోర్స్ అధికారులు. కళింగపట్నం ఓడరేవులో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. అత్యవసర సాయం కోసం ప్రజలకు టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో వుంచారు. తుపాను హెచ్చరికలతో ఉభయగోదావరి జిల్లాల్లో ఆందోళన నెలకొంది. భైరవపాలెం వద్ద ఓ ఫిష్షింగ్ బోట్‌ తప్పిపోయి.. 8 మంది మత్స్యకారుల ఆచూకీ కనబడక.. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం గాలింపు చర్యల్లో నిమగ్నమైంది. బాధిత కుటుంబాలను పరామర్శించిన కలెక్టర్ రవిచంద్ర, పొంచివున్న తుపాను ముప్పుపై కూడా సీరియస్‌గా స్పందిస్తున్నారు.

దక్షిణకోస్తాలోనూ అదే పరిస్థితి. రుతుపవనాల రాక, లైలా తుపానుల కారణంగా భారీవర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంతాల్లో టూరేశారు. తీరంలోని మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. తీరప్రాంతం తక్కువగా వున్న గుంటూరు లాంటి జిల్లాల్లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు అన్ని ఓడరేవుల్లోనూ డేంజర్ లైట్లే వెలుగుతున్నాయి. చేపల వేట ఆగిపోయింది. ఫిష్షింగ్ బోట్లన్నీ లంగరేసి రెస్ట్ తీసుకుంటున్నాయి. ప్రస్తుతానికి ఓ మోస్తరు వర్షంతో సద్దుచేయకుండా కనిపిస్తున్న రాష్ట్రంలో.. రేపు తెల్లారేసరికి తుపాను తీరం దాటితే.. సీను మారిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా తీరప్రాంతం భారీగా నష్టపోవడం గ్యారంటీ అన్న హెచ్చరికల నడుమ.. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు జనం.

Advertisements

బ్రిటన్‌లో మళ్లీ ఎన్నికలు?


లండన్‌: బ్రిటన్‌లో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు హంగ్‌ కూడా వచ్చేట్లుగా కనపడటం లేదు. అంతర్గతంగా ఏర్పడ్డ పార్టీ విభేదాలతో కన్జర్వేటివ్‌ – డెమొక్రాట్లు దూరమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 25 లోపు బ్రిటన్‌లో ఏ పార్టీనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు.

ఈసారి బ్రిటన్‌లో తప్పకుండా సంకీర్ణ ప్రభు త్వం వస్తుందని ముందుగానే ఊహించిన రాజకీయ పండితులు…. లండన్‌ లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని మాత్రం ఊహించలేకపోయారు. బ్రిటన్‌లో ఉన్న మూడు (కన్జర్వేటివ్‌, లేబర్‌, లిబరల్‌ డెమొక్రటిక్‌) పార్టీలకు ఇంకా 14 రోజుల గడువుంది. ఈలోపుగా మూడు పార్టీల్లోని ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే రెండోసారి బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరగుతాయి. మే6న ముగిసిన ఎన్నికల తరవాత సంకీర్ణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కన్జర్వేటివ్‌, లిబరల్‌ డెమొక్రాట్‌ మధ్య రాయబారాలు నడిచాయి. అయితే యూరప్‌ యూనియన్‌ విధానం ఇరు పార్టీల్లోనూ విభేదాలను సృష్టించటానికి కారణమైందని పరిశీలకులు భావిస్తున్నారు.

హంగ్‌ దిశగా…
తాజా పరిణామాల నేపథ్యంలో బ్రిటన్‌లో హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడే అవకాశాలున్నాయి. నిన్న ఇరుపార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కన్జర్వేటివ్‌ – లిబరల్‌ డెమొక్రాట్లు కలసి బ్రిటన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో వస్తున్న తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. దీంతో ప్రల్లో ఉన్న ఆందోళనకు తెరపడేట్టు కనపడుతున్నది. అయితే బ్రిటన్‌లో ఏర్పడిన ఈ సంక్షోభం త్వరలో తొలగకపోతే… యూరో మీద తీవ్ర ప్రభావం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి.

బాబును ఏమీ అనను: రోజా


హైదరాబాద్‌: తాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ఏమీ అనబోనని రోజా అన్నారు. తెలుగుదేశంలో వారే కొందరు తనను ఎన్నికల్లో మోసం చేసి ఓడించారని, చంద్రబాబుకు కూడా ఆ విషయం తెలుసునని రోజా అన్నారు. పార్టీ నాయకులు కొందరు అమ్ముడుపోయి కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన విషయం అందరికీ తెలుసునని ఆమె అన్నారు. పనిచేసే వారని పార్టీలో ఇబ్బంది పెడుతుంటే పనిచేయలేమని, అలాంటివి చేసినవారి విషయం చంద్రబాబు నాయుడికి కూడా తెలుసునని ఆమె అన్నారు. అలాంటి వారిని పక్కన పెట్టకపోతే ఎలా అని ఆమె అడిగారు. చంద్రబాబు కొందరు నాయకులు చెప్పినట్లే వింటూ పని చేసేవారిని ప్రోత్సహించలేకపోతున్నారని ఆయన అన్నారు. తనకు వాయల్పాడు గానీ నగరి గానీ ఇవ్వాలని కోరారని, కొత్త నాయకులు కావాలనే పేరుతో కొందరు తనను వాటికి దూరం చేశారని ఆమె అన్నారు. పార్టీలో జరిగిన వ్యవహారాలకు తన మనసు గాయపడిందని ఆమె అన్నారు. కాంగ్రెసులో చేరితే గనుక ప్రజలకు ఉపయోగపడేలా కార్యకర్తలను కాపాడుకుంటానని ఆమె అన్నారు. ముఖ్యమంత్రిపై ఆమె ప్రశంసలు కురిపించారు.

రోజాను బెదిరించారు: ఎర్రబెల్లి


హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వర్గీయులు బెదిరించడం వల్లనే ఆమెకు కాంగ్రెస్‌లోకి వెళ్లాలని లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ తీర్థం పుర్చుకోవడానికి సిద్ధమైదని టీడీపీ సీనియర్‌నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో రోజాకు చాలా ప్రాధాన్యం ఇచ్చామని, ఎన్నో అంశాల్లో సీనియర్లను కాదని ఆమెకు సముచిత స్థానం కల్పించామన్నారు. పార్టీ నేతల వల్లనే తాను ఓడిపోయానని, తనకు పార్టీలో అవమానం జరిగిందని రోజా ఆరోపణలు చేయడంలో అర్థం లేదన్నారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటే పట్టుబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిందని, మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వలేదంటూ రాద్ధాంతం చేస్తుందన్నారు.