హైదరాబాద్‌‌: చాపకింద నీరులా మావోయిస్టులు రాష్ట్రంలో తమ నెట్‌వర్క్‌ను, ఇటు క్యాడర్‌ను పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. 2005 చర్చల తర్వాత వరుస ఎన్‌కౌంటర్లు, అగ్రనేతలు ఎన్‌కౌంటర్‌లో హతమవడం… మరికొందరు నేతలు లొంగిపోవడంతో ఉత్తర తెలంగాణా స్పెషల్‌ జోనల్‌ కమిటీతో పాటు నల్లమల, దండకారణ్యం పూర్తిగా మట్టికొట్టుకుపోయింది. ఇటీవలే ఛత్తీస్‌ గఢ్‌లో పోలీసులపై గెరిల్లా యుద్ధతంత్రంతో విజ యాన్ని సాధించిన మావోయిస్టులు తిరిగి రాష్ట్రంలో పాగా వేసేందుకు యత్నాలను ముమ్మరం చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

గతంలో అగ్ర నేతలు శాఖమూరి అప్పారావు, టెక్‌ రమణ అలి యాస్‌ కొండల్‌రెడ్డి ఎన్‌కౌంటర్‌ సమయంలో వారి డైరీని డీకోడ్‌ చేసినప్పుడు మావోల వ్యూహాలు బయటపడ్డాయి. రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రముఖులను టార్గెట్‌ చేసేందుకే వారు వచ్చినట్లు డీజీపీ స్వయంగా పేర్కొన్నారు. మావోయిస్టులు ఉత్తర తెలం గాణా స్పెషల్‌ జోన్‌పై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. చాలా వరకు గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలక భూమిక పోషించి ఆ తర్వాత లొంగిపోయినవారు.. మావోయిస్టు సానుభూతిపరులుగా పోలీసు శాఖకు చిక్కకుండా పనిచేసిన యువత ప్రస్తుతం నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న వారు…. వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పులపాలైనవారు మావోయిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఉత్తర తెలంగాణా స్పెషల్‌ జోనల్‌ కమిటీలో సభ్యులుగా చేరుతున్నట్లు తెలుస్తోంది.

దండకారణ్యం… అబూజ్‌మఢ్‌ కొండల్లో వీరికి శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతంలో శిక్షణ పూర్తి అయిన తర్వాత ఉత్తర తెలంగాణాలో జిల్లాల వారీగా, మండలాల వారీగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జి రామన్న ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఉత్తర తెలంగాణాలోని నల్గొండలో కొంతభాగం, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో చాలామంది యువకులు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం. అదే సమయంలో తెలంగాణాలో గతంలో విప్లవోద్యమాన్ని బలోపేతం చేసిన సికాస గట్టిపడుతున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాలు సైతం అప్రమత్తం చేస్తున్నాయి.

నల్లమలలో ఉనికే లేదు…
అగ్రనేతలు బాలకృష్ణ, సుధాకర్‌ ఎన్‌కౌంటర్‌, ఉయ్యూరు ఎన్‌కౌంటర్‌ తర్వాత నల్లమలలో మావో యిస్టుల ఉనికి లేకుండా పోయిందనేది స్పష్టమవు తోంది. అదే సమయంలో పోలీసు వర్గాలు సైతం ఉత్తర తెలంగాణా, ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ)లో మాత్రమే మావోయిస్టుల కదలికలు స్పష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు. దండకారణ్యం, నల్లమల కేంద్రంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే మావోయిస్టులు పేట్రేగిపోయి దాడులకు దిగుతు న్నారు. గతంలో మావోయిస్టులకు బలంగా ఉన్న ఉత్తర తెలంగాణాలో పార్టీ పుంజుకుంటేనే తిరిగి రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉండటంతో అగ్రనేతలంతా ఉత్తర తెలంగాణాపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన ఆరు సంవత్సరాలుగా రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్ళిన అగ్రనేతలు సైతం రాష్ట్రం పైనే ప్రధానంగా గురిపెట్టి వ్యూహరచన చేస్తున్నట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

దండకారణ్యం ద్వారా ప్రవేశం
ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో ఉన్న దండకార ణ్యం ద్వారా మావోయిస్టు వర్గాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తు న్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పేట్రేగిపోయి సాయుధ బలగాలపై దాడులకు దిగుతున్న నేపథ్యంలో… రాష్ట్ర పోలీసులు ఛత్తీస్‌గఢ్‌ – ఆంధ్రా సరిహద్దుపై భద్రతా దళాలు, గ్రేహౌండ్స్‌ బలగాలు పెద్దయెత్తున మోహరించడం… ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దుపై పోలీసుల నిఘా తక్కువగా ఉండటం… సులువుగా ప్రవేశించే అవకాశం ఉండటం ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Advertisements

మావోయిస్టులపై ఆకాశ దాడులు!


రంగంలోకి హెలికాప్టర్లు
వైమానిక మద్దతు కోరుతున్న రాష్ట్రాలు
ఎటూ తేల్చుకోని కేంద్రం
లాభం కంటే నష్టమే ఎక్కువ: నిపుణులు
హైదరాబాద్‌: మావోయిస్టుల చేతుల్లో వరుస ఎదురుదెబ్బలు తింటున్న భద్రతా బలగాలకు ఇక ‘ఆకాశమార్గం’ తప్పేటట్లులేదు. నక్సల్స్‌పై పోరాటంలో గగనతల దాడులే శరణ్యమని రాష్ట్రాలు కోరుతున్నాయని కేంద్ర హోంమంత్రి చిదంబరం సోమవారం ఢిల్లీలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాబోయే రోజుల్లో హెలికాప్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అడుగడుగునా మందుపాతర్లు అమర్చడంతో ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల్లో భద్రతా బలగాలు ఎటూ కదలలేని పరిస్థితి. ఇక మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం ఆకాశమార్గమే. ఇది కాస్త క్లిష్టమైన ప్రక్రియే అయినప్పటికీ ఇంతకు మించి ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో ఇప్పుడు కేంద్రం కూడా ఆలోచనల్లో పడింది.

వాస్తవానికి మావోయిస్టులపై దాడులకు వైమానిక మద్దతు తీసుకోవాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. చాలాకాలం నుంచి నలుగుతూనే ఉంది. దశాబ్దకాలం క్రితమే మన రాష్ట్ర పోలీసులు ఏరియల్‌ సర్వేకోసం గ్రేహౌండ్స్‌ ఆధ్వర్యంలో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొనుగోలు చేశారు. కాని వాటివల్ల ఆశించిన ఫలితాలు రాలేదు. అత్యవసర సరిస్థితుల్లో బలగాలను తరలించేందుకు 35 మందిని మోసుకొని వెళ్లగలిగే ట్రూప్‌ క్యారియర్‌ హెలికాప్టర్‌ అందించాలని మన రాష్ట్రం నాలుగైదేళ్ల నుంచీ కేంద్రాన్ని కోరుతోంది. దీనికి కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు. ఛత్తీస్‌గఢ్‌లో మావోలు పెట్రేగిపోతుండటంతో వారిపై గగనతల దాడులు మినహా గత్యంతరం లేదని కేంద్రం భావిస్తున్నట్లు చిదంబరం వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

ఒకవేళ నిజంగా కేంద్రం వైమానిక దాడులు మొదలుపెడితే పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పూర్తిస్థాయి యుద్ధం సమయంలోనే వైమానిక దాడులు నిర్వహిస్తారు. శత్రువులు సమూహాలుగా సంచరించేటప్పుడు వారందర్నీ మట్టుబెట్టే ఉద్దేశంతో నిముషానికి ఆరువేల రౌండ్ల వరకూ కాల్చగలిగే సామర్థ్యం ఉన్న ‘మల్టీ బ్యారెల్‌ గ్యాట్లింగ్‌ గన్‌’ బిగించిన హెలికాప్టర్‌ను రంగంలోకి దింపుతారు. ఇలాంటి తుపాకులు కొనుగోలు చేసేందుకు ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వశాఖ టెండర్లు పిలిచింది. శత్రుదేశంపై దాడి సమయంలో ఈ తరహా దాడుల వల్ల ప్రయోజనం ఉటుందేమోకాని దేశ ప్రజలతో కలిసిపోయి ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్న మావోయిస్టులను ఏరివేయడానికి మాత్రం పనికి రాకపోగా కొత్త సమస్యలు ఎదురవుతాయనే వాదన బలంగా వినిపిస్తోంది.

మావోయిస్టులు ఇంకా గెరిల్లా యుద్ధతంత్రంతోనే పొంచి ఉండి దాడులు చేస్తున్నారు. ఎదురుబొదురు నిలబడి పోరాడే పొజిషనల్‌వార్‌ దశకు ఇంకా చేరుకోలేదు. అటవీ ప్రాంతంలో గిరిజనులతో కలిసి ఉన్న వీరిపై ఆకాశమార్గంలో గుర్తించి దాడిచేయడం సాధ్యంకాదు. ఒకవేళ అటువంటి ధైర్యం చేస్తే మావోయిస్టుల కంటే సాధారణ ప్రజలకే ఎక్కువ నష్టం కలుగుతుంది. అనేక పురాతన గిరిజన జాతులు ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో సాధారణ ప్రజలకు ప్రాణహాని కలిగే పక్షంలో వెల్లువెత్తే విమర్శలు తట్టుకోవడం కష్టం. పైగా శత్రువు బలంగా ఉన్నప్పుడు ఒక అడుగు వెనక్కి వేసినా తప్పులేదన్నది గెరిల్లా సిద్దాంతం. ఒకవేళ ప్రభుత్వం వైమానిక దాడులకు దిగే పక్షంలో మావోయిస్టులు సాధారణ ప్రజల్లో కలిసిపోతారు. అటువంటప్పుడు వారిని గుర్తించడం కూడా కష్టమే. అన్నిటికంటే ముఖ్యంగా మావోయిస్టులు రాకెట్‌ లాంచర్లు సమకూర్చుకున్నారు. వీటిద్వారా హెలికాప్టర్లపై దాడిచేసే పక్షంలో నష్టం అపరిమితంగా ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మావోయిస్టులపై వైమానిక దాడుల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందనేది నిపుణుల వాదన. అయితే బలగాలను తరలించేందుకు పరిమితంగానైనా హెలికాప్టర్లను వినియోగించడం వల్ల ప్రయోజనం ఉంటుందని మావోయిస్టు కార్యకలాపాలు ఎదుర్కోవడంలో విశేష అనుభవం ఉన్న ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ముందుగా మావోయిస్టుల కదలికలకు సంబంధించి నిర్దుష్టమైన సమాచారం సేకరించిన తర్వాత వారికి సమీపంలో ట్రూప్‌ క్యారియర్ల ద్వారా బలగాలను తరలించాలి. ఆపరేషన్‌ పూర్తి చేసిన తర్వాత మళ్లీ హెలికాప్టర్‌లో వారిని అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం ద్వారా కొంతవరకైనా ప్రయోజనం ఉంటుంది. ఇక ఇదే పద్దతిలో హెలికాప్టర్‌ల ద్వారా బలగాలను ఒక ప్రాంతంలో దింపి కొంతదూరం అడవుల్లో గాలింపులు నిర్వహించిన తర్వాత మరో ప్రదేశం నుంచి వారిని తరలించడం వల్ల కూడా లాభం ఉంటుంది. అయితే హెలికాప్టర్లను వాడుతున్నప్పుడు వాటిని కూల్చివేసేందుకు జరిగే ప్రయత్నాలను తట్టుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా మావోలపై విరుచుకుపడటం సాధ్యంకాకపోయినా వాటిని వ్యూహాత్మకంగా వాడుకోగలిగితే ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.

తెలంగాణాలో మావోల బంద్‌


ఖమ్మం: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టులు రెండు రోజుల పాటు బంద్‌ పిలుపునిచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నక్సల్స్‌ ఉద్యమంపై చేపడుతున్న అణచివేతకు నిరసనగా ఈ బంద్‌ పిలుపునిచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు జిల్లాలోని దమ్ముగూడెం మండలంలో రెండు రోజుల బంద్‌ను విజయవంతం చేయాలని మావోయిస్టుల బ్యానర్లు వెలిశాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నడవకుండా నక్సల్స్‌ చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. ఈ నేపథ్యంలో నక్సల్స్‌ విధ్వంస చర్యలకు పాల్పడే అవకాశం ఉండటంతో మారుమూల ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. అయితే మావోయిస్టుల బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు ఆయా ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది.

ఏజెన్సీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నక్సల్స్‌ బ్యానర్లు


ఖమ్మం: ఖమ్మం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగు, హిందీ భాషల్లో బ్యానర్లు కట్టారు. అందులో అధిక ధరలకు వ్యతిరేకంగా పోరాడండి, అధిక ధరలకు కారణమైన పాలకులకు తగిన బుద్ధి చెప్పండి, గ్రామాలకు వచ్చే అధికారులను నిలదీయండి అని వ్రాసి ఉంది. అంతేకాకుండా జిల్లాలోని వేలాది ఎకరాల పంట భూములను పొలవరం పేరుతో లాక్కుంటూ, ఓపెన్‌ కాస్టుల పేరుతో గిరిజనులను నిరాశ్రయులను చేస్తూ, చారిత్రక నగరాలనుండి వారిని ప్రభుత్వ ఖాళీ చేయిస్తుందని వాపోయారు. జల సంపదను బహుళ జాతి సంస్థలకు ఆదివాసీల భూములను ధారాదత్తం చేస్తోందని దీనివెనుక కాంగ్రెస్‌ నేతల హస్తం ఉన్నదని ఆరోపిస్తూ వాల్‌ పోస్టర్లు వేశారు. పోలీసులు వెంటనే చేతి వ్రాతని గుర్తించి సమాచారం ఇవ్వాలని తగిన పారితొషిక ఇస్తామని ఫోన్‌నంబర్లుతో సహా పోస్టర్లు వేశారు. సెప్టెంబర్‌ 1న నక్సల్‌ బంద్‌ ప్రకటించడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.

కల్వకుర్తిలో మావోయిస్టుల సంచారం?


కల్వకుర్తి (మహబూబ్‌నగర్‌ జిల్లా): కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ, మాడ్గుల మండలాల్లో మావోయిస్టు దళ సభ్యులు సంచరిస్తున్నట్లు పలు గ్రామాలనుండి సమాచారం… ఇటీవల మావో యిస్టు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిం చిన బొంత పార్వతమ్మ అలియాస్‌ స్వర్ణక్క నేతృత్వంలో పది మంది సభ్యులు గల దళం కల్వకుర్తి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలలో తమ కార్యకలాపాలను విస్తృత పర్చు కునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. వెల్దండ మండలం అజిలాపూర్‌ గ్రామ వ్యవసాయ పంట పొలాల్లో వారం క్రితం మావోయిస్టు సానుభూతి పరులతో సమావేశం నిర్వహించి పార్టీ స్థితి గతుల గురించి చర్చించినట్లు వాదనలొస్తున్నాయి.

నల్లమల ప్రాంతంలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతుండటంతో మావోయిస్టులు మైదాన ప్రాంతాలను సేఫ్‌జోన్‌గా ఎంచుకొని తమ టార్గెలను పూర్తి చేసుకునేందుకు కసరత్తులు ప్రారంభించినట్లు వినికిడి.బొంత పార్వతమ్మ గతంలో కల్వకుర్తి ప్రాంతంలో మావోయిస్టు కార్యకలపాలు నిర్వహించిన అనుభవం ఉండటంతోనే ఆమె కల్వకుర్తి ప్రాంతంలో మావోయిస్టు పార్టీని బలోపేతం చేసే అవకాశాలున్నాయని మావోయిస్టు సానుభూతి పరులు విలేకరులకు తెలిపారు. అయితే పది మంది గల దళం విడిపోయి ఇద్దరు ముగ్గురు సభ్యులుగా యాక్షన్‌ టీంలను ఏర్పాటు చేసుకొని గ్రామాలలో సంచరిస్తున్నారని సమాచారం. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి చాపకిందినీరులా పార్టీ బలోపేతానికి పాటుపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా కల్వకుర్తి నియోజకవర్గంలో వారి కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో పల్లెప్రాంతాలు ప్రశాంతంగా వున్నాయి. కాగా ఇటీవల మళ్లీ మావోయిస్టు యాక్షన్‌ టీం కదలికలు మొదలు కావడంతో నియోజకవర్గంలో అలజడలు రేగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

ఎఓబిలో మళ్ళీ అలజడి జిల్లాలో రెడ్‌ అలర్ట్‌


శ్రీకాకుళం: ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో మళ్ళీ అలజడి రేగింది.గత కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దు ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విజయనగరం జిల్లా కటికికేదారిపురం ఒరిస్సాకు చెందిన పల్నారా సమితి ముకుందాపురం అడవిలో జరిగిన్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందగా వీరిలో ఇద్దరు శ్రీకాకుళం డివిజన్‌ కమిటీలో కీలకబాధ్యతలు వహిస్తున్న మహిళలు ఉన్నారు. ఒరిస్సాలోని చంద్రాపూర్‌, గుడారి సమితుల పరిధిలో పోలీస్‌ ఇన్మఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇటీవల ముగ్గురు గిరిజనులను హతమార్చిన తరువాత ఆంధ్రా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఒరిస్సాలోని కీలక స్థావారాలను విజయనగరం ప్రత్యేక పోలీసు దళాలు చుట్టుముట్టడంతో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మహిళ మావోయిస్టులు శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండల పరిధిలోగల బొట్టపాడు గ్రామానికి చెందిన పి. సుభద్ర అలియాస్‌ స్వర్ణక్క, వజ్రపు కొత్తూరు మండలం అక్కిపల్లికి చెందిన లంక రాజేశ్వరీ అలియాస్‌ దివ్యగా గుర్తించారు. మరోకరిని ఒరిస్సా దళ సభ్యురాలు శివానీగా గుర్తించారు. కొండబారిడి ఏరియా కమిటీలో కీలకపాత్ర వహించిన వీరు పలు విధ్వంసాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. కాగా సరిహద్దు సంఘటన నేపథ్యంలో శ్రీకాకుళంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇక్కడి జిల్లా పోలీసు యంత్రాంగం రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. జరిగిన ఎన్‌కౌంటర్‌లో కొంతమంది తప్పించుకుని ముగ్గురు మావోయిస్టులే మృతిచెందడం అందులోను శ్రీకాకుళంకు చెందినవారే ఇద్దరు ఉండడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తుతాయోనన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. ఈ తరుణంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై జిల్లాలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ప్రస్తుతం వాహనాలను లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ జిల్లాలోని అన్ని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేసారు.